పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుంది?

  • 15 జనవరి 2020
ముంబయిలో ఉల్లిపాయల బస్తా మోసుకెళ్తున్న కూలీ. 2019 ఆగస్టు 7వ తేదీన తీసిన చిత్రం Image copyright Getty Images

దేశంలో అందరి కళ్లూ కొన్ని రోజులుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలపైనే ఉన్నాయి. అవి ఎప్పుడు తగ్గుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 7.35 శాతానికి చేరుకుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన 2014 జూలై తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతకు ముందు నెల (నవంబర్)లో 5.54 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే దాదాపు రెండు పాయింట్లు పెరిగింది.

దీనికి ప్రధాన కారణం 60 శాతం మేర పెరిగిన కూరగాయల ధరలే.

ఉల్లిపాయల ధర ఏకంగా 300 శాతం పెరిగింది.

దేశవ్యాప్తంగా అకాల వర్షాలు పడటం, ఉల్లి పంట దెబ్బతినడంతో వాటి ధర ఇలా పెరిగిపోయింది.

బంగాళాదుంపల ధర 45 శాతం పెరిగింది. పప్పులు, తృణ ధాన్యాల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి.

ఈ ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కూడా పడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరిగే ద్రవ్య విధాన సమావేశంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం ఉండాలనే లక్ష్యంతో ఆర్బీఐ ధరల్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంటుంది. 2016లో ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆర్బీఐ తన లక్ష్యాన్ని అందుకుంటూనే ఉంది.

ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించకపోతే, వినియోగదారులపై రుణాల భారం కొనసాగుతుంది. దానివల్ల వారి చేతుల్లో తక్కువ నగదు ఉంటుంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని కోరుకుంటోంది.

కాగా, కూరగాయల సరఫరా మెరుగైందని, కాబట్టి వాటి ధరలు మార్చి నాటికి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం, దానికి ద్రవ్యోల్బణంతో కూడిన ఆర్థిక మందగమనం తోడవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిని స్టాగ్‌ఫ్లేషన్ అంటుంటారు.

భారతదేశం ఇప్పటికీ 4 శాతానికిపైగా వృద్ధి రేటుతో పయనిస్తోందని అంతా చెబుతున్న తరుణంలో, అసలే ఇలాంటి పరిస్థితి మంచిదికాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)