తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌ల మధ్య పోటీ నేడే.. ఒలింపిక్స్ దిశగా ముందడుగు ఎవరిదో - ప్రెస్ రివ్యూ

  • 28 డిసెంబర్ 2019
Image copyright nikhat_zareen/twitter&GETTYIMAGES

ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో పాల్గొనే అవకాశం కోసం తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్ శనివారం పోటీపడనున్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.

భారత బాక్సింగ్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

టోక్యో (2020) ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం జరుగుతున్న ట్రయల్స్‌లో శనివారం జరిగే మహిళల 51కిలోల విభాగం ఫైనల్లో మేరీ, నిఖత్ బౌట్‌లోకి దిగనున్నారు. ఇందులో గెలిచినవారు ఒలింపిక్స్ బెర్త్ సాధించే దిశగా ముందడుగు వేస్తారు. చైనా వేదికగా వచ్చే ఫిబ్రవరి 3 నుంచి జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొంటారు.

క్వాలిఫయింగ్ టోర్నీ కోసం పారదర్శకంగా ఎంపిక జరగాలన్న నిఖత్ డిమాండ్ మేరకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) రెండు రోజుల పాటు ట్రయల్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన 51కిలోల ఫైట్‌లో నిఖత్ జరీన్.. జాతీయ చాంపియన్ జ్యోతి గులియాను ఓడించింది. మరో బౌట్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్.. రీతూ గ్రెవాల్‌పై అలవోక విజయం సాధించింది.

మేరీతో జరిగే ఫైనల్ పోరుపై స్పందిస్తూ బౌట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నిఖత్ చెప్పింది.

Image copyright Getty Images

జనాభా లెక్కల్లో అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారంటే...

జనాభా లెక్కల్లో భాగంగా అధికారులు దేశంలోని ప్రతి కుటుంబాన్ని అడిగే ప్రశ్నలు ఇవేనంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

మొత్తం 34 ప్రశ్నలతో కేంద్ర జనగణన శాఖ ప్రశ్నావళిని సిద్ధం చేసింది.

వచ్చే ఏప్రిల్‌ ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ గణన చేపడతారు.

ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కాదు. దేశంలో నిర్మించిన ప్రతి కట్టడం, అందులో నివసించే కుటుంబం వివరాలను నమోదు చేయనున్నారు.

ఒక్కో కుటుంబం వినియోగించే సౌకర్యాల్లో అత్యంత సూక్ష్మ అంశాలను కూడా సేకరిస్తారు. సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సమాచారమే కీలకం.

ఎస్సీ కేటగిరీ కింద హిందూ, సిక్కు, బౌద్ధమతాలు అనుసరించే వారినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇతర మతాల్లో ఎస్సీ అని చెప్పినా, నమోదు చేయరు. ఎస్టీ ప్రజలు ఏ మతంలో ఉన్నా నమోదు చేస్తారు.

ప్రశ్నల్లో కొన్ని..

  • మీరు ఎన్ని కట్టడాలు నిర్మించారు? ఏ భవనం ఎందుకు వినియోగిస్తున్నారు? దుకాణం లేదా పరిశ్రమ, లేదా ఇతర అవసరాలకు వాడుతున్నారా? ఖాళీగా ఉంచారా?
  • ఇంట్లో మొత్తం ఎన్ని గదులున్నాయి, వంటగదులెన్ని, స్నానపు గదులెన్ని, మరుగుదొడ్లు ఎన్ని, అవి ఇంటితో పడకగదులకు ఆనుకుని ఉన్నాయా లేక ఇంటి బయట ఆవరణలో ఉన్నాయా?
  • ఇంట్లో ఎందరు దంపతులున్నారు?
  • మీరు అద్దె ఇంటిలో ఉంటున్నారా? మీకు దేశంలో ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా ?
  • తాగునీరు ఎంత దూరం నుంచి తెస్తున్నారు? (పట్టణాల్లో 100 మీటర్ల నుంచి, పల్లెల్లో 500 మీటర్ల నుంచి తెస్తే తాగునీరు 'దగ్గర'గా ఉన్నట్లు నమోదు చేస్తారు.)
  • నల్లా నుంచి రక్షిత తాగునీరు వస్తోందా, బావి లేదా చేతిపంపు ఉందా, కాల్వ లేదా చెరువు నుంచి తెస్తున్నారా? రోజూ డబ్బా లేదా సీసా నీరు తాగుతున్నారా?
  • ఇంటి గోడలను కర్రలు, సిమెంటు, మట్టిగోడ, గ్రానైట్‌ ఇలా ఏ సామగ్రితో నిర్మించారు?
  • మరుగుదొడ్డిని డ్రెయినేజీకి అనుసంధానం చేశారా, ఇంటి ఆవరణలోనే మరుగుదొడ్డికి గుంత (సెప్టిక్‌ ట్యాంకు) నిర్మించారా? దాని శుభ్రతకు పారిశుద్ధ్య పనివారిని వినియోగిస్తున్నారా ?
  • వంటకు ఎల్పీజీ కనెక్షన్‌ ఉందా లేక ఇంకా కిరోసిన్‌, పిడకలతో వంట చేస్తున్నారా, కరెంటు లేదా సౌరవిద్యుత్తు పొయ్యిపై వండుతున్నారా?
  • ల్యాండ్‌లైన్‌ లేదా సెల్‌ఫోన్‌ ఉందా, రెండూ వాడుతున్నారా?
  • సైకిల్‌, బైక్‌, కారులో ఏమేం ఉన్నాయి?
  • కుటుంబంలో ఎంతమందికి ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయి?
  • కుటుంబ పెద్ద సెల్‌ఫోన్‌ నెంబరు?
Image copyright YS JAGAN MOHAN REDDY/FACEBOO

స్కూలు ఫీజులు తగ్గించేందుకు చర్యలు చేపట్టండి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల తగ్గింపు దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.

విద్యా హక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ఏపీ సీఎం అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, స్కూళ్ల పరిస్థితులను సమీక్షించాలని అన్నారు.

''స్కూళ్లలో ఫీజులు బెంబేలెత్తించేలా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ ఫీజులు తల్లిదండ్రుల అభిలాష, స్థాయిల మేరకు తగ్గాలి. ఆ దిశగా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి'' అని అధికారులకు సూచించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రైవేట్‌ కాలేజీలు, స్కూళ్లు, విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణపై సంబంధింత మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు (రిటైర్డ్‌), ఏపీ ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య (రిటైర్డ్‌) తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ స్కూళ్లు తెలుగు మీడియంలో నడుస్తున్నందున చిన్నారుల భవిష్యత్తుపై బెంగతో వారి తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయించి, అప్పులు కూడా చేసి ఖర్చు పెడుతున్నారని సీఎం జగన్‌ అన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెట్టేందుకు మొగ్గు చూపినట్లు వివరించారు. ఇంగ్లీషు మీడియం చదువులు పేదవాళ్లకు చేరువైతేనే వ్యవస్థలో మార్పులు వస్తాయని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.

ఒక వైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతూనే, మరోపక్క ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దూకుడును నియంత్రంచాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

ప్రైవేట్‌ కాలేజీలు, స్కూళ్లలో భారీ ఫీజులను నియంత్రించేందుకు త్వరలోనే తల్లిదండ్రులకు అందుబాటులో ఒక టోల్‌ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కచ్చితంగా అమలు కావాలని, బకాయిలను సకాలంలో చెల్లిస్తామని చెప్పారు.

కేటీఆర్ Image copyright twitter/KTRTRS

'కేసీఆర్ తర్వాత.. కేటీఆరే'

తెలంగాణకు కేసీఆర్ తర్వాత ఎప్పటికైనా సీఎం ఎవరు కావాలంటే, అందరూ కేటీఆర్‌నే కోరుకుంటారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించినట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ, నమ్మకం ఉన్న వ్యక్తి కేటీఆర్ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

''కేటీఆర్‌లో ఒరిజినాలిటీ ఉంది. ఆయన సీఎం కావాలని అందరూ కోరుకుంటారు. కేసీఆర్‌ తర్వాత ఐదేళ్లు, పదేళ్లు.. ఎప్పటికైనా సీఎం ఎవరు అంటే.. కేటీఆర్‌నే సహజంగా కోరుకుంటారు. అధికారం కోసం పాకులాడకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కేటీఆర్‌'' అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ, ప్రజల నమ్మకం, ముక్కుసూటితనం, మాటకు కట్టుబడి ఉండే నైజం, నమ్ముకున్న వారి కోసం పనిచేసే లక్షణం, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే తత్వం కేటీఆర్‌కు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

''తర్వాత సీఎం ఎవరు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. క్లాస్‌లో ఫస్ట్, సెకండ్‌ వచ్చే విద్యార్థులుంటారు. రేపేదైనా పోటీకి వెళ్తే.. ఫస్ట్‌ ఎవరొస్తరు అంటే చెప్పగలం.. అంతేకానీ ఫెయిలైన వ్యక్తి, మామూలు మార్కులతో పాసైన వ్యక్తి పేర్లు చెప్తామా?'' అని చెప్పారు.

అయితే, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాన్ని తమ అధినేత, పార్టీ చూసుకుంటుందని అన్నారు.

''ఎంఐఎం నేత అసదుద్దీన్‌.. కేసీఆర్‌ను కలవడాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది. సీఎంను ఏ పార్టీ వారైనా కలవొచ్చు. మత కలహాలు సృష్టించి ఓట్లు దండుకోవాలనే కొందరి ప్రయత్నాలను అడ్డుకుంటాం'' అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: అమరావతిపై నాకెలాంటి కోపం లేదు, నా ఇల్లు అక్కడే ఉంది - వైఎస్ జగన్

వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు

థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు

మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు

‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫొటో చూసి ఆగిపోయా’ - టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా, జంతువులు కూడా నొప్పితో బాధపడుతాయా