ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్

  • 21 జనవరి 2020
అమరావతి Image copyright AP.GOV.IN

మోటివ్స్ పెత్తనం చేస్తున్న చోట నిర్ణయాల మంచి చెడ్డలు ఎంచి చూడడం కష్టమైన విషయం. అస్తిత్వాన్ని బట్టి ప్రయోజనాలు బట్టి మంచి చెడ్డలు నిర్ణయమయ్యే పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదదే. అటు జగన్ అభిమానులకు మహా గొప్ప మార్పు కనిపిస్తోంది. చంద్రబాబు అభిమానులకు మహా ఉపద్రవం జరిగిపోయినట్టు అనిపిస్తోంది. అభిమానం మరీ అంతగా పులుముకోని వారికి మాత్రం పట్టినట్టు అనిపించడం లేదు. నేరుగా ఎఫెక్ట్ అయ్యే అమరావతి ప్రాంత రైతులు తప్ప మరెక్కడా పెద్ద కదలిక లేదు. అమరావతికి మద్దతుగా తెలుగుదేశం సారధ్యంలో అక్కడక్కడా జరిగిన ఆందోళనలు దానికి పోటీగా వైజాగ్ కు మద్దతుగా అక్కడక్కడా వైసిపీ సారధ్యంలో జరిగిన ప్రదర్శనలు తప్ప గట్టిగా ఎక్కడా ఏమీ కనిపించలేదు. నిన్నటి అసెంబ్లీ లాగే మొత్తం పొలిటికల్ డ్రామాను ఆంధ్రులు స్తబ్దుగా చూస్తూ ఉన్నారు. రాజధాని అంశంతో భావోద్వేగ బంధం ఉందో లేదో కానీ బాహాటంగా అయితే కనిపించలేదు.

హైదరాబాద్ వదిలి వచ్చినపుడు ఓటుకు నోటుపై డిఫెన్స్లో పడినట్టే ఇపుడు కూడా తెలుగుదేశం భూముల కొనుగోలు అంశం వల్ల గట్టిగా మాట్లాడలేని స్థితిలో పడింది. దాన్ని చూపించి మొత్తంగా అమరావతి అనే ఐడియాను దారి మళ్లించడం పాలకపక్షానికి సులువైపోయింది. అసెంబ్లీలో జరిగిన చర్చల సరళి చూస్తే పూర్తి చిత్రం ప్రజలముందుంచే దానికి బదులుగా ఇరుపక్షాలూ తమకు కావాల్సిన డీటైల్స్ తమకు కావాల్సిన రీతిలో ప్రజెంట్ చేయడానికే ప్రాధాన్యమిచ్చాయి. జగన్ నిర్ణయం మంచిదా కాదా అనేదానికంటే గతంలో ఆమోదించిన దాన్ని తిరగదోడి కొత్త నిర్ణయం తీసుకున్న సమయమూ సందర్భమూ ప్రశ్నార్థకాలుగా మారాయి.

అర్థవంతమైన చర్చల బదులు అసెంబ్లీని హైడ్రామాకు వేదిక చేయడం ఆరంభమై చాలాకాలమే అయ్యింది కానీ హాకీలో మార్కింగ్ మాదిరి ఫలానా నాయకులను ఎదుర్కోవడానికి ఫలానా ఫలానా వారిని ప్రత్యేకంగా కేటాయించడం అనే ఎత్తుగడ మాత్రం ఆధునిక నాయకుల అమ్ములపొదిలోంచి వదిలిన నూతన అస్ర్తం. వైఎస్ ,చంద్రబాబు ద్వయం పరస్పరం తలపడ్డంలో భాగంగా మొదలైన ఈ ఎత్తుగడల పర్వం ఇవాళ పతాక స్థాయిని చేరింది. బిలో ది బెల్ట్ లెవల్కి దిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో రోజా కొత్త పరిభాషను శాసనసభా చర్చల పదకోశానికి జత చేస్తే ఇపుడు కొడాలి నాని మరింత దూకుడుగా తనదైన పరిభాషను పరిచయం చేస్తున్నారు. నువ్వు అప్పుడు మమ్మల్ని అట్లా అన్నావ్ కదా, అంతకు పదింతలు అంటాం చూడు అన్నట్టు ఎదుటివాళ్లను హ్యూమిలియేట్ చేయడంలో పోటీ నెలకొని ఉంది. మాతో ఉండకపోతే శత్రువుతో ఉన్నట్టే లాంటి బుష్ డాక్ర్టిన్ కూడా చాలామంది ఒంట బట్టించుకున్నారు. ట్రెజరీ బెంచ్ లో కూర్చోవాల్సిన కోడెలను స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టారు అనే మాట తరచుగా వినిపించేది. ఇప్పటి స్పీకర్ గురించి అంతకంటే ఎక్కువగా వినిపిస్తోంది.

Image copyright CBN

రాష్ర్ట విభజన జరిగి ఆరేళ్లవుతోంది. రాజధానిపై ఇంకా చట్టసభల్లో చర్చిస్తూనే ఉన్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సేవలందించే వెసులుబాటు ఉన్నప్పటికీ గత పాలకులు దాన్ని వదిలేసి అమరావతికి తరలివచ్చారు. అందరినీ తరలించారు. తెరలపై చూపించిన రంగుల కల లాంటి రాజధానిలో ఒకమోస్తరు కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేదు. కొన్ని భవంతులు పూర్తయ్యాయి. ఐకానిక్ భవంతులకు పునాదులు వేశారు. కానీ గ్రాఫిక్స్ లో చూపించిన నగరంతో పోల్చుకుంటారు కాబట్టి కనీసం సీడ్ కాపిటల్ వరకైనా కొంత రూపమిచ్చి ఇదిగో భవిష్యత్తు ఇలా ఉండబోతోంది అని నేలమీద చూపించే పురోగతి అయితే కనిపించలేదు. ప్రభుత్వ ప్రైవేట్ ధనం కలిసి లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు ఐదేళ్లలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఐదు వేల కోట్ల పైచిలుకే నని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ పథకం కింద హడావుడిగా విడుదల చేసిన మొత్తమే దాదాపు నాలుగువేల కోట్లు. పోల్చి చూసుకున్నపుడు తమ డ్రీమ్ ప్రాజెక్టుకు వారు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం టైమూ ఇచ్చారా అనే సందేహం రావడం సహజం. డిజైన్స్ ను చర్చించడంతోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. అది కొత్త పాలకులు కొత్త ఆలోచనలకు చేయడానికి బలం చేకూర్చింది. ఇపుడు మళ్లీ సారొచ్చె, మొదలాడు పరిస్థితి అయిపోయింది. అటు చూస్తే కేంద్రం ప్రత్యేక హోదా మీద మాట తప్పింది. గట్టిగా అడిగే నాధులు లేరు. అదే ప్రధానాస్ర్తంగా ఎన్నికల ప్రచారం సాగించారు కదా, ఇపుడెందుకు అడగడం లేదని పాలకులను అడిగే వారు కూడా లేరు. బ్యాక్ టు స్వ్కేర్ వన్. అటు కొత్త రాజధానిలో సౌకర్యాలు కల్పించుకుని స్థిరపడేలోపు పదేళ్లపాటు పాలన సాగించడానికి ఉపయోగపడే హైదరాబాదూ లేదు. ఇటు కొత్త నగరమూ లేదు. సభల్లో నాయకుల ఆవేశం. జనానికి ఆయాసం. ఆరేళ్లు వృధా. సంక్షేమం జోరుగా ఉంది కానీ ఆ మేరకు ఖజానా డొల్లయిపోయి ఉంది. ఈ పథకాలన్నింటినీ కొనసాగించడానికి నిధులు ఎక్కడనుంచి తెస్తారు అనే ప్రశ్న వినిపిస్తూ ఉన్నది. ఇక దీర్ఘకాలిక అంశాలైతే దిక్కులు చూస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొత్త పెట్టుబడుల్లేవు. గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడే వాతావరణంలో పెట్టుబడి దారుల విశ్వాసం పొందడం అంత సులభం కాదు. రేపొచ్చే ప్రభుత్వం వీళ్ల నిర్ణయాలకే కట్టుబడి ఉంటుందన్న భరోసా వారికి ఉండదు కదా! ఉపాధిపై ఫోకస్ దారి మళ్లింది. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఒకసారి వైజాగ్ లో ఏర్పాట్లు పూర్తయితే జగన్ కాలికి బలపం కట్టుకుని తిరిగి పెట్టుబడులు తెస్తారని అవినీతికి తావులేని పాలన అనే బ్రాండ్తో ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలను లాక్కొస్తారని ఆయన అనుకూలురు చెపుతున్నారు కానీ వర్తమానం అయితే గడ్డుగా ఉంది.

పైకి చూడడానికి అటూ ఇటూ ఇద్దరి వాదనల్లోనూ తర్కం కనిపిస్తుంది. తర్కం ఉన్నచోటల్లా న్యాయం ఉన్నట్టేమీ కాదు. పాలకులు తాము కావాలనుకున్నట్టు కమిటీలు వేయగలరు. నివేదికలు తెప్పించుకోగలరు. ఆ కమిటీలు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఇది మాత్రమే సరైన నిర్ణయం అని భజాయించి చెప్పగలవు. లోపలికి తొంగి చూస్తే కానీ నిర్ణయాల వెనుక దాగిన అసలు మతలబులు అర్థం కావు, డొల్ల బయటపడదు.

Image copyright YS Jagan

నాడు చంద్రబాబు ఏం చేశారు? కేంద్రం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ నివేదికకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా తమ పార్టీ నేతలు, పారిశ్రామిక వేత్తలతో కమిటీ వేశారు. ఆ కమిటీ చెప్పిందంటూ అమరావతిని ఎంపిక చేశారు. శివరామకృష్ణన్ కమిటీ పంటలుపండే భూముల్లో వద్దని చెపితే దానికి విరుద్ధంగా రెండు మూడు పంటలు పండే భూములున్న ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కనీసం ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించను కూడా లేదు. సభలో బలాన్ని ఉపయోగించి బుల్డోజ్ చేసి నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పటి పాలకులు అంతకన్నా బుల్డోజ్ చేస్తున్నారు. పూర్తి కొత్త ప్రాంతంలో కొత్త నగరాన్ని నిర్మించడం కంటే విజయవాడ, గుంటూరు మధ్యలో నిర్మిస్తే రెండూ కలిసిపోయి మహా నగరం ఏర్పడుతుందని అది ఆర్థిక కేంద్రంగా మారగలదని చంద్రబాబు చూపించిన కారణం. కాకపోతే అంతా గ్రాఫిక్స్ అనే విమర్శను మూటకట్టుకోవడంలో స్వయంకృతాపరాధం కూడా ఉందని చెప్పక తప్పదు. దానికి తోడు అవినీతి ఆరోపణలు. సాంకేతికంగా అవి నేరాలుగా నిరూపితమవుతాయో లేదో గానీ రాజధాని గుంటూరులోనా, నూజివీడులోనా అని చర్చలు జరుగుతున్న సమయంలో అంటే 2014 జూన్ నవంబర్ మధ్య భాగంలో పాలకులు, వారి దగ్గరి వారు రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా ప్రభుత్వం అసెంబ్లీలో సర్వేనెంబర్లతో సహా వాదిస్తోంది. అంటే రాజధాని అక్కడ అని నిర్ణయించుకున్న పాలకులు, వారి దగ్గరి వారు భూమిని ఎకరాల్లో కొని గజాల రేటుకు పెంచుకునే ఎత్తుగడ వేశారనేది సారాంశం. ఎకరాల పరిభాషలోనే ఉన్నపుడు వ్యవసాయ భూమి తక్కువ ధరకు కొని తర్వాత రాజధానిగా దాన్ని ప్రకటించాక భూమి గజాల పరిభాషలోకి మారుతుంది కనుక, వెల అనేక రెట్లు పెరుగుతుంది కనుక అట్లా కోట్ల కొద్దీ మూటగట్టుకునే పన్నాగం పన్నారనేది ప్రభుత్వం ముందుంచిన లెక్కల సారాంశం. దీన్నే వారు పాపులర్ పరిభాషతో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర్నుంచి నేటి వరకు అనేక ప్రాజెక్టుల్లో ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ప్రైవేట్ సంస్థలకు సబ్సిడీపై కేటాయించిన భూములపై ఆరోపణలు. సో, ఏదీ పారదర్శకంగా లేదు.

జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నపుడు కారణాలేమైనా అమరావతికి సై అన్నారు. పెద్ద నగరాల అవసరం ఉందని అసెంబ్లీలో ధాటిగా ఉపన్యాసమే ఇచ్చారు. 30 వేల పైచిలుకు ఎకరాల సమీకరణను కూడా సమర్థించారు. ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నా, మీ నాయకుడు కట్టుకున్నాడా అని సవాల్ కూడా విసిరారు. రాజధానిని మార్చాలనుకుంటే, అంత పెద్ద నిర్ణయం మదిలో ఉంటే ఎన్నికల ప్రచారంలోనే చెప్పి ఉండాల్సింది. అపుడెందుకు అలా మాట్లాడారు, ఇపుడెందుకు వైఖరి మార్చుకున్నారు అనేది కూడా ఆయన ఎక్కడా సూటిగా వివరించిన దాఖలాలు లేవు. రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధికే లక్షా 9 వేల కోట్ల నిధులు అవసరమని అప్పుల్లో ఉన్న రాష్ర్టం రాజధానిపై అంత పెద్ద పెట్టుబడి పెట్టలేదని ఇపుడు చెపుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం పెట్టుబడి పెట్టనక్కర్లేదని అది సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని ప్రతిపక్ష తెలుగుదేశం అంటోంది కానీ ఈ విషయంలో చెరొకవైపునా ఎవరికి కావాల్సిన లెక్కలు మాత్రమే వారు చెపుతూ కలగా పులగం చేస్తున్నారు. ఏదీ పూర్తి సత్యం కాదు. ఎవరూ పూర్తి చిత్రం చూపరు. దాన్ని మించింది కులాల గొడవ. ఒక కులమూ, ఒక ప్రాంతమే బాగుపడాలా అని మంత్రి బొత్స పదే పదే చెపుతూ వచ్చారు. అంటే కమ్మ కులం ఆధిపత్యం ఉన్న ప్రాంతం కాబట్టి రాష్ర్ట ఖజానా అంతా అక్కడే ఖర్చుపెడితే మిగిలిన వాళ్లూ మిగిలిన ప్రాంతాల సంగతేంటి అనేది ఆయన మాటల్లో సూటిగానే ఉంది. బుగ్గన మాత్రం కులం యాంగిల్ ను తక్కువ చేసి అంతా ఒక ప్రాంతంలో పోస్తే మిగిలిన ప్రాంతం సంగతేంటి అని లౌక్యంగా మాట్లాడతారు. సారాంశం ఒక్కటే. ఒక కులం ప్రముఖంగా కనిపించొచ్చేమో కానీ ఏ ప్రాంతమూ ఒక్క కులానికో కొందరికో చెందింది కాదు. పెట్టుబడి లాభాన్ని వెతుక్కుంటూ ప్రయాణిస్తుంది. హైదరాబాద్ లో పెట్టుబడుల వల్ల ఇవాళ ఏ కులంవాళ్లు ఏ ప్రాంతం వాళ్లు అభివృద్ధి అయ్యారు? అక్కడ కూడా రెండు మూడు కులాలు ప్రముఖంగా కనిపించినా కారణాలు స్థానికతతో ముడిపడినవి కావు. అభివృద్ధిలో పనిచేసే కోణాలు అనేకం. అది సరళ రేఖలాగా ఉండదు. పాలనలోకి వచ్చినప్పటినుంచీ కొన్ని విషయాల్లో చూపుతున్న ఉత్సాహం వల్ల ప్రస్తుత ప్రభుత్వం కక్షతో ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణ మాత్రం ఎదుర్కుంటోంది.

Image copyright APCRDA
చిత్రం శీర్షిక అమరావతిలో నిర్మాణ పనులు

కులం, ప్రాంతం వంటి అంశాలు పక్కనబెడితే ఈ ప్రభుత్వం ప్రధానంగా ముందుకు తెచ్చిన అంశం అభివృద్ధి వికేంద్రీకరణ. పాలన వికేంద్రీకరణ. వాస్తవానికి ఇపుడు జరిగింది రాజధాని వికేంద్రీకరణే గానీ పాలన వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకు కూడా రాజధాని వికేంద్రీకరణ పర్యాయపదం కాదు. వికేంద్రీకరణ పేరుకే గానీ ప్రాక్టికల్ గా చూస్తే అమరావతినుంచి విశాఖకు తరలించడమే. మిగిలిన రెండూ లాంఛన ప్రాయమే. సమతుల్య అభివృద్ధి అనేదే ప్రాధామ్యమైతే అందుకే నిర్ణయం తీసుకుని ఉంటే కులాల గురించి, ప్రత్యర్థుల భూముల కొనుగోలు గురించి అంత ఎక్కువగా ఎందుకు మాట్లాడినట్టు?

అభివృద్ధి నగరాల కేంద్రకంగా ఉండనక్కర్లేదని ఒక్కొక్క జోన్లో ఒక్కో రకమైన ప్లాన్తో అభివృద్ధి సాధించవచ్చని ప్రభుత్వంలోని వారు చెపుతున్నారు. రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా మోడల్ ను అభివృద్ధి విషయంలో జర్మనీ మోడల్ ను ప్రభుత్వంలోని పెద్దలు వివరిస్తున్నారు. జర్మనీ లాంటి యూరప్ మోడల్ నిజమైనదే కానీ ఇప్పటివరకూ మన దేశంలో మన కళ్లముందు రెవెన్యూ కేంద్రాలుగానూ ఉపాధి కేంద్రాలుగానూ ఉన్నవైతే ప్రధానంగా నగరాలే. అమరావతి అనే భారీ కలను పక్కనబెట్టినా ఇపుడు ఈ ప్రభుత్వం ఎంచుకున్న వైజాగ్ కూడా అలాంటి నగరమే.

రాడికల్ షిఫ్ట్ తీసుకోవడంలో దానికది తప్పు లేకపోవచ్చు. కానీ సమయం సందర్భమూ ప్రశ్నార్థకాలవుతాయి. ఆరేళ్ల సమయమూ వేల కోట్ల డబ్బూ అక్కడ పోశాక దారి మళ్లించి కొత్త ప్రయోగానికి రాష్ర్టం సిద్ధంగా ఉందా, కొత్త దారిలో గాడిలో పడడానికి ఎంత కాలం పట్టొచ్చు అనేవి ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు. సమతుల్య అభివృద్ధికి రాజధాని వికేంద్రీకరణ అవసరమా, అభివృద్ధి ప్రాజెక్టుల వికేంద్రీకరణ అవసరమా అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. రాజధాని నిర్ణయాన్ని తిరగదోడకుండా అవసరమైతే తాము ప్రాక్టికల్అనుకునే స్థాయికి దాని డిజైన్ మార్చి ఇతరత్రా అభివృద్ధి ప్రాజెక్టులను వికేంద్రీకరిస్తే అడ్డుపడే వారెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలున్నాయి. కాకపోతే కోల్ కత్తా, ముంబై తర్వాత మరొక పోర్ట్ సిటీ రాజధాని కావడంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం గురించి పాజిటివ్ గా మాట్లాడే వారివైపునుంచి వినవస్తోంది. ఇపుడున్న పరిస్థితుల్లో అప్పుల పాలైన రాష్ర్టం రాజధానిపై అంత ఖర్చు పెట్టలేదు కాబట్టి ఆల్ రెడీ అభివృద్ధి పథంలో ఉన్న విశాఖలో కొన్ని భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందన్నది వారి వాదన. ఎంత అప్పుల్లో ఉన్నా ఖజానా నిండుకున్నా వేతనాలకే కటకటగా ఉన్నా సంక్షేమ పథకాలైతే ఆరంభిస్తూనే ఉన్నారు. అంటే ఉన్న వనరులు, ఖర్చు ప్రాధామ్యాల్లో తేడా అంతే. ప్రభుత్వాలకు ప్రాధామ్యాలను నిర్ణయించుకునే హక్కు ఉంది.

Image copyright FACEBOOK/GVMC.OFFICIAL

కానీ ఇప్పటివరకూ అమరావతిలో పెట్టిన ఖర్చుకు ఎవరు బాధ్యులు? అదంతా ఏమయ్యేట్టు? కొన్ని భవనాలు అటూ ఇటూ మార్పులు చేసి దేనికైనా ఉపయోగించుకోవచ్చునేమో కానీ ఉపయోగం కంటే వృధా కొన్ని రెట్లు ఉంటుంది కదా! ఐకానిక్ భవనం రాఫ్ట్ పునాదికే 350 కోట్లు ఖర్చయిందని లెక్కలు చెపుతున్నారు కదా! ఇపుడు ఐకానిక్కూ లేదు, భవంతీ లేదు. ఈడబ్బులు రాళ్లలో పోసినట్టే కదా! నిర్మించిన భవనాలు, అంతంత పెద్ద పునాదులు, రోడ్లూ, రైతులకు ఇచ్చే డబ్బులు, ఎవరు దీనికంతా బాధ్యులు? ప్రభుత్వం అనేది కంటిన్యుయస్ ప్రాసెస్ అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్న కాదని ఇంత పెద్ద మార్పు చేసే నైతిక హక్కు కొత్త ప్రభుత్వానికుంటుందా? పైగా ఎన్నికలకు ముందు సమర్థించిన ప్రభుత్వానికి ఇపుడు దాన్ని తిరగేసి పూర్తిగా మార్చే నైతికత ఉంటుందా?

ఇపుడు తీసుకున్న నిర్ణయం అప్పట్లోనే తీసుకుని ఉంటే వేరే కథ. ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉంటే వేరే కథ. ప్రభుత్వం అనేదానిమీదే నమ్మకం పోతే ఎట్లా అనేది ప్రశ్న. పాలకులెవరైనా ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అనే నమ్మకం ఉండాలి కదా! నిర్ణయాల్లో స్థిరత్వం లేని చోటకు బయటినుంచి పెట్టుబడులు పెట్టేవాళ్లు నమ్మకంతో వస్తారా? వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కొత్తలో బీబీసీ తెలుగుకు ఇచ్చిన ఇంటర్య్వూలో జగన్ రాజధాని గురించి మాట్లాడుతూ మేం క్యాచ్ 22 పరిస్థితిలో ఉన్నాం అని చెప్పారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ చేయలేని స్థితిలో ఉన్నాం అనే ధ్వనితో మాట్లాడారు. క్యాచ్ 22 నుంచి బయటపడి ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించిన అంశాలేంటో తెలీదు.

రాయలసీమకు హైకోర్టు గురించి చాలా చెపుతున్నారు గానీ హైకోర్టు వల్ల జరిగే అభివృద్ధి ఎంత ఉంటుందనేది వినిపించే మాట. కాలాలు మారాయి. అరవై డెభ్బై యేళ్ల క్రితం హైకోర్టు నినాదం వేరు. ఇవాళ పరిస్థితులు వేరు. ఆ మాటకొస్తే అప్పట్లో ఆంధ్రా యూనివర్శిటీ రాయలసీమలో పెట్టాలనేది ఒక ప్రధాన డిమాండ్ గా ఉండేది. ఇవాళ యూనివర్శిటీ అనేది ఎంత సాధారణ విషయంగా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. సిద్ధేశ్వరం నుంచి శ్రీశైలం దాకా నీటి ప్రవాహాలు దిశ ఎట్లా మార్చుకున్నాయో రాయలసీమలో నిపుణులు పదే పదే వివరిస్తారు. విద్య, ఉపాధి, జల వనరులు మూడూ ప్రధానం రాయలసీమకు. మొదటిది కొంత మెరుగయ్యింది కానీ మిగిలిన రెంటిలో చాలా జరగాల్సి ఉంది. రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు అదనపు మేలు అని చెపుతున్నారు గానీ అట్లా వన్ టు వన్ రిలేషన్ ఉంటుందా! అంత పారిశ్రామిక నగరం పక్కనే ఉన్నాఉత్తరాంధ్ర లోని చిన్న సన్న జీవులు పని కోసం పొలోమంటూ దేశమంతా పట్టి తిరగాల్సిన పరిస్థితి. అనంతమైన సముద్రం పక్కనే ఉన్నా గుజరాత్ లాంటి చోట్లకు వెళ్లి పాకిస్తాన్ వాళ్లకు బందీలయ్యే స్థితి. ఉపాధి అవకాశాలు విస్తరించకపోతే ఏ నగరంలోనైనా వనరులు అవకాశాల్లో సింహభాగం ప్రివిలేజ్డ్ సెక్షన్స్ అనుభవించడం మన వ్యవస్థ లక్షణం.

ఎవరి కారణాలు ఏమైనా ఆచరణలో మాత్రం నష్టపోయింది ప్రజలు. పాత ప్రభుత్వం ప్రయోగాన్ని తిరగదోడిన కొత్త ప్రభుత్వపు ప్రయోగాన్ని నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం అలాగే ఉంచుతుందని గ్యారంటీ ఉందా? ఒక వేళ ప్రభుత్వం మారితే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పగలమా? మరింత నష్టం జరక్కుండా మేం ఆచరణాత్మకమైన వైఖరి తీసుకున్నాం అని ఈ ప్రభుత్వం చెప్పొచ్చు కానీ ఈ నలుగులాటలో కోల్పోయింది తిరిగి పొందగలిగేంత వేగంగా ప్రభుత్వం ఏమైనా చేయగలదా అనే ప్రశ్న అయితే వారు ఎదుర్కోక తప్పదు. రాజధాని గొడవలో అమరావతికి బయట సామాన్యుడి ఆసక్తి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. విసిగిపోయిన ప్రజలకు కావాల్సింది ఉపాధి, సాగునీరు. ఈ గొడవనుంచి ఎంత త్వరగా బయటపడి వాటిమీద దృష్టిపెట్టగలరన్నది యక్ష ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు

కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

కరోనావైరస్‌: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?