CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - జమీయతుల్-ఉలేమా-ఎ-హింద్ మౌలానా మహమూద్ మదనీ

మౌలానా మహమూద్ మదనీ
ఫొటో క్యాప్షన్,

మౌలానా మహమూద్ మదనీ

వాయువ్య ఉత్తరప్రదేశ్ దేవబంద్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన జమీయతుల్-ఉలేమా-ఎ-హింద్ నిరసన ప్రదర్శనలపై చాలా చర్చ జరుగుతోంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం వ్యతిరేక ప్రదర్శనల తర్వాత జమాయతుల్-ఉలామా-ఎ-హింద్‌కు సంబంధించిన సుమారు 300 మంది స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు.

కొత్త పౌరసత్వ సవరణ చట్టాన్ని 'బ్లాక్ యాక్ట్‌'గా చెబుతూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని జమాయతుల్-ఉలామా-ఎ-హింద్‌ ప్రధాన కార్యదర్శి మౌలానా మహమూద్ మదనీ ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టం విషయానికి వస్తే, చొరబాటుదారులు అనే మాటను ఎప్పుడు ఉపయోగించినా వారి వేళ్లు ముస్లింల వైపే చూపిస్తున్నాయని ఆయన అన్నారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్ ముస్లింలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, మదనీ సంస్థ ఈ చట్టం గురించి ఏం చెబుతోంది అనే అంశాలపై బీబీసీ ప్రతినిధి షకీల్ అక్తర్, మౌలానా మహమూద్ మదనీతో మాట్లాడారు.

ఇంటర్వ్యూ చదవండి:

బీబీసీ:పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వస్తున్న స్పందనలకు కారణం ఏంటని భావిస్తున్నారు?

మౌలానా మహమూద్ మదనీ: చాలాకాలం నుంచీ భారత ముస్లింలు స్వయంగా అంచుల్లో ఉన్నట్టు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే చర్చిస్తున్నారు. ప్రస్తుత సమయంలో తమ గొంతు వినిపించేవారు లేరని ముస్లింలు ఎప్పుడో ఒకప్పుడు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చింది దాన్ని మేం 'బ్లాక్ యాక్ట్' అంటున్నాం. దీనికి వ్యతిరేకంగా ఎంత ఆగ్రహం ఉందో మీరు వీధుల్లోకి వచ్చిన జనాల సంఖ్యను బట్టి అంచనా వేయచ్చు.

కానీ ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది ఈ దేశంలోని ఏ ముస్లిం అయినా ఒక ముస్లిమేతరుడికి పౌరసత్వం ఇవ్వడాన్ని అసలు వ్యతిరేకించడం లేదు. మమ్మల్ని బయటపెట్టడం వల్లే మాకు సమస్యగా ఉంది.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఏ ముస్లిం అయినా భారత్ ఎందుకు వస్తారు అనడానికి నేను ఏమాత్రం వెనకాడను. కానీ మన దేశం మాకు ఒక మర్యాద నేర్పించింది. ఆ మర్యాద మాకు కొన్ని హక్కులు కల్పించింది.

మీరు ఆ మర్యాద ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా వెళ్లి ఈ చట్టం తీసుకొస్తున్నారు. తర్వాత ఈ ప్రభుత్వంలోని వారు, వారి మద్దతుదారులు ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని అంటున్నారు.

కానీ చొరబాటుదారులు అనే మాట వచ్చినప్పుడు వారి వేళ్లన్నీ ముస్లింలవైపే చూపిస్తాయి. అది దేశంలోని ముస్లింలందరికీ ఇబ్బంది కలిగిస్తోంది.

దీనికంటే పెద్ద పెద్ద దెబ్బలను ఈ దేశంలో ముస్లింలు చాలా ఓర్పుతో భరించారని ప్రజలకు తెలీదా?

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ:అయితే హద్దులు మీరుతున్నారని మీరు చెబుతున్నారా.. ?

మౌలానా మహమూద్ మదనీ: హద్దులు మీరుతున్నారు. కానీ మేం ఏమంటున్నాం. ప్రజాస్వామ్య దేశంలో మా గొంతు వినిపించే మా హక్కును, మా నుంచి లాక్కోవద్దని అంటున్నాం.

మొదటి విషయం మీరు మా మూలాలు కుదిపేశారు. రెండోది, మీరు ప్రజలను ప్రదర్శనలు చేయనివ్వడం లేదు. ఎక్కడ చూసినా 144 సెక్షన్ విధించారు. ఎక్కడా నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదు.

అక్కడక్కడా ప్రజలతో దౌర్జన్యంగా వ్యవహరించారు. ధర్నా, నిరసనలను అనుమతించడం అనేది, అసమ్మతి గళాలను శాంతింపజేసేందుకు ఒక మంచి పద్ధతి అనేది వీళ్లు అర్థం చేసుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో ఉండే ప్రత్యేకత అదే.

బీబీసీ: నిరసన ప్రదర్శనలు చేయడానికి ముస్లింలకు ఇది ఆఖరి అవకాశమని అనిపిస్తోందంటారా?

మౌలానా మహమూద్ మదనీ: ప్రతి ముస్లింకూ అదే అనిపిస్తోంది. అది తప్పు కాదు. మీరు మా మాట్లాడే హక్కు లాక్కుంటే, ఇంకేముంటుంది

పోలీసులు దౌర్జన్యం చేస్తుంటే, హింసిస్తుంటే, ప్రజలను నిర్బంధిస్తుంటే, అలా ప్రజలను అణచివేయలేరనే విషయం గుర్తించండి. ఇది మరింత ఎక్కువవుతుంది.

ఫొటో సోర్స్, Reuters

బీబీసీ: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మారింది?

మౌలానా మహమూద్ మదనీ: జమీయతుల్-ఉలేమా-ఎ-హింద్ ముస్లింల సంస్థ. అది ఎప్పుడూ టు నేషన్ థియరీని వ్యతిరేకిస్తూ వచ్చింది.

స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ముస్లింలు వర్సెస్ ఇతరులు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని మేం చెబుతూ వచ్చాం. అంటే, దేశం బాగుంటే, అప్పుడే ముస్లింలు బాగుంటారని, ముస్లింలు బాగుంటే అప్పుడే దేశం బాగుంటుందని చెబుతూ వచ్చాం. రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.

కానీ దురదృష్టవశాత్తూ దేశంలో రాజకీయంగా ముస్లింలను అంచులకు నెట్టేశారు. ఇప్పుడు సామాజికంగా కూడా ముస్లింలను వెనక్కు నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మేం ఈ సమాజం గురించి మాట్లాడాలని అనుకోవడం మా దురదృష్టం. కానీ మా పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా ఉంది.

వ్యతిరేకించే వారికి మేం అండగా నిలిస్తే, హిందువులు లేదా మరెవరికైనా పౌరసత్వం ఇవ్వడానికి వ్యతిరేకం కాదని ప్రజలను ఒప్పించడం చాలా కష్టం.

ఈ చట్టం వెంట నిలబడితే ఈ వంచనను ఎలా తట్టుకోవాలో తెలీడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: ఎన్ఆర్సీ ఎంత పెద్ద సవాలుగా అనిపిస్తోంది?

మౌలానా మహమూద్ మదనీ: ఇది నిజంగానే ఒక పెద్ద సవాలు లాంటిది. ప్రజల్లో దాని భయం ఉంది.

ఎన్ఆర్సీ గురించి కూడా మాకు సైద్ధాంతిక విబేధాలు లేవు. మేం అది చెడ్డదని చెప్పడం లేదు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం దాని గురించి ఎలా వ్యక్తం చేసిందో, అది చేసిన విధానం, అంతా చూస్తే వారి వేళ్లు ముస్లింల వైపే చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. అది కచ్చితంగా మాకు ఒక చాలెంజే.

దానిని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా ఆలోచించాకే చెప్పగలం. కానీ దానిని మేం నిలబడి ఎదుర్కుంటాం అనేది మాత్రం కచ్చితం.

దేశంలో ఇంత భారీ జనాభా(సుమారు 18 కోట్లు)ను రెండో తరగతి పౌరులుగా మార్చేయడాన్ని మేం ఒప్పుకోం, మా ప్రాణాలు పోయినా సరే.

బీబీసీ: ఇంతజనాభా ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యం దేశంలో ఇలా ఎలా చేయలరు?

మౌలానా మహమూద్ మదనీ: మీరు నిజమే చెబుతున్నారు. అది కచ్చితంగా కష్టమే.

ఈ దేశం ముస్లింలకు చాలా చేసింది. ముస్లింలు కూడా ఈ దేశం కోసం చాలా చేశారు. అది రెండు వైపులా ఉంది.

ఇక్కడ ముస్లింలు 'బై చాన్స్' ఇండియన్స్ కాలేదు. మేం 'బై చాయిస్' ఇండియన్స్ అయ్యాం. మేం ఈ దేశాన్ని ఎంచుకున్నాం. ఈ దేశానికి కూడా ఇక్కడి ముస్లింలపై అపార నమ్మకం ఉంది. ఆ విషయాన్ని మేం మా మనసులో పెట్టుకుంటాం.

మేం దిగులుపడడం లేదు, అసలు దిగులు పడ్డం లేదు. అప్పుడప్పుడు రాత్రులు సుదీర్ఘంగా ఉండొచ్చు. అయినా, ఇది చలికాలం రాత్రులు ఎక్కువే ఉంటాయి.

కానీ ఉదయం వస్తుంది, కచ్చితంగా వస్తుంది.. మాకు ఆ నమ్మకం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)