సైన్యాధిపతి జనరల్ రావత్ 'రాజకీయపరమైన' వ్యాఖ్యలతో నియమాలను ఉల్లంఘించారా?

జనరల్ బిపన్ రావత్

ఫొటో సోర్స్, Getty Images

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరగుతున్న నిరసనల విషయంలో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

వివిధ రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి.

''నేతలకు వారి నాయకత్వ తీరు వల్ల పేరు వస్తుంది. అభివృద్ధి పథంలో నడిస్తే, మీ వెంట అందరూ నడుస్తారు. సరైన దిశలో జనాలను నడిపించేవాళ్లే అసలైన నాయకులు. తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లేవాళ్లు నేతలు అవ్వరు. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఇది నాయకత్వం అనిపించుకోదు'' అని రావత్ అన్నారు. గురువారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓ సైన్యాధికారి అయ్యుండి రావత్ ఇలా 'రాజకీయపరమైన' వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

''పాకిస్తాన్ బాటలో మనమైతే నడవట్లేదు కదా.. మన సైన్యంతో రాజకీయాలు చేయట్లేదు కదా..'' అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్‌లో సందేహం వ్యక్తం చేశారు.

రావత్ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

రావత్ వ్యాఖ్యలు నిజంగానే రాజకీయపరమైనవా? ఆయన సైనిక నియమాలకు ఉల్లంఘించారా?

బీబీసీ ప్రతినిధి మహమ్మద్ షాహిద్ రక్షణ వ్యవహారాల్లో నిపుణుడైన సీనియర్ జర్నలిస్ట్ అజయ్ శుక్లాను ఇవే ప్రశ్నలు అడిగారు. శుక్లా చెప్పిన అభిప్రాయం ఆయన మాటల్లోనే..

ఫొటో సోర్స్, PIB

'నియమాల ఉల్లంఘనే'

సైనిక నియమాలు, చట్టాల పరంగా చూసుకుంటే, సైన్యంలోని సభ్యులు ఎవరైనా రాజకీయ అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదు. ఆర్మీ రూల్ బుక్‌లో 21వ నిబంధన ఇది.

ఒకవేళ ప్రకటన చేయాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అది తీసుకోకుండా సైన్యం గానీ, సైన్యంలోని అధికారులు గానీ రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడకూడదు. జనరల్ రావత్ ఈ నియమాన్ని ఉల్లంఘించారు.

ప్రస్తుతం దేశంలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న అంశం గురించే ఆయన మాట్లాడారు. సైన్యాధిపతి ఇలాంటి విషయాలపై స్పందించడం తప్పు. అయితే, దీనిపై జనాలు అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

‘రావత్ సాధారణ పౌరుడు కాదు’

సైన్యంలోని జూనియర్ సైనికుడు నుంచి సైన్యాధిపతి వరకూ అందరికీ ప్రాథమిక హక్కులపై ఆర్మీ రూల్-19 ప్రకారం పరిమితులు వర్తిస్తాయి.

సాధారణ పౌరులకున్నట్లుగా సైనికులకు హక్కులు ఉండవు. ఇది కొత్త విషయం కాదు. సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసేదే. వాళ్లకు ఈ విషయం ఏటా మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటారు. సైన్యాధిపతి ఓ పౌరుడిగా ఆ వ్యాఖ్యలు చేశారని అనడం కుదరదు.

ప్రస్తుతం దేశంలో చాలా సున్నితమైన పరిస్థితులు ఉన్నాయి. సైన్యం ఒక సుస్థిర సంస్థ. దాన్ని దేశపు చివరి ఆప్షన్‌గా భావిస్తారు.

సైన్యం రాజకీయ అంశాలపై మాట్లాడితే, దాని నిష్పాక్షపాత వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది మంచిది కాదు. రాజకీయ అంశాలకు సైన్యం, సైన్యాధిపతి దూరంగా ఉండాలి.

ఒక ఆరోగ్య సదస్సులో జనరల్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ రాజకీయపరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని ఆయనకు అనిపించి ఉండకపోవచ్చు. కానీ, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అది పూర్తిగా రాజకీయ అంశం అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)