బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’

  • 24 జనవరి 2020
బాంబే డక్ Image copyright Getty Images

నా చిన్నప్పుడు.. ముంబయిలో పెరుగుతున్నపుడు.. జూన్ నెల కోసం ఆత్రంగా ఎదురుచూసేదాన్ని. ఆ నెలలో వసంత మేఘాలు వస్తాయి. నింగిలో మెరుపు తీగలు కనిపిస్తాయి. వేసవి వేడిమిని తుడిచివేస్తాయి.

నాకు కొత్త పుస్తకాలు వస్తాయి. వాటికి సరికొత్త అట్టలు వేస్తాను. మళ్లీ బడికి వెళతాను. అన్నిటికీ మించి.. మా వంటి పార్సీల ఇళ్లలో వంట గదుల్లో బాంబే డక్ కొలువు తీరేది కూడా ఆ నెలలోనే.

చవులూరించే ఈ వానాకాలపు విశిష్ట వంటకంతోనే నాకు ఆ కాలం గుర్తుంటుంది. వర్షాల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా దొరకుతుందిది. వానాకాలానికి ఆ ప్రత్యేకతను అందించేదిదే.

అసలు పార్సీలు ఎవరు? ఈ బాంబే డక్ ఏమిటి?

Presentational grey line
Presentational grey line
బాంబే డక్ Image copyright Getty Images

పార్సీలు అంటే.. ఇరాన్ నుంచి వచ్చిన జొరాష్ట్రియన్ వలసలు. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దం నుంచి వీరు భారతదేశాన్నే తమ ఇల్లుగా చేసుకున్నారు. అయితే.. 19వ శతాబ్దంలో ముంబయిలో బ్రిటిష్ వలస పాలనలో వీరు నిజంగా వర్ధిల్లారు.

బ్రిటిష్ వారి ప్రభావంతో పార్సీ పారిశ్రామికవేత్తలు పశ్చిమ విద్య, రసికతలో తమ అభిరుచిని ఉపయోగించుకుని.. భారత పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు అయ్యారు. తమ అపారమైన ప్రభావాన్ని ఉపయోగించి పేదల కోసం స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు ఏర్పాటు చేసే దాతృత్వం ప్రదర్శించారు.

ఆ తర్వాత.. 19వ శతాబ్దంలో ముంబయిలో రెండో విడత జొరాష్ట్రియన్ల గాలి వీచింది. ఈ వ్యాపార చతురులు ఇరానీలు. విశిష్టమైన ఇరానీ కేఫ్‌లను ప్రారంభించింది వీరే. సంప్రదాయంగా.. అన్ని కులాలు, మతాలు, లింగాల వారికి ఆహారం అందించిన కేఫ్‌లు ఇవి.

భారతదేశం లాగానే.. పార్సీ వంటలు కూడా ఈ ద్వీపకల్పం మీద గల అనేక సంస్కృతుల ప్రభావాలను సంలీనం చేసుకుంది. ఈ పార్సీ వంటలకు మూలం ఇస్లామ్ ముందటి ఇరాన్‌లో ఉండి ఉండొచ్చు. కానీ.. గుజరాత్, గోవా, కొంకణ తీరం వంటి భారత ప్రాంతాలతో పాటు బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి ప్రాంతాల ప్రభావం కూడా ఉంది. తినే ప్రతి ముద్దతో భౌగోళికాలు, చరిత్రలు పొరలుగా విడిపోతాయి.

భారత తీరం వెంట.. ప్రత్యేకించి గుజరాత్‌ రాష్ట్రంలోని పార్సీ ఆవాసాల పుణ్యమా అని.. పార్సీ సంస్కృతికి చేపలు ఒక బలమైన కాడిగా స్థిరపడ్డాయి.

మేం చమ్నో (పాంఫ్రెట్), బోయి (ఒక రకమైన ముల్లెట్), కోల్మీ (ప్రాన్), లేవ్తీ (మడ్ హాపర్), భింగ్ (షాద్), రావాస్ (ఒక తరహా భారతీయ సాల్మన్), బాంగ్రా (మాకెరెల్) వంటి అనేక రకాల చేపలను తింటాం. వీటిలో బాంబే డక్ విశిష్టమైనది.

బాంబే డక్ Image copyright Meher Mirza

ఈ బాంబే డక్ అనేది నిజానికి ముంబయి, దాని పరిసర ప్రాంతాల జలాల్లో కనిపించే చేప. ఇది ఒళ్లుగగుర్పొడిచేంత అసహ్యంగా ఉంటుంది. జిగటగా ఉంటుంది. పెద్ద నోరు ఉంటుంది. లేత గులాబీ రంగులో ఉంటుంది. అసలు దీనికీ పేరు ఎలా వచ్చిందనేది పెద్ద మిస్టరీ.

ఈ చేపకు స్థానిక మరాఠీ పేరు 'బాంబిల్'. మరాఠీ బజార్‌లో 'బాంబిల్ తక్' అని అరిచి చెప్తుంటారు. అంటే.. 'బాంబిల్ ఇక్కడ (ఉంది)' అని అర్థం చెప్పొచ్చు. దీనిని బ్రిటిష్ వాళ్లు ఆంగ్లంలో పలికేటపుడు నోరు తిరగక 'బాంబే డక్' అని వ్యవహరించటం ద్వారా అలా పేరు స్థిరపడిందనేది ఒక ఊహాగానం.

అయితే.. చాలా ప్రచారంలో ఉన్న వివరణ ఒకటి ఉంది. భారతదేశంలో జన్మించిన బ్రిటిష్-పార్సీ రచయిత ఫారుఖ్ ధోండీ తన 'బాంబే డక్' పుస్తకంలో దీని గురించి రాశారు.

ఈ చేపలు ఎండబెట్టి.. ముంబయి నగరం నుంచి భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు మెయిల్ రైళ్లలో తరలించే క్రమంలో ఈ పేరు వచ్చిందని ఆయన భావిస్తారు. ఎండుచేపల వాసన వచ్చే ఈ పార్సిళ్లను 'బాంబే డాక్' అని వ్యవహరించేవారు. డాక్ అంటే మెయిల్ అని అర్థం. అది కాస్తా 'బాంబే డక్'గా మారిందనేది ఫారుఖ్ వివరణ.

ఈ చేప మీద ప్రేమ నగరంలోని విభిన్న సంస్కృతుల్లో లోతుగా పాతుకుని ఉంది. ముంబయి తొలి నివాసుల్లో ఒకరైన కోలీ జాలర్లు ఈ చేపలకు ఉప్పుపెట్టి పెద్ద వరుసల్లో వెదురు కర్రల దడుల మీద ఎండబెడుతుండటం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది.

ఇలా ఎండుతున్న చేపల నుంచి వచ్చే ఘాటైన దుర్వాసన చూసిన బ్రిటిష్ వలసపాలకులు.. ఈ చేప తమ ఆరోగ్యానికి హానికరమని భావించేవారు. అయితే.. తర్వాత వారు కూడా ఈ చేప ప్రేమలో పడిపోయారు.

బాంబే డక్ Image copyright Getty Images

ఈ ఎండబెట్టిన చేపలను వానా కాలంలో మళ్లీ నీటిలో నానబెట్టి కూరగా వండి కానీ వేపుడు చేసి కానీ.. పప్పు, అన్నంతో కలిపి తింటే ఆ మజా వేరేలా ఉంటుంది. కోలీ జాలర్లు తాజా చేపలను ఘాటైన కోలీ మసాలాతో వండుకుని తింటారు. సగం ఎండబెట్టి కొబ్బరి తురుముతో కలిపి కూడా వండుతారు.

భారత పశ్చిమ కొంకణ తీరంలో.. జలచర ఆహారాన్ని అమితంగా ఇష్టపడే ఈస్ట్ ఇండియన్లు, మహారాష్ట్ర వాసులు వంటి చాలా సమూహాల వంటకాల్లో బాంబే డక్ అవినాభావంగా ఉంటుంది.

ఈస్ట్ ఇండియన్లు ఈ చేపలను వెనిగర్‌తో కలిపి చట్నీగా చేసుకుంటారు. వేపుడు చేసుకుంటారు. కొన్నిసార్లు ఈ చేప పొట్టలో రొయ్యలు కూడా నింపి వండుతారు. మహారాష్ట్ర సమూహాలు ముక్కలుగా వేపుడు చేస్తారు. వేరేవాళ్లు తాజా ఆకుకూరలు కలిపి వండుతారు. ఉల్లి, చింతపండు మసాలాతో కలిపి కూర చేస్తారు.

ఈ బాంబే డక్ కేవలం పార్సీలకు మాత్రమే చెందదనేది స్పష్టం. అయితే.. మా సమాజానికి ఇది ఒక ఆరాధ్య జీవిగా అనిపిస్తుంది. ఇది మా పళ్లేలలోకే కాదు.. మా పాటల్లోకి, మా పుస్తకాల్లోకీ.. చివరికి మా పేర్లలోకి కూడా చొచ్చుకుపోయింది. పార్సీల ఇంటి పేర్లలో చాలా సాధారణంగా కనిపించే పేరు బూమ్లా. బాంబే డక్‌ చేపకు పార్సీ పేరు బూమ్లా.

మా నాన్న గుజరాత్‌లోని ఒక చిన్న పట్టణం బిలిమోరాలో పెరిగారు. ముంబయి నుంచి ఉత్తరంగా సుమారు 215 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ పట్టణంలో తన చిన్నప్పటి జ్ఞాపకాల గురించి ఆయన చెప్తుంటాడు. మా నానమ్మ బొగ్గుల నిప్పుల మీద ఎండు బాంబే డక్‌ చేపలను దళసరిగా మారేవరకూ ఎలా కాల్చేదో చెప్పేవాడు.

బాంబే డక్ Image copyright Getty Images

నా కలల.. కాల్చిన ఎండు బాంబే డక్ చేప ఇది. నిప్పుల మీద కాల్చిన ఆ చేపల పొగ రుచి.. ముంబయిలోని స్టవ్ మీద రాదు.

అదృష్టవశాత్తూ.. ఎండు బాంబే డక్ కోసం నా తపనను పరిష్కరించుకునే మార్గాలున్నాయి. తారాపోరి పచ్చడి అటువంటిదే. ఒక ఆల్చిప్పంత ఈ బాంబే డక్ పచ్చడితో పప్పు, అన్నానికి జీవం వస్తుంది.

తరీ మా సుక్కా బూమ్లా అనేది మరొక బాంబే డక్ వంటకం. కల్లు, బెల్లం, వెనిగర్, పండు మిరపకాయలు కలిపి ఉడకబెట్టి.. అందులో ఎండు బాంబే డక్‌లను నానబెడతారు.

తాజా బాంబే డక్ చేపలతో కూడా పచ్చడి చేస్తారు. కొన్నిసార్లు ఉప్పగా ఉండే 'ఖరా బూమ్లా'గా కూడా తింటారు. ఉల్లిపాయల కూరతో దీనిని తయారుచేసి అన్నంతో తింటారు.

నాకు ఇష్టమైన వంటకమా? నిమ్మరసం, పసుపు పూసి.. వేడి నూనెలో దోరగా వేయించిన గోధుమ రవ్వ పట్టించి.. పెనం మీద వేయించిన చేప. ఈ రకంగా వండిన బాంబే డక్‌ను సాధారణంగా ఉదయపు అల్పాహారంలో, బియ్యపు రొట్టెల్లో.. తీపి, పులుపు మామిడికాయ పచ్చడితో నంచుకుని తింటారు. మటన్ కైమా, కోడిగుడ్డు పొరుటు, పెనం మీద వేయించిన ఏట్ల చేపలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.

అయితే.. ఈ ప్రత్యేక శైలి బాంబే డక్ వంటకాన్ని రుచి చూడాలంటే.. పార్సీ ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించాలి. లేదంటే.. పార్సీ ఆంటీలు, అంకుళ్లతో నిండివుండే ప్రిన్సెస్ విక్టోరియా అండ్ మేరీ (పీవీఎం) వంటి పాత కాలపు ప్రసిద్ధ క్లబ్‌ను కానీ.. ఐకానిక్ ఇరానీ కేఫ్ బ్రిటానియా అండ్ కో రెస్టారెంట్‌ను కానీ సందర్శించాలి.

బొమన్ కోహినూర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బొమన్ కోహినూర్

ముంబయిలో.. పార్సీ శైలి బాంబే డక్‌ను ఆరగించటానికి ఆహ్వానం అవసరం లేని ఏకైక ప్రాంతం.. 1928 నాటి ఈ సుప్రసిద్ధ ఇరానీ రెస్టారెంట్ మాత్రమే కావచ్చు. ఇక్కడి గ్రాండ్ డైనింగ్ రూమ్‌లో క్వీన్ ఎలిజబెత్-2, మహాత్మా గాంధీ చిత్రపటాలు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటాయి.

ఈ రెస్టారెంట్‌లో.. బాంబే డక్‌ను బొంబాయి రవ్వలో ముంచి.. బయటివైపు పెళుసుగా మారేవరకూ వేయిస్తారు. లోపలి భాగం మాత్రం మెత్తగానే ఉంటుంది. ఇక ముంబైలోని అనేక పార్సీయేతర సముద్ర ఆహార కేంద్రాల్లో.. బాంబే డక్‌లో ముళ్లు తీసేసి.. బాగా కరకరలాడటం కోసం కర్రతో సాపు చేస్తారు.

బ్రిటానియా అండ్ కో రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు చాలా ఏళ్ల పాటు ఈ రెస్టారెంట్ పార్సీ యజమాని బొమన్ కొహినూర్‌తో ముచ్చటించే అవకాశం కూడా ఉండేది. ఆయన తనను తాను ''రాచ కుటుంబానికి భారతదేశంలో అతిపెద్ద అభిమాని''గా చెప్పుకుంటారు. (విలయం, కేట్‌ల భారీ చిత్రపటం కూడా రెస్టారెంట్‌లో కనిపిస్తుంది.) ఆయన 97 ఏళ్ల వయసులో ఇటీవల చనిపోయే వరకూ.. నేను డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌ లాగా ఉంటానని చాలాసార్లు చెప్పేవారు. (నేను అలా ఉండను.)

బాంబే డక్‌తో పార్సీల ప్రేమ శతాబ్దాల కిందటిది. 1795లో సేఠ్ కవాస్జీ అనే ఒక పార్సీ వ్యాపారవేత్త.. అర్థ టన్ను ఎండు బాంబే డక్ చేపలను, 30 ఎండు పాంఫ్రెట్ చేపలను బొంబాయి గవర్నర్‌కు బహూకరించినట్లు నమోదయింది.

ఆ తర్వాత.. నావ్‌రోజీ ఫ్రామ్‌జీ రాసిన 1883 సంవత్సరం నాటి 'ఇండియన్ కుకరీ ఫర్ యంగ్ హౌస్‌కీపర్స్' అనే పుస్తకంలో.. ఈ చేపను 'బాంబ్లో' అని వర్ణిస్తూ రెండు వంటకాల తయారీ విధానాన్ని చెప్పారు. ఒకటి: చింతపండు, అల్లం, వెల్లుల్లి, మిరపకాయ, వేయించిన ఉల్లిపాయలతో కలిపి చేసే ఎండు చేప కూర. రెండోది: పసుపు, ధనియాలు, చింతపండు రసం, పచ్చి మిరపకాయలతో వండే ఎండు బాంబ్లోల చిల్లీ ఫ్రై.

బాంబే డక్ Image copyright Getty Images

తర్వాతి కాలంలో 1975లో పార్సీ సంగీతకారుడు మీనా కావా 'బాంబే డక్' పేరుతో పాట రాయటం ద్వారా ఈ చేప మీద తమ సమాజపు ప్రేమకు సంగీత రూపం ఇచ్చారు.

ఒక సంస్కృతిని తన భుజాల మీద మోసేది ఎక్కువగా వంటగదే. ఆహారం అనేది.. ఒక ప్రజా సమూహపు స్వచ్ఛమైన సారాంశం కాగలదు.

ఎవరైనా పార్సీ ఆహారాన్ని విశ్లేషిస్తే వెలుగుచూసేది ఏమిటి? మా మారిపోయే భాషలా? దేశాలను పట్టుకుని తిరగటమా? మా రుచికి గల అస్థిరతా? అనుకూలంగా మారటంలో కలిసిపోవటంలో ఊసరవెల్లి వంటి మా సహజ స్వభావమా? మా వెర్రితనమా? మరి.. ఒక అసహ్యకరమైన చేప పేరును తమకు తాము పెట్టుకునేది ఎవరు?

బహుశా.. ప్రతి ఏటా నగరపు వేసవి వెనక్కు తగ్గి గాలుల వానాకాలానికి దారి ఇచ్చినపుడు.. నా బెంగ అదుపుతప్పి.. నా చిన్నప్పుడు బాంబిల్ పళ్లెం ముందు తీరికగా కూర్చున్న రోజులు గుర్తురావటమే ముఖ్యమేమో !

బీబీసీ ట్రావెల్‌లో 'క్యులినరీ రూట్స్' - ఒక ప్రాంతపు వారసత్వ సంపదగా అల్లుకుపోయిన అరుదైన స్థానిక ఆహారాల గురించి వివరించే సిరీస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)