అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ, సీబీఐకి అప్పగించే అవకాశం.. రాజధాని నిర్మాణంపై హైలెవల్ కమిటీ - పేర్ని నాని

ఫొటో సోర్స్, facebook/ysjagan
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ (రాజధాని అక్కడే ఏర్పాటవుతుందన్న సమాచారం ముందే తెలుసుకున్న కొందరు భూములు కొనుగోలు చేయడం) జరిగిందని, ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు.
శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
సీఆర్‌డీఏ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై మంత్రివర్గ ఉప సంఘం తన నివేదికను సమర్పించిందని, నైతిక విలువలు దిగజార్చే విధంగా, అనైతికంగా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత చేరువగా ఉన్న వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేసినట్లుగా ఉప సంఘం గుర్తించిందన్నారు.
దీనిపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని, సమగ్ర దర్యాప్తు చేస్తామని ప్రకటించారు.
అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న ఒక కంపెనీ 2014 జూలైలో భూములు కొనుగోలు చేసిందని, ఏ రోజు, ఏ స్టాంపుతో, ఏ రిజిస్ట్రేషన్ నంబరుతో కొనుగోలు చేసిందో కూడా సమాచారం తమకు అందిందని చెప్పారు. అదేవిధంగా శాసనసభ్యులు, మంత్రులు, వాళ్ల కుటుంబ సభ్యులు, పనివాళ్లు, డ్రైవర్ల పేరిట కూడా భూముల కొనుగోళ్లు జరిగాయని తెలిపారు.
2014 డిసెంబర్ 31వ తేదీన రాజధాని ప్రకటన చేశారని, దానికంటే ముందు భూములు కొనుగోలు చేసిన వారిపై ఈ విచారణ జరుగుతుందన్నారు.
ఈ ప్రభుత్వానికి దమ్ముంటే తమను జైల్లో పెట్టాలని కొందరు గత నాలుగు నెలలుగా ప్రకటనలు చేశారని, పాపం పండే రోజు వస్తే ఎవరూ దాక్కునే పరిస్థితి ఉండదని, ఎవరిదీ దాచిపెట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు.
న్యాయ నిపుణుల సలహా మేరకు లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీల్లో ఎవరు చేస్తే సమగ్రంగా, సహేతుకంగా ఉంటుందో వారి చేత దర్యాప్తు చేయిస్తామన్నారు.
ఫొటో సోర్స్, I and PR, AP
రాజధాని నిర్మాణంపై హైలెవల్ కమిటీ ఏర్పాటు
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలపై జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వం మంత్రి మండలి ముందు పెట్టిందని, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదిక ఇంకా తమకు అందవలసి ఉందని పేర్ని నాని చెప్పారు.
వీటిపై మంత్రి మండలిలో సుదీర్ఘ చర్చ జరిగిందని ఆయన తెలిపారు.
ఈ రెండు నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వ హై లెవల్ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తుందని, అనంతరం నివేదిక ఇస్తుందని వెల్లడించారు.
2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ నివేదికను పక్కనపెట్టి.. మంత్రి నారాయణ, ఆయన బృందం ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, ఊహాజనిత, కలల రాజధానిని నిర్మించాలని నిర్ణయించిందని పేర్ని నాని చెప్పారు.
ఇందుకోసం 2016లో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి, మరో 20 ఎకరాలు ప్రభుత్వ అసైన్డు, బంజరు భూములను.. మొత్తంగా సుమారు 54 వేల ఎకరాల్లో ప్రపంచం ఈర్ష్య పడేలా రాజధాని నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అప్పటి అంచనాల ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున సుమారు రూ. లక్షా 10 వేల కోట్ల పైచిలుకు వ్యయం అవుతుందని ఆనాటి ప్రభుత్వం అంచనా వేసిందన్నారు.
అయితే.. ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్లు, నెలసరి వడ్డీ కింద మరో రూ.4 వేల కోట్లు.. మొత్తంగా రూ.5400 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.
అప్పట్లోనే ఈ హామీలపై వైఎస్ జగన్, తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు.
40 ఏళ్ల అనుభవంతో ఐదేళ్లలో రూ.5400 కోట్లు ఖర్చు చేయగలిగారని, తమకున్న తక్కువ అనుభవంతో మిగతా రూ. లక్షా 5 వేల కోట్లు ఎప్పటికి ఖర్చు చేయాలని, ఈ కలల రాజధాని ఎప్పటికి సాకారమవుతుందని అన్నారు.
ఎక్కువగా అప్పు తీసుకొచ్చేందుకు కూడా అవకాశం లేదన్నారు.
రాష్ట్రంలో ప్రారంభించి, కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.25 వేల కోట్లు, పాఠశాలలను మెరుగుపర్చేందుకు రూ.12 వేల కోట్లు, ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు రూ.14 వేల కోట్లు, ఆరోగ్య శ్రీ కోసం రూ. 3150 కోట్లు, పోలవరం నిర్మాణానికి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు నీళ్లు అందించేందుకు రూ.లక్ష కోట్లు, అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్లు, ఇళ్ల నిర్మాణానికి ఏటా రూ.9 వేల కోట్లు, వాటర్ గ్రిడ్ కోసం రూ.40 వేల కోట్లు, సాంఘీక, గిరిజన, బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.35 వేల కోట్లు, పేదలకు బియ్యం పంపిణీకి ఏటా రూ.10 వేల కోట్లు, ఫీజు రీయంబర్స్ మెంట్‌కు ఏటా రూ.6 వేల కోట్లు, వీటితో పాటు రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలకు ఏటా వేల కోట్లు అవసరమని పేర్ని నాని చెప్పారు.
ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ప్రజల భవిష్యత్తును పక్కనపెట్టి కలల రాజధానిని ఎప్పటికి నిర్మించగలం, ఆ రాజధాని ఇతర రాష్ట్రాల రాజధానులతో ఎప్పటికి పోటీ పడుతుంది? అనే అంశాలపై క్యాబినెట్‌లో చర్చించామన్నారు.
ఈ నేపథ్యంలో జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి, నివేదిక అందిచేందుకు క్యాబినెట్ మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు:
- పంచాయితీ రాజ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
- పంచాయితీ రాజ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
- కొత్తగా 108 వాహనాల కొనుగోలుకు నిధుల కేటాయింపు
- వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కొత్త విధానం అమలు
- కనీస మద్దతు ధర నోచుకోని చిరుధ్యాన పంటలకు మద్దతు ధర ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కొత్త విధానం
- వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగు ఎకరాలు వక్ఫ్ బోర్డ్‌కు కేటాయింపు
ఇవి కూడా చదవండి:
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- చంద్రబాబు: ‘ముఖ్యమంత్రి ప్రాణానికే ముప్పు ఉందని భావించే పరిస్థితి వచ్చింది’
- విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధానిగా మారేందుకు సన్నద్ధంగా ఉందా
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- తెలంగాణ, ఏపీ కార్మికుల 'గల్ఫ్' బాటకు కారణాలేంటి.. అక్కడ వారి కష్టాలేంటి
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
- నిర్భయ కేసు: మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ నలుగురు దోషులకు చట్టపరంగా ఉన్న చివరి అవకాశాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)