సీఏఏపై నిరసనలు - యూపీలో పోలీసు కాల్పులు: "నమాజ్ చేసి బయటకు వస్తుంటే లాఠీచార్జి చేసి, కాల్పులు జరిపారు"

  • సమీరాత్మజ్ మిశ్రా
  • బీబీసీ ప్రతినిధి
మీరట్ మృతుల కుటుంబం
ఫొటో క్యాప్షన్,

మృతుడు సులేమాన్ కుటుంబం

ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా, నహటౌర్ పట్టణానికి చెందిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా శుక్రవారం జరిగిన ప్రదర్శనల్లో ఈ పట్టణంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వారిలో మహమ్మద్ సులేమాన్ ఒకరు. అతడి కుటుంబం పోలీసులను, ప్రభుత్వాన్ని నిందిస్తోంది.

"పోలీసులు జరిపిన కాల్పుల్లోనే నా తమ్ముడు చనిపోయాడు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. మాకు న్యాయం కావాలని మేం డిమాండ్ చేస్తున్నాం. న్యాయం దొరక్కపోతే మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తాం" అంటున్నారు సులేమాన్ అన్న మహమ్మద్ షోయబ్.

ఫొటో క్యాప్షన్,

బాధిత కుటుంబంతో ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ ఆదివారం సులేమాన్ ఇంటికి వచ్చారు.

స్థానిక ముస్లిం యువకులు మృతి చెందడం పట్ల బీజేపీ కూడా విచారం వ్యక్తంచేసింది.

"నహటౌర్‌లో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. మా పార్టీ కార్యకర్తలు మృతుల కుటుంబాలను కలిశారు" అని బిజ్నోర్ బీజేపీ నేత మహేంద్ర ధనౌరియా పేర్కొన్నారు.

"వాళ్లను ఈ దేశపౌరులు కారని గానీ, వారు నహటౌర్ వాసులు కారని గానీ ఎవ్వరూ భావించడం లేదు. వారి కుటుంబాలన్నీ ఇక్కడివే. ఈ ఘటనలో ఇద్దరు భరతమాత పుత్రులు అమరులు కావడమనేది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందే" అని చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఉత్తర్ ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో చాలా పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

"శుక్రవారం నాడు నమాజ్ పూర్తిచేసి మేమంతా మసీదులోంచి బయటకు వస్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతేకాదు, మాపై కాల్పులు కూడా జరిపారు. టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు. ఎదురుపడ్డ ప్రతి ఒక్కరినీ పట్టుకెళ్లారు" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇంకా కొనసాగుతున్నాయి. మీరఠ్‌ నగరంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రదర్శనకారులు మృతి చెందారు. వారిలో 45 ఏళ్ల జహీర్ కూడా ఒకరు.

ఫొటో క్యాప్షన్,

మృతుడు జహీర్ తండ్రి మున్షీ

"ఎవరిని ఏమనగలం, చెప్పండి? పోలీసులే కాల్పులు జరిపారు" అని జహీర్ తండ్రి మున్షీ నిర్వేదం వ్యక్తంచేశారు.

హింసకు బాధ్యులు పోలీసులు, ప్రభుత్వాధికారులేనని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసుల వాదన మరోలా ఉంది.

"నిజమే. ఫైరింగ్ జరిగింది. గుంపులను చెదరగొట్టడానికి మేం గాలిలోకి కాల్పులు జరిపాం" అని మీరఠ్ ఎస్‌పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

మీరఠ్ ఎస్‌పీ అఖిలేష్ నారాయణ్ సింగ్

"అయితే, నాకు గుర్తున్నంత వరకు, పాయింట్ 315 బోర్ బుల్లెట్లు 37, 32 బోర్‌ తూటాలు దాదాపు 20 మాకు లభ్యమయ్యాయి. అంటే అల్లరిమూకలు ఎలా పథకం ప్రకారం హింసకు పాల్పడ్డాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్లు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. జనాల్లో భయాందోళనలు వ్యాపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 23 మంది మరణించారు. ఈ ప్రాంతంలో 150 మందికి పైగా ప్రదర్శనకారులను అరెస్ట్ చేశారు. ఇక్కడి పోలీసులు విచక్షణారహితంగా, ఎవరినిపడితే వారిని అరెస్టు చేయొచ్చని ప్రజలు భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)