నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమే ఒక్క ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కారణమా?

నరేంద్ర మోదీ, అమిత్ షా (2019 ఆగస్టు 27వ తేదీన తీసిన చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

గత ఏడాది కాలంగా మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.

అయితే, ఈ రాష్ట్రాల్లో బీజేపీ సీట్లు, ఓట్ల శాతం కూడా చాలా తగ్గడం కనిపించింది.

అందుకే, అమిత్ షా, నరేంద్రమోదీ నాయకత్వ చరిష్మాలో బీజేపీ ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎందుకు విజయవంతం కాలేకపోయిందనే ప్రశ్న వస్తుంది.

జాతీయ అంశాల్లో దాగిన స్థానిక సమస్యలు

జార్ఖండ్ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలు బహిరంగంగా అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images

గొప్ప రామమందిర నిర్మాణం గురించి మట్లాడి జార్ఖండ్ ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు.

అటు, జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ మాత్రం స్థానిక అంశాల గురించి మాట్లాడుతూ కనిపించాయి.

కానీ, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీ ఓటమి రుచిచూడాల్సి వచ్చంది.

అందుకే ఇప్పుడు, బీజేపీ స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే, ఈ ఓటమికి కారణమా అనే ప్రశ్న కూడా వస్తుంది.

బీజేపీ అందుకే ఓటమి పాలైందని ఆ పార్టీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ స్మితా గుప్తా భావిస్తున్నారు.

"బీజేపీ నేతలు ఎన్నికల ప్రచార సమయంలో ఆర్థిక మాంద్యం లాంటి వాటి వల్ల ప్రజల ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోడానికి బదులు రామమందిరం లాంటి అంశాలపై మాట్లాడి ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. త్వరలోనే భవ్య రామమందిరం నిర్మిస్తాం అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఎవరి వ్యాపారాలు మూతపడే స్థితిలో ఉన్నాయో అలాంటివారు రామమందిరం అంశంపై ఓట్లెలా వేస్తారు" అని స్మితా అన్నారు.

దీనితోపాటూ జార్ఖండ్‌లో సంక్షేమ పథకాలు కూడా పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి.. అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టలేదు.

ఫొటో సోర్స్, Getty Images

అంతర్గత కలహాలు

జార్ఖండ్ నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి.

పలు సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ నేతల నుంచి తిరుగుబాటు ధోరణి కూడా కనిపిస్తూ వచ్చింది.

ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి చాలావరకూ అంతర్గత కలహాలే కారణం అని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ అయ్యర్ భావిస్తున్నారు.

"మోదీ ఆకట్టుకునే వ్యక్తిత్వం వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్ని ఓట్లు రాబట్టుకున్నా, ప్రాంతీయ స్థాయిలో ఆ పార్టీ బలహీనం అవుతూ కనిపిస్తోంది. గత ఏడాదిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర నేతల్లో అంతర్గత కలహాలు బహిరంగం అయ్యాయి" అన్నారు

"జార్ఖండ్ విషయానికి వస్తే రఘుబర్ దాస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరుగుబాటు నేత సరయూ రాయ్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. దానివల్ల రాష్ట్ర స్థాయిలో బీజేపీ అంతర్గత కలహాలకు బలైపోతోందని అనిపిస్తోంది. కేంద్ర నాయకత్వం వాటిని చక్కదిద్దాలని కూడా అనుకోవడం లేదు".

"రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్ర నేత ఇమేజ్ ఎలా ఉంది అనేదానిపై కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అంశాలు ఆధారపడతాయి. జార్ఖండ్ బీజేపీలో చాలామంది నేతలు రఘుబర్ దాస్‌కు వ్యతిరేకం అయ్యారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్, రాజస్థాన్‌లో వసుంధరా రాజేలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది" అని అయ్యర్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అమిత్ షా మాయలు ఏమైపోయాయి

చాలా ఏళ్లుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాలకు కారణం అమిత్ షా తిరుగులేని నాయకత్వమే అని చెబుతుండేవారు.

అయితే, గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వం విఫలమైందా? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఓటమికి కచ్చితంగా కేంద్ర నాయకత్వమే కారణం అని శేఖర్ అయ్యర్ భావిస్తున్నారు.

"రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తుల బహిరంగ ఇమేజిని బీజేపీ కేంద్ర నాయకత్వం సరిగా అంచనా వేయకపోవడం ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి ఒక కారణం. ఉదాహరణకు రాజస్థాన్ బీజేపీ సర్కిళ్లలో వసుంధరకు తగినంత మద్దతు లేదు. సామాన్యుల్లో కూడా ఆమెపట్ల ఒక లాంటి ప్రతికూలత ఏర్పడింది. అలా ఉన్నప్పటికీ కేంద్ర నాయకత్వం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదు".

లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రసంగ శైలి ఆయన నాయకత్వ చరిష్మా వల్ల బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోగలదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అలా కాదు. ఇది కేంద్ర నాయకత్వం ముందు మరో సవాలుగా నిలిచింది.

లోక్‌సభ ఎన్నికల్లో అంతర్గత భద్రత లాంటి అంశాలు ప్రజలకు చాలా కీలకం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అంశాలు మారిపోతాయి. స్థానిక అంశాలు, స్థానిక ప్రభుత్వం, ముఖ్యమంత్రి పనితీరును బట్టి బీజేపీ రాష్ట్రాల్లో బలహీనం అయిపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ నేతల్లో గర్వం

బీజేపీ ప్రాతీంయ నేతల ధోరణిలో ఒక విధమైన గర్వం కూడా కనిపిస్తోందని స్మితా గుప్తా భావిస్తున్నారు.

"స్థానిక రాజకీయాల విషయానికి వస్తే, బీజేపీ స్థానిక నేతలు కూడా గర్వంతో వ్యవహరిస్తుంటారు. వారు తమ పరస్పర విభేదాలను పక్కనపెట్టాలని ప్రయత్నించరు. మిగతావారు, విపక్ష పార్టీలు అన్నిరకాల సయోధ్యల కోసం ప్రయత్నిస్తూ కనిపిస్తుంటారు.’’

జార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. పరస్పరం ఒక అంగీకారం చేసుకోవడంలో విజయవంతమైంది. అటు తమ శిబిరంలోనే తలెత్తిన ఆందోళనలు, ఆగ్రహాలను పరిష్కరించడానికి బీజేపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.

రాబోవు నెలల్లో దిల్లీతో పాటు బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటప్పుడు, బీజేపీ ఈ ఐదు రాష్ట్రాల ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకుంటుందా లేదా అనేది కాలమే చెబుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)