నరేంద్ర మోదీ చెప్పింది నిజమేనా? ‘పాకిస్తాన్‌లో ఉండే హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలనుకున్నా, వారికి స్వాగతం’ అని గాంధీ అన్నారా? : FACT CHECK

  • కీర్తీ దూబే
  • ఫ్యాక్ట్ చెక్ టీమ్
నరేంద్ర మోదీ, గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆదివారం ప్రధానమంత్రి తన ర్యాలీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను తీవ్రంగా విమర్శించారు.

దాదాపు గంటన్నరపాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన మహాత్మాగాంధీ చేసిన ఒక ప్రకటనను ప్రస్తావించారు. దానిపై ఇప్పుడు చాలా చర్చజరుగుతోంది.

మోదీ తన ప్రసంగంలో "మహాత్మా గాంధీ పాకిస్తాన్‌లో ఉంటున్న హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలని అనుకున్నా, వారికి స్వాగతం పలుకుతాం అన్నారు. ఇది నేను అనడం లేదు. పూజ్యులు మహాత్మా గాంధీ చెప్పారు. ఆ సమయంలో ప్రభుత్వ వాగ్దానం ప్రకారమే ఈ చట్టం చేశాం" అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మతాన్ని నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దేశమంతటా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర సమాజాల శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చే నిబంధన ఉంది. గాంధీ ఈ ప్రకటనను ప్రస్తావించిన మోదీ, మహాత్మా గాంధీ అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కోరుకున్నారని విపక్షాలకు, దేశానికి చెప్పారు.

ప్రధానమంత్రి ఈ వాదనపై బీబీసీ పరిశోధన ప్రారంభించింది. మహాత్మాగాంధీ రాసిన, రచనలు, ప్రసంగాలు, లేఖలను మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఆ తర్వాత మాకు 'కలెక్టెడ్ వర్క్ ఆఫ్ మహాత్మాగాంధీ' వాల్యూమ్ 89లో ఈ ప్రకటన ప్రస్తావన లభించింది.

ఫొటో సోర్స్, CENTRAL PRESS/GETTY IMAGES

1947 సెప్టెంబర్ 26న స్వాతంత్ర్యం వచ్చిన ఒక నెల తర్వాత ప్రార్థన సభలో మహాత్మాగాంధీ ఈ మాట అన్నారు. కానీ చరిత్ర నిపుణులు, గాంధీ ఫిలాసఫీ గురించి తెలిసిన వారు ఈ ప్రకటన సందర్భం, ప్రస్తుత సమయంలో దాని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి, లాహోర్‌లో ఉంటున్న పండిట్ ఠాకూర్ దత్త అనే ఒక వ్యక్తి, తనను లాహోర్ నుంచి ఎలా బలవంతంగా భారత్ పంపించారో మహాత్మాగాంధీకి చెప్పుకున్నారు. ప్రతి వ్యక్తి చివరి వరకూ తన జన్మస్థలంలో ఉండాలనే గాంధీజీ మాటలకు ఆయన చాలా ప్రభావితం అయ్యారు. కానీ, ఠాకూర్ లాహోర్‌లో ఉండాలనుకున్నా అది సాధ్యం కాలేదు.

1947 జనవరి 26న మహాత్మా గాంధీ తన ప్రార్థన సభలో మాట్లాడుతూ "ఈరోజు గురుదత్త్ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఒక పెద్ద వైద్యుడు. ఈరోజు ఆయన తన గురించి చెబుతూ ఏడ్చారు. ఆయన నన్ను గౌరవిస్తారు. నేను చెప్పిన ఎన్నో విషయాలను పాటించే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ అప్పుడప్పుడూ నా మాటలను వాస్తవానికి అమలు చేయడం కష్టం అవుతుంది" అన్నారు.

అప్పుడే, "పాకిస్తాన్‌లో మీకు న్యాయం జరగడం లేదని, పాకిస్తాన్ తన తప్పులను అంగీకరించడం లేదని మీకు అనిపిస్తే, మన దగ్గర మన క్యాబినెట్ ఉంది. అందులో జవహర్ లాల్ నెహ్రూ, పటేల్ లాంటి మంచి వాళ్లున్నారు. రెండు దేశాలూ పరస్పరం ఒక ఒప్పందం చేసుకోవాలి. అయినా, అది ఎందుకు సాధ్యం కాదు. హిందూ, ముస్లింలు నిన్నటివరకూ స్నేహితులు. ఒకరినొకరు నమ్మలేనంతగా మనం అంత శత్రువులం అయిపోయామా. మీరు వాళ్లను నమ్మలేమని చెబితే రెండు పక్షాలూ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండాల్సుంటుంది. రెండు పక్షాల మధ్య ఏదైనా ఒప్పందం జరగలేదంటే, వేరే దారేదీ మిగలదు. మనం న్యాయమార్గాన్ని ఎంచుకోవాలి" అన్నారు.

ఫొటో సోర్స్, Collected Works of Mahatma Gandhi: Volume 89

"న్యాయమార్గంలో నడుస్తూ హిందువులు, ముస్లింలు మరణించినా నాకు ఏ సమస్యా ఉండదు. భారత్‌లో ఉంటున్న నాలుగున్నర కోట్ల మంది ముస్లింలు దొంగచాటుగా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే, వాళ్లను కాల్చిచంపాలని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడను. అదేవిధంగా పాకిస్తాన్‌లో ఉంటున్న సిక్కులు, హిందువులు అలా చేస్తే, వాళ్లను కూడా అలాగే చేయాల్సుంటుంది. మనం పక్షపాతం చేయలేం. మన ముస్లింలను మనం మనవాళ్లుగా అనుకోకపోతే, పాకిస్తాన్ హిందవులు, సిక్కులను తనవాళ్లుగా అనుకుంటుందా. అలా జరగదు. పాకిస్తాన్‌లో ఉంటున్న హిందువులు, సిక్కులు ఆ దేశంలో ఉండకూడదని అనుకుంటే, తిరిగి రావచ్చు. ఆ పరిస్థితుల్లో వారికి ఉపాధి కల్పించి, వారి జీవితం సౌకర్యంగా ఉండేలా చూడడం, భారత ప్రభుత్వం మొదటి బాధ్యత అవుతుంది. కానీ వారు పాకిస్తాన్‌లో ఉంటూ భారత్ కోసం గూఢచర్యం చేయడం, మన కోసం పనిచేయడం లాంటివి కుదరదు. అలా ఎప్పటికీ జరక్కూడదు. అలా చేసేవారికి నేను పూర్తిగా వ్యతిరేకం" అని గాంధీ చెప్పారు.

కానీ, అంతకు ముందు 1947 ఆగస్టు 8న మహాత్మాగాంధీ భారతదేశం, భారతీయతపై ఏం చెప్పారో దాని గురిచి ముఖ్యంగా చెప్పుకోవాలి. -రాజ్యాంగంలో భారత్ హిందూ దేశం అని కాకుండా, భారత దేశంగా ఉంటుంది. అది ఏ మతం, జాతి, లేదా మెజారిటీ వర్గం లక్షణాలపై ఆధారపడి ఉండదు అన్నారు.

దిల్లీ పీసీసీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) గురించి మహాత్మా గాంధీకి ఒక లేఖ రాశారు. ఉర్దూలో రాసిన ఆ లేఖలో ఆయన "ఆర్ఎస్ఎస్ అనే సంస్థలోని 3 వేల మంది లాఠీలతో డ్రిల్ చేస్తూ 'హిందుస్తాన్ హిందువులదే, వేరే ఎవరిదీ కాదు' అనే నినాదాలు చేస్తారు" అని చెప్పారు.

దానికి సమాధానం ఇచ్చిన గాంధీ "హిందుస్థాన్ ఇక్కడ పుట్టిపెరిగిన ప్రతి వ్యక్తిదీ. ఎవరికైతే ఏ దేశం ఉండదో, ఒక దేశాన్ని ఎవరు తనదిగా చెప్పుకోలేరో ఇది వారిది కూడా, అందుకే భారత్ పార్సీ, ఇజ్రాయెలీ, భారతీయ క్రిస్టియన్లు అందరిదీ. స్వతంత్ర భారతదేశం హిందూ దేశం కాదు, భారత దేశం ఏర్పడితే అది ఏ మతం, జాతి లేదా మెజారిటీ వర్గాల లక్షణాల ఆధారంగా ఏర్పడదు. ఏ మత వివక్షా లేకుండా, ప్రజలందరి ప్రతినిధులపై అది ఆధారపడి ఉంటుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Collected Works of Mahatma Gandhi: Volume 89

అలాంటప్పుడు, గాంధీ చేసిన ఈ రెండు ప్రకటనలనూ వేరు చేసి చూడడం సబబు కాదు.

ముస్లింలు, సిక్కుల గురించి మహాత్మాగాంధీ చేసిన ప్రకటన ప్రస్తావనపై మాట్లాడిన గాంధీ, ఫిలాసఫీ నిపుణులు ఉర్విష్ కొఠారీ "గాంధీజీ అలా చెప్పినప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చి ఒక నెలే అయ్యింది. చాలా మంది అప్పటికీ పారిపోతున్నారు. స్వతంత్రం వచ్చిన 72 ఏళ్ల తర్వాత ఈ ప్రకటనను నరేంద్రమోదీ ఎందుకు పూర్తి చేయాలని అనుకుంటున్నారో నాకు తెలీదు. ఇప్పుడు రెండు దేశాల ప్రజలు స్థిరపడి ఉన్నారు. ఆయన గాంధీ చెప్పిన మార్గంలో నడవాలనే అనుకుంటుంటే, గాంధీ ఎప్పుడూ ముస్లింలను వేరుగా చెప్పలేదు. ఎవరికి దేశమే ఉండదో, భారత్ వారిది కూడా అని గాంధీ అన్నారు. బయటి నుంచి వచ్చిన ముస్లింలకు కూడా ఆశ్రయం ఇవ్వాలనే విషయం చెప్పారు. ఇలా మన సౌకర్యం కోసం రాజకీయాల కోసం గాంధీ చెప్పిన మాటను వక్రీకరించి చెప్పడం గాంధీజీని అవమానించినట్లే అవుతుంది" అన్నారు.

మరోవైపు "గాంధీ చేసిన ఈ ప్రకటనను ప్రస్తుతం అప్రస్తుతం అని ఎవరైతే అంటున్నారో, వారంతా రాజకీయపరంగా మోటివేట్ అయినవాళ్లు. గాంధీ ఆ ప్రకటన ప్రస్తుత సమయానికి పూర్తిగా తగినది. పాకిస్తానీ ముస్లింలు లేదా మూడు దేశాల ముస్లింలు భారత దేశానికి ప్రమాదం కావచ్చు" అని దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, రైట్ వింగ్ రాజకీయ ధోరణి ఉండే సంగీత్ రాగీ భావించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇదే విషయంపై చరిత్ర నిపుణులు అవ్యక్త్ "హిందూ లేదా సిక్కు శరణార్థుల విషయంలో గాంధీజీ ప్రకటనను అప్పటి సందర్భాల నుంచి కత్తిరించి చెబుతున్నారు. ఇది ఎవరు చెబుతున్నారో, వారు పరోక్షంగా రెండు దేశాల సిద్ధాంతానికి భారత్ వైపు నుంచి అధికారిక ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయం గమనించాలి. ఇది ఎప్పుడూ వారి ఎజెండాలో ఉంటూ వచ్చింది. ఇందులో వారు గాంధీజీ పేరును దుర్వినియోగం చేయడానికి పనికిరాని ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ హిందూ, సిక్కు సమాజాల వారిని భారత్‌లో ఆశ్రయం కల్పిస్తామని గాంధీజీ హామీ ఇచ్చినట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు" అన్నారు.

దీనిని గమనిస్తే.. 1947 సెప్టెంబర్ 26న చెప్పిన గాంధీజీ మాటలను మనం పూర్తిగా చదివితే ఆయన పాకిస్తాన్‌కు చెందిన హిందూముస్లిం మైనారిటీలు పాకిస్తాన్ పట్ల విధేయతతో ఉండలేకపోతే, వారికి అక్కడ ఉండే హక్కు లేదని అన్నారు.

మహాత్మా గాంధీ చివరి వరకూ అలాంటి విభజనను అంగీకరించేవారు కాదు. అందుకే 1947 నవంబర్ 25న ప్రార్థనా సందేశంలో రెఫ్యూజీ, శరణార్థి అనే మాటలను కూడా గాంధీ తిరస్కరించారు. దానికి బదులు నిరాశ్రయులు, బాధితులు అనే మాటలు ఉపయోగించేవారు. అలా ఆయన రెండు వైపుల మైనారిటీల గురించి మాట్లాడేవారు.

మహాత్మా గాంధీ "పాకిస్తాన్‌లో ఉండే హిందూ, సిక్కు సోదరులకు ఎప్పుడు భారత్ రావాలని అనిపించినా, వారికి స్వాగతం" అన్నట్లు బీబీసీ తన పరిశోధనలో కనుగొంది. కానీ, కానీ ఈ ప్రకటన సందర్భం, ప్రస్తుతం దాని ఔచిత్యం గురించి ప్రశ్నలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)