ఉత్తర్‌ప్రదేశ్ - CAA నిరసనలు: "పశువులకు గడ్డికోసం వెళ్లిన మా అబ్బాయిని పోలీసులు చంపేశారు" - గ్రౌండ్ రిపోర్ట్

  • 29 డిసెంబర్ 2019
యూపీ విధ్వంసం

భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం గురించి గత రెండు వారాలుగా వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ చట్టం ద్వారా మూడు పొరుగు దేశాలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడానికి షరతులను సడలించే నిబంధన ఉందని అధికార బీజేపీ చెబుతోంది.

ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో హింస వల్ల 20 మందికి పైగా మృతిచెందారు. వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మృతులు, అరెస్టైన వారు ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉన్నారు.

నిరనసకారులపై తీవ్ర బల ప్రదర్శన చేశారని, ముస్లింల ఇళ్లలో విధ్వంసం సృష్టించారని యూపీ పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. కానీ రాష్ట్రం నుంచి బయటకు వస్తున్న వీడియోలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి.

కాన్పూర్‌లో నిరసన ప్రదర్శనలకు సంబంధించిన ఒక వీడియోలో ఒక పోలీస్ నిరసనకారులపై కాల్పులు జరపడం కనిపిస్తోంది. ఇక ముజఫర్‌నగర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనల వీడియోలో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేస్తున్నారు. మరో వీడియోలో పోలీసులు ఒక వృద్ధుడిని చితకబాదుతున్నారు.

మీరట్‌లో పోలీసులు ముస్లింల షాపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడం కూడా కనిపిస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలకు సంబంధించిన వీడియోల్లో రాష్ట్రంలో ముస్లిం నిరసనకారులతో పోలీసులు ప్రవర్తించిన తీరు గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 19 మంది మృతిచెందారు. వీరంతా సామాన్యులే. వీరిలో ఎక్కువమంది కాల్పుల్లో చనిపోయారు. 28 ఏళ్ల మహమ్మద్ మొహసిన్ గుండెలో బుల్లెట్ తగలడంతో మృతిచెందాడు.

చిత్రం శీర్షిక మొహసిన్ తల్లి నఫీసా పర్వీన్

మొహసిన్ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనలేదని అతడి తల్లి నఫీసా పర్వీన్ చెప్పారు. పశువుల కోసం గడ్డి తీసుకురావడానికి వెళ్లిన అతడు తిరిగి రాలేదన్నారు.

మొహసిన్ ఒక చిన్నారికి తండ్రి కూడా. అతడి తల్లి "మాకు ఏం తెలీదు. మాకు న్యాయం కావాలి. పోలీసులు నా కొడుకును చంపేశారు. ఇప్పుడు తన బిడ్డను ఎవరు చూసుకుంటారు" అని ప్రశ్నిస్తున్నారు.

మొదట యూపీ పోలీసులు తమ వైపు నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదని చెప్పారు. నిరసనకారుల్లో కొందరి దగ్గర తుపాకులు ఉన్నాయని చెప్పారు. అయితే, తర్వాత యూపీ పోలీసులే, తమ వైపు నుంచి కాల్పులు జరిగాయని అంగీకరించారు.

పోలీసులు రాత్రి చీకటిలో తమ ఇంట్లో చొరబడి ధ్వంసం చేశారని ఆరోపించిన ఒక కుటుంబాన్ని బీబీసీ కలిసింది.

ఆ ఇంట్లో ప్రతి గదిలో కనిపించిన దృశ్యాన్ని ఊహించడం కూడా కష్టం. అక్కడ విధ్వంసం సృష్టించారు. ఒక గదిలో ఉంచిన బీరువాలో నగలు, డబ్బు కూడా ఉన్నాయని, వాటిని అదే రాత్రి దోచుకెళ్లారని హుమాయారా పర్వీన్ చెప్పారు.

తమ ఇంటికి చాలా మంది పోలీసులు వచ్చారని, వారిలో మామూలు బట్టల్లో కూడా కొందరు ఉన్నారని ఆమె చెప్పారు.

"మా సామాన్లలో కొన్ని నగలు, డబ్బాలో కొంత డబ్బు కూడా ఉంది. అవన్నీ ఎత్తుకెళ్లారు. పోలీసులతో పాటు మామూలు బట్టల్లో వచ్చినవారు మమ్మల్ని బయటకు వెళ్లమని చెప్పారు. మా ఇల్లు త్వరలో వాళ్లదవుతుందని, మేం దేశం వదిలి వెళ్లాలని అన్నారు" అని ఆమె వివరించారు.

"మేం ముస్లింలం అయితే ఏమైంది? మాకు భారతదేశంలో ఉండడానికి ఏ హక్కూ లేదా?" అని హుమాయారా ప్రశ్నించారు.

బీబీసీ టీమ్ అక్కడ చాలా మంది మహిళలతో మాట్లాడింది. దాదాపు ప్రతి చోటా తమ ఇళ్లలోని వస్తువులు దోచుకున్నారని, విధ్వంసం సృష్టించారని ప్రజలు చెప్పారు.

పోలీసుల ప్రవర్తన, కొత్త చట్టం రెండూ అధికార పార్టీ హిందూ జాతీయవాద ఎజెండాలో భాగం అని చాలామంది అన్నారు.

ప్రభుత్వం మాత్రం పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలో ఉండే ముస్లింలపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతోంది. నిరసనకారులు హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది.

"వాళ్లు 50 వేల మంది ఉన్నారు. బహుశా భారత్‌లో 50 వేల మంది ఎప్పుడూ గుమిగూడి ఉండరు. వాళ్లంతా, తమకు కనిపించిన ప్రతి మోటర్ సైకిల్‌కూ నిప్పుపెట్టారు. రాళ్లు రువ్వుతున్నారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను" అని బీజేపీ నేత, ముజఫర్‌నగర్ ఎంపీ సంజీవ్ బలియాన్ అన్నారు.

"ఫుటేజ్‌లో కాల్పులు జరిపిన, రాళ్లు రువ్వుతున్న కొందరి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేయకూడదా?" అని ప్రశ్నించారు.

"పోలీసులు మొదటే స్పష్టంగా చెప్పారు. నేను కూడా చెప్పాను. ధర్నా ప్రదర్శనల్లో పాల్గొన్న వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోం. కానీ ఎవరైతే రాళ్లు రువ్వారో, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారో, వాహనాలు తగలబెట్టారో, కాల్పులు జరిపారో వారిని మేం వీడియోలో గుర్తించాం. వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటాం. వాళ్లను వదిలిపెట్టం" అన్నారు.

రాష్ట్రంలో వ్యతిరేక ప్రదర్శనల తర్వాత గత కొన్ని రోజులుగా ఏర్పడిన పరిస్థితులను చూస్తున్న స్థానిక ముస్లిం సమాజాలు తమ భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నాయి.

Image copyright Bc

ప్రభుత్వం వారి ఆందోళనలను దూరం చేసేందుకు సోషల్ మీడియాలో పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తోంది.

కానీ ఈ చట్టం అమలవడానికి ముందే ప్రభుత్వం, పోలీసు యంత్రాగం మీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో, వాటిని గమనిస్తే ఈ చట్టం ప్రభావం అప్పుడే క్షేత్రస్థాయిలో కనిపించడం మొదలైందని సంకేతాలు లభిస్తున్నాయి.

ఇప్పుడు దేశంలో మతప్రాతిపదికన చీలిక పెరుగుతోంది. ఇది మరింత తీవ్రంగా మారుతోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఇప్పుడు భయం నీడలో ఉన్నాయి. జనం ఆగ్రహం లోలోపలే పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం