కేరళ తీరంలో రెండు ఆకాశహర్మ్యాలు క్షణాల్లో నేలమట్టం

  • 12 జనవరి 2020
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకేరళలోని మరదు మున్సిపాలిటీ పరిధిలో జనవరి 11న రెండు ఆకాశహర్మ్యాల కూల్చివేత

కేరళలో తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు ఆకాశహర్మ్యాలను అధికారులు శనివారం 'నియంత్రిత పేలుడు(కంట్రోల్డ్ ఇంప్లోజన్)' పరిజ్ఞానంతో కొన్ని క్షణాల్లో నేలమట్టం చేశారు.

మరదు మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌2వో హోలీ ఫెయిత్ కాంప్లెక్స్, ఆల్ఫా సెరీన్ ట్విన్ టవర్లు అనే ఈ అపార్టుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఒక కమిటీ నిర్ధరించిన తర్వాత వీటి కూల్చివేతకు 2019లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఆదివారం ఇలాంటి మరో రెండు ఆకాశహర్మ్యాలను అధికారులు తొలగించనున్నారు.

ఈ వారాంతంలో మొత్తం రెండు వేల మంది నివాసాలైన ఇంచుమించు 343 ఫ్లాట్లను కూల్చివేయనున్నారు. భారత్‌లో ఇప్పటివరకు పెద్దయెత్తున చేపట్టిన నివాస భవనాల తొలగింపు కార్యక్రమాల్లో ఇది ఒకటని చెబుతున్నారు.

శనివారం మొదట 90 ఫ్లాట్లు ఉన్న 19 అంతస్తుల హెచ్‌2వో హోలీ ఫైత్ కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. తర్వాత ఆల్ఫా సెరీన్ ట్విన్ టవర్లను పడగొట్టారు.

షంషుద్దీన్ కరుణగపల్లి అనే నివాసితుడు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ- భవనాల కూల్చివేతను తన భార్య, పిల్లలు చూడలేదని, తమ కలలు కళ్లెదుటే కూలిపోతుంటే వాళ్లు తట్టుకోలేరని చెప్పారు. తమ తప్పేమీ లేకున్నా తాము నష్టపోవాల్సి వచ్చిందంటూ ఆయన తన బాధను వ్యక్తంచేశారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక నియంత్రిత పేలుడు పరిజ్ఞానంతో శనివారం కొన్ని క్షణాల్లో రెండు ఆకాశహర్మ్యాలను నేలమట్టం చేశారు.

ఈ భవనాల నిర్మాణానికి తమ ఆమోదం లేకుండా స్థానిక అధికారులు అనుమతులు ఇచ్చారని కేరళ తీర ప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థ(కేసీజడ్‌ఎంఏ) తెలిపింది. ఈ అపార్టుమెంట్లు ఉన్న ప్రాంతం కొత్త నిర్మాణాలను అనుమతించడానికి వీల్లేనంత ముప్పును ఎదుర్కొంటోందని చెప్పింది.

ఇందులో విలాసవంతమైన ఫ్లాట్లను బ్యాంకర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, పదవీ విరమణ చేసిన సంపన్న ఉద్యోగులు, ఇతర ధనవంతులు కొన్నారు.

2006లో ఆల్ఫా సెరీన్‌లో 2,140 చదరపు అడుగుల ఫ్లాట్ కొన్నానని, ఇప్పటి లెక్కల్లో చెబితే దాదాపు 50 లక్షల రూపాయలతో దీన్ని కొన్నానని ఒక బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బీబీసీతో చెప్పారు.

2019లో తన పొరుగింటి వ్యక్తి ఒకరు దాదాపు కోటీ 25 లక్షల రూపాయలకు తన ఫ్లాటు అమ్ముకున్నారని ఆయన ప్రస్తావించారు.

2019 మేలో కేసీజడ్‌ఎంఏకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అపార్టుమెంట్లు కూల్చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అధికారులు ఎన్నడూ వీటి కూల్చివేతకు ఆదేశాలు అడగలేదు.

నిర్మాణ నిబంధనలను బిల్డర్లు ఉల్లంఘించారని, ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని న్యాయస్థానం చెప్పింది. కేరళలో 2018లో సంభవించిన విధ్వంసకర వరదలను ప్రస్తావిస్తూ- మొత్తం పర్యావరణం దెబ్బతినడం, తీర ప్రాంతాలను దురాక్రమించుకోవడమే వీటికి కారణమని వ్యాఖ్యానించింది.

కూల్చివేతకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ అపార్టుమెంట్లను ఖాళీ చేయడానికి కొందరు యజమానులు మొదట్లో నిరాకరించారు. అధికారులు నీరు, విద్యుత్ నిలిపివేయడంతో వాళ్లు మరో మార్గం లేక ఖాళీ చేశారు.

బాధితులకు తాత్కాలిక పరిహారం కింద రూ.25 లక్షలు చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

కరోనావైరస్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాక్‌డౌన్ గురించి ఏం చెప్పింది?

లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి

హైడ్రాక్సీ క్లోరోక్విన్: అమెరికాలో కరోనావైరస్ ఉద్ధృతి తగ్గించడానికి భారత్ సాయం చేస్తుందా?

కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; 'లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానికి చెప్పాను'

కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ అడ్డాగా కర్నూలు... 303 కేసుల్లో 74 ఈ జిల్లాలోనే

కరోనావైరస్... ఈ భూమి మీద ఒక ఆదిమ జాతిని సమూలంగా నాశనం చేస్తుందా?

కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?