బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం?

  • 11 జనవరి 2020
బంగారం ఆభరణాలు ధరించిన మహిళ Image copyright Getty Images

పశ్చిమాసియాలో పెరుగుతున్న సంక్షోభానికి, మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇరాన్ మిలిటరీ సీనియర్ కమాండర్ కాసిం సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత వెంటనే అంతర్జాతీయంగా బంగారం ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1600 డాలర్లకు పెరిగింది.

భారత్‌లో 2 శాతానికి పైగా పెరిగి పది గ్రాముల బంగారం రూ. 41,290కి ఎగబాకింది. అకస్మాత్తుగా మారిన అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బంగారానికి బలమైన సాంస్కృతిక ప్రధాన్యత ఉన్న భారత్‌ లాంటి దేశాల్లో ఈ ప్రభావం ఎప్పుడూ ఊహించేదే.

"బంగారం మీద పెట్టుబడి పెడితే సురక్షితమన్న భావన ఉంది. అందుకే ప్రత్యేకించి భారత్‌లో ఇదొక సంప్రదాయ పెట్టుబడి మార్గంగా కొనసాగుతోంది. అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పుడు మదుపరులు బంగారాన్ని ఒక నమ్మకమైన ఆస్తిగా చూస్తారు" అని కేడీఎన్ ఇన్వెస్ట్‌మని ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాహుల్ శర్మ అంటున్నారు.

Image copyright Getty Images

ధరల పెరుగుదలతో బంగారానికి డిమాండ్‌ కాస్త తగ్గే అవకాశం ఉంది. కానీ, అది తాత్కాలికమేనని స్థానిక బంగారం వ్యాపారులు అంటున్నారు. భారత్‌లో బంగారానికి డిమాండ్ ఎన్నడూ తగ్గదని దిల్లీలో 40 ఏళ్లుగా నగల తయారీ వ్యాపారంలో ఉన్న విజేందర్ వర్మ అంటున్నారు.

"ధరలు భారీగా పెరిగాయి కాబట్టి తాత్కాలికంగా బంగారానికి కాస్త డిమాండ్ తగ్గొచ్చు. కానీ, అవసరం ఉన్నవారు ఎలాగైనా కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఎందుకంటే, మతపరమైన, సంప్రదాయ కార్యక్రమాలకు అది తప్పనిసరి కదా. గ్రాముల చొప్పున బంగారం అమ్మకాలు ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు పది గ్రాములు కొందామనుకున్నవారు ఇప్పుడు ఒక గ్రాము తక్కువ కొంటారు" అని వర్మ వివరించారు.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్నది భారత దేశమే.

భారత్‌లో ఏటా జనవరి నుంచి ఏప్రిల్ వరకు పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే, కుటుంబాలు ఇచ్చిపుచ్చుకునే మంగళప్రదమైన బహుమతిగా బంగారానికి గుర్తింపు ఉంది.

Image copyright Getty Images

ఇతర వ్యాపారులు కూడా అదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పతనమైన సందర్భాలు చాలా అరుదని, బంగారం ఎప్పుడూ విలువైన వస్తువేనని అంటున్నారు. "ఎందుకంటే, రానురాను బంగారం గనులు తగ్గిపోతున్నాయి. కాబట్టి, అది ఎల్లప్పుడూ అమూల్యమైన పదార్థంగానే ఉంటుంది. దాని విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది" అని రాహుల్ శర్మ అంటున్నారు.

ప్రజలు బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి మరో ప్రధాన కారణం అది చరాస్తి కావడం.

"ఎంత బంగారం ఉన్నా సమస్య ఉండదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. లావాదేవీలకు సురక్షితమైన వస్తువు. బంగారం అమ్మేసి అప్పటికప్పుడే డబ్బులు తీసుకోవచ్చు" అని శర్మ వివరించారు.

ఇలాంటి సానుకూల కారణాల వల్లే, ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును బంగారం లాంటి సురక్షిత మార్గాల్లో మదుపు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

భారత్ లాంటి దేశాల్లో ఎక్కువ మంది ఇష్టపడుతున్న పెట్టుబడి మార్గంగా కొనసాగుతోంది.

సాంస్కృతిక అవసరాలకు మించి, ప్రజలు బంగారం వైపు చూడటానికి ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులు కూడా కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొనుగోళ్ల వైపు మొగ్గుచూపేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రయాస పడుతోంది. ఆర్థిక మందగమనం కారణంగా దేశంలో ప్రతి రంగం మీదా ప్రభావం పడింది. గృహాలు, కార్ల లాంటి భారీ వస్తువుల మీద ఖర్చు పెట్టేందుకు ప్రజలు సంకోచిస్తున్నారు.

Image copyright Getty Images

బంగారం ధరలు పెరిగినప్పుడు ప్రజలు బంగారాన్ని పునర్వినియోగం వైపు వెళ్తుంటారన్న అభిప్రాయం కూడా ఉంది.

కొన్ని నివేదికల ప్రకారం, భారత్‌లో 2019 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బంగారానికి డిమాండ్ 32 శాతం పడిపోయింది. ధరల పెరుగుదల, ఆర్థిక మందగమనం పరిస్థితులు వినియోగదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీయడమే అందుకు కారణం.

ధరలు గరిష్ఠానికి చేరిన తర్వాత, ఇప్పుడు వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఇరాన్ బుధవారం చేసిన ప్రతిదాడుల వల్ల తమ బలగాలకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

పశ్చిమాసియాలో పరిస్థితులు కాస్త శాంతించడంతో భారత్‌లో వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. కానీ, ఇది తుపానుకు ముందు ప్రశాంతత లాంటిది అనుకోవాలా? అంటే, రాబోయే కొన్ని వారాల పాటు మార్కెట్‌ ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ వణికిస్తున్నా, మే నెలలోనే ఎన్నికలు జరుపుతామంటున్న పోలాండ్

కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు

ఇండియా లాక్‌డౌన్: ‘‘కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని నేను అనుకోలేదు’’

కరోనావైరస్: ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న బ్రిటన్ వైద్య సిబ్బంది

కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది.. కంటైన్‌మెంట్ ఆపరేషన్‌ ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది

ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్

కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు

ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?