విశాఖపట్నం: "ఎవరైనా మా జోలికి వస్తే పంచ్‌లతో సమాధానం చెబుతాం"

విశాఖపట్నం: "ఎవరైనా మా జోలికి వస్తే పంచ్‌లతో సమాధానం చెబుతాం"

"అమ్మాయిలకు రెజ్లింగ్ ఎందుకు? పెళ్లి అయిన తరువాత చాలా ఇబ్బందులు వస్తాయి అని చాలా మంది నిరుత్సాహపరిచారు. కానీ, మేము వాళ్ల మాటలు వినలేదు. మాకు పెళ్లి కంటే లక్ష్యమే ముఖ్యం. ఇప్పుడు రోజులు బాగోలేవు. అమ్మాయిలు బయటకు వస్తే కామెంట్స్ చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అలాంటి వారికి పంచ్‌లతో సమాధానం చెబుతాం" అని అంటున్నారు ఈ అమ్మాయిలు.

"నాన్న కూలీకి వెళ్తారు. ఉద్యోగం తెచ్చుకోవాలమ్మా అని నాకు పదే పదే చెప్తారు. నేను బాగా చదువుకుంటా. అలాగే ఆటలూ ఆడతా. ఉద్యోగం తెచ్చుకుంటా" అంటూ ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్పింది కొండమ్మ.

ఈ పదో తరగతి అమ్మాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదుకుంటూనే, రెజ్లింగ్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణి అయింది. ఆమెకు స్ఫూర్తి ఏంటో తెలుసా? దంగల్ సినిమా.

దంగల్ సినిమా స్ఫూర్తి విశాఖ గిరిజనులను కుస్తీల వైపు నడిపించింది. సాధనతో వారు జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.

విశాఖ జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్న కేంద్రీకృత ఆశ్రమోన్నత పాఠశాలలో పాడేరు ఐటీడీఏ అధ్వర్యంలో రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ఉంది. దాదాపు 30 మంది విద్యార్ధులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.

ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్కూల్ రెజ్లింగ్ పోటీలలో కొయ్యూరు శిక్షణ కేంద్రం నుంచి 15 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఒకరు కాంస్య పతకం సాధించారు. ఇక రాష్ట్ర స్థాయిలో అయితే ఛాంపియన్‌షిప్పే గెల్చుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

"బాగా చదువుకుంటా. అలాగే ఆటలూ ఆడతా. ఉద్యోగం తెచ్చుకుంటా"- కొండమ్మ

ఇలా మొదలైంది

విశాఖ ఏజన్సీ గిరిజనులలో శారీరక బలం ఎక్కువగా ఉంటుంది. రోజులో ఎన్నో గంటల సమయం రకరకాల నేలలపై, ఎత్తులపై నడుస్తూ ఉంటారు. కొయ్యూరు ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) నూకరాజు స్వయంగా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు. ఆయనకు కుస్తీ విద్యలోనూ ప్రవేశం ఉంది. దీంతో పిల్లలచేత కుస్తీ ప్రాక్టీస్ చేయించేవారు.

ఒక రోజు ఆ పాఠశాల సందర్శనకు వచ్చిన అప్పటి పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆధికారి ప్రదీప్ పఠాన్ శెట్టి... గిరిజన విద్యార్థులు కుస్తీ పట్టడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన పరికరాలు లాంటివి సమకూర్చుకోవడానికి నిధులు మంజూరు చేశారు. దీంతో 15 మందితో తొలి బ్యాచ్ ప్రారంభమైంది.

అకాడమీకి అవసరమైన క్రీడా సామగ్రి రూ.3.50 లక్షలతో మ్యాట్‌లు, ఇతర క్రీడా పరికరాలు, క్రీడాకారులకు జెర్సీలు, షూలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతం ఐటీడీఏ అధికారి బాలాజీ రూ.4.50 లక్షలు మంజూరు చేయడంతో అధునాతన జిమ్‌ను ఏర్పాటు చేశారు.

విద్యార్థుల ప్రతిభ

సదుపాయాలు మెరుగుపడటంతో క్రీడాకారులు తమ సత్తా చాటడం మొదలు పెట్టారు. అసలు కుస్తీలో ఓనమాలు కూడా తెలియని వారికి పతకాలు తెచ్చే స్థాయికి వచ్చేలా శిక్షణ ఇచ్చారు.

ముందుగా కోచ్ నూకరాజు ఆధ్వర్యంలో మండల స్థాయిలో పోటీలు పెట్టి విద్యార్ధులను ఎంపిక చేశారు. అలా ఈ ఆటకు, శిక్షణకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ఇక్కడ 30 మంది ఉన్నారు.

2018లో ఈ అకాడమీ నుంచి నేషనల్ స్కూల్ గేమ్స్‌లో 9 మంది పాల్గొనగా, 2019లో 15 మంది వెళ్లారు. వీరు 25కి పైగా పతకాలు సాధించి స్టేట్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు.

2019 నవంబర్‌లో దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన పోటీలలో కొయ్యూరు అకాడమీ నుంచి 15 మంది పాల్గొన్నారు. అండర్ 44 కేజీల విభాగంలో వంతల మహేష్ అనే విద్యార్ధి జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించాడు. అండర్ 17 విభాగంలో ఒక బాలిక జిల్లో మహేశ్వరి సెమీస్ వరకూ వెళ్లారు.

ఫొటో క్యాప్షన్,

మహేశ్వరి

దంగల్ సినిమా ప్రకటన చూసి..

''నేను ముంచంగిపుట్టులో చదువుకుంటున్నప్పుడు పేపర్‌లో దంగల్ సినిమా‌‌కు సంబంధించిన ప్రకటనను నా ఫ్రెండ్ నాకు చూపించింది. అప్పటి దాకా రెజ్లింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఆ సినిమాలో కొడుకులు ఉండరు... కూతుళ్లే ఉంటారు. వాళ్ల నాన్న తమ కూతుళ్లను రెజ్లర్లుగా మార్చారు. వాళ్లను చూసిన తర్వాత నాకు కూడా అలా అవ్వాలని అనిపించింది.

మన లోకంలో మనం ఉండిపోకూడదు. మారుమూల ప్రాంతం అభివృద్ధి అవ్వాలంటే నేను ముందుకు వెళ్లాలని అనిపించింది. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను.

విజయవాడ‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో బంగారు పతకం సాధించాను. అనంతరం హరియాణాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో సెమీఫైనల్ దాకా వెళ్లాను. గతంలో ఇతరులతో మాట్లాడటానికే భయం వేసేది. కానీ, ఇప్పుడు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఒకప్పుడు బయటకు వెళ్లాలంటే భయపడేదాన్ని. రెజ్లింగ్ వల్ల ఆ భయం పోయింది. మిగతా ఆడపిల్లలు కూడా రెజ్లింగ్ నేర్చుకోవాలని మా టీచర్ సలహా ఇస్తున్నారు. వారు బయట ఎలా ధైర్యంగా వెళ్తున్నారో మీరు కూడా అలా వెళ్లగలగాలి అని చెబుతున్నారు.

నేను కూడా గీతా ఫొగట్, బబిత లాగా పతకాలు సాధించి, మంచి ఉద్యోగం సంపాదించాలని, దేశానికి పేరు తేవాలని ఉంది. మా ప్రాంతం యువత ఎక్కువగా ఉద్యమాల పట్ల అకర్షితులవుతారు. కానీ, నాకు రెజ్లింగ్ అంటే ఇష్టం పెరిగింది'' అంటూ వివరించింది మహేశ్వరి.

ఫొటో క్యాప్షన్,

కొండమ్మ (10వ తరగతి)

అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలి

''ముంచంగిపుట్టు మండలం లుక్కూరు మా సొంతూరు. రెజ్లింగ్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. గీతా, బబిత గురించి పేపర్‌లో చదివాక రెజ్లింగ్ మీద ఆసక్తి పెరిగింది. అయినా మాకు కోచింగ్ ఎవరిస్తారు? అనుకున్నాం.

పెదబయలులో జరిగిన సెలక్షన్‌లో జిల్లా స్థాయి పోటీకి ఎంపికయ్యాం. ఇక్కడ కోచింగ్‌కు రాగానే ఏడుపు వచ్చింది. అన్నయ్య వాళ్లు మట్టిలో ఆడుతుంటే నాకు కూడా ఉత్సాహం వచ్చింది. రెండు సార్లు ఆడితే భయం పోయింది. మేము కూడా బాగా ఆడాలి. అంతర్జాతీయ స్థాయిలో అడాలన్నది నా కోరిక.

రెండుసార్లు రాష్ర్ట స్థాయిలో పతకం గెలిచాను. 2018 నవంబర్‌‌లో హరియాణాలో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ రెజ్లింగ్, 2019లో దిల్లీలో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్‌లోనూ ఆడాను. 2018లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాను. దాంతో చాలా ఏడ్చాను. మా సార్ ధైర్యం చెప్పారు. 2019లో మాత్రం బెస్ట్ 8లో ఒకరిగా నిలిచాను.

మా నాన్న కూలి పనులకు వెళ్తారు. నువ్వు మంచి ఉద్యోగం సాధించాలమ్మా అని నాకు పదే పదే చెప్తారు. బాగా చదివి, క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదిస్తాను. హరియాణాలో 2020 ఫిబ్రవరిలో జరిగే ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం అవుతున్నాను'' అని పదో తరగతి చదువుతున్న కొండమ్మ చెప్పింది.

మహేష్ నేషనల్స్‌లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారుడు.

''ముందు నాకు కుస్తీ తెలీదు. విజయవాడలో మొదటిసారి గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ, జాతీయ స్థాయిలో తొలిసారి పోటీపడినప్పుడు ఆరంభంలోనే ఓడిపోయాను. బాధేసింది. కసిగా ప్రాక్టీస్ చేసి 2019 నవంబర్‌లో జాతీయ స్థాయిలో కాంస్యం గెలుచుకున్నాను'' అని మహేశ్ చెప్పారు.

కుస్తీలో రకాలు

సాధారణంగా సంప్రదాయ కుస్తీతో పాటుగా అమెచ్యూర్ రెజ్లింగ్ అని ఇంకోటి ఉంటుంది. సంప్రదాయ కుస్తీ అంటే మట్టిలో చేసేది. అమెచ్యూర్ రెజ్లింగ్ ..మ్యాట్ మీద చేస్తారు.

అమెచ్యూర్ రెజ్లింగ్‌లో కూడా ఫ్రీ స్టైల్ విభాగం అని, గ్రీకో రామన్ విభాగం అని ఉంటాయి. ఫ్రీ స్టైల్ విభాగంలో రెజ్లర్లు బాడీ, కాళ్లు ఇలా ఎక్కడైనా పట్టుకొని ఆడవచ్చు. కానీ, గ్రీకో రామన్‌లో క్రీడాకారులు కేవలం బాడీతో మాత్రమే కుస్తీ పట్టాల్సి ఉంటుంది. కాళ్లు పట్టుకోకూడదు.

అమెచ్యూర్ రెజ్లింగ్‌లో 9 మీటర్ల వ్యాసార్థంలో వృత్తం ఉంటుంది. ఆ వృత్తం మధ్యలో మరో 1 మీటరు వ్యాసార్థంలో మరొక వృత్తం ఉంటుంది (దీనిలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది) క్రీడాకారులు ఆ వృత్తాలలోనే ఆడాల్సి ఉంటుంది.

డైట్ చాలా కీలకం

రెజ్లింగ్‌లో ఆహార నియమాలు చాలా కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన ఐటీడీఏ పీవో బాలాజీ క్రీడాకారుల భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఉదయం గుడ్లు, పాలు, కార్న్ ఫ్లేక్స్, అంబలి, వారానికి నాలుగు సార్లు చికెన్ లాంటివి పెడతారు.

క్రీడాకారులు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఆశ్రమ పాఠశాల కావడంతో క్రీడాకారులకు వసతి సదుపాయం కూడా కల్పించారు.

"చాలా కష్టమైన ఆట"

"ఏడాదికి ఒకరిద్దరిని రాష్ట్ర స్థాయికి పంపేవాళ్లం. గిరిజన పిల్లల్లో శరీర దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. వారిని సరిగ్గా సాన బెడితే మంచి క్రీడాకారులు అవుతారని అనిపించింది.

కుస్తీ అనేది చాలా కష్టమైన ఆట. పిలల్లు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. పిల్లలను ఆ రకంగా తీర్చి దిద్దేందుకు చాలా కష్టపడ్డాం.

రాష్ర్ట స్టాయిలో కాంస్యం సాధించేందుకే మొదట్లో ఇబ్బంది పడేవాళ్లు. కానీ, ఇప్పుడు 15 బంగారు పతకాలతో ఓవరాల్ ఛాంపియన్స్ అయ్యారు. జాతీయ స్థాయిలో పతకాలు తెస్తున్నారు. దీంతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. అమ్మాయిలు కూడా ఒంటరిగా పోటీలకు వెళ్తున్నారు" అంటూ తమ విజయ యాత్ర గురించి వివరించారు కోచ్ అంబటి నూకరాజు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)