చంద్రబాబు: ‘ముఖ్య‌మంత్రి ప్రాణానికే ముప్పు ఉందని భావించే పరిస్థితి వచ్చింది.. ఒక్క పైసా లేకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చు’

  • వి శంకర్
  • బీబీసీ కోసం
చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, facebook/TDP.Official

రాజ‌ధాని మార్చే అధికారం ఈ ప్ర‌భుత్వానికి ఎవ‌రిచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శ్నించారు.

రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై శుక్రవారం ఆయన స్పందించారు.

‘‘రాష్ట్రంలో అంద‌రికీ అందుబాటులో ఉండేలా రాజ‌ధాని నిర్ణ‌యించాం. అన్ని ప్రాంతాల‌కు స‌మాన దూరంలో ఉండేలా ఒక శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసి నిర్ణ‌యం తీసుకున్నాం. విశాఖ‌ని ఒక ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సెంట‌ర్ గా, ఒక ఫార్మా సెంట‌ర్ గా మార్చేందుకు ప్ర‌ణాళిక‌లు తీసుకొచ్చాం. హైద‌రాబాద్ కి ధీటుగా విశాఖ‌ని అభివృద్ధి చేయాల‌ని ఫిన్ టెక్ హ‌బ్ గా చేయాల‌ని ప్ర‌య‌త్నించాం. అదానీ గ్రూప్ స‌హాయంతో ఒక మేజ‌ర్ క్యాపిట‌ల్ గా డేటా సెంట‌ర్ గా మార్చాల‌ని చూశాం. కొన్ని ల‌క్ష‌ల మందికి డేటా రెవ‌ల్యూష‌న్ తో ప్ర‌యోజ‌నం క‌లిగించేలా చూశాం. ఎందుకు ఈ ప్ర‌భుత్వం దానిని తీసేశారో స‌మాధానం చెప్పాలి’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘హైద‌రాబాద్ లో హైటెక్స్ పెట్టిన త‌ర‌హాలో లూలూ కి క‌మ‌ర్షియ‌ల్ సెంట‌ర్ కూడా ఏర్పాట‌య్యేలా చేశాం. కానీ దానిని వెళ్ల‌గొట్టారు. ఒక కంపెనీ తీసుకురావ‌డం చాలా క‌ష్టం. ఒక ఫార్య్చూన్ 500 కంపెనీ తీసుకొచ్చాం. విశాఖ‌ను అలాంటి కంపెనీల‌కు కేంద్రంగా చేయాల‌ని అనుకున్నాం. లాజిస్టిక్స్ కేంద్రంగా మార్చాల‌ని సుంద‌ర‌న‌గ‌రంగా చేశాం. 2వేల ఎక‌రాల‌తో భోగాపురం ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చాం. దానిని కూడా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. మెట్రో కూడా తీసుకురావాల‌నుకున్నాం. దానికి కూడా అడ్డుప‌డ్డారు. కానీ ఇప్పుడు 500 మందినో, వెయ్యి మందినో మ‌రో చోట‌ని తీసుకెళ్లి పెడితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటే పాల‌న‌ను విడ‌గొట్ట‌డం కాదు. కొత్త ప్రాజెక్టులు రావాలి. తిరుప‌తిని కూడా హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్ హ‌బ్ గా మార్చాల‌ని చూశాం. కానీ 30శాతం మొబైళ్లు తిరుప‌తిలో త‌యార‌వుతుంటే అక్క‌డి నుంచి రిల‌యెన్స్ ని త‌రిమేశారు’’ అని ఆరోపించారు.

‘ఒక్క పైసా లేకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చు’

‘‘ప్ర‌పంచంలో ఎక్క‌డ‌యినా మూడు రాజ‌ధానుల‌న్నాయా.. రాజ‌ధానులు మార్చ‌డం పిచ్చి తుగ్ల‌క్ చ‌ర్య త‌ప్ప ఇంకేంటి. ఇండియాలో వ‌చ్చిన ముఖ్య‌మంత్రులు ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం, ఇలాంటి పిచ్చి ముదిరితే చేసే చ‌ర్చ‌లు ఎలా సాగిస్తారు. అమ‌రావ‌తిలో 10వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. రైతులకు ధీమా క‌ల్పించాం. ప్ర‌భుత్వ భూములు అమ్ముకుంటే కావాల్సిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజ‌ధాని రూప‌క‌ల్ప‌న చేశాం. ఒక్క పైసా లేకుండా అభివృద్ధి చేసే అవ‌కాశం ఉంది. ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు అర్థం కాదు..చెబితే అర్థం చేసుకోరు. హైద‌రాబాద్ లో ఆదాయం పెంపుద‌ల కోసం మ‌హాన‌గ‌రాన్ని నిర్మించాం’’ అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

‘‘డ్రీమ్ క్యాపిట‌ల్ గా చేయాల‌నే అనుకున్నాం. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం చేశాం. మ‌న‌కు అర్హ‌త లేదా.. చెన్నై,హైద‌రాబాద్, బెంగ‌ళూరు, ముంబై త‌ర‌హాలో అభివృద్ధి చేయాల‌నుకున్నాం. అది త‌ప్పా. 29 గ్రామాల ప్ర‌జ‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా నిద్ర‌హారాలు మాని రోడ్డున ప‌డ్డారు. అన్ని రాజ‌కీయ పార్టీలు, సంఘాలు కూడా వారికి అండ‌గా ఉన్నాయి. ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను హౌస్ అరెస్ట్ చేస్తారా.. టీవీల స‌హాయంతో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తారా..పుండు మీద కారం చ‌ల్లి పైశాచిక ఆనందం పొందుతారా.. ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని మ‌హిళ‌లు ఆవేద‌న చెందుతున్న తీరుతో సీఎం సిగ్గుప‌డాలి. రైతుల‌పై త‌ప్పుడు కేసులు పెడ‌తారా.. ఇవాళ సెక్ర‌టేరియేట్ కి ఆక్టోప‌స్ (భద్రతా దళం)ని పెట్టుకుని వెళ్లారు. ఒక ముఖ్య‌మంత్రి ఈ ప‌రిస్థితికి వ‌చ్చిన త‌ర్వాత‌, మీ ప్రాణానికి, మీ భ‌ద్ర‌త‌కే ముప్పు వ‌చ్చింద‌ని భావించే ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు ఏమ‌నుకోవాలి. ముఖ్య‌మంత్రి ఇంటి ద‌గ్గ‌ర ఎవ‌రూ రాకూడ‌ద‌ని 144 సెక్ష‌న్ పెట్టారు. ప్ర‌జాద‌ర్భార్ కూడా మానుకుంటారా. ఇష్టానుసారంగా చేయ‌డం కూడ‌దు. ప్ర‌జ‌లు తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవ‌డం ఖాయం. అలాంటి ఉన్మాద చ‌ర్య‌లు వ‌ద్దు’’ అని చంద్ర‌బాబు అన్నారు.

‘జీఎన్ రావు ఓ గ్రూప్ వ‌న్ ఆఫీసర్ మాత్ర‌మే..’

‘‘ఒక్క రూపాయి ఖ‌ర్చు లేకుండా, ఆదాయం సంపాదించే అవ‌కాశాల‌ను వ‌దులుకోవ‌డం ఏంటి. మ‌న క‌ష్ట‌మో, న‌ష్ట‌మో మ‌న గ‌డ్డ మీదే ప‌డ‌దామ‌నుకుంటే మ‌న‌కు ఆత్మ గౌర‌వం లేదా. జీఎన్ రావు ఒక గ్రూప్ వ‌న్ ఆఫీస‌ర్. ఆయ‌న ఎందులో నిపుణుడో చెప్పాలి. ఆయ‌న్ని పెట్టుకుని నాట‌కాలు ఆడ‌తారా. క‌మిటీ రిపోర్ట్ ఇవ్వ‌క ముందే సీఎం ఎలా మాట్లాడ‌తారు. ఒక ముఖ్య‌మంత్రి ఈ ప్రాంతం మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నారో చెప్పాలి. అమ‌రావ‌తి దేవేంద్రుడి రాజ‌ధాని. అలాంటి ప‌విత్ర ప్రాంతం మీద ఎందుకు క‌క్ష గ‌ట్టారు. లండ‌న్ లో ఇప్ప‌టికే అమ‌రావ‌తికి గుర్తింపు వ‌చ్చింది. అలాంటి చారిత్రక న‌గ‌రాన్ని విస్మ‌రిస్తారా. ఆంధ్రుల‌కు రాజ‌ధాని క‌ట్టుకునే అర్హ‌త లేదా.. మ‌ళ్లీ బోస్ట‌న్ క‌మిటీ రిపోర్ట్, దానిపైన హైప‌వ‌ర్ క‌మిటీ అంటూ ఎందుకీ నాట‌కాలు. మూడు రాజ‌ధానులు పెట్టుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుని అనిశ్ఛితి సృష్టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అంద‌రినీ భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డి రాజ‌ధాని గురించి మాట్లాడ‌తారు. ఓ జిల్లా అధికారుల‌పై పెత్త‌నం చెలాయించే అధికారం ఆయ‌నకు ఎవ‌రిచ్చారు’’ అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)