షాహీన్ బాగ్: 'గతంలో మగవాళ్ల తోడు లేనిదే బయటకు రాని మహిళలు.. ఇప్పుడు CAA నిరసనల ముఖచిత్రంగా మారారు'

  • 14 జనవరి 2020
నిరసన తెలుపుతున్న మహిళ Image copyright Getty Images

షాహీన్ బాగ్.. దిల్లీలోని వందలాది ప్రాంతాల్లో ఇదీ ఒకటి. నిన్న మొన్నటిదాకా దిల్లీ వాసులకు కూడా ఈ ప్రాంతం గురించి పెద్దగా తెలీదు. ఇక బయటి వాళ్లు ఎప్పుడూ ఈ పేరు వినుండకపోవచ్చు. కానీ, ఇప్పుడు అదే షాహీన్ బాగ్ మనో నిబ్బరానికి మరో పేరుగా నిలుస్తోంది. అలుపెరుగని పోరాటానికి చిరునామాగా మారుతోంది. దానికి కారణం అక్కడి మహిళలే.

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతం మహిళల నిరసనకు వేదికగా మారింది. అలా డిసెంబర్ 15 నుంచీ నిత్యం మహిళలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. రాత్రులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా అక్కడే ఉన్నారు.

వాళ్లలో పెళ్లికాని యువతులున్నారు, బాలింతలున్నారు, పండు ముసలివాళ్లూ ఉన్నారు. వారిలో కొందరు ఇంతకు ముందెన్నడూ మగవారి తోడు లేకుండా ఇంటి బయట కాలు పెట్టలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 'షాహీన్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించలేని ఓ పక్షి. కానీ, ఇప్పుడు మేము ఎగరాల్సిన సమయం వచ్చింది. మేమే షాహీన్' అని చెబుతారు ఆ నిరసనల్లో భాగమైన 75ఏళ్ల నూరున్నీసా అనే మహిళ.

షాహీన్ బాగ్‌ అంటే గతంలో లెక్కలేనన్ని చిన్న చిన్న వీధులు, బిల్డింగులను చుట్టేసిన వందలాది కరెంటు తీగలు, టెంప్టేషన్ అనే ఫేమస్ కెఫే, కబాబ్ షాపుల లాంటివే స్ఫురించేవి. కానీ, ఇప్పుడు దిల్లీ చలిలో మౌనంగా, 'రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినట్లు' వాళ్లు భావిస్తున్న చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న మహిళలు, వారినే అంటిపెట్టుకొని ఉంటున్న చిన్నారులు గుర్తొస్తున్నారు. వారిలో రోజంతా అక్కడే ఉంటున్న ఓ 90ఏళ్ల మహిళ, 82 ఏళ్ల మహిళ కూడా ఉంటున్నారు.

అక్కడే ఓ వ్యక్తి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచీ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇప్పుడతడు సెలైన్ మీదే ఆధారపడి తన దీక్షను కొనసాగిస్తున్నాడు.

అక్కడ నిరసనలు మొదలైనప్పటి నుంచి అనేక కొత్త స్నేహాలు చిగురించాయి. ఇంతకుముందు పరిచయం లేని చాలామంది ఇప్పుడు స్నేహితులుగా మారారు. సముదాయాలుగా ఏర్పడి జీవించే ఒక కొత్త సంస్కృతి ప్రాణం పోసుకుంది. 'బలహీనులైన మహిళలు' అంతటి నిబ్బరాన్ని ప్రదర్శిస్తారని ఎవరూ ఊహించలేదు. వారిలో చాలామందికి తమను తీసుకెళ్లి జైల్లో పెడతారేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. అయినా వారు వెనక్కు తగ్గట్లేదు.

Image copyright Getty Images

డిసెంబర్ 15న జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై దాడి జరిగిన అనంతరం నలుగురు మహిళలు, ఆరుగురు మగవాళ్లు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసన ప్రారంభించారు. క్రమంగా పదుల సంఖ్యలో మహిళలు వారికి తోడయ్యారు. అలా ఆ నిరసనలకు మహిళలు ముఖచిత్రంగా మారారు. ఇప్పుడు షాహీన్ బాగ్ ప్రాంతం 'ప్రొటెస్ట్ టూరిజం'కు వేదికగా మారింది. కొత్త సంవత్సర వేడుకలను కొందరు మేధావులు ఈ నిరసనకారులతో కలిసి జరుపుకున్నారు.

పాతికేళ్ల క్రితం షాహీన్ బాగ్ అడవిని తలపించేది. మొదట కొందరు వచ్చి రేకుల షెడ్లు వేసుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టారు. చాలా కాలంపాటు అక్కడ విద్యుత్, నీటి సౌకర్యాలు కూడా లేవు. ఎలక్ట్రిక్ తీగల నుంచి విద్యుత్‌ను చోరీ చేసి రాత్రి పూట బల్బులు వెలిగించుకునేవారు.

కానీ, ఇప్పుడది కాంక్రీట్ అడవిలా మారిపోయింది. ఎటు చూసినా సున్నాలు లేని పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తాయి. అక్కడ నివసించేవారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చినవారే. గత ఏడాదే ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. దాంతో ప్రభుత్వ సేవలూ అందడం మొదలయ్యాయి.

'పదేళ్ల క్రితం మేం ఇక్కడికి వచ్చాం. నా జీవితమంతా పిల్లలకు వండి పెట్టడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడంలోనే గడిచిపోయింది. కానీ, ఏదో ఒక సమయంలో గడప దాటాల్సిందే కదా. ఆ అవసరం ఇప్పుడొచ్చింది' అంటారు 75ఏళ్ల నూరున్నీసా. 'నేను బడికి వెళ్లి చదువుకోలేదు. కానీ, జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు' అంటారామె.

'నా గుండె ఇప్పుడు రాయిలా మారింది. తుపాకీ తూటాలకు కూడా నేనిప్పుడు భయపడేది లేదు' అని ఆమె చెబుతున్నారు. కానీ, ఒకప్పుడు ఆమె చాలా సున్నితంగా ఉండేవారు. గతంలో జరిగిన అల్లర్లు తలచుకొని రోజూ కన్నీరు పెట్టేవారు.

Image copyright Getty Images

''1980, ఆగస్టు 13న మొరాదాబాద్‌లోని మసీదు దగ్గర దాదాపు 40 వేల మంది ముస్లింలు ఈద్ జరుపుకుంటున్నారు. ఆ సమయంలో సాయుధులైన పోలీసులు కాల్పులు జరిపారు. ఆ రోజు 300 మంది దాకా చనిపోయారు. నా పిల్లలు ఇంటికి తిరిగి వస్తారో లేదోనని చాలా రోజులపాటు ఏడుస్తూ ఎదురు చూశా'' అని నూరున్నీసా నాటి ఘటనలను గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలోనే నూరున్నీసా మనవరాలు కలగజేసుకొని మాట్లాడుతూ... ''నేను షాహీన్ బాగ్‌లో ఉంటానని చెబితే, 'ఓహ్.. చోటా పాకిస్తాన్‌ లోనా?' అని కొందరు ఎగతాలి చేస్తారు. కానీ, ఇదే నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగా. మరెక్కడా నాకు ఇంతకంటే భద్రంగా అనిపించదు'' అని చెప్పారు. ఆమె ప్రస్తుతం దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నారు. ఆమెతో పాటు తల్లి, నానమ్మ కూడా నిత్యం షాహీన్ బాగ్ నిరసనల్లో భాగమవుతున్నారు.

షాహీన్ బాగ్‌లో మహిళలు చేస్తున్న ఈ నిరసనను కొందరు రకరకాల మార్గాల్లో భగ్నం చేయడానికి కూడా ప్రయత్నించారు. జనవరి 3న షార్జీల్ ఇమామ్ అనే ఓ ఐఐటీ పట్టభద్రుడు.. ''షాహీన్ బాగ్ నిరసనలను మేమే మొదలుపెట్టాం. ఇప్పుడు వాటిని ఆపేస్తున్నాం'' అని ప్రకటించారు. వెంటనే హెన్నా అహ్మద్ అనే 45ఏళ్ల మహిళ నిరసన ప్రదర్శన జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి, అక్కడ ధర్నాకు కూర్చున్న మహిళల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నిరసనలు ఆగలేదని స్పష్టం చేశారు.

Image copyright Getty Images

'నేను మొదటి రోజు నుంచీ ఈ నిరసనల్లో పాల్గొంటున్నా. దీన్ని రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులు హైజాక్ చేయకుండా చూసుకోవడం మా బాధ్యత' అని హెన్నా చెప్పారు. షాహీన్ బాగ్ సమీపంలో ఉండే హెన్నా, రోజూ రాత్రులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

ఆమె కూతురు జామియా మిలియా యూనివర్సిటీలో చదువుతున్నారు. పోలీసుల లాఠీ ఛార్జ్‌లో ఆమెకు కూడా గాయాలయ్యాయి.

'గుజ్జర్లు, జాట్లు రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం మాదిరిగానే ఈ నిరసనలు జరుగుతున్నాయి. మేం వేరే ఎక్కడ కూర్చొని ప్రదర్శనలు చేసినా ఎవరూ పట్టించుకోరు. అందుకే ఇలా హైవే మీద చేస్తున్నాం' అని హెన్నా తెలిపారు.

అక్కడ పోలీసులు మొహరించి ఉండడం మామూలు విషమైపోయింది. నిరసనను భగ్రం చేయడానికి ప్రయత్నాలు జరిగినా, వారు మౌనంగానే తమ పని కొనసాగిస్తున్నారు.

ఈ మహిళలతో పాటు జైనుల్ అబెదీన్ అనే కుర్రాడు కూడా మొదటు రోజు నుంచి అక్కడ నిరహార దీక్ష చేస్తూనే ఉన్నారు. మొదటి రోజు ఆరు బయట చలిలోనే వారు కూర్చున్నారు. మూడో రోజున కొందరు ఓ చిన్న ప్లాస్టిక్ టెంటు అక్కడ వేశారు. ఆ తరువాత మరింత మంది కూర్చునేందుకు వీలుగా ఓ స్టేజీని ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి చాపలు, లైట్లు, మైకుల లాంటివన్నీ విరాళంగా అందాయి. నిత్యం ఎవరో ఒకరు ఆహారాన్ని అందిస్తూనే ఉన్నారు.

'ఇక్కడ మా మహిళలందరం నాయకులమే. ఏ ఒక్క వ్యక్తో మాకు నాయకుడు కాలేరు. ఐకమత్య సూత్రాన్ని నమ్ముకొని మేం ముందుకెళ్తున్నాం. పోలీసుల బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కానీ, మేం డీసీపీతో టచ్‌లో ఉన్నాం. మేం అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. ఒకవేళ పోలీసులు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే, అందరం కలిసే జైలుకెళ్లాలని నిర్ణయించుకున్నాం' అని హాహీన్ కౌసెర్ అనే మహిళ వివరించారు. న్యూ విజన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న షాహీన్, ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

అలా నెల రోజులుగా చెక్కుచెదరని సంకల్పంతో మహిళలు చేస్తున్న ఈ దీక్ష, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ముఖచిత్రంగా మారిపోయింది.

నిరసనల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువమంది ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సిన మహిళలే ఉండటంతో, వాళ్లు నిరసనల కోసం టైం టేబుల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దానికి తగ్గట్టే నిత్యం దీక్ష జరిగే ప్రాంతానికి మహిళలు వచ్చి వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్‌ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం

కరోనా లాక్‌డౌన్: నరేంద్ర మోదీ మన్‌కీ బాత్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇది యుద్ధం లాంటి పరిస్థితి’

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు

ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు

కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు.. వారు ఏమంటున్నారు

కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు టాలీవుడ్ హీరోలు, నిర్మాతల సహాయం

కరోనావైరస్: పాకిస్తాన్‌ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు