RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి? జరిగే నష్టమేంటి?

  • 18 జనవరి 2020
ఇద్దరు పిల్లల ప్లాన్ Image copyright Getty Images

భారతదేశంలో 'ఇద్దరు పిల్లల చట్టం' అమలయ్యేలా చేయడమే ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు ప్రణాళిక అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

ఈ ప్రణాళిక సంఘ్‌దే అని, కానీ దీనిపై ఏ నిర్ణయమైనా ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన చెప్పారు.

ఇద్దరు పిల్లల అంశం తెరపైకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. అస్సాంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే, 2021 తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదని గత ఏడాది అక్టోబర్‌లో నిర్ణయం కూడా తీసుకున్నారు.

11 ఇతర రాష్ట్రాల్లో కూడా ఇద్దరు బిడ్డల చట్టం అమల్లో ఉంది. కానీ, దాని పరిధిని కొంత పరిమితం చేశారు. అంటే గుజరాత్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషాలలో ఈ నిబంధనలను లోకల్ బాడీ ఎన్నికలు, అంటే పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల విషయంలో మాత్రమే అమలు చేశారు.

అయితే, మహారాష్ట్రలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడం కూడా కష్టమే. రాజస్థాన్‌లో కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇద్దరు పిల్లల చట్టం అడ్డంకి అవుతుంది.

కానీ, ఇద్దరు పిల్లలే ఉండాలనే విధానాన్ని 2005లో మధ్యప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికల నుంచి తొలగించింది. అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో అమలు చేయని ఈ నిబంధనపై ఇక్కడ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Image copyright EUROPEAN PHOTOPRESS AGENCY

ఈ విధానంపై వివాదం

ఆ తర్వాత కూడా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి చోట్ల ఇద్దరు పిల్లలు ఉండాలనే ఇలాంటి చట్టాన్ని అమలు చేయలేకపోయారు.

ఈ చట్టం గురించి ఎప్పుడు వార్తలు వచ్చినా, వివాదాలు, వ్యతిరేకతలు వెల్లువెత్తుతాయి. దీనిని అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తారు. దానితోపాటూ ప్రభుత్వంపై ఈ చట్టంతో ముస్లిం సమాజాలను టార్గెట్ చేసుకుంటోందనే ఆరోపణలు కూడా వస్తుంటాయి.

దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో మాట్లాడిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ప్రంట్ అధ్యక్షుడు బదరుద్దీన్ అజ్మల్ "అస్సాం ప్రభుత్వ విధానం, ముస్లింలు పిల్లలను కనకుండా అడ్డుకోలేదని" అన్నారు.

ఆ తర్వాత ఆయనకు సమాధానం ఇచ్చిన బీజేపీ నేత మనోజ్ తివారీ "ఇద్దరు పిల్లల విధానం ప్రత్యేకంగా ఒక సమాజానికి వ్యతిరేకంగా కాదని, బదరుద్దీన్ అజ్మల్ ఒక మంచి విషయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని" ఆరోపించారు.

గత ఏడాది రాజ్యసభలో బీజేపీ ఎంపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనావేత్త రాకేశ్ సిన్హా పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లు-2019 ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని శిక్షించడానికి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నుంచి కూడా దూరంగా ఉంచాలని ప్రతిపాదనలు చేశారు.

ఇద్దరు పిల్లల విధానానికి కట్టుబడి ఉండేలా చేయడానికి సంఘ్, మరికొన్ని డిమాండ్ల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి నిబంధనలను చైనాలో ఒక బిడ్డ విధానంతో కూడా పోల్చి చూస్తున్నారు. దానికి ప్రయోజనాలు ఉంటాయని, అయితే భవిష్యత్తులో దుష్ప్రభావాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.

ఇన్ని వివాదాల మధ్య ఇద్దరు పిల్లల చట్టాన్ని భారత్‌లో అమలు చేయడం ఎంతవరకూ సబబు, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అని మేం తెలుసుకోడానికి ప్రయత్నించాం.

Image copyright Reuters

కఠిన చట్టంతోప్రయోజనమెంత?

ఎవరైనా ఒక కొత్త నిబంధన అమలు చేసే ముందు కచ్చితంగా జనాభా పెరుగుదల కారణాలపై కూడా దృష్టిపెట్టాల్సి ఉంటుందని, ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌(IIPS, Mumbai) పాపులేషన్ పాలసీ అండ్ ప్రోగ్రామ్స్ విభాగం చీఫ్ డాక్టర్ బలరాం పాస్వాన్ చెప్పారు.

"భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో సగటున పునరుత్పత్తి రేటు ఆరుకు దగ్గరగా ఉండేది. అంటే ఒక మహిళ సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేది. కానీ ఇప్పుడు పునరుత్పత్తి రేటు 2.2 అయ్యింది. అది రీప్లేస్‌మెంట్ లెవల్‌కు చేరుకోబోతోంది. కానీ, ఇది దక్షిణభారతం అంతటా ఉన్నా, హిందీ మాట్లాడే బెల్ట్‌లో పునరుత్పత్తి రేటు ఇప్పటికీ 3కు సమానంగా ఉంది" అన్నారు.

భారత్‌లో పునరుత్పత్తి రేటు ఇప్పటికీ 2.1 శాతం సగటు రీప్లేస్‌మెంట్ రేటు(సగటు ప్రత్యామ్నాయ రేటు)వరకూ చేరుకోలేదు. జనన, మరణాల రేటు సమానం అయినప్పుడు, దానిని సగటు రీప్లేస్‌మెంట్ రేటు అంటారు. నీతి ఆయోగ్ వివరాల ప్రకారం 2016లో పునరుత్పత్తి రేటు 2.3. ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తుంది అనేదానిని పునరుత్పత్తి రేటు అంటారు.

కానీ బిహార్‌లో ఈ రేటు 3.3 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 3.1, మధ్యప్రదేశ్‌లో 2.8 శాతం, రాజస్థాన్‌లో 2.7 శాతం, జార్ఖండ్‌లో 2.6 శాతం ఉంది. కేరళ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో 2016లో పునరుత్పత్తి రేటు 2 శాతం కంటే తక్కువ ఉంది.

ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారత్‌లో 2017లో పునరుత్పత్తి రేటు 2.2గా ఉంది.

Image copyright PAL PILLAI/AFP/GETTY IMAGES

జనాభా ఎందుకు పెరుగుతోంది?

"జనాభా పెరగడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. దేశంలో పునరుత్పత్తి వయసు మహిళలు చాలా మంది ఉన్నారు. మనం ఇద్దరు పిల్లల చట్టం తీసుకొచ్చి, దాన్ని అమలు చేసినా జనాభాను పెద్దగా తగ్గించలేం. ఆ వయసులోని మహిళలు ఒక బిడ్డకు జన్మనిచ్చినా, జనాభా భారీ సంఖ్యలో పెరుగుతుంది" అని డాక్టర్ బలరామ్ చెప్పారు.

"రెండో కారణం.. అవాంఛిత గర్భం దాల్చే వారు దేశంలో చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది పిల్లలను కోరుకోకపోయినా, వారు దానికోసం గర్భనిరోధకాలు ఉపయోగించరు. దాంతో అవాంఛిత గర్భం ధరించాల్సి వస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 12 నుంచి 13 శాతం దంపతుల్లో అవాంచిత గర్భం వస్తోంది. ఆ వయసు వారిలో అవగాహన కల్పించడం వల్ల ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రోత్సహించవచ్చు" అని ఆయన అన్నారు.

"మూడో కారణం.. శిశుమరణాల రేటు తగ్గింది. కానీ కొన్ని సమాజాలలో ఇప్పటికీ ఇది ఎక్కువగా ఉంది. తమ సమాజంలో ఏడాదిలోపే పిల్లలు చనిపోవడం చూసే కొందరు, ఆ భయంతో ఎక్కువమంది పిల్లల్ని కంటారు. తర్వాత ఆ ప్రభావం తల్లి, పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. అది విష వలయంలా మారుతుంది".

"నాలుగోది.. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. దానివల్ల అమ్మాయిలు తమ పునరుత్పత్తి వయసులో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారు".

"పై నాలుగు కారణాలపై దృష్టిపెట్టకపోతే, ఏ చట్టం తీసుకొచ్చినా జనాభాను నియంత్రించడం కష్టమే. ఏ విధానమూ తప్పు కాదు, కానీ దానిని సరైన పద్ధతిలో అమలు చేయాలి. చైనా ఒకే బిడ్డ విధానంతో ఎంత ప్రయోజనం పొందిందో, అలాగే భారత్‌కు కూడా ఇద్దరు బిడ్డల విధానం వల్ల మంచి జరగవచ్చు. కానీ దానికి ముందు ప్రజలు విద్యావంతులై, దానిపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. లేదంటే వారి సమస్యలు కూడా పెరగవచ్చు" అని బలరామ్ చెప్పారు.

Image copyright Getty Images

భారత్ కఠిన నిబంధనల నుంచి సరళ నిబంధనల దిశగా వెళ్తోందని, ఈ చట్టాన్ని ఒక విధంగా మళ్లీ కఠినం చేయాలని , దిల్లీ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పాంజలి అన్నారు.

"మొదటి నుంచీ మన జనాభా విధానం చిన్న కుటుంబాన్ని ప్రోత్సహించింది. మొదట, ఇది ఒక లక్ష్యం ఆధారితంగా ఉండేది. అంటే నిర్ధారిత సంఖ్యలో కుటుంబ నియంత్రణ చేయించాలని భావించారు. అందులో మహిళలను ఒక శరీరంలాగే చూసేవారు. కానీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు జరిగాయి. భారత్‌లో కూడా దీనిని బలవంతంగా అమలు చేయలేరు అనే ఆలోచన మొదలైంది" అని పుష్పాంజలి చెప్పారు.

చైనాలో కూడా మొదట దీనిని చాలా కఠినంగా అమలు చేశారు. దానివల్ల అక్కడ లైంగిక నిష్పత్తి పెరిగింది. అమ్మాయిల సంఖ్య చాలా తగ్గిపోయుంది. భారత్‌లో కూడా చిన్న కుటుంబాలను ప్రోత్సహించినపుడు అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం కనిపించింది. అందుకే, అమ్మాయిలను కాపాడ్డం మీద కూడా దృష్టి పెట్టాలి.

ఇప్పటివరకూ భారత్ అమలు చేసిన జనాభా నియంత్రణ విధానం, చైనా అంత బలంగా లేదని డాక్టర్ బలరామ్ పాశ్వాన్ భావిస్తున్నారు.

"దీనిని కఠినంగా అమలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే, భారత సమాజంలో ఎన్నిరకాల వారు ఉన్నారంటే కొందరికి అది నచ్చితే, మరికొందరికి నచ్చదు. అందుకే, ఒకరిని సంతోషపెట్టి, మరొకరిని బాధపెట్టాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. ఇద్దరు పిల్లల చట్టం తీసుకు వస్తే జనాభా పెరిగే కారణాలపై కూడా దృష్టి పెట్టాల్సుంటుంది".

ప్రభుత్వ ఉద్దేశాలపై కూడా తనకు సందేహం ఉందని పుష్పాంజలి చెప్పారు.

"ఇలాంటి చట్టాలతో మైనారిటీలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని ఏకపక్షంగా కాకుండా, సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుంది. లేదంటే సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఇద్దరు పిల్లల చట్టం తెచ్చి, మీరు ఎవరిని ఎంత బలవంతం చేయగలరు. అయినా, చిన్న కుటుంబమే కావాలంటే, ఎలాంటి కఠిన నిమయాలు లేకుండా జనాభాను తగ్గించిన దేశాలు ఉదాహరణగా ఉన్నాయి. మొదట మీరు విద్యావంతులు కావాలి. అభివృద్ధి దిగువ వర్గాలను కూడా చేరాలి, అప్పుడే చిన్న కుటుంబాల గురించి కూడా జనం స్వయంగా అవగాహన పెంచుకుంటారు" అంటారు ఆమె.

Image copyright Getty Images

చైనా ఎంత లాభ పడింది

ఐక్యరాజ్యసమితి జారీ చేసిన తాజా ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం 2027 నాటికి భారత జనాభా చైనాను దాటిపోతుంది.

ప్రస్తుతం భారత జనాభా 133 కోట్లకు దగ్గరగా ఉంది. చైనా జనాభా 138 కోట్లు.

1979లో చైనా కూడా ఒకే బిడ్డ విధానాన్ని పాటించింది. కానీ 2015లో దానిని అది వెనక్కు తీసుకుంది. ఈ సమయంలో చైనా జనాభాలో తగ్గుదల కనిపించింది. కానీ దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపించాయి.

"చైనా ఒక్క బిడ్డ చట్టం వల్ల లింగ నిష్పత్తి పెరిగిపోయింది. అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ఒక్క బిడ్డ అంటే జనం మగపిల్లలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. రెండోది.. దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగింది. అక్కడ యువకులు తక్కువ, వృద్ధులు ఎక్కువ అయిపోయారు. ముసలివారిని చూసుకునేవారు కూడా లేకుండాపోయారు. సామాజిక పరిధి చిన్నదైపోయింది. అయితే, చైనాకు దీనివల్ల ప్రయోజనం కలిగింది అనే విషయాన్ని కూడా మనం తోసిపుచ్చలేం".

"చైనా ఒకే బిడ్డ విధానంతో 100 శాతం జనాభాపై నియంత్రణ సాధించలేదు. అంటే హాంకాంగ్‌, నైరుతి చైనాలో ప్రత్యేక సమాజాల్లో ఈ విధానం అమలు కాలేదు. విదేశాల్లో నివసించే చైనా పౌరులకు కూడా ఇది వర్తించదు. మిగతా పౌరులపై మాత్రం దీనిని చాలా కఠినంగా అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం పెట్టడం నుంచి జరిమానాల వరకూ చాలా నిబంధనలు విధించారు.

కఠిన నిబంధనల వల్లే చైనా తమ 'ఒకే బిడ్డ' విధానానికి ముగింపు పలకాల్సి వచ్చిందని డాక్టర్ బలరామ్ పాశ్వాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు

కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

వుహాన్‌లో లాక్‌ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు

దిల్లీ హింస: అద్దాలు పగిలిన రాత్రి

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా

కరోనావైరస్‌ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా

కరోనావైరస్ లాక్‌డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?

కరోనావైరస్: లాక్‌డౌన్‌లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్‌జెండర్ల ఇబ్బందులు