అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకున్నారు?

  • 11 జనవరి 2020
సూర్య రాజప్పన్ చేతిలో బ్యానర్ Image copyright SURYA RAJAPPAN
చిత్రం శీర్షిక సూర్య రాజప్పన్ చేతిలో బ్యానర్

అది దిల్లీలోని లాజ్‌పత్ నగర్ కాలనీ. అక్కడ హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఇది బీజేపీ ప్రచారంలో ఓ భాగం.

కానీ, ఆ సమయంలో ఓ మహిళ సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక బ్యానర్ పట్టుకుని తన బాల్కనీలో నిలబడ్డారు. ఈ ఫొటో విస్తృతంగా ప్రచారమైంది.

ఆ సమయంలో ఉన్నట్లుండి ఓ మూక ఆ ఇంట్లో ప్రవేశించి ఆమెపై దాడికి దిగింది.

ఇప్పుడు ఆ బ్యానర్ పట్టుకున్న సూర్య రాజప్పన్, ఆమె స్నేహితురాలిని ఆ ఇంటి యజమాని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

సూర్య తన స్నేహితులతోనే ఉంటున్నారు. యజమాని ఇల్లు ఖాళీ చేయించినందుకు ఆమె బాధపడట్లేదు. కానీ, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించే వారి ఆందోళనంతా.

"మేం అతివాదులకూ వ్యతిరేకం కాదు. మితవాదులకూ వ్యతిరేకం కాదు. ఇదంతా భారత్ కోసమే. మనందరం పుట్టి పెరిగిన ఈ దేశం కోసం. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో 2020 నాటికి భారత్ ఎలా ఉంటుందని ఊహించానో అది ఇది కాదు" అని సూర్య బీబీసీతో అన్నారు.

"ఈ దేశంలోని పౌరులందరికీ స్వేచ్ఛగా, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. ఇది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెబుతోంది. నిరసన తెలపడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలపై ఓ పౌరుడిగా నాకు ఆ హక్కు ఉంది" అని తను నిరసన తెలపడంపై నెలకొన్న వివాదంపై సూర్య వ్యాఖ్యానించారు.

చిత్రం శీర్షిక సూర్య రాజప్పన్

27ఏళ్ల సూర్య దిల్లీ హైకోర్టులో న్యాయవాది.

ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తోంది, లేదా చేయాలని నిర్ణయించుకుంది అనిపిస్తే, రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు నాకుంది అని ఆమె అంటున్నారు.

ఆదివారం నాడు అమిత్ షా లాజ్‌పత్ నగర్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే ఆమె తన బాల్కనీ నుంచి సీఏఏ వ్యతిరేక బ్యానర్ ప్రదర్శించారు.

ఆమె వ్యతిరేకత అమిత్ షా పైనా?

తాము చూపించిన బ్యానర్ కారణంగా ఇంత జరుగుతుందని అనుకోలేదని సూర్య అన్నారు.

"మా బ్యానర్ అమిత్ షాకు వ్యతిరేకంగా ఉన్నది కాదు. అది సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ రాసిన బ్యానర్. కానీ, అమిత్ షా మా అభిప్రాయం తెలుసుకోవాలని మేం కోరుకున్నాం. కానీ, సీఏఏ, ఎన్ఆర్సీల విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని అమిత్ షా అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ మీతో విభేదిస్తున్నారని ఆయనతో చెప్పాలనుకున్నాం.

నేను అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు దేశంలో రోడ్లపైకి వస్తున్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. వారిని నిర్లక్ష్యం చేయవద్దు. దేశంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. దేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోండి.

అమిత్ షా మా వీధిలోంచి వెళ్తారని తెలియగానే, మా నిరసనను ఆయనకు తెలియచేయాలనుకున్నాం. ఓ బెడ్‌షీట్‌పైన పింక్ కలర్ స్ప్రే చేసి అక్షరాలు రాశాం. మా నిరసన ఇంత పెద్దదవుతుందని అనుకోలేదు. ప్రజల స్పందన దీన్ని పెద్దగా చేసింది" అని ఆమె తెలిపారు.

Image copyright SURYA RAJAPPAN

ఆమె బ్యానర్‌ను చించేసిన మూక, ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తారని అనుకున్నానని, వాళ్లు అంత తీవ్రంగా స్పందిస్తారని అనుకోలేదని సూర్య తెలిపారు.

"మా బ్యానర్ చూసి ర్యాలీలో ప్రజలకు కోపం వస్తుందని అనుకున్నాం. కానీ, వాళ్లు ఇలా హింసకు దిగుతారని ఊహించలేదు" అని ఆమె అన్నారు.

"మా నిరసన ద్వారా మేం కోరుకున్నది ఈ ఆవేశం కాదు. వాళ్లు బ్యానర్ చించేశారు. మా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వాళ్లు మాపై దాడి చేయాలనుకున్నారేమో. మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నారేమో" అని సూర్య అభిప్రాయపడ్డారు.

"నిరసన వ్యక్తం చేసే చిన్న చిన్న గొంతులను కూడా హింసతో అణచివేసే కాలానికి మనం చేరుకున్నాం అంటే బాధ కలుగుతోంది. మన హక్కుల కోసం మనం ఇప్పటికీ నిరసన తెలపవచ్చు, కానీ, అందరూ ఐక్యంగా ఉండకపోతే అది సాధ్యం కాదు. భారత పౌరురాలిగా, అలా అణచివేతకు గురవుతున్నవారి గళాన్ని వినిపించడం కూడా నా బాధ్యతే" అని సూర్య అన్నారు.

ఆ బ్యానర్ చూసిన సూర్య ఇంటి యజమాని ఆమెను ఇల్లు ఖాళీ చేయిస్తానంటూ బెదిరించారు. ఆ తర్వతా ఖాళీ చేయించారు. ఆ యజమానితో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన దానికి నిరాకరించారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో ఇప్పటివరకూ 31 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

లాయర్ సూర్య కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

"నాకు ఈ దేశంపై చాలా ఆశలున్నాయి. ఈ నిరసనలు నా ఆశలను మరింత పెంచాయి. ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయని చెబుతున్నవారు ఓసారి బయటకొచ్చి జరుగుతున్నదేంటో చూడాలి. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే చాలా అసహనంగా ఉండేది. కానీ, ఈ నిరసనలు చూస్తుంటే మళ్లీ నేను కోరుకున్న భారత్ సాకారమవుతుందనిపిస్తోంది" అని సూర్య అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?

కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షలకు చేరిన కోవిడ్ కేసులు, 34,000 దాటిన మృతులు

కరోనా లాక్‌డౌన్: తెలంగాణ రాష్ట్రంలోని 3 లక్షల మంది వలస కార్మికులకు అన్నం పెట్టేదెవరు

కరోనా లాక్‌డౌన్ సమయంలో కుటుంబ జీవనం ఎలా ఉంది?

కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి.. అవి ఎందుకు ముఖ్యం

క‌రోనావైర‌స్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో న‌ష్టం ఎంత‌

దిల్లీ: కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. ‘మొదటి మూడు రోజులు మాటలు కూడా సరిగా రాలేదు’

కరోనా లాక్‌డౌన్: కశ్మీర్ పర్యాటక రంగంపై దెబ్బమీద దెబ్బ.. మొన్నటి వరకూ ఆర్టికల్ 370, ఇప్పుడు లాక్‌డౌన్

కరోనా లాక్‌డౌన్: సరిహద్దుల్ని మూసేయండి.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం