ఎన్‌ఆర్‌సీ-సీఏఏ: ఆ 19 లక్షల మందిని దేశం నుంచి ఎలా తరలిస్తారు... రైళ్లలోనా, విమానాల్లోనా? వాళ్లను ఏ దేశం స్వీకరిస్తుంది? - చిదంబరం

చిదంబరం

ఫొటో సోర్స్, Getty Images

అస్సాంలో అక్రమ వలసదారులుగా గుర్తించిన 19 లక్షల మందిని భారత్ నుంచి పంపించేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారని, వారిని ఎలా తరలిస్తారని, వారిని ఏ దేశం స్వీకరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక, హోంశాఖల మాజీ మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు.

ఇప్పటికే భారత్‌కు వలస వచ్చి నివసిస్తున్నవారిని ముస్లింలు, హిందువులు, సిక్కులు అని వర్గాలుగా విభజించి చూడాలా, సమానంగా చూడాలా అని ఆయన అడిగారు.

బీబీసీ ప్రతినిధి మురళీధరన్ కాశీ విశ్వనాథన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో- పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), శ్రీలంక తమిళులకు పౌరసత్వం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఇతర అంశాలపై ఆయన స్పందించారు.

బీబీసీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని మీరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమేమో ఈ చట్టం పొరుగు దేశాలకు చెందిన మతపరమైన మైనారిటీలను ఆదుకోవడానికి ఉద్దేశించినదని, భారత పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతోంది. దీనిపై మీరేమంటారు?

చిదంబరం: ఇదో హాస్యాస్పదమైన వాదన. వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు కటాఫ్ తేదీని 2014 డిసెంబరు 31గా ఈ చట్టంలో పొందుపరిచారు. ఈ తేదీలోపు భారత్‌కు వలస వచ్చినవారికి ఉద్దేశించిన చట్టమిది. వాళ్లు ఇప్పటికే దేశానికి వచ్చేశారు, దేశంలోనే ఉంటున్నారు. ఇది ఇకపై రాబోయే వలసదారులకు సంబంధించినది కాదు.

ఇప్పటికే వలస వచ్చిన వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి- వివక్షతోనా, వివక్ష లేకుండానా? ఇక్కడికి వలస వచ్చి నివసిస్తున్న వాళ్లను ముస్లింలు, హిందువులు, సిక్కులు అని వర్గాలుగా విభజించి చూడాలా, సమానంగా చూడాలా అన్నదే అసలు ప్రశ్న. ఈ చట్టం భారత్‌లో ఉన్నవారికి సంబంధించినది కాదంటూ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: ఈ చట్టం పొరుగు దేశాల ముస్లింలపై ప్రభావం చూపుతుందని, కానీ భారత్‌లోని ముస్లింలపై చూపదని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రతిపక్షాలే వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆరోపిస్తోంది.

చిదంబరం: నేను మళ్లీ చెప్తున్నా. ఈ చట్టం భారత్‌లో ఇప్పటికే ఉంటున్నవారికి ఉద్దేశించినది. 2014 డిసెంబరు 31లోపు భారత్‌కు వలస వచ్చినవాళ్లు ఇక్కడే ఉన్నారా, విదేశాల్లో ఉన్నారా? వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా! ఇది భారత్‌లో ఉన్నవారికి సంబంధించినది కాదని వాళ్లు ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు.

బీబీసీ: భారత పౌరులు ఈ చట్టం పరిధిలో లేరు కదా!

చిదంబరం: ఎవరు పౌరులు, ఎవరు కాదు అనే ప్రశ్నే ఇక్కడ ముఖ్యమైనది. (ఎన్‌ఆర్‌సీ-జాతీయ పౌరసత్వ జాబితా ద్వారా) అస్సాంలో 19 లక్షల మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. మొదట 40 లక్షల మందిని అక్రమ వలసదారులని, భారత పౌరులు కాదని గుర్తించారు. వీరిలో హిందువులు, ముస్లింలు, ఇతర మతాలవారు ఉన్నారు. 'వాళ్లు పౌరులా, కాదా' అనే ప్రశ్నకు సమాధానం లేదు. వాళ్లంతా భయాందోళనతో బతుకుతున్నారు.

సీఏఏను అమలు చేస్తే వాళ్లందరి భవిష్యత్తు ఏమిటని మేం అడుగుతున్నాం. దీనికి సమాధానం లేదు. ఎవరిని పౌరులుగా పరిగణిస్తారు, ఎవరిని బయటకు పంపించేస్తారు అనేది పెద్ద ప్రశ్న. హిందువులను పౌరులుగా స్వీకరించి, ముస్లింలను దేశం నుంచి పంపించేస్తామని ప్రభుత్వం చెబితే మనం ఎలా అంగీకరించగలం?

ఫొటో సోర్స్, ANI

బీబీసీ: ఎన్‌ఆర్‌సీని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు, దీనిపై మీరేమంటారు?

చిదంబరం: ఎన్ఆర్‌సీని మేం తీసుకురాలేదు. ఎన్‌ఆర్‌సీ అనేది సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం అస్సాంలో మాత్రమే ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూడండి.

ప్రభుత్వం మొదట 40 లక్షల మంది అక్రమ వలసదారులని ప్రకటించింది. వివరాలను సమీక్షించి, ఈ జాబితాను 19 లక్షలకు కుదించారు. 19 లక్షల మందిని భారత్ నుంచి పంపించేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. వాళ్లను ఎలా తరలిద్దామనుకుంటున్నారు- రైళ్లలోనా, బస్సుల్లోనా, నౌకల్లోనా, విమానాల్లోనా అని మేం అడుగుతున్నాం. ఒకవేళ భారత్ నుంచి తరలించినా ఏ దేశం వాళ్లను స్వీకరిస్తుంది?

ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 2024లోగా వాళ్లలో ప్రతి ఒక్కరినీ దేశం నుంచి పంపించేస్తామని హోం మంత్రి చెబుతున్నారు. వాళ్లను ఎక్కడికి పంపించేస్తారు? బంగాళాఖాతంలోకా? ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు? 19 లక్షల మందిని దేశం నుంచి పంపించేయడం సాధ్యం కాదనే విషయాన్ని కనీసం ఆలోచిస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: శ్రీలంక హిందువులను సీఏఏ పరిగణనలోకి తీసుకోవడం లేదని మీరు మీడియా సమావేశంలో తప్పుబట్టారు. వాళ్లకు భారత్‌లో పౌరసత్వం కల్పించాలనే సూచనను మీరు సమర్థిస్తారా?

చిదంబరం: తమకు పౌరసత్వం కావాలో వద్దో వాళ్లే చెప్పాలి. మేం శరణార్థులుగా భారత్‌కు వచ్చామని, తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు సాయం చేయాలని వారు భారత్‌ను అడుగుతున్నారు. సొంత దేశంలోనే తమకు పౌరసత్వం, ఇతర హక్కులు ఉండాలని కోరుకొంటున్నారు. వాళ్లు కోరిన సాయాన్నే భారత ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ ఇంకా కొంత మంది ఈ దేశంలోనే ఉన్నారు.

స్వదేశానికి తిరిగి వెళ్లబోమని, తమకు ఇక్కడే పౌరసత్వం కల్పించాలని వారు అడిగితే, దానిని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు తెచ్చిన భారత పౌరసత్వ చట్టం అందుకు వీలు కల్పించదు. సీఏఏపై ఈ ఫిర్యాదు ఉంది.

శరణార్థులుగా వచ్చిన హిందువులకు ప్రభుత్వం ఈ చట్టంతో పౌరసత్వం కల్పిస్తుంది. కానీ శరణార్థులుగా వచ్చిన శ్రీలంక తమిళులను మాత్రం స్వీకరించడం లేదు. శ్రీలంక తమిళుల్లో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఉన్నారు. ప్రభుత్వం ఇలా చేయడం తమిళులకు, తమిళనాడుకు నష్టం కలిగిస్తుంది. ప్రభుత్వం చర్యలో వివక్ష ఉంది. దీనినే మేం వ్యతిరేకిస్తున్నాం.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: ఇప్పుడు చాలా విషయాల్లో మీరు బీజేపీని విమర్శిస్తున్నారు. అయితే చాలా పథకాలు, చట్టాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి కదా?

చిదంబరం: కాంగ్రెస్‌ ప్రభుత్వం అవివేకమైనదనే భావనతోనే కదా ఎన్నికల్లో ఓడించారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఉపయోగం ఏముంది? వాళ్లు చేసింది తప్పనే అనుకున్నా, వాళ్లు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయారు కదా, అధికారంలో లేరు కదా! అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేస్తున్న పనులకు ఒకప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ను తప్పుపట్టగలమా?

బీబీసీ: ఆరేళ్ల క్రితం వెనకబడిన ఆర్థిక వ్యవస్థకు తాను పునరుత్తేజం కల్పిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు...

చిదంబరం: ఆయన చెప్పే గణాంకాలన్నీ తప్పు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013-14లో 6.4 శాతం వృద్ధిరేటు నమోదైన ఆర్థిక వ్యవస్థను మేం ఈ ప్రభుత్వానికి అందించాం.

బీబీసీ: 2013-14 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన 4.5 శాతం వృద్ధిరేటును ప్రధాని మోదీ ప్రస్తావిస్తున్నారు..

చిదంబరం: మనం చూడాల్సింది ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వృద్ధిరేటు ఎంతుందన్నది. 2013-14 చివరి నాటికి వృద్ధిరేటు 6.4 శాతంగా ఉంది. అప్పుడు కరెంటు ఖాతా లోటు ఒకటిన్నర శాతమే ఉంది. ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంది. మోదీ వచ్చిన తర్వాత కూడా ఏడాదిన్నరపాటు ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. మోదీ పాత బాటలోనే సాగుతున్నారని నేను కూడా చెప్పాను. ఇంతలో 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. ఆ క్షణం నుంచి అన్నీ తగ్గుముఖం పట్టాయి.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: ఆర్థిక వ్యవస్థ మందగమనానికి పెద్దనోట్ల రద్దు ఒక్కటే కారణమా?

చిదంబరం: అదే అత్యంత ప్రధానమైన కారణం. తర్వాతిది వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ). జీఎస్‌టీ మంచి విధానమే కానీ, అమలు సరిగా లేదు. తప్పుడు చట్టాలు, తప్పుడు వడ్డీరేట్లు, తప్పుడు పత్రాలు, తప్పుడు పద్ధతులు అమలు చేశారు. జీఎస్‌టీ వల్ల వాణిజ్య రంగం బాగా దెబ్బతింది. తర్వాత కూడా పొరపాట్లు కొనసాగాయి. సర్‌చార్జి అమలు సహా అన్ని విషయాల్లో తప్పులు చేశారు. ఇవన్నీ సరళీకృత ఆర్థిక విధానానికి విరుద్ధమైనవి. 1991 నుంచి సరళీకరణతో భారత్‌కు చాలా మేలు జరిగింది. సరళీకరణను ప్రవేశపెట్టడానికి ముందున్న రోజులకు ఆర్థిక వ్యవస్థను వాళ్లు తీసుకెళ్లాలనుకొంటున్నారు. ఇది తప్పు.

బీబీసీ: ఒకవైపు ఇన్ని అంశాలున్నా, ఒక తాత్కాలిక సారథితో ప్రధాన ప్రతిపక్షం పనిచేస్తోందా?

చిదంబరం: అదేమంత పెద్ద విషయం కాదు. తాత్కాలిక సారథి కూడా సారథే. తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటానని, అధ్యక్ష పదవికి తగిన నేతను గుర్తించాలని సోనియా గాంధీ మాకు చెప్పారు. అలాగే చేస్తామని మేం చెప్పాం. ఇది సీనియర్ నాయకుల తప్పు. మేం 25-30 మంది సీనియర్ నాయకులం సమావేశమై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అది ఇంకా జరగలేదు. ఇది సోనియా గాంధీ తప్పు కాదు. సమర్థురాలైన ఒక తాత్కాలిక సారథిగా ఆమె చేయగలిగినదంతా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకొన్నారు. ఇది ఆయన బలహీనతలా కనిపించడం లేదా?

చిదంబరం: ఇది బలమో, కాదో నాకు తెలియదు. అది ఆయన నిర్ణయం. "నేను పార్టీకి నాయకత్వం వహించలేను, పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది, అందుకు నైతిక బాధ్యత వహించి, రాజీనామా చేస్తాను" అని ఒక నాయకుడు అంటే అది తప్పని ఎలా అనగలం? బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి జెరిమీ కోర్బిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయన నైతిక బాధ్యత వహిస్తే అది తప్పని మనం ఎలా అనగలం?

బీబీసీ: మరింత బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో రాహుల్ కాడి దించేసినట్లు కనిపిస్తోంది...!

చిదంబరం: నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని, కొనసాగాలని ఆయనకు మేం చెప్పాం. "లేదు, నేను నైతిక బాధ్యత వహిస్తున్నా" అని ఆయన స్పష్టం చేశారు. ఆయన అలా చెప్పినప్పుడు మనం ఏం చేయగలం? ఆయన నిర్ణయాన్ని ఆయనకు వదిలేయాలి కదా!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)