ఉత్తరాంధ్ర మత్స్యకారులు: "పాకిస్తాన్ జైలులో మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్లు.. చచ్చిపోదాం అనిపించేది"

  • 15 జనవరి 2020
శ్రీకాకుళం మత్స్యకారుడు
చిత్రం శీర్షిక పాకిస్తాన్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన శ్రీకాకుళం మత్స్యకారుడు రామారావు

దాదాపు 13 నెలలు పాకిస్తాన్‌ జైలులో ఉన్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఎట్టకేలకు తమ ఇళ్లకు చేరారు. పరాయి దేశంలో ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ గడిపిన తమవాళ్లు ఇల్లు చేరడంతో ఆ కుటుంబాలకు సంక్రాంతి కొన్ని రోజుల ముందుగానే వచ్చినట్లయ్యింది.

ఏం జరిగింది?

2018 నవంబర్ 28న అరేబియా మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరిని పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ, ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్ తీర రక్షణ దళం అరెస్టు చేసింది.

గుజరాత్‌లోని వీరావల్ నుంచి వీరంతా నాలుగు పడవలతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బయల్దేరారు. మరో రెండు రోజుల్లో ఒడ్డుకు చేరుతామనగా వీరంతా పాక్‌ బందీలయ్యారు.

జీపీఎస్ సాయంతో సరిహద్దు తెలుసుకునే అవకాశం ఉన్నా మూడు బోట్లు పొరపాటున సరిహద్దులు దాటి పాక్ కోస్టుగార్డులకు చిక్కాయి. తరువాత దాదాపు 13 నెలలు వీరు పాకిస్తాన్ జైల్లోనే ఉన్నారు.

భారత ప్రభుత్వం చర్చలు ఫలించి ఈ నెల 7వ తేదీన వీళ్లు మళ్లీ భారతదేశంలో అడుగు పెట్టారు. కరాచీలోని జైలు నుంచి పాకిస్తాన్ పోలీసు అధికారులు వీరిని వాఘా సరిహద్దు వరకు తీసుకొచ్చారు. అక్కడ పాకిస్తాన్ భద్రతాధికారులు ఈ మత్స్యకారుల్ని బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులు వాఘా-అటారి సరిహద్దు వద్ద వీరికి స్వాగతం పలికారు.

వలసలకు కారణమేంటి?

శ్రీకాకుళం జిల్లాలో చేపల జెట్టీ లేకపోవడంతో మత్స్యకారులు ఏటా ఆగస్టులో గుజరాత్‌లోని వీరావల్‌కు వలస వెళ్లి, అక్కడ బోట్లలో కూలీలుగా చేరి వేట సాగిస్తారు.

శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవునా సముద్రతీరం ఉంది. అయినా ఒక జెట్టీ కూడా లేదు. గుజరాత్‌లో ప్రతి 30 కిలోమీటర్లకో జెట్టి ఉంటుంది. దీంతో చేపల వేటకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. అందుకే కొన్నాళ్లుగా ప్రతి అగస్టులో జిల్లా నుంచి దాదాపు 15 నుంచి 20 వేల మంది మత్స్యకారులు అక్కడికి వెళ్తుంటారు.

'జైలులో నరకం కనిపించింది'

పాకిస్తాన్ జైలులో నరకం కనిపించిందని అక్కడ నుంచి విడుదలై స్వగ్రామాలకు వచ్చిన మత్స్యకారులు చెబుతున్నారు.

"2018 నవంబరు 27న మూడు బోట్లతో 22 మంది కలిసి చేపల వేటకు వెళ్లాం. దట్టమైన పొగమంచు ఉంది. సరిహద్దులు గుర్తించలేక కాస్త అవతలివైపు వెళ్లాం. పాకిస్తాన్ కోస్టు గార్డులు మమ్మల్ని చుట్టుముట్టే వరకూ మాకు విషయం అర్ధం కాలేదు. సముద్రంలో సరిహద్దులు గుర్తించడం కష్టం కదా. ఆ రోజు మా వైర్‌లెస్ సెట్లు కూడా పనిచేయలేదు. మరో రెండు రోజుల్లో తిరిగి తీరానికి వస్తామనగా అరెస్టు అయ్యాం. పాకిస్తాన్ జైలులో మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్లు. నేను అరెస్టయ్యే పాటికి నా భార్య గర్భిణి. తను ఎలా ఉందో తెలిసేది కాదు. చాలా సార్లు చచ్చిపోదాం అనిపించింది. ఇంటి నుంచి ఉత్తరం వస్తేనే సంతోషంగా ఉండేది. నాకు కూతురు పుట్టిందని నా భార్య ఉత్తరం రాస్తే కనీసం బిడ్డను చూసుకోలేకపోయానని బాధ పడ్డాను. ఇక నా బిడ్డను చూస్తానని అనుకోలేదు" అని గనగళ్ల రామారావు అనే మత్స్యకారుడు చెప్పారు.

ఇంకెప్పుడూ అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లనని రామారావు అంటున్నారు.

రామారావు భార్య నూకరత్నం మాట్లాడుతూ... "నా భర్త పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌కు చిక్కినప్పుడు నేను గర్భిణీని. జీవితమంతా చీకటిగా అనిపించింది. ఇక నేను ఎందుకు బతకాలి? అనుకునేదాన్ని. ఏడవని రోజు లేదు. అయినా ధైర్యం కోల్పోలేదు. గర్భిణీగా ఉన్నా అధికారులను కలిసేదాన్ని, ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తూ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మా సమస్య వివరించాను. అలాగే నా భర్తను పాకిస్తాన్ నుంచి విడిపించాలని విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డిని, దిల్లీలో అధికారులను కలిసి కోరాను. మా మొర దేవుడు ఆలకించాడు. ఇప్పుడు మాకు పండగ వచ్చింది" అని అన్నారు.

గుజరాత్‌లోని వీరావల్‌కు వలస వెళ్లిన ఇక్కడి మత్స్యకారుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్లే. అందరూ బంధువులే.

చిత్రం శీర్షిక జాలర్లను అదుపులోకి తీసుకున్నారంటూ పాకిస్తాన్‌లోని ఓ పత్రికలో అచ్చయిన ఫొటో

శిరీష (ఎర్రయ్య భార్య) మాట్లాడుతూ... "శ్రీకాకుళం జిల్లాలో సరైన ఫిషింగ్ హార్బర్ లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి గుజరాత్‌లోని వీరావల్‌కు నా భర్త ఇతర కుటుంబ సభ్యులు కలిసి వలస వెళ్లారు. నాకు పెళ్లి అయ్యాక రెండేళ్లకు నా భర్త వలస వెళ్లారు. పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్‌కు పట్టుబడ్డారని 2018 నవంబర్ 28న మాకు సమాచారం వచ్చింది. ఆ రోజు నుంచి మేము చాలా అందోళన పడ్డాం. సరైన తిండి లేదు. చాలా సార్లు చనిపోవాలనిపించేది.

ఆయన నుంచి ఉత్తరం వస్తేనే సంతోషం అనిపించేది. మా వాళ్లు ఎప్పటికైనా వస్తారన్న అశతో చూశాం. ఎవరు ఎక్కడ మీటింగ్‌లు పెట్టినా వెళ్లి మా బాధలు చెప్పుకున్నాం. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కూడా కలిశాం. 2020 జనవరిలో మంచి వార్త వింటారని అధికారులు మాకు చెప్పారు. మా వాళ్లు విడుదల అవుతున్నారన్న సమాచారాన్ని జనవరి 1న చెప్పారు. ఎంతో సంతోష పడ్డాం. వాళ్లు 13 నెలలు ఎలా ఉన్నారో తెలియదు. ఇక్కడ ఉపాధి లేకపోవడమే మా ఇబ్బందులకు కారణం. అంతదూరం వలసపోయి వేటకు వెళతారు. వారు ఎలా ఉన్నారో సమాచారం మాకు తెలియదు. ఎండైనా, వానైనా వేట చేయాల్సిందే.

ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంటే మా వాళ్లు అంతదూరం ఎందుకు వలస వెళతారు? మాకు ఫిషింగ్ హార్బర్ కావాలి. మా వాళ్లను విడిపించేందుకు రాజకీయ నాయకులు ఎంతో సహాయం చేశారు. మేం చాలా దీన స్థితిలో ఉన్నాం. చదువుకున్నా మాకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. బీటెక్‌లు, డిగ్రీలు చేసి మళ్లీ వేటకు వెళుతున్నారు. మత్స్యకారుడి కొడుకు మళ్లీ మత్స్యకారుడే అవుడుతున్నాడు" అని చెప్పారు.

చిత్రం శీర్షిక మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరగానే వారిని చూసి కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు

'ఇంటికి వస్తామని అనుకోలేదు'

పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారుల్లో ఎర్రయ్య ఒకరు. వారు పాకిస్తాన్ కోస్ట్‌గార్డుకు చిక్కిన తీరు గురించి ఆయన బీబీసీకి వివరించారు.

"అప్పటికే 5 ట్రిప్పులు వేట పూర్తి చేశాం. ఆరోసారి వేటకు వెళ్లాం. 12 ఏళ్ల నుంచి అక్కడే వేట చేస్తున్నాం. మొట్టమెదటి సారి పాకిస్తాన్ దళం మమ్మల్ని అదుపులోకి తీసుకుంది. మా పేపర్లు తీసుకున్నారు. జెట్టి దగ్గరకు వెళ్లిన తరువాత మా ఫోటోలు తీశారు. మీది ఏ ప్రాంతం అని మా వివరాలు తీసుకున్నారు. మా వేలిముద్రలు కూడా తీసుకున్నారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏమీ చెప్పలేదు.

పాకిస్తాన్‌లోని సబ్ జైలుకు తీసుకు వెళ్లారు. ఒక బ్లాకులో ఉంచారు. అక్కడ భారత్‌కు చెందినవారు చాలా మంది ఉన్నారు. అక్కడ మా బాధ ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు. రెండు రోజులు ఏడుస్తూనే ఉన్నాం. 'నేను బాగున్నాను. మీరు భయపడకండీ' అంటూ మా వాళ్లకు ఉత్తరం రాశాను. కొన్ని రోజులకు మా వాళ్ల నుంచి ప్రత్యుత్తరం వచ్చింది.

నాకు ధైర్యం చెబుతూ మా వాళ్లు ఉత్తరం రాశారు. జైలులో సిబ్బంది మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. సరిగా భోజనం పెట్టేవారు కాదు. కూరలు కూడా బాగుండేవి కాదు. పాకిస్తాన్ జైలు నుంచి విడుదల అవుతామని నేనైతే అనుకోలేదు. మేం విడుదల అవుతామని చెబుతున్నా నమ్మకం కుదరలేదు. అదే సమయంలో భారత్- పాకిస్తాన్ మధ్య గొడవలు అవుతుండటంతో ఇక మేము విడుదల అవుతామనుకోలేదు. కానీ, ఈ జవనరి 1న 20 మందిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంతోషం" అని ఎర్రయ్య వివరించారు.

వలసలకు పరిష్కారం లేదా?

మత్స్యకారుల వలసలను ఆపేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వీ.వీ. కృష్ణమూర్తి బీబీసీతో చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో 104 మత్స్యకార గ్రామాల్లో 1.5 లక్షల మంది ఉన్నారని, ఇక్కడి నుంచి ఏటా 10 నుంచి 15 వేల మంది గుజరాత్‌కు వలస వెళుతున్నారని, ఈ వలసలను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

"గత ఏడాది స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో 400 బోట్లను మత్స్య కారులకు అందజేశాం. దాని వల్ల 5 వేల వరకూ వలసలు తగ్గాయి. జిల్లాలో మంచినీళ్లపేట, గాళ్లపేటలో జెట్టి కట్టాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం, దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంతే కాకుండా 314 కోట్ల రూపాయలతో బోడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కట్టే ఆలోచన చేస్తున్నాం. 11.95 కోట్లతో షిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వలసలు తగ్గించే కార్యక్రమాలను మరింత పెంచుతాం. కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని కూడా ప్రతిపాదన పంపాం. కొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉంది" అని వీ.వీ. కృష్ణమూర్తి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)