విశాఖపట్నం: రాజధానిని ఇక్కడికి తరలిస్తే నీళ్లు సరిపోతాయా? లోటును పూడ్చే మార్గాలేమిటి

  • విజయ్ గజం
  • బీబీసీ కోసం
నీళ్లు - అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని చేయాలనే ప్రతిపాదనల నేపథ్యంలో ఇక్కడి నీటి సమస్య చర్చకు వచ్చింది.

సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు ధర్మాసనం, శాసనసభ విశాఖపట్నానికి తరలిస్తే వచ్చే ఉద్యోగులకు, పెరిగే జనాభాకు, సందర్శకులకు తగినట్లుగా ఇక్కడ నీటి సౌకర్యం ఉందా అనే ప్రశ్న వచ్చింది. ఇక ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు పెద్ద మొత్తంలో నీరు కావాలి.

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో విశాఖ ఒకటి.

2001లో ఎనిమిదిన్నర లక్షలున్న విశాఖ జనాభా 2011 లెక్కల ప్రకారం 17 లక్షల 28 వేలకు పెరిగింది. అంటే పదేళ్లలో రెట్టింపైంది. 2011 నుంచి ఇప్పటి వరకూ పెరిగిన జనాభాను కలుపుకొంటే ఇది 21 లక్షలపైన ఉంటుందని అంచనా.

పరిసర గ్రామాల విలీనంతో విశాఖ మహానగరంగా రూపుదిద్దుకుంది. వీరు కాకుండా రోజు లక్ష మందికి పైగా వివిధ అవసరాల నిమిత్తం విశాఖకు వచ్చి వెళ్తుంటారు.

విశాఖకు నీరు ఎక్కడ నుంచి వస్తుంది?

ప్రధానంగా ఏలేరు రిజర్వాయర్ నుంచి వంద ఎంజీడీ (మిలియన్ గ్యాలన్సీ పర్ డే)ల నీరు విశాఖ నగరానికి వస్తోంది. ఇందులో నుంచే పరిశ్రమలకు, తాగునీటికి అందిస్తున్నారు. ఒక్క విశాఖ ఉక్కు పరిశ్రమే 40 ఎంజీడీల నీరు, ఎన్టీపీసీ 10 జీఎండీల నీరు తీసుకుంటున్నాయి. ఇక రైవాడ నుంచి 16, మేఘాద్రి గడ్డ నుంచి 10, తాటిపూడి పథకం నుంచి 10, గంభీరం, ముడసర్లోవ నుంచి నాలుగు ఎంజీడీల చొప్పున నీరు విశాఖ తాగునీటి అవసరాల కోసం వస్తోంది.

లెక్కల్లో చూస్తే ఇన్ని చోట్ల నుంచి నీరు వస్తున్నట్టు ఉన్నా, సాధారణంగా విశాఖలో ఏటా నీటి కష్టాలు ఉంటాయి. 2018లో తీవ్ర నీటి సమస్య ఎదుర్కొన్నారు నగర ప్రజలు. అనేక ప్రాంతాలకు నీటిని సరఫరా చెయ్యడం వీలు కాలేదు. రెండు రోజులకోసారి నీటిని ట్యాంకర్ల ద్వారా అందించారు. 2019లో విస్తారంగా వానలు పడటం, భూగర్భ జలాలు పెరగడంతో ఈ ఏడాది నీటి సమస్య రాలేదు. అయినా పూర్తిస్థాయిలో సరఫరా లేదు.

సరిపడా నీరు ఎందుకు రావడం లేదు?

విశాఖకు అధిక భాగం నీరు ఏలేరు జలాశయం నుంచి రావాలి. ఇప్పుడు ఏలేరుకు తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం లిఫ్టు నుంచి గోదావరి నీరు వస్తోంది. ఏలేరు కాలువ ద్వారా ఈ నీరు విశాఖకు వస్తుంది. ఏలేరు కాలువ నుంచి రోజుకు 162 ఎంజీడీల నీరు సరఫరా చేయొచ్చు. వ్యవసాయానికి అందివ్వడం, ఆవిరి నష్టాల వల్ల కేవలం 80-100 ఎంజీడీలు మాత్రమే వస్తోంది. మిగిలిన వనరులన్నీ తక్కువ సామర్థ్యం ఉన్నవి, వర్షాధారమైనవే.

ఏ వనరు నుంచి చూసుకున్నా విశాఖకు వచ్చే నీటిలో నష్టాలు పోను, సగం వరకు పారిశ్రామిక అవసరాలకు పోను లోటే ఉంటుంది.

"గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాటిపూడి, రైవాడ నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఈసారి విస్తారంగా వర్షాలు పడటం వల్ల నగరానికి నీరు అందించే అన్ని వనరులూ పూర్తిగా నీటితో ఉన్నాయి. రెండేళ్ల వరకూ నీటికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం" అని జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ వేంకటేశ్వర రావు బీబీసీతో చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

మేఘాద్రి గడ్డ

పోలవరమే పరిష్కారం

ఇప్పుడు విస్తారంగా వానలు పడ్డా అవసరమైన దాని కంటే తక్కువగానే నీరు సరఫరా అవుతోంది, మరి వానలు పడకపోతే, జనాభా పెరిగితే పరిష్కారం ఏమిటి?

విశాఖపట్నానికి మరిన్ని పరిశ్రమలు రావాలన్నా, ఒకవేళ రాజధాని విశాఖలో ఏర్పాటైనా ఈ నీరు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు అందితే భవిష్యత్తులో కొరత ఉండదని వారు పేర్కొంటున్నారు.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సాగునీటిశాఖలో చీఫ్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన సత్యనారాయణ బీబీసీతో మాట్లాడుతూ- "పోలవరం నుంచి గొట్టాల ద్వారా నీటిని విశాఖకు తీసుకు రావాలనే ప్రతిపాదన ఉంది. ఆ పైపు లైను వెళ్లే గ్రామాలకు శుద్ధి చేసిన మంచి నీటిని ఇవ్వాలని ప్రతిపాదన. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు పోలవరం ఎడమ కాల్వను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఇది పూర్తయితే కాల్వ పరిసర ప్రాంతాల్లో సాగునీటికి, విశాఖ నగర తాగునీటికీ ఇబ్బంది ఏదీ ఉండదు. ఈ కాల్వతో విశాఖ జిల్లా తాళ్లపాలెం వరకూ గ్రావిటీ ద్వారా నీరు వస్తుంది. అక్కడ లిఫ్టు ఏర్పాటు చేసుకుంటే ఉత్తరాంధ్రలోని ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు. పోలవరం పైపు లైను, ఎడమ కాల్వ రెండింటినీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులేవీ తలెత్తవు" అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు అందితే విశాఖకు భవిష్యత్తులో కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు.

బచావత్ ట్రైబ్యునల్ విశాఖ నీటి అవసరాల కోసం 400 ఎంజీడీల నీటిని కేటాయించిందని ఆయన ప్రస్తావించారు. గత పాలకులెవరూ ఇవేమీ పట్టించుకోలేదన్నారు.

విశాఖ జిల్లాలోని చిన్న జలాశయాలైన గోపాలపట్నం ఆవ, కృష్ణపట్నం ఆవ, యలమంచిలి, పెంజేరు, విశాఖ కొండకర్లలను అభివృద్ధి చెయ్యడం వల్ల మరో ఏడు టీఎంసీల నీటిని పొందొచ్చని, వేసవిలో గోదావరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

విశాఖకు పోలవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని అందించాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది.

ఫొటో క్యాప్షన్,

రైవాడ జలాశయం

దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ నమూనా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక సమీక్ష సమావేశంలో ఆదేశించినట్లు జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు బీబీసీతో చెప్పారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశముందని తెలిపారు. ఇది పూర్తిచేస్తే విశాఖవాసులకు నీటి లోటు ఉండదని వివరించారు.

సముద్ర నీటిని నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియతో శుద్ధి చేసి విశాఖలోని పరిశ్రమలకు ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ తరహాలో నిర్లవణీకరణ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని వెంకటేశ్వరరావు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)