"మత్తు వదలరా.." సినిమా రివ్యూ: కొత్తదనం నిండిన సినిమా

  • కె.సరిత
  • బీబీసీ కోసం
మత్తు వదలరా

ఫొటో సోర్స్, twitter.com/ClapEntrtmnt

"మత్తు వదలరా.." - కొత్తదనం నిండిన సినిమా.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహాను కథానాయకుడిగా, మరో కూమారుడు కాలభైరవను సంగీత దర్శకుడిగా, రితేష్ రాణాను దర్శకుడిగా పరిచయం చేసిన 'మత్తు వదలరా' సినిమా ఆసక్తికర ప్రోమో, ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

కథ

బాబు మోహన్ (శ్రీ సింహా) పేదరికానికి కేరాఫ్ అడ్రస్ లాంటి యువకుడు. మారుమూల ప్రాంతం నుంచి ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. మరో ఇద్దరు కుర్రాళ్లతో కలిసి ఒక పాత అపార్ట్‌మెంట్‌లో అద్దెకి ఉంటూ... పనికి తగిన వేతనం కూడా దక్కని కొరియర్ బాయ్‌గా పని చేస్తుంటాడు. నెల అంతా కష్టపడితే వచ్చే జీతం తన కనీస అవసరాలకు కూడా సరిపోక తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాబుకి అతడి కొలీగ్ ఏసుబాబు (సత్య) అక్రమ మార్గంలో ఎక్కువగా సంపాదించే విధానం చెబుతాడు.

ఏసుబాబు చెప్పినట్లు చేయబోయి బాబు పెద్ద ప్రమాదంలో పడతాడు. కొరియర్ డెలివరీ కోసం ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అనూహ్యంగా అక్కడ రెండు హత్యానేరాల్లో ఇరుక్కుంటాడు.

ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? బాబును ఎందుకు టార్గెట్ చేశారు? ఆ నేరాల నుంచి బయటపడడానికి బాబుకు అతని ఫ్రెండ్స్ ఏసుబాబు, అభి(నరేష్ అగస్త్య) ఎలా సహాయపడ్డారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఫొటో సోర్స్, BOOKMYSHOW

కథనం

'మత్తు వదలరా' కథ కన్నా కథనం గురించి ఎక్కువ చెప్పుకోవచ్చు. హీరో అనూహ్యంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం, మొదటి భాగమంతా ఆందోళన పడి, ఇంటర్వెల్ సమయానికి కాస్త గాడిన పడి, ఆ తర్వాత సినిమా అంతా చాణక్య తెలివితేటలు ప్రదర్శిస్తూ... అసలు దోషులు ఎవరో తెలియచెబుతాడు.

అలవాటు పడిన ఈ థ్రిల్లర్ లైన్‌తో తెలుగు సినిమా అన్ని జెనరేషన్‌ల ప్రేక్షకులు విసిగిపోయి ఉన్నారు. అయితే రితేష్ రాణా పనితనం ఇక్కడే కనపడుతుంది.

అదే మూస థ్రిల్లర్ కథను తీసుకుని,టెక్నికల్ అంశాలను తెలివిగా వాడుకుని, పకడ్బందీ కథనంతో కొత్తగా ప్రజెంట్ చేస్తూ... ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు ఎంగేజ్ చేయగలిగాడు. ప్లాష్‌బ్యాకుల పేరిట కథను అటు తిప్పి ఇటు తిప్పి హింస పెట్టే ధోరణికి విరుద్ధంగా తెలుగులో చాలా అరుదుగా వాడుకునే నియో-నాయిర్ స్క్రీన్ ప్లే ఈ కథకు బలాన్ని చేకూర్చింది అని చెప్పవచ్చు.

తెలుగులో వచ్చే రెగ్యులర్ సినిమాలతో విసిగిపోయి, కొత్తదనం ఆశించే ప్రేక్షకుల్ని మాత్రమే కాదు... రెగ్యులర్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుందని చెప్పవచ్చు. కథను ఎవరో చెప్తున్నారు, మరెవరో నటిస్తున్నారు అన్నట్లుగా కాక.. పాత్రల ద్వారానే కథను రాబట్టుకుంటున్నట్లుగా ప్రతి పాత్రను బిల్డ్ చేయడం... అన్నీ చూడ్డానికి చక్కగా అనిపిస్తాయి.

ఫొటో సోర్స్, twitter.com/MythriOfficial

సినిమాకు మరో బలం సందర్భోచిత హాస్యం అని చెప్పుకోవాలి. కామెడీ ట్రాకులు పంచ్‌ల తరహాలో కాకుండా సందర్భోచితంగా ఉండి ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా సత్య అయితే తన కామెడీ టైమింగ్‌తో సినిమానంతా ఒంటిచేత్తో నడిపిస్తున్నట్లుగా చెలరేగిపోయాడు. అతడు కనపడే ప్రతి సన్నివేశానికి హాలంతా ప్రేక్షకుల నవ్వులతో నిండిపోయింది.

సినిమా ప్రథమార్థంలో మొదటి పదిహేను నిమిషాలు కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ప్రేక్షకుడికి అసలు ఇది థ్రిల్లర్ కథేనా కాదా అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఆ తరువాత మాత్రం కథనం ఊపందుకుంటుంది. ఇక్కడి నుంచి ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉండి, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందకుండా పరుగులు పెడుతుంది.

ద్వితీయార్ధంలోనూ థ్రిల్లుకు, కామెడీకీ లోటులేనప్పటికీ డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం అంతగా కనెక్టవ్వదు. కోట్లల్లో జరిగే డ్రగ్స్ రాకెట్‌ని చాలా పీలగా చూపించే సరికి, ఈ విషయంలో ఇంకొంత కసరత్తు జరిపుంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఇక హీరో ఫ్రెండే విలనవ్వడంలోని ట్విస్ట్.. ఏమాత్రం ట్విస్టుగా అనిపించక చాలా బలహీనంగా కనపడుతుంది. సినిమా చూస్తున్నంత సేపు క్లైమాక్స్ ఎలా ఉంటుందోనన్న ప్రేక్షకుడి అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పవచ్చు. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్ధం తేలిపోయినట్లుగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Twitter/ClapEntrtmnt

దర్శకుడే కొత్త - దర్శకత్వానికి కాదు

సినిమా ప్రమోషన్ అనగానే భారీ సెట్టింగ్స్ నడుమ, అంతకన్నా భారీ డైలాగులూ.. ఇవే అందరికీ గుర్తొస్తాయి. కానీ దానికి భిన్నంగా 'మత్తు వదలరా' సినిమా ప్రమోషన్లు కూడా కొత్త పంథాలో కామెడీగా సాగుతూ... బాగా ఆకట్టుకున్నాయి.

ఈమధ్య ప్రతి సినిమాకు మొదట్లో మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే మెసేజ్ ఏ సినిమాకు ఆ సినిమా హీరో వాయిస్‌తోనే చెప్పించడం గమనించే ఉంటారు. ఐతే 'మత్తు వదలరా' సినిమాలో మాత్రం సినిమాలో చిన్న పాత్ర చేసిన పావలా శ్యామల గారితో హాస్యధోరణిలో చెప్పించారు.

తిరిగి ద్వితీయార్ధం మొదట్లో 'బామ్మ చచ్చిపోయింది కదా పాపం అందుకే నేనొచ్చా' అంటూ... అదే హెచ్చరిక జారీ చేస్తూ నవ్విస్తాడు సత్య. ఈ రెండు సందర్భాలు చాలు.. దర్శకుడు రితేష్ రాణా ఆలోచనలు ఎంత కొత్తగా, ఆహ్లాదంగా ఉంటాయో చెప్పడానికి. సినిమాలోని ప్రతి సీన్లో రితేష్ ముద్ర కనపడుతుంది. దర్శకుడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉందని అర్థమవుతుంది. దర్శకుడిపై హాలీవుడ్ థ్రిల్లర్ల ప్రభావం ఉన్న విషయం కూడా అర్థమవుతుంది. మొదటి సినిమాతోనే తాను ఈ తరం దర్శకుడినని చాటుకున్నాడు. మున్ముందు చూడదగ్గ దర్శకుడు అవ్వగలడనడంలో సందేహం లేదు.

ఫొటో సోర్స్, twitter.com/MythriOfficial/

సత్య నటస్వరూపం

'స్వామిరారా' సినిమా నుంచి తనను తాను రుజువు చేసుకోవాల్సిన ప్రతి సందర్భాన్ని తెలివిగా ఉపయోగించుకుంటున్న హాస్యనటుడు సత్య. తన కామెడీ టైమింగ్‌కి మ్యాచ్ అయ్యే సినిమా దొరకడంతో తన నటనతో చెలరేగిపోయాడని చెప్పవచ్చు.

శ్రీ సింహా ప్రత్యేకంగా హీరోలా కాకుండా ముగ్గురు కుర్రాళ్ల కథలో కొంచెం ప్రాముఖ్యం కలిగిన పాత్రలా... చాలా సహజంగా కనపడతాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ కూడా పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. మరో నటుడు నరేష్ అగస్త్య కూడా మంచి మార్కులే కొట్టేశాడని చెప్పవచ్చు. ఇక అతుల్య చంద్ర హీరోయిన్‌గా కాక డ్రగ్స్ డీలర్‌గా మంచి నటనను కనపరిచింది.

వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖ, గుండు సుదర్శన్... ఎవరి పరిధిలో వాళ్లు బాగా నటించారు.

టెక్నీషియన్స్

కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక్కడ తండ్రికి తగ్గ కొడుకు లాంటి పోలికలు అనవసరం కానీ నేపథ్య సంగీతం సినిమాకు ఆయువు పట్టు అని ఒప్పుకోవాలి. కాలభైరవ తన సంగీతంతో సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. డైరెక్షన్ మాదిరిగానే కాలభైరవ నేపథ్య సంగీతం కూడా కొత్తగా అనిపిస్తుంది. సురేష్ సారంగం ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని.. సినిమా చూస్తే అర్థమవుతుంది.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)