ఉల్లి ధర పెరిగిందని చెబుతూ మిమ్మల్ని మోసగిస్తున్నారా, విదేశీ దిగుమతులు స్వదేశీ ఉల్లి రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయా?

  • 13 జనవరి 2020
ఉల్లిపాయల ధరల పెరుగుదల Image copyright Getty Images

కూరగాయలు రిటైల్‌గా అమ్మేవారు ఉల్లి ధరలను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే, ఉల్లిధరలు ఎక్కడికి చేరుకున్నాయో ప్రజలకు తెలియడం లేదు.

"కిలో ఉల్లిధర వందకు చేరుతోంది. మేం ఇలా ఇంత ధరలకు ఎప్పటివరకూ కొనాల్సుంటుంది" అని మేం దిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలో ఉల్లి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సురేంద్ర బుద్ధిరాజాను అడిగాం.

దానికి ఆయన టోకు ధరల గురించి ప్రస్తావించారు. దిల్లీ మండీలో ఉల్లిపాయలు కిలో రూ. 15(విదేశీ ఉల్లి) నుంచి రూ. 35( దేశీయ ఉల్లి) వరకూ అమ్ముతున్నారని చెప్పారు.

కానీ, అవే ఉల్లిపాయలు రీటైల్‌గా కిలో 60 నుంచి 80 వరకూ అమ్ముతున్నారు. ఇది శనివారం(జనవరి 11) సాయంత్రం వరకూ దిల్లీ స్థానిక మార్కెట్లలో ఉల్లిపాయల రేటు.

ఉల్లిపాయల ధరల పెరుగుదల

దిల్లీ ఎన్‌సీఆర్‌లో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉల్లిపాయలు ధర ఇలాగే ఉంది.

మార్కెట్ ట్రెండ్ చూస్తున్న వ్యవసాయ నిపుణులు "దాదాపు ప్రతి నాలుగేళ్లకూ ఒకసారి ఇలాటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఉల్లిధరలు బాగా పెరుగుతాయి" అన్నారు.

కానీ పెరిగిన ధరలు ఇంత కాలం అలాగే కొనసాగడం మాత్రం ఇదే మొదటిసారి.

భారీవర్షాలతో మొదట మహారాష్ట్ర, తర్వాత కర్ణాటకలో ఉల్లి పంట పాడవడంతో సుమారు రెండున్నర నెలల క్రితం ఉల్లి ధరలు పెరగడం మొదలయ్యాయి. దిల్లీ లాంటి పెద్ద నగరాల్లో ధర ఒకేసారి కిలో 100-150కి చేరుకుంది.

కొన్ని నెలలు ఉల్లి అసలు దొరకదేమోనని కూడా భయపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం ఉల్లిపాయలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.

కానీ రిటైల్ మార్కెట్ వెనుక టోకు మార్కెట్‌కు ఉల్లిపాయల ఉత్పత్తిని తీసుకొచ్చే రైతులు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. ఇక ముందు ఎలా ఉండబోతోంది? దాని గురించి తెలుసుకోడానికి మేం కొంతమంది నిపుణులతో మాట్లాడాం.

ఉల్లిపాయల ధరల పెరుగుదల

మరో నెలన్నర..

ఎక్కువకాలం కొనసాగిన వర్షాకాలం వల్ల ప్రభావితమైన ఉల్లిపాయల డిమాండ్, సప్లై చక్రం సర్దుకోడానికి మరో నెలన్నర పడుతుందని ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ లాసల్‌గావ్‌లో వ్యవసాయ ఉత్పత్తి సమితి మాజీ అధ్యక్షుడు, నాఫెడ్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ చెప్పారు.

దక్షిణభారతమైనా, ఉత్తరభారతమైనా దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరను లాసల్‌గావ్ మండీ నుంచే నిర్ణయిస్తారు.

శుక్రవారం ఇక్కడ ఉల్లిపాయల హోల్‌సేల్ ధర కిలో 20 నుంచి 30 వరకూ ఉంది. కానీ కొంతకాలం క్రితం ఇదే మండీలో హోల్‌సేల్ ధర కిలో 50 వరకూ ఉండేది.

అదే సమయంలో ఉల్లిపాయ ధర గత రికార్డులన్నీ బద్దలుకొట్టింది. కానీ, మెల్లమెల్లగా పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తోంది.

భారత్‌లో ఉల్లిపాయలు ఏడాదంతా తింటారు. ఉల్లి పంట మార్కెట్లోకి వచ్చే ఒక పూర్తి సర్కిల్ దాదాపు 12 నెలలు కొనసాగుతుంది అని నానాసాహెబ్ పాటిల్ చెప్పారు.

జూన్ నుంచి ఆగస్టు-సెప్టెంబర్ వరకూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉల్లి మార్కెట్లోకి వస్తుంది. తర్వాత అక్టోబర్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఖరీఫ్ పంట అంటే ఎర్ర ఉల్లి మార్కెట్లోకి వస్తుంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే జనవరిలో రాజస్థాన్, మహారాష్ట్రలో లేట్ ఖరీఫ్ ఉల్లి మార్కెట్లోకి చేరుతుంది. తర్వాత కొన్నిరోజులకు యూపీ, బిహార్ ఉల్లి మార్కెట్లో నిండిపోతాయి. ఏప్రిల్-మే వరకూ ఉల్లి అక్కడనుంచే వస్తుంది అనిచెప్పారు.

ఉల్లిపాయల ధరల పెరుగుదల

సరఫరా ఎలా ఉంటుంది?

వర్షాకాలం దెబ్బకొడితే, ఈ మొత్తం చక్రం ప్రభావితం అవుతుంది. దానివల్ల మార్కెట్లో ధరల్లో హెచ్చుతగ్గులు వస్తాయి అన్నారు.

2019లో నవంబర్ ముందు వారం వరకూ దక్షిణభారతంలో మాన్‌సూన్ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాంతో ఉల్లి పంట చక్రం ప్రభావితమైంది. దానివల్ల పంట నష్టం జరుగడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో పంట నాటడం కూడా ఆలస్యం అయ్యింది.

ప్రస్తుతం గుజరాత్‌లో పండే ఉల్లి ముంబయి, రాజస్థాన్ నుంచి వచ్చే ఉల్లిపాయలు దిల్లీ, చుట్టుపక్కల మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.

దీనితోపాటు టర్కీ, ఈజిఫ్ట్, ఇరాన్, కజకిస్థాన్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకోడానికి ప్రభుత్వం ఆమోదించింది. దాంతో ఉల్లి సరఫరా జరుగుతూనే ఉంది.

కానీ మహారాష్ట్ర, గుజరాత్ రైతులు దీనిని విమర్శించారు. బయటి నుంచి ఉల్లిపాయలు వస్తే ఇక్కడి ఉల్లి ఏమైపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.

అటు దిల్లీ, పంజాబ్, ముంబయి, మిగతా పెద్ద నగరాల్లో మండీల్లో ఉన్న వ్యాపారులు ప్రభుత్వం ఆలస్యంగా తన నిర్ణయం అమలు చేసిందని భావిస్తున్నారు.

ఉల్లిపాయల ధరల పెరుగుదల

విదేశీ ఉల్లి, భారతీయులు

మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్రభుత్వ కంపెనీ ఎంఎంటీసీ(మెటల్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లిమిటెడ్ ఇప్పటివరకూ 40 వేల టన్నులకు పైగా ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంది.

కానీ మండీల్లో కూర్చున్న వ్యాపారులు మాత్రం ఈ ఉల్లిపాయలు పడేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. భారతీయులు విదేశీ ఉల్లిని పెద్దగా ఇష్టపడకపోవడమే దానికి పెద్ద కారణం అంటున్నారు.

భారత్‌లో పండే ఉల్లి సైజు చిన్నదిగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ బరువు సగటున 50 నుంచి 100 గ్రాముల మధ్య ఉంటుంది. దాని రంగు ఎర్రగా, గులాబీగా ఉంటుంది.

కానీ, విదేశీ ఉల్లి ముఖ్యంగా ఈజిఫ్ట్, కజాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే ఉల్లి బంగారు రంగులో ఉంటాయి. ఇది కాస్త లావుగా ఉంటుంది. దాని సగటు బరువు రెండు వందల గ్రాముల కంటే ఎక్కువగా కూడా ఉంటాయి.

దానితోపాటూ ఇరాన్, టర్కీ నుంచి భారత్ చేరే ఉల్లిపాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తమ వంటకాల్లో వీటిని ఉపయోగించడానికి భారతీయులు ఇష్టపడరు.

ఉల్లిపాయల ధరల పెరుగుదల Image copyright Getty Images

అయితే రేటు మళ్లీ పెరుగుతుందా?

"మహారాష్ట్ర నాసిక్ రైతులు 1999లో ఇరాన్ నుంచి వచ్చిన ఉల్లిపాయల రకాన్ని తమ పొలాల్లో నాటారు. అది ఒక ప్రయోగం. మహారాష్ట్రలో ఇరాన్ ఉల్లిపాయ ఉత్పత్తి బాగా జరిగింది. కానీ జనం వాటి రుచిని ఇష్టపడలేదు. దాంతో రైతులు దాన్ని నాటడం ఆపేశారు" అని నానాసాహెబ్ పాటిల్ చెప్పారు.

అందుకే, గుజరాత్-రాజస్థాన్ నుంచి సరుకు వస్తున్నప్పుడు, మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్ ఉల్లి కూడా మార్కెట్‌కు చేరబోతున్నప్పుడు దిల్లీలోని మండీలకు భారీగా వస్తున్న విదేశీ ఉల్లిపాయలను ఏం చేయాలా అని వ్యాపారులు ఆందోళనగా ఉన్నారు.

దిల్లీ మండీలో విదేశీ ఉల్లిని కొనడానికి జనం సిద్ధంగా లేరు. విదేశీ ఉల్లి టోకు ధర కిలో 15 రూపాయలు ఉంది. ఇప్పుడు మరింత సరుకు వస్తుందని చర్చ జరుగుతోంది. దీనితోపాటూ నెల తర్వాత మార్కెట్లో దేశీయ ఉల్లి సరుకు పెరుగబోతోంది. తర్వాత విదేశీ ఉల్లిపాయలను ఎవరూ అసలు కొనరు అని సురేంద్ర బుద్ధిరాజా చెప్పారు.

విదేశీ సరుకును ఆపకపోతే, రైతులకు ధర లభించదు. బదులుగా ప్రభుత్వం ఇప్పుడు ఎగుమతులకు తలుపులు తెరవాలి. లేదంటే భారత రైతులు ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు కొన్ని రోజుల్లో, ముఖ్యంగా మార్చి నుంచి ఆగస్టు మధ్య మార్కెట్లోకి చాలా ఉల్లి రాబోతోంది. బంగ్లాదేశ్, మలేసియా లాంటి దేశాల్లో భారత ఉల్లికి చాలా డిమాండ్ ఉంది. రైతులు ఉల్లిని ఎగుమతి చేయగలిగితే, వారికి డబ్బులు మిగులుతాయి. దేశీయ సరఫరా చాలా ఎక్కువైతే వారికి రేటు దొరకదు అని బుద్ధిరాజా అన్నారు.

దీని ప్రభావం మళ్లీ మార్కెట్ మీదే పడుతుంది. ఎందుకంటే రైతు తర్వాత పంట సైకిల్లో ఉల్లి ఉత్పత్తి తగ్గిస్తాడు. దాంతో, నగరాల్లో ఉల్లి రేటు మళ్లీ పెరుగుతుంది.

ఉల్లిపాయల ధరల పెరుగుదల Image copyright Getty Images

ఉల్లిపాయ అంత అవసరం ఏముంది? దీన్ని పండించడానికి అయ్యే ఖర్చెంత?

ఉల్లి భారతీయుల ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. చాలా వంటకాలు ఉల్లి లేకపోతే అసంపూర్ణంగా ఉంటాయి.

4 వేల ఏళ్ల క్రితం నుంచీ రకరకాల వంటకాల్లో ఉల్లి తనదైన రుచిని అందిస్తున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

అందుకే ధరలు విపరీతంగా పెరిగినా జనం వాటిని ఉపయోగించకుండా ఆగలేకపోతుంటారు.

ఒక అంచనా ప్రకారం భారత్‌లో ప్రతిరోజూ సగటున 50 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలు తింటున్నారు.

మహారాష్ట్ర రైతులపై చేసిన ఒక స్థానిక సర్వే ప్రకారం ఒక ఎకరం భూమిలో ఉల్లి పంటకు సుమారు 40 వేల రూపాయలు ఖర్చవుతాయి.

ఇది ఉల్లి నాటు నుంచి పంట చేతికొచ్చేవరకూ అయ్యే ఖర్చు.

ఉల్లిపాయల ధరల పెరుగుదల

నాటు నుంచి మార్కెట్ వరకూ

దీని గురించి నాసిక్‌లో ఒక రైతు బీబీసీతో "రోజుకు 250 రూపాయల చొప్పున ముగ్గురు కూలీలకు 18 రోజుల కూలి 13,500, ఉల్లి విత్తనాలు, నర్సరీకి 9 వేలు, పురుగుమందులు, ఎరువులకు 9 వేలు, పిచికారీ ఖర్చు వెయ్యి రూపాయలు ఉంటుంది" అని చెప్పారు.

"దానితోపాటూ ఒక ఎకరంలో ఉల్లి పండించడానికి కరెంటు ఖర్చు 5 వేలు, పొలం నుంచి మార్కెట్ వరకూ ఉల్లి సరుకు తీసుకురావడానికి 2400 నుంచి 3 వేలు ఖర్చు అవుతుంది" అని అన్నాడు.

ఇందులో ఉల్లి ఉత్పత్తి చేసే రైతు కుటుంబంలో అయ్యే ఖర్చును చేర్చలేదు.

పరిస్థితులన్నీ రైతుకు అనూకూలంగా ఉంటే ఒక ఎకరానికి దాదాపు 60 క్వింటాళ్లు, అంటే 6 వేల కిలో ఉల్లిపాయలు ఉత్పత్తి చేయచ్చు.

భారత్‌లోని 26 రాష్ట్రాల్లో ఉల్లి పంటను వేస్తారు. మొదట్లో నాలుగు దక్షిణ భారత రాష్ట్రాలు, మహారాష్ట్రలో మాత్రమే ఉల్లిని పండించేవారు.

ఉల్లిపాయల ధరల పెరుగుదల

అత్యధిక ఉత్పత్తి మహారాష్ట్ర నుంచే

ప్రస్తుతం దేశంలోని మొత్తం ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర దాదాపు 30 నుంచి 40 శాతం ఉల్లి పంటను అందిస్తోంది. ఉల్లి ఉత్పత్తి అత్యధికంగా ఉత్తర మహారాష్ట్రలో జరుగుతుంది.

కానీ, చేదు నిజం ఏంటంటే రైతుల ఉల్లి పంట పొలాల్లోనే పడి ఉన్నప్పుడు వారిని ఎవరూ పట్టించుకోరు. ఉల్లి ధర దారుణంగా పతనమైనప్పుడు దాని గురించి ఎక్కడా, ఎలాంటి చర్చా జరగదు.

2018లో నాసిక్ జిల్లాలో బగలాన్ తాలూకాలో ఇద్దరు ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని భాదానే గ్రామంలోని ఖైర్నార్(44), సార్దే గ్రామంలోని యువ రైతు ప్రమోద్ ధోంగ్డే(33)గా గుర్తించారు.

మీడియా రిపోర్టుల ప్రకారం ఆ సమయంలో కిలో ఉల్లి ధర మండీలో 50 పైసల నుంచి 1 రూపాయికి పడిపోయింది.

ఒక ఉల్లి రైతు తమ సమస్యలను ప్రజలకు తెలిసేలా చేయడానికి 750 కిలోల ఉల్లి అమ్మగా వచ్చిన, 700 రూపాయలను ప్రధానికి పంపించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)