సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ

  • 19 జనవరి 2020
కొడుకుతో సానియా Image copyright Twitter/MirzaSania
చిత్రం శీర్షిక "బిడ్డా, మనం సాధించాం" - కొడుకు ఇజాన్‌తో సానియా

రెండేళ్లకు పైగా విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్న భారత టెన్నిస్ తార సానియా మీర్జా అసాధారణ విజయం సాధించారు. తల్లి అయిన తర్వాత ఆడిన తొలి టోర్నీ 'హోబర్ట్ ఇంటర్నేషనల్'‌లో ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచోనోక్‌తో కలసి డబుల్స్ టైటిల్ గెలుపొందారు.

ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఈ నెల 18న జరిగిన ఫైనల్లో సానియా-నదియా ద్వయం 6-4, 6-4తో విజేతగా నిలిచింది.

ఈ నెల 14న టోర్నీ తొలి రౌండ్‌లో గెలిచిన తర్వాత తన కొడుకు ఇజాన్‌తో ఆనందాన్ని పంచుకొంటున్న ఫొటోను ట్విటర్లో పెట్టి, తన జీవితంలో అత్యంత విశేషమైన రోజుల్లో ఇది ఒకటని సానియా రాశారు. నమ్మకమే విజయం వైపు నడిపిస్తుందని అందులో చెప్పారు. "బిడ్డా, మనం సాధించాం" అని కొడుకును ఉద్దేశించి అన్నారు.

క్రీడల్లో 'పునరాగమనం' అనే మాట మగవారి కంటే ఆడవారికి ఎక్కువ విస్తృతమైన అర్థంలో వర్తిస్తుంది.

Image copyright Twitter/ WTA

సాధారణంగా ఆటగాళ్ల విషయంలో పునరాగమనం అంటే గాయం, విరామం లేదా నిషేధం తర్వాత తిరిగి రావడం. అదే క్రీడాకారిణులకైతే మాతృత్వం అనే కోణం కూడా ఉంటుంది.

మాతృత్వాన్ని గతంలో చాలా కాలం క్రీడాకారిణులకు ఒక ఆటంకంగా భావించేవారు. క్రమంగా పరిస్థితి మారుతూ వస్తోంది.

రికార్డులను బట్టి చూస్తే గత కొన్నేళ్లలో పలువురు మహిళలు ప్రసవం తర్వాత అసాధారణ రీతిలో తిరిగి రాణించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మేరీ కోమ్

భారత ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ రెండుసార్లు ప్రసవం తర్వాత విజయాలతో పునరాగమనాన్ని ఘనంగా చాటారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లు గెలిచారు.

పరుగుల రాణి పీటీ ఉష 1990ల్లోనే ఈ ఘనత సాధించారు.

Image copyright Twitter/PTUshaOfficial
చిత్రం శీర్షిక పీటీ ఉష

23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన సెరీనా విలియమ్స్ ప్రసవం తర్వాత ఆరు నెలలకు 2018లో ఘనంగా పునరాగమనం చేశారు.

సెరెనా పట్టుదల, టెన్నిస్‌పై ఆమె ప్రేమ అంతా ఇంతా కాదు. సెప్టెంబరులో కాన్పు అయితే, డిసెంబరులోనే మళ్లీ టెన్నిస్ కోర్టులోకి దిగారు. ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.

ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత సెరెనా ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ ఆడటం మొదలుపెట్టారు.

తనకు మొదటి సంతానం కలిగాక మళ్లీ పోటీలకు సన్నద్ధమవడం చాలా కష్టమైందని, అయినప్పటికీ సాధన చేస్తూ వచ్చానని సెరెనా విలియమ్స్ 2018లో పునరాగమనానికి ముందు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన ఆట ఉండాల్సినంత అత్యుత్తమంగా లేదనేది తనకు తెలుసని, కానీ మెరుగుపరచుకొని ఆ స్థాయిని చేరుకొనేందుకు శ్రమిస్తున్నానని తెలిపారు.

ప్రతీ రోజు కొత్త రోజేనని, రోజు రోజుకూ తన ఆట మెరుగుపడాలని సెరెనా నాడు చెప్పారు. ఎంత వేగంగా పురోగతి సాధిస్తున్నానన్నది తనకు అంత ముఖ్యం కాదని, పురోగతే ముఖ్యమని వివరించారు.

ఇప్పుడు చాలాసార్లు టెన్నిస్ సాధన సమయంలో, పోటీలు జరిగే చోట సెరెనాతోపాటు ఆమె కూతురు కనిపిస్తుంటుంది.

Image copyright TWITTER/SERENA WILLIAMS
చిత్రం శీర్షిక కుమార్తెతో సెరెనా విలియమ్స్

2019లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో జమైకాకు చెందిన 32 ఏళ్ల షెల్లీ-ఆన్-ప్రైస్ బంగారు పతకం గెలుచుకున్నారు.

మైదానంలో తన కొడుకును ఎత్తుకొని ఆమె సంబరాలు జరుపుకొన్నారు.

అది షెల్లీకి ఎనిమిదో ప్రపంచ టైటిల్.

Image copyright Twitter/@rama_rajeswari
చిత్రం శీర్షిక షెల్లీ-ఆన్-ప్రైస్

తనకు కొడుకు పుట్టడం, తాను తిరిగి పోటీల్లో పాల్గొనడం, ఈ స్థాయిలో రాణించడం పిల్లలను కంటున్న లేదా కనాలనుకొంటున్న మహిళలందరికీ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె నాడు చెప్పారు. "మీరేమైనా సాధించగలరు" అంటూ వారిలో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

మాజీ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి కిమ్ క్లిజ్‌స్టర్స్ 36 ఏళ్ల వయసులో తిరిగి బరిలోకి దిగుతున్నారు.

బెల్జియంకు చెందిన కిమ్ క్లిజ్‌స్టర్స్ 2020 డబ్ల్యూటీఏ టూర్‌ పోటీల్లో పాల్గొననున్నారు.

"మాతృమూర్తులు అత్యున్నత స్థాయిలో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నమే నాకు స్ఫూర్తి" అని కిమ్ క్లిజ్‌స్టర్స్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం