కశ్మీర్ పోలీస్ అధికారి దేవేందర్ సింగ్: 'ఇదంతా ఓ గేమ్.. మీరు దీన్ని పాడు చేయకండి సార్'

  • 16 జనవరి 2020
దేవేందర్ సింగ్ Image copyright PTI
చిత్రం శీర్షిక దేవేందర్ సింగ్

మిలిటెంట్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై కశ్మీర్ పోలీస్ అధికారి దేవేందర్ సింగ్ రైనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఆయన్ను జాతీయ విచారణ సంస్థ (ఎన్ఎస్ఏ) విచారించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే కశ్మీర్‌లో మిలిటెంట్లకు అందుతున్న నిధులకు సంబంధించిన కేసులను ఎన్ఐఏ విచారిస్తోంది. ఇప్పుడు మిలిటెంట్లకు సహకరించడం వెనుక దేవేందర్ సింగ్ అసలు ఉద్దేశాలు ఏంటన్నది కనిపెట్టడం ఎన్ఐఏ ముందున్న సవాలు.

దేవేందర్ సింగ్ రికార్డు బాగా లేదని, ఆయన అత్యాశపరుడని కొందరు పోలీసులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, దారి దోపిడీల్లో భాగమయ్యారని, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని మిలిటెంట్లకు కూడా సహకరించారని అంటున్నారు.

గత ఏడాది 40 మందికిపైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటనతోనూ దేవేందర్ సింగ్‌కు సంబంధం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ దాడి జరిగినప్పుడు పుల్వామా పోలీసు ప్రధాన కార్యాలయంలోనే దేవేందర్ సింగ్ విధులు నిర్వర్తించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణ నిజమని నిరూపించే బలమైన ఆధారాలేవీ లేవు. ఎన్ఐఏ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టనుంది.

దేవేందర్ సింగ్‌ ఇదివరకే నిఘా పరిధిలో ఉన్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి బీబీసీతో చెప్పారు. ''కశ్మీర్‌లో, ఈ ప్రాంతం అవతలా దేవేందర్ సింగ్ మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు మాకు ముందుగానే సమాచారం ఉంది'' అని అన్నారు.

Image copyright ANI

దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగుండ్ పట్టణంలో దేవేందర్ సింగ్‌ అరెస్టు నాటకీయంగా జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్, హిజ్బుల్ కమాండర్ సయ్యద్ నవీద్‌తో కలిసి దేవేందర్ సింగ్ జమ్మూకు వెళ్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారితో పాటు నవీద్ సహచరుడు ఆసిఫ్ రాదర్, ట్రాఫికర్ ఇమ్రాన్ ఉన్నట్లు వివరించారు.

ఖాజిగుండ్ తనిఖీ కేంద్రం వద్ద దక్షిణ కశ్మీర్ పోలీస్ డీఐజీ అతుల్ గోయల్‌, దేవేందర్ సింగ్ మధ్య తోపులాట జరిగిందని, దీనిపై విచారణ జరుగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.

మిలిటెంట్లతో కలిసి దేవేందర్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారని, అక్కడి నుంచి ఖాజీగుండ్ రహదారి మార్గంలో వాళ్లు జమ్మూకు వెళ్తున్నారని దేవేందర్ సింగ్‌పై నిఘా కోసం నియమించిన అధికారి అతుల్‌కు సమాచారం చేరవేసినట్లు వివరించాయి.

''డీఐజీ స్వయంగా ఓ బృందంతో తనిఖీ కేంద్రం వద్ద మాటు వేశారు. దేవేందర్ సింగ్‌ను ఆపారు. తనతో పాటు ఉన్న మిలిటెంట్లను తన గార్డులంటూ దేవేందర్ సింగ్ పరిచయం చేశారు. ఆ వాహనంలో గాలించినప్పుడు ఐదు గ్రెనేడ్లు దొరికాయి. ఆ తర్వాత కారు డిక్కీలో ఓ అసాల్ట్ రైఫిల్ దొరికింది. 'ఇదంతా ఓ గేమ్.. మీరు దీన్ని పాడు చేయకండి సార్' అంటూ దేవేందర్ సింగ్ డీఐజీ అతుల్‌తో వాగ్వాదానికి దిగారు'' అంటూ ఘటనకు సాక్షిగా ఉన్న ఓ అధికారి బీబీసీతో చెప్పారు.

Image copyright Getty Images

ఆగ్రహంతో దేవేందర్ సింగ్‌ను డీఐజీ అతుల్ చెంపదెబ్బ కొట్టారని, పోలీసు వ్యానులో ఆయన్ను కట్టిపడేయాలని ఆదేశించారని వివరించారు.

దేవేందర్ సింగ్‌ స్వస్థలం కశ్మీర్‌లోని త్రాల్ పట్టణం. మిలిటెన్సీ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌గా ఉన్న బుర్హన్ వానీది కూడా త్రాల్ పట్టణమే.

దేవేందర్ సింగ్‌పై బలవంతపు వసూళ్లు, దారి దోపీడీల ఆరోపణలకు సంబంధించి చాలా విచారణలు ప్రారంభమయ్యాయని.. కానీ, ఉన్నతాధికారులు ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకునేవారు కాదని అతడి సహచరులు బీబీసీతో చెప్పారు.

1990లో భారీ మొత్తంలో నల్లమందు తీసుకువెళ్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడని.. దేవేందర్ సింగ్ అతడిని విడిచిపెట్టి, నల్లమందు అమ్ముకున్నారని ఓ అధికారి అన్నారు. దీనిపై విచారణ మొదలైనా, కొన్ని రోజులకు అది నిలిచిపోయిందని చెప్పారు.

Image copyright PTI
చిత్రం శీర్షిక దేవేందర్ సింగ్, అఫ్జల్ గురు

2001లో అఫ్జల్ గురు రాసినట్లుగా చెప్పిన ఓ లేఖ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది.

''ఓ విదేశీ ఉగ్రవాదిని దిల్లీకి తీసుకువెళ్లాలని.. అతని కోసం గదిని అద్దెకు తీసుకుని, కారు కొనివ్వాలని దేవేందర్ సింగ్ నన్ను బలవంతం చేశాడు'' అని అఫ్జల్ రాసినట్లుగా అందులో ఉంది. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌కు 2013లో ఉరిశిక్ష అమలైంది.

దేవేందర్ సింగ్ కేసుపై చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేనప్పుడు ఆయనకు పదోన్నతులు ఎలా వచ్చాయి?

ఆయనపై విచారణలు సాగుతుంటే, సున్నితమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఎలా ఇచ్చారు?

అత్యాశపరుడని తెలిస్తే, 2003లో ఏడాది పాటు తూర్పు యూరప్‌లో ఐరాస పీస్ కీపింగ్ ఫోర్స్‌లో భాగంగా ఉండేందుకు ఎందుకు పంపించారు?

ఆయన అక్రమాల గురించి తెలిసి కూడా, డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్‌లో హైజాకింగ్ నిరోధక విభాగంలో ఎందుకు నియమించారు?

సేవలకు గుర్తింపుగా రాష్ట్రంలో అత్యున్నత పోలీసు పురస్కారం షేర్-ఎ-కశ్మీర్ ఎలా వచ్చింది?

ఒకవేళ ఆయన చెప్పినట్లుగా తాను ఆడింది 'గేమ్' అయితే, అందులోని మిగతా 'ఆటగాళ్లు' ఎవరు?

ఈ చిక్కుముళ్లన్నీ ఎన్ఐఏ విచారణలో వీడుతాయో చూడాలి.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు... ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు