భారతీయులు తమ నిరసనల్లో రాజ్యాంగాన్ని ఎందుకు పఠిస్తున్నారు?

  • 15 జనవరి 2020
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు Image copyright AFP

భారతదేశవ్యాప్తంగా నెల రోజులకు పైగా మహిళలు, పురుషులు, వృద్ధులు, యవత వీధుల్లో, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వివక్షాపూరితంగా ఉందని తాము భావిస్తున్న కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వీరు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ నిరసనల్లో వీరు రాజ్యాంగాన్ని ఉచ్చరిస్తున్నారు. న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాలను హామీ ఇస్తున్న.. దేశ వ్యవస్థాపక పత్రంలోని ప్రాధమిక లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠికను పఠిస్తున్నారు.

రాజ్యాంగంతో ప్రజల సంబంధం మామూలుగా భావించేదానికన్నా మరింత లోతుగా ఉందని ఈ సామూహిక పఠనాలు బహిర్గతం చేశాయి.

ఇప్పటివరకూ.. రాజ్యాంగం అనేది నిస్సారమైన తరగతి గదుల పాఠాలకు మించి ప్రజల ఊహల్లోకి పయనించలేదని చాలామంది నమ్మేవారు.

Image copyright AFP

భారత రాజ్యాంగాన్ని రచించటానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన వ్యవస్థాపక పత్రమిది. నూరు కోట్ల మందికి పైగా ప్రజలను పరిపాలించే ఈ గ్రంథం.. వలసరాజ్యానంతర ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలంగా మనుగడ సాగిస్తున్న రాజ్యాంగం.

ఈ విస్తారమైన పత్రంలో 450 అధికరణలు, 12 షెడ్యూళ్లు ఉంటాయి. ఇందులోని అంశాలన్నీ ఎంతో సవివరంగా ఉంటాయి.

ఇది ''భాషాప్రయోగంలో సాటిలేని కృషి.. అద్భుత శిఖరాలను తాకింది'' అని న్యాయ నిపుణుడు ఉపేంద్ర బక్సీ అభివర్ణిస్తారు. ఉదాహరణకు ఆర్టికల్ 367.. ఒక విదేశీ రాజ్యం అంటే ''భారత రాజ్యం కానిదని అర్థం'' అని వివరిస్తుంది.

ఈ రాజ్యాంగంలోని అంశాలను 1950 నుంచి ఇప్పటి వరకూ 100 సార్లకు పైగా సవరించారు.

రక్తసిక్త విభజన, స్వాతంత్ర్యాల అనంతరం ఆవిర్భవించిన ఈ అద్భుత రాజ్యాంగంలో.. ''మతపరమైన, జాతీయపరమైన భావనల'' విషయంలో విభేదాల మధ్య.. భారతదేశం ఎలా ఉండాలి అనేది రాశారు.

Image copyright BERT HARDY/GETTY IMAGES
చిత్రం శీర్షిక భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ రూపొందించింది

ఒక జాతీయ గుర్తింపును రూపొందించే ప్రయత్నంలో.. ఈ ముసాయిదా మీద భీకర సంవాదం జరిగింది. ప్రపంచంలో అత్యంత అధికంగా జాతుల భిన్నత్వం ఉన్న దేశాల్లో ఒకటైన భారతదేశంలో జాతీయ గుర్తింపును ఎలా మలచాలనే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఈ పత్రం విశదీకరిస్తుంది.

రాజ్యాంగాన్ని ప్రధానంగా పశ్చిమ ప్రపంచ భావనలు ప్రాతిపదికగా, పశ్చిమ విద్యావంతులైన ఉన్నతవర్గం వారు రాశారని విమర్శకులు అంటారు. పీఠిక సైతం.. అనేక బృందాలు, ప్రయోజనాల మధ్య కుదిరిన రాజీ అని.. వలస చట్టాల నుంచి దానిని స్వీకరించారని నిపుణులు చెప్తారు.

డెబ్బై ఏళ్ల అనంతరం ఈ రాజ్యాంగం.. ఇటీవలి చరిత్రలో కనీ వెనుగని రీతిలో సాధారణ భారతీయుల ఆలోచనలను రగులుస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే.. ఈ రాజ్యాంగం ఎల్లప్పుడూ ప్రజలతో లోతుగా కలసివుందని చాలా మంది నిపుణులు నమ్ముతారు. యేల్ యూనివర్సిటీలో చరిత్ర బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ డే తను రచించిన అద్భుత పుస్తకం 'ఎ పీపుల్స్ కాన్‌స్టిట్యూషన్'లో.. ఈ పత్రాన్ని ప్రజలు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారని.. ''సాధారణ ప్రజలు.. ఎక్కువా మైనారిటీలు, అణగారిన బృందాల ప్రజలు పెద్ద సంఖ్యలో రాజ్యాంగ చర్చ చేస్తుంటారు'' అని పేర్కొన్నారు.

స్థానిక కూరగాయల మార్కెట్ మీద ఒకే ఒక్క వ్యాపారికి గుత్తాధిపత్యం కట్టబెట్టిన అధికార వ్యవస్థలు.. వ్యాపారం చేయటానికి, పని చేయటానికి రాజ్యాంగంలో హామీ ఇచ్చిన తన హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మొహమ్మద్ యాసిన్ అనే ఒక యువ ముస్లిం కూరగాయల విక్రేత 1950లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటి నుంచీ.. అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది సాధారణ భారతీయులు కోర్టుల్లో రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ఎలా పోరాటం చేశారనే విషయాలు డాక్టర్ రోహిత్ తన పుస్తకంలో వివరించారు.

Image copyright AFP

కానీ.. ప్రస్తుతం జరుగుతున్న చర్చ, సంవాదం మరింత విస్తృతమైనది.

''ప్రస్తుత చర్చను చాలా అద్భుతమైనదని చెప్పటానికి రెండు కోణాలు ఉన్నాయి. మొదటిది.. ఈ చర్చ అనేక రకాల ప్రజా సమూహాల్లో చాలా విస్తృతంగా విస్తరించి ఉండటం. యాభయ్యో దశకంలో రాజ్యాంగం తమకు రక్షణనిస్తుందని కొన్ని నిర్దిష్ట బృందాలు వాదించాయి. కానీ.. ఇప్పుడు రాజ్యాంగం ప్రతి ఒక్కరినీ రక్షిస్తోందని విభిన్న ప్రజాసమూహాలు వాదిస్తున్నాయి. రెండో కోణం.. నిర్దిష్ట హక్కుల మీద కాకుండా పీఠిక మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించటం'' అని డాక్టర్ రోహిత్ నాతో పేర్కొన్నారు.

అనూహ్యంగా జరుగుతున్న ఈ నిరసనల్లో రాజ్యాంగ పీఠికను పఠించటం.. స్వాతంత్ర్యం కోసం భారతీయులు బ్రిటిష్ పాలనను సవాల్ చేస్తూ పాటలు పాడుతూ, స్వతంత్ర ప్రతిజ్ఞ చేస్తూ నిర్వహించిన శాసనోల్లంఘన ఉద్యమాలను గుర్తుతెస్తున్నాయి. ''అధికారం ఎవరూ ఇచ్చేది కాదని.. ప్రజలు తమకు తాముగా తీసుకునేదని ఆ నిరసనకారులు వాదించారు'' అని ఆయన చెప్తారు.

పౌరులు రాజ్యాంగాన్ని చేపట్టటానికి కారణం.. నరేంద్రమోదీ సారధ్యంలోని హిందూ జాతీయవాద బీజేపీ ప్రభుత్వం.. తన విధానాలకు వ్యతిరేకించే వారందరినీ ''దేశ వ్యతిరేకులు''గా చిత్రీకరించటమని చాలా మంది భావిస్తున్నారు.

''రాజ్యాంగాన్ని ఉపయోగించటం ద్వారా నిరసనకారులు తమ దేశభక్తిని చాటుకోవటం కొనసాగించవచ్చు, జాతీయ చిహ్నాలను, పాటలను ఉపయోగిస్తూ.. 'దేశ వ్యతిరేకత' చర్చను రాజ్యాంగ దేశభక్తితో సవాల్ చేయవచ్చు'' అని డాక్టర్ రోహిత్ విశ్లేషించారు.

అలాగే.. ''కోర్టుల వైఫల్యం'' - ప్రత్యేకించి పారదర్శకంగా ఉండకపోవటం ద్వారా, పౌర స్వాతంత్ర్యాల విషయంలో బలహీనంగా వ్యవహరిస్తుండటం ద్వారా సుప్రీంకోర్టు విఫలమవటం మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేయటానికి ప్రజలు రాజ్యాంగాన్ని గుర్తుచేస్తున్నారని కూడా చాలా మంది నమ్ముతున్నారు.

కార్యనిర్వహణ వ్యవస్థ నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించేదిగా స్వయంగా నిర్మించుకున్న ప్రతిష్టను అత్యున్నత న్యాయస్థానం.. బీజేపీ తరహాలో భారీ పార్లమెంటరీ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటపుడు మూగబోయినట్లు కనిపిస్తోందని వారు అంటున్నారు.

''పౌర స్వాతంత్ర్యం, రాజ్యాంగ ప్రక్రియల పరిరక్షక పాత్రను కోర్టు పోషించలేకపోవటం.. సాధారణ పౌరులు రంగంలోకి దిగి రాజ్యాంగ పరిరక్షకులుగా నిలవక తప్పని పరిస్థితిని కల్పిస్తోంది'' అంటారు డాక్టర్ రోహిత్ డే.

గత నెలలో దిల్లీలోని సుప్రీంకోర్టు ఆవరణలో 40 మంది న్యాయవాదులు సమావేశమై.. రాజ్యాంగ పీఠికను పఠించారు. పాఠశాలల్లో ఉదయపు సమావేశాల్లో ఈ పీఠికను పఠించటం తప్పనిసరి చేస్తామని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రకటించింది.

''ఇదంతా చాలా ముఖ్యం. శక్తిమంతం. ఒక దేశంగా ఇండియా అంటే అర్థం ఏమిటనేది చర్చించటం, వ్యక్తీకరించటం దీని లక్ష్యం'' అని 'ఇండియాస్ ఫౌండింగ్ ముమెంట్: ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎ మోస్ట్ సర్‌ప్రైజింగ్ డెమొక్రసీ' రచయిత, న్యాయ నిపుణుడు మాధవ్ ఖోస్లా పేర్కొన్నారు.

''ఇటువంటిది గతంలో జరిగిందని నేను భావించటంలేదు'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..

అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...

నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం