కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?

  • 19 జనవరి 2020
కరీం లాలా Image copyright WIKIPEDIA
చిత్రం శీర్షిక కరీం లాలా

కరీమ్ లాలా. ఒకనాటి బొంబాయి మాఫియా డాన్. చనిపోయి 18 ఏళ్లయింది. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా కరీమ్ లాలాను కలిసేవారని వ్యాఖ్యానించడం ద్వారా ఇప్పుడు అతడిని మళ్లీ బతికిస్తున్నారు. ఈ కలకలానికి శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెరతీశారు. దాంతో, ఇప్పుడు ఇందిరాగాంధీతో పాటు కరీమ్ లాలా మీద కూడా దృష్టి కేంద్రీకృతమైంది.

దక్షిణ ముంబయిలోని పైధోనీ ప్రాంతంలో గల కరీమ్ లాలా కార్యాలయంలో గర్వంగా ప్రదర్శించిన ఒక ఫొటో ఇందిరాగాంధీ ఆయనతో సమావేశమయ్యారనే ఊహాగానాలను రేకెత్తించింది.

ముంబయి డాన్‌గా దావూద్ ఇబ్రహీం ఆవిర్భవించటానికి పూర్వం కరీమ్ లాలాను, అయన తరహా వ్యక్తులను సామాజిక బృందాల్లో అవాంఛితులుగా పరిగణించేవారు.

బంగారం స్మగ్లర్ హాజీ మస్తాన్ మంత్రాలయలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కలుస్తుండేవాడు. హిందూ - ముస్లిం సంఘర్షణల్లో చాలా చర్చల్లో భాగంగా ఉండేవాడు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం చెలరేగిన హిందూ - ముస్లిం అల్లర్లు తీవ్ర స్థాయిలో ఉన్నపుడు కూడా అటువంటి ఒక సమావేశంలో ఆయన పాల్గొన్నాడు.

వీరిద్దరూ తమ జీవితాలను తర్వాతి దశలో తమ తమ సంస్థలకే అంకితం చేశారు.

దళిత - ముస్లిం సురక్ష మహాసంఘ్ అనే తన రాజకీయ సంస్థకు హాజీ మస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన పష్తూన్ లేదా పఠాన్ తెగ వారి ప్రయోజనాల కోసం పనిచేసిన పఖ్తూన్ జిర్గాయ్ హింద్ అనే సంస్థకు కరీమ్ లాలా అంకితమయ్యారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పెషావర్‌లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహాత్మా గాంధీ

కరీమ్ లాలా స్వయంగా ఒక పఠాన్. చాలా చిన్నవయసులోనే భారతదేశానికి వచ్చాడు. 'సరిహద్దు గాంధీ'గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ ప్రభావం తన మీద ఉన్నప్పటికీ, ఆయన సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమైన మార్గంలో నడిచాడు కరీమ్ లాలా.

అబ్దుల్ కరీం ఖాన్ భారతదేశానికి వచ్చిన తొలి నాళ్లలో ఒక జూదశాల ప్రారంభించాడు. అందులో డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు తమ ఇంటి ఖర్చుల కోసం కరీం ఖాన్ మనుషుల దగ్గర అప్పులు తీసుకునేవాళ్లు.

దీనికి ముగింపు పలికే ప్రయత్నంలో తన దగ్గర తీసుకున్న డబ్బుల మీద ప్రతి నెలా 10వ తేదీన వడ్డీ వసూలు చేయాలని, దానివల్ల డబ్బు కోల్పోయిన వాళ్లు తన దగ్గర అప్పు తీసుకోవటం ఆపేస్తారని ఆయన భావించాడు. కానీ, అలా జరగకపోగా ప్రతి నెలా పదో తేదీన తన ఖజానా దండిగా నిండుతోందని తెలుసుకున్నాడు. దీంతో వడ్డీకి డబ్బులు ఇవ్వటం పెంచాడు.

అనంతరం అద్దెకు ఉన్నవాళ్లలో మొండిగా వ్యవహరించే వారిని తన వస్తాదులతో ఖాళీ చేయించటం మొదలుపెట్టాడు. ఆయనకు యాభై ఏళ్ల వయసు వచ్చినపుడు అతడి అభిమానుల్లో ఒకరు బంగారంతో తయారు చేసిన ఒక చేతికర్రను అతడికి బహుమతిగా ఇచ్చారు. అది అతడి ఉపాంగంగా మారిపోయింది.

చిత్రం శీర్షిక 1998లో ముంబయి నగరం

అతడు పార్టీలకు, ఫంక్షన్లకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆ వాకింగ్ స్టిక్‌ను అక్కడ మరచిపోతే, దానిని కదిలించటానికి జనం భయపడేవారు. ఆ ప్రదేశాన్ని ఖాళీగా ఉంచేవారు. కరీం లాలాకు బదులుగా ఆ చేతికర్ర అక్కడ ఉందని భావించేవారు.

ఆయనకు సన్నిహితంగా ఉండే అసాంఘిక శక్తులు కొన్ని కరీం లాలా ప్రత్యక్షంగా రాకపోయినా ఆయనకు బదులుగా ఆ చేతికర్రను ఉపయోగించవచ్చునని భావించారు. అద్దెకు ఉన్న వారిలో మాటవినని వారిని ఇళ్లు ఖాళీ చేయించటానికి ఆ కర్రను ఉపయోగించారు.

ఎవరైనా మొండిగా తిష్టవేసినపుడు ఆ ఇంటి తలుపు ముందు కరీం లాలా చేతికర్రను పెట్టేవాళ్లు. దీంతో అద్దెకున్న సదరు వ్యక్తి తీవ్రంగా భయపడిపోయి తక్షణం ఖాళీ చేసేవాడు. ఆ చేతికర్ర అనధికారిక నోటీసు లాగా పనిచేసేది.

దక్షిణ ముంబయి బస్తీలో బలప్రయోగం చేసినా కూడా నీతి, న్యాయం పాటించేవాడని అతడికి పేరుంది.

దక్షిణ ముంబయిలో రెడ్-లైట్ ఏరియా కామాటిపురాకు చెందిన ప్రముఖ 'మేడం' గంగూభాయ్ కథేవాలి తన మీద షౌకత్ ఖాన్ అనే పఠాన్ రెండు సార్లు అత్యాచారం చేసినపుడు కరీం లాలాను ఆశ్రయించింది. ఆయన ఆమెకు రక్షణ కల్పించారు. ఆయన మనుషులు షౌకత్ ఖాన్‌ను చితగ్గొట్టారు.

Image copyright RAINDROP PR
చిత్రం శీర్షిక సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్న గంగూబాయి సినిమా పోస్టర్

కరీం లాలాను తన రక్షకుడైన సోదరుడిగా గుర్తిస్తూ అతడికి గంగూబాయి రాఖీ కట్టింది. ఈ ఉదంతాన్ని ఇప్పుడు గంగూభాయ్ పాత్రలో అలియా భట్ నటిస్తుండగా బాలీవుడ్ మొఘల్ సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న సినిమాలో చిత్రీకరిస్తున్నారు.

ముంబయిలో హాఫియా నిర్మాణంలో కరీం లాలా పోషించిన కీలక పాత్ర గురించి చాలా మందికి తెలియదు. ఆయన హాజీ మస్తాన్‌తో జట్టు కట్టాడు. అతడి బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్లకు తన కండ బలాన్ని జోడించాడు. కరీమ్ లాలా కనుక అండగా లేనట్లయితే హాజీ మస్తాన్ తన బంగారం స్మగ్లింగ్‌లో శిఖరాలకు చేరుకోగలిగేవాడు కాదు.

ఇక దావూద్ ఇబ్రహీం తండ్రి, పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కాషర్‌‌కు కరీం లాలా, హాజీ మస్తాన్‌లతో స్నేహం లేకపోయినట్లయితే, వీరిలాగా తానూ డాన్ కావాలని దావూద్ ఇబ్రహీం ఆకాంక్షించేవాడు కాదు.

ఇబ్రహీం కాషర్ పోలీస్ కానిస్టేబుల్ అయినా కూడా కరీం లాలా నుంచి కానీ, హాజీ మస్తాన్ నుంచి కానీ ఆర్థిక ప్రయోజనాలు పొందలేదు. కానీ, ఆయన కొడుకుకి అటువంటి ఆదర్శాలేవీ లేవు. ఈ డాన్లను అనుకరించాలని అతడు కోరుకున్నాడు. ఆ ఒక్క ఆలోచనతో పట్టుదలగా ప్రయత్నించి చివరికి వీరందరినీ కూలదోయగలిగాడు.

ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయిన హాజీ మస్తాన్, కరీం లాలాలు ఇద్దరూ అనంతర కాలంలో కొత్త జీవితాలు ప్రారంభించారు. హాజీ మస్తాన్ బాలీవుడ్‌లో ప్రవేశిస్తే, కరీం లాలా తన ప్రతిష్ఠను తీర్చిదిద్దుకోవటానికి ప్రాధాన్యం ఇచ్చాడు.

చిత్రం శీర్షిక హాజీ మస్తాన్

దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉండే కరీం లాలా నిత్యం సఫారీ సూట్‌లో, ముదురు రంగు కళ్లద్దాల్లో కనిపిస్తాడు. ఆ సమయానికి దావూద్ ఒక బలమైన గ్యాంగ్‌స్టర్‌గా రూపొందుతున్నాడు. పఠాన్‌లను లక్ష్యంగా చేసుకున్నాడు. కరీం లాలా మేనల్లుడు సమద్ ఖాన్‌తో పాటు ఆయనకు సన్నిహితులైన ఇతర పఠాన్‌లను దావూద్ చంపాడు. కానీ, కరీం లాలాను ఎన్నడూ లక్ష్యంగా చేసుకోలేదు.

చివరికి వీరిద్దరి మధ్య మక్కాలో రాజీ కుదిరింది. ఇరువురూ భావోద్వేగంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

హాజీ మస్తాన్, కరీం లాలాలను ముస్లింలు చాలా గౌరవించేవారు. అన్ని శుభకార్యాలకూ ఆహ్వానించేవారు. సామాజికంగా క్రియాశీలంగా ఉండేవారు. అటువంటి ఒక కార్యక్రమంలో కరీం లాలాను ఇందిరాగాంధీ కలిసినప్పుడు ఆ ఫొటో తీసి ఉండవచ్చు.

మరొకవిషయం ఏమిటంటే, కరీం లాలా ఎప్పుడూ చట్టం నుంచి తప్పించుకుని పారిపోలేదు. అతడి మీద పెద్దగా క్రిమినల్ కేసులూ లేవు. 1990ల్లో ఒక ఇంటిని ఖాళీ చేయించిన కేసులో అతడిని ఒకసారి ఆరెస్ట్ చేశారు.

వెల్లీ తేవర్ సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ముంబైలో ముప్పై ఏళ్ల పాటు వివిధ వార్తా పత్రికలు, మేగజీన్లకు క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్‌‌‌ల కంటే దిగువన

కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు

ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా

స్కేటర్ సాయి సంహిత: "క్రీడల్లోకి రావడానికి అమ్మాయిలు భయపడకూడదు"

వైరల్ వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి

జర్మనీలో రెండుచోట్ల తుపాకీ కాల్పులు, తొమ్మిది మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది బస్సు ప్రయాణికులు మృతి

కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి