ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ: రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు... భారీగా పోలీసు బందోబస్తు

నిరసనలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

మూడు రాజధానుల ఏర్పాటు అంశం, రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు సారథ్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ భేటీ నేపథ్యంలో సచివాలయానికి సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, అగ్నిమాపక దళాలను మోహరించారు.

మరోవైపు అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ స్థానికులు కొందరు ఆందోళనకు దిగారు. అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద టీవీ ఛానెల్ ప్రతినిధులపై కొందరు ఆందోళనకారులు దాడికి దిగారు.

ఇద్దరు విలేకరులు గాయపడగా వారిని అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వెలగపూడి సమీపంలో సీఐతో పాటు, మరో ఎస్సైకి గాయాలయ్యాయి.

వెంకటాయపాలెం సమీపంలో ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

రాజధాని మార్పు అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ సాకుతో జగన్ ప్రభుత్వం ఏకంగా రాజధానిని అమ్మేస్తోందని ఆరోపించారు. రైతులు ఇచ్చిన భూములు అమ్మడానికే జగన్ సిద్ధమయ్యారని, కానీ ఇది వైసీపీ జాగీరు కాదని అన్నారు.

రాజధాని అంశంపై రైతుల ఆందోళన, ఉద్రిక్తత

రాజధాని అంశంపై వెలగపూడిలో రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది. రోడ్డుపై బైఠాయించిన రైతులు, మహిళలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.

మందడంలో భారీగా పోలీసులను మోహరించారు. జగన్ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ ఈ మార్గంలోనే తిరిగి ఇంటికి చేరుకుంటారు. దీంతో ఈ మార్గంలో ఆక్టోపస్ బలగాలను మోహరించారు.

విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించేందుకు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా గేటు ముందే బైఠాయించారు. వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నగరంలోని ఇతర మంత్రుల నివాసాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రామస్తులు రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు.

రాజధానిని మార్పు చేయొద్దంటూ రైతులు, మహిళలు గొల్లపూడి వద్ద ధర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గ గుడి వరకూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ర్యాలీకి ప్రయత్నించగా, దాన్ని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు.

అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని దేవినేని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)