గల్ఫ్ వలసలు: తెలంగాణ, ఏపీ కార్మికుల వలసకు కారణాలేంటి? అక్కడ వారి కష్టాలేంటి?

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
ఏడుస్తున్న మహిళ

గల్ఫ్ దేశాల్లో గత ఆరేళ్లలో 35,748 మంది భారతీయ వలస కార్మికులు మరణించారు. వారిలో రెండు వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాల కార్మికులున్నారు. 2019 నవంబరులో లోక్‌సభకు విదేశీ వ్యవహారాలశాఖ ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం ఉంది.

ఈ గణాంకాలు గల్ఫ్ వలస కార్మికుల సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. గల్ఫ్ దేశాలతో చర్చల్లో వీరి గురించి కూడా చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు.

భారతీయులు ఏయే దేశాలకు వెళ్తారు?

పాక్షిక నైపుణ్యమున్నవారు, లేదా నైపుణ్యంలేని కార్మికులు కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, యూఏఈ లాంటి దేశాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు.

విదేశీ వ్యవహారాల లెక్కల ప్రకారం 2018 డిసెంబరు నాటికి గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్నవారు, నివసిస్తున్నవారు కలిపి 85 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

2014 నుంచి 2018 మధ్యలో 28 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఇమిగ్రేషన్ అనుమతులు పొందారు.

ఫొటో సోర్స్, Getty Images

గల్ఫ్‌ దేశాలకు వలస పోయేవారిలో ఎక్కువ మంది నైపుణ్యం లేని కార్మికులు, లేదా పాక్షిక నైపుణ్యం ఉన్నవారే. భవన నిర్మాణ రంగంలో సహాయకులుగా, పెయింటర్లుగా, వెల్డర్లుగా, ప్లంబర్లుగా, నిర్మాణ కూలీలుగా, డ్రైవర్లుగా వెళ్తున్నారు. మగవారు టెక్నీషియన్లుగా, మహిళలు ఇంటిపనివారిగా వెళ్తున్నారు.

వీరే కాకుండా, ఎక్కువ నైపుణ్యం ఉండి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు గల్ఫ్ దేశాలకు కార్మికుల వలసలు ఎక్కువగానే ఉన్నాయన్నారు వలసల నిపుణుడు ప్రొఫెసర్ ఆర్‌బీ భగత్. ఆయన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్‌(ఐఐపీఎస్‌)లో మైగ్రేషన్ అండ్ అర్బన్ స్టడీస్ విభాగం సారథి.

వలస కార్మికుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతంలోని మొత్తం ఐదు రాష్ట్రాలు.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతోపాటు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, బిహార్‌లకు చెందినవారు ఉన్నారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) నివేదిక 2015 ప్రకారం- వలసల సంఖ్య దక్షిణ భారతం నుంచి తగ్గి ఉత్తర భారతం నుంచి పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి తగ్గి ఉత్తర్ ప్రదేశ్, బిహార్ నుంచి పెరుగుతోంది. 2005లో వలస కార్మికులు అత్యధికంగా కేరళ, తమిళనాడు, కర్నాటకల నుంచి ఉండేవారు. 2012 నాటికి పరిస్థితి మారిపోయింది. 2012 నాటికి దక్షిణ రాష్ట్రాలతోపాటు ఉత్తర్ ప్రదేశ్, బిహార్ నుంచి ఎక్కువ మంది వలస వెళ్లారు.

ఇంతకూ గల్ఫ్ వలసలు ఎలా మొదలయ్యాయి?

చమురుతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థే మారిపోయింది. అది ఆధునికతకు దారితీసింది. ఈ నేపథ్యంలో, ఆయా దేశాలు భారీ సంఖ్యలో వలస కార్మికులను తీసుకోవడం మొదలుపెట్టాయంటారు నిపుణులు.

తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల నుంచే ఎక్కువ వలసలు ఉంటాయి. 1970లలో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉండటం కూడా వలసలకు కారణం అంటారు నిజామాబాద్‌కు చెందిన పి.బసంత్ రెడ్డి.

ఆయన బహ్రెయిన్లో వలస కూలీగా పనిచేసి, తర్వాత గల్ఫ్‌లో వలస కార్మికులకు స్వచ్ఛందంగా సహాయం చేస్తున్నారు.

"1978లో జగిత్యాల జైత్రయాత్ర పేరుతో 150 గ్రామాల్లో భూములు స్వాధీనం చేసుకునే ఉద్యమం సాగింది. ఆ ఉద్యమం సఫలం అయింది. కానీ దాని వల్ల గ్రామాల్లో నిరంతరం ఘర్షణ ఉండేది. దీంతో చాలా మంది ముంబయి, సూరత్ వలస వెళ్లారు. అక్కణ్నుంచి గల్ఫ్ దేశాలకు వలస పోవడం మొదలైంది. ఇక్కడకీ, అక్కడికీ జీతాల్లో ఉన్న భారీ తేడా చూశాక మిగిలిన వారు కూడా వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఇక భూములున్నా నీటి సౌకర్యం లేకపోవడమూ వలసలు పెరగడానికి ఒక కారణం. ఇప్పుడైతే ఏకంగా మూడో తరం వలసలు వెళ్లడం చూడవచ్చు" అని బసంత్ రెడ్డి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా, రాయలసీమ జిల్లాల నుంచి వలసలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టికి చెందిన పాతికేళ్ల శేఖర్ పాలిటెక్నిక్ చదివారు. ఆయన సింగపూర్, దుబాయ్, అజర్ బైజాన్, రష్యాల్లో నిర్మాణ రంగంలో వెల్డర్‌గా పనిచేశారు. ఆయన తండ్రి, బాబాయి కూడా గతంలో వలస వెళ్లారని శేఖర్ చెప్పారు.

"మా జిల్లాలో పరిశ్రమలు లేవు. వ్యవసాయం చేయడానికి ఏమీ లేదు. మా ఊళ్లో అయితే సాగు చేయదగ్గ భూమి కుటుంబానికి 30 సెంట్లు మాత్రమే ఉంది. నలుగురున్న కుటుంబం గడవడానికి ఈ భూమి సరిపోదు. అలాంటప్పుడు వలస వెళ్లడం తప్ప ఏం చేయగలం" అని ఆ యువకుడు వ్యాఖ్యానించారు.

భూమిలేని, సామాజికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల నుంచే ఎక్కువ వలసలు ఉంటున్నాయి.

భారత్‌లో కార్మిక విధానాలు, వ్యవస్థలు సరిగా లేకపోవడం, జీతాలు లేదా కూలీల్లో భారీ తేడాలు, అవి కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం లాంటి అంశాలన్నీ కలపి కార్మికులను గల్ఫ్ వైపు నడిపిస్తున్నాయని ప్రొఫెసర్ భగత్ విశ్లేషించారు.

37 ఏళ్ల పి.రాజేశ్వర్ సౌదీలో రెండు దశాబ్దాలుగా పెయింటర్‌గా పని చేస్తున్నారు. గల్ఫ్‌కూ ఇక్కడకీ పోల్చినప్పుడు ఆదాయంలో భారీ తేడాలున్నాయని ఆయన చెప్పారు.

"నేనిక్కడ పనిచేస్తే రోజుకు రూ.350 వచ్చేది. అక్కడయితే రూ.700 వస్తుంది. అక్కడ ఆరోగ్య బీమా కూడా ఇస్తారు. నెలనెలా జీతం ఇస్తారు. ఇక్కడ పనిచేస్తే జీతం సమయానికి రాదు. రోజూ పని దొరుకుతుందన్న భరోసా కూడా లేదు" అని రాజేశ్వర్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

రాజేశ్వర్

కార్మికులను వేధిస్తున్న సమస్యలేంటి?

మోసపూరిత ట్రావెల్ ఏజెంట్లు, కఫాలా పద్ధతి, మానవ అక్రమ రవాణా, ఆర్థిక ఇబ్బందులు, కఠినమైన పని పరిస్థితులు లాంటి సమస్యలు గల్ఫ్ కార్మికుల మరణాలకు కారణమవుతున్నాయి.

విదేశీ వ్యవహారాలశాఖ లెక్కల ప్రకారం, గత ఆరేళ్లలో లక్షకు పైగా ఫిర్యాదులు కార్మికుల నుంచి వచ్చాయి. జీతాలు ఇవ్వకపోవడం, హక్కులు నిరాకరించడం, నివాస పరిమితి ఇవ్వకపోవడం లేదా కొనసాగించకపోవడం, ఓవర్ టైం డబ్బులు ఇవ్వకపోవడం, వారాంతపు సెలవు లేకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావవడం, సొంత దేశానికి పంపకపోవడం, వైద్య సహాయం లేదా బీమా అసలు అందించకపోవడం, మరణించిన సందర్భాల్లో పరిహారం ఇవ్వకపోవడం లాంటి సమస్యలపైనే అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి.

అక్రమ ఏజెంట్లు

ఉద్యోగాల విషయంలో అక్రమ ఏజెంట్ల మోసాలపైనే 2016-19 మధ్యలో విదేశీ వ్యవహారాలశాఖకు 1,637 ఫిర్యాదులు వచ్చాయి.

విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ఈమైగ్రేట్ వెబ్ సైట్ ప్రకారం భారత్‌లో సుమారు 500 మంది మోసపూరిత ఏజెంట్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 30 మంది వరకు ఉన్నారు. ఇలాంటి ఏజెంట్లు అనధికారికంగా ఇంకా చాలా మందే ఉన్నారని బసంత్ రెడ్డి అంటారు.

కఫీల్: 'ఆధునిక బానిసత్వం'

కఫీల్ పద్ధతి కింద నైపుణ్యం లేని విదేశీ కార్మికులకు వీసా, ఇతర చట్టపరమైన ప్రక్రియలు చూసే ఒక స్పాన్సర్ కావాలి. ఆ స్పాన్సర్ ద్వారానే వారు పని కోసం గల్ఫ్‌ దేశాలకు వస్తారు. వారు స్పాన్సర్ అనుమతి లేకుండా ఉద్యోగం మానలేరు, దేశం విడిచి గల్ఫ్ వెళ్లలేరు. చాలా సందర్భాల్లో సదరు 'కఫీల్', వలస కార్మికుడి పాస్‌పోర్ట్, వీసా తీసేసుకుంటారు. దీన్నే ఆధునిక బానిసత్వంగా పిలుస్తున్నారు మానవ హక్కుల కార్యకర్తలు.

నిజామాబాద్‌కు చెందిన రాజేశ్వర్‌కు ఆయన కఫీల్ అనుమతి లేకపోవడంతో తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేకపోయాడు.

తనను వెనక్కు రప్పించడానికి సాయం చేయాలంటూ కరీంనగర్‌కు చెందిన వీరయ్య ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో అతను ఎడారిలో ఎండలో నిల్చున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

"నేను భారత్ తిరిగి రావడానికి దయచేసి సహకరించండి. నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. మేం చాలా పేదవాళ్లం. వాళ్లు మమ్మల్ని బాగా కొడుతున్నారు. మా అమ్మ చచ్చిపోయినా వాళ్లు నన్ను వెళ్లనివ్వడం లేదు. కనీసం తిండి కూడా సరిగా పెట్టడం లేదు. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంది" అంటూ వీరయ్య గోడు వెళ్లబోసుకున్నారు.

2009లో మొదటిసారిగా బహ్రెయిన్, ఈ కఫీల్ వ్యవస్థను రద్దు చేసింది. అప్పటి బహ్రెయిన్ కార్మిక మంత్రి మాజీద్ అల్ అల్వాయి- ఇది ఆధునిక బానిసత్వమని వ్యాఖ్యానించారు. కొత్త చట్టాల ప్రకారం తమ దేశంలోకి వచ్చే కార్మికులను బహ్రెయిన్ కార్మిక శాఖే స్పాన్సర్ చేస్తుంది. యజమానితో పనిలేదు.

2020 జనవరి 1 నుంచి తాము కూడా కఫీల్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించింది ఖతార్.

కార్మికులకు ఎదురయ్యే మరో సమస్య, వారు ఇక్కడి నుంచి పర్యాటక వీసాపై వెళ్తున్నారు. అక్కడకు వెళ్లాక వర్క్ వీసాగా మార్చుకుంటున్నారు. గల్ఫ్ కార్మికులు అక్రమ వలసదారులుగా మారడానికి ఇదొక కారణమని బసంత్ రెడ్డి చెప్పారు.

"విజిటర్ వీసాయే కాదు, కొన్నిసార్లు పాస్ పోర్టు కూడా కఫీల్ తీసేసుకుని తర్వాత అమ్మేస్తారు. దీంతో కార్మికుడికి ఎలాంటి గుర్తింపూ ఉండదు" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దుబాయ్‌లో భారత కార్మికులు

ప్రభుత్వం ఏం చేస్తోంది?

వలస కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో 'తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్' ప్రారంభించింది.

విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని ఎంఏడీఏడీ వెబ్ సైట్ ద్వారా న్యాయ సహాయానికి కార్మికులు లేదా వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు.

"ఇలాంటి ఫిర్యాదులు రాగానే భారతీయ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత ప్రభుత్వం లేదా అధికారులతో మాట్లాడుతున్నారు. తక్షణమే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. అవసరమైతే రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా సంబంధిత కంపెనీలతో మాట్లాడుతున్నారు" అని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

దుబాయ్, రియాద్, షార్జా, జెడ్డా, కౌలాలంపూర్లలో భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు వెళ్లే భారతీయ కార్మికులందరికీ ఈ కేంద్రాల్లో కౌన్సెలింగ్, ఇతర సహకారం అందిస్తుంది. క్షేత్రీయ ప్రవాసీ సహాయ కేంద్రాలను దిల్లీ, కోచి, హైదరాబాద్, చెన్నై, లక్నోల్లో ఏర్పాటు చేసింది. కార్మికులకు, వారి బంధువులకు ఇవి సహకారం అందిస్తాయి.

2016 ఆగస్టు 2 నుంచి ఈసీఆర్ పాస్‌పోర్ట్ ఉన్న మహిళా కార్మికులను ఏడు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థల ద్వారా మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకునేలా భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. మహిళా సిబ్బంది రక్షణ కోసం ఈ ఏర్పాట్లు చేసింది. భారతీయ మహిళలను నియమించుకోవాలనుకున్న విదేశీ కంపెనీలు ఈ మైగ్రేట్ సైట్లో తమ పేరు నమోదు చేయించుకుని 2500 డాలర్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి. మహిళా కార్మికులందరికీ కనీసం 30 ఏళ్లు ఉండాలనే నిబంధనా పెట్టారు.

అయినప్పటికీ 2015 - 17 మధ్య ఇంటిపనిలో చేరిన మహిళా కార్మికుల నుంచి ఏడు వేల ఫిర్యాదులు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

వలస కార్మికులతో భారత్‌కు లాభమేనా?

రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం భారత్‌కు భారతీయు మూలాలున్న వారి నుంచి వచ్చే విదేశీ డిపాజిట్లలో 82 శాతం యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బ్రిటన్, అమెరికాల నుంచే వస్తున్నాయి.

2018 నవంబరు నాటి ఆర్‌బీఐ నివేదిక ప్రకారం- విదేశాల్లోని భారతీయ కార్మికుల్లో 90 శాతం మంది గల్ఫ్‌, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ 2018 నివేదిక చెప్తోంది. వారిలో ఎక్కువ మంది నైపుణ్యం లేని వారు లేదా పాక్షిక నైపుణ్యమున్నవారు. 2016-17లో భారత్‌కు వచ్చిన డిపాజిట్లలో సగానికి పైగా గల్ఫ్ సహకార మండలి దేశాల నుంచే వచ్చాయి. ఆయా దేశాల్లో చమురు ధరల్లో భారీ పతనం, ద్రవ్య పరిస్థితులు కఠినతరం అయినప్పటికీ ఇది జరిగింది. ఈ విషయంలో గల్ఫ్ కార్మికులు మొదటి స్థానంలో ఉండగా, ఎక్కువ నైపుణ్యాలు, ఎక్కువ ఆదాయాలున్న అమెరికాలోని భారతీయ కార్మికులు వారి తర్వాతి స్థానంలో ఉన్నారు.

2017-18 లో భారత్‌కు 7,860 కోట్ల డాలర్ల డిపాజిట్లు వచ్చాయి. అది 2019లో 8,200 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

మారుతున్న వలసల తీరు

ఇమ్మిగ్రేషన్ క్లియరెన్సుల సంఖ్య తగ్గుతోందని విదేశీ వ్యవహారాలశాఖ లోక్‌సభకు తెలిపింది. చమురు ధరలు తగ్గడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటం, గల్ఫ్ దేశాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సొంత దేశస్థులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఉండటం దీనికి కారణాలుగా అంచనా వేస్తున్నారు.

గల్ఫ్ దేశాల స్థానికీకరణ విధానాల వల్ల అక్కడే పుట్టిన వారి ఉపాధి అవకాశాలు పెరిగి, విదేశీ కార్మికులకు డిమాండ్ తగ్గిందని 'లివరేజింగ్ ఎకనమిక్ మైగ్రేషన్ ఫర్ డెవలప్‌మెంట్- ఎ బ్రీఫింగ్ ఫర్ ద వరల్డ్ బ్యాంక్' పేరుతో ఈ ఏడాది సెప్టెంబరులో వెలువడిన ఒక నివేదిక వెల్లడించింది.

వలసలను సానుకూల దృక్పథంతో చూడాలంటారు ప్రొఫెసర్ భగత్ లాంటి నిపుణులు.

"ఎన్నో సంక్షోభాలకు వలసలు పరిష్కారం చూపుతాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లేది తాత్కాలిక వలసదార్లే. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తుల ఆర్థిక పరిస్థితీ మెరుగవుతుంది. కానీ, స్పాన్సర్షిప్ వంటి వ్యవస్థలపైనా, కార్మికులకు సంబంధించిన ఇతర అంశాలపైనా ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో చర్చించాలి" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)