నిర్భయ కేసు: మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ నలుగురు దోషులకు చట్టపరంగా ఉన్న చివరి అవకాశాలేమిటి?

  • సుచిత్ర మొహంతి
  • లీగల్ కరస్పాండెంట్, బీబీసీ హిందీ
నిర్భయ కేసు దోషులు

ఫొటో సోర్స్, DELHI POLICE

దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబర్ 16న ఒక యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు త్వరలో మరణశిక్ష అమలుచేసే అవకాశం కనిపిస్తోంది.

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకూ మరణశిక్షను అమలుచేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

జనవరి 22 లోపు (అంటే 14 రోజుల్లోపు) వారు క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

అయితే, సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు.

అంతకుముందు, ఈ కేసులో నాలుగో దోషి రివ్యూ పిటిషన్‌ను.. జస్టిస్ ఆర్.భానుమతి సారథ్యంలో జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఎ.ఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది.

ఇప్పుడిక నలుగురు దోషులు తమ తమ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఈ పిటిషన్ వేయటానికి నిర్ణీత కాల పరిమితి ఏదీ లేనప్పటికీ.. నెల రోజుల లోపు దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

నలుగురు దోషులు - అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌లకు - చట్టపరంగా ఉన్న చివరి అవకాశం.. సుప్రీంకోర్టులో తమ తమ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయటం, రాజ్యాంగ శరణు కోరటం మాత్రమే.

ఆ తర్వాత మిగిలే చిట్టచివరి అవకాశం.. భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకోవటం.

ఫొటో సోర్స్, Getty Images

రివ్యూ పిటిషిన్‌ను కొట్టివేయటంతో ఈ దోషులను ఉరితీసే సమయం దగ్గరపడిందని భారతదేశపు ఉన్నతస్థాయి న్యాయ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. వీరికి మిగిలిన అవకాశాలు క్యురేటివ్, క్షమాభిక్ష మాత్రమేనని.. అయితే వీరు చేసిన నేరం సమాజ అంతఃచేతనను దిగ్భ్రాంతికి గురిచేసేంత క్రూరంగా ఉన్నందున.. వాటిని తిరస్కరించే అవకాశమే అధికంగా ఉందని అంచనా వేస్తున్నారు.

''అవును.. మూడు, నాలుగు నెలల కాలం లోగా ఉరి తీయవచ్చు'' అని మాజీ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్ పేర్కొన్నారు.

''వారి రివ్యూ పిటిషన్‌ను కొట్టివేశారు. క్యురేటివ్ పిటిషన్‌ను కూడా కొట్టివేసే అవకాశముంది. అలాగే.. ఈ సామూహిక అత్యాచారం, హత్య చేసిన తీరు చాలా క్రూరంగా ఉన్నందున క్షమాభిక్ష అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోరని నేను అనుకుంటున్నా'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

మరో సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ కె.సి.కౌశక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ''గరిష్టంగా రెండు, మూడు నెలల్లో ఉరితీసే అవకాశం ఉంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

''వీరి క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లను కూడా కొట్టివేసే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఈ కేసు నిజంగా అత్యంత అరుదైన కేసుల్లోకి వస్తుంది. దోషులు తమకు గల చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవకాశాలన్నిటినీ రెండు, మూడు నెలల్లో ఉపయోగించేసుకోవచ్చు'' అని కౌశిక్ బీబీసీతో పేర్కొన్నారు.

ఈ రెండు, మూడు నెలలకు మించి జాప్యం జరిగే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టంచేశారు.

''వీరి రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.. క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లను కూడా కొట్టివేసే అవకాశముంది.. కాబట్టి హేతుబద్ధమైన కాలావధిలో మరణశిక్ష అమలు జరగాలి. ఈ కేసు ఎంత క్రూరమైనదంటే.. ఇటువంటి కేసుల్లో క్షమాభిక్ష ఆలోచనే రాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కేసు సాధ్యమైనంత త్వరగా హేతుబద్ధమైన ముగింపుకు రావాలని తాను భావిస్తున్నట్లు మరో క్రిమినల్ లాయర్ వికాశ్ పాశ్వా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

''ఈ కేసు హేతుబద్ధమైన ముగింపుకు రావాలంటే.. ఓ రెండు, మూడు నెలల్లోపు చట్టపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయి.. దోషులను ఉరితీయాలి'' అని ఆయన బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

అయితే.. ''నా క్లయింట్లు ముగ్గురూ పేదవాళ్లు.. వాళ్లకి శిక్ష తగ్గించాలి.. తమను తాము సంస్కరించుకోవటానికి ఒక అవకాశం ఇవ్వాలి'' అని దోషులు అక్షయ్, పవన్, వినయ్‌ల తరఫు న్యాయవాది ఎ.పి.సింగ్ వాదిస్తున్నారు.

''వాళ్లు పేదవాళ్లు.. ఈ దేశపు మంచి పౌరులుగా నిరూపించుకోవటానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలి'' అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.

దోషులు నలుగురికీ మరణ శిక్ష విధిస్తూ విచారణ కోర్టు 2013 సెప్టెంబర్ 13న ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు 2014 మార్చిలో ఖరారు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నలుగురు దోషులూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.

అత్యున్నత న్యాయస్థానం సైతం వారి అప్పీళ్లను 2017 మే 5న కొట్టివేసింది.

ఫొటో సోర్స్, Getty Images

అనంతరం ముగ్గురు దోషులు పవన్, వినయ్, ముఖేష్‌లు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు 2018 జూలై 9న వాటిని కొట్టివేసింది.

అప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రా (అనంతరం పదవీ విరమణ చేశారు) సారథ్యంలోని ధర్మాసనం.. ఆ పిటిషన్లను కొట్టివేస్తూ దోషులు పాల్పడిన నేరం స్వభావం, తీవ్రతను ''దిగ్భ్రాంతి సునామీ'' వంటిదని అభివర్ణించింది.

బాధితురాలైన 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని మీద 2012 డిసెంబర్ 16న ఆరుగురు పురుషులు దిల్లీలో బస్సులో తిప్పుతూ అత్యంత కిరాతకంగా సామూహికంగా అత్యాచారం చేశారు.

మరణశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషులు కాకుండా.. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ కేసు విచారణ సమయంలో తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫొటో సోర్స్, AFP

బాలనేరస్తుడి విషయం ఏమిటి?

ఈ కేసు నిందితుల్లో అత్యంత పిన్నవయస్కుడైన బాల అపరాధిని 2015లో సంస్కరణ కేంద్రం నుంచి విడుదల చేశారు.

అతడి విడుదలను నిరోధించటంలో న్యాయ సవాళ్లు విఫలమయ్యాయి.

నేరం జరిగినపుడు అతడు మైనర్ అయినందున అతడి పేరు వెల్లడించటానికి వీలులేదు. అతడిని సంస్కరణ కేంద్రంలో మూడేళ్లు ఉంచాలని 2013 ఆగస్టులో కోర్టు ఆదేశించింది.

ఆ అపరాధి ఇప్పుడు వయోజనుడే అయినా కూడా.. అతడిని బాల అపరాధిగా విచారించారు. అతడికి విధించిన శిక్షను పూర్తి చేశాడు.

అతడి భద్రత మీద ఆందోళనల రీత్యా.. విడుదల అనంతరం అతడిని ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)