పీవీ సింధు: భారత బ్యాడ్మింటన్‌కు పీబీఎల్ ఉపయోగపడుతోందా
- దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
- ఆదేశ్ కుమార్ గుప్తా, బీబీసీ కోసం

క్రికెట్లో దేశవాళీ లీగ్ ఐపీఎల్ విజయవంతమయ్యాక, మిగతా క్రీడల్లోనూ అలాంటి లీగ్‌లు వచ్చాయి.
2013లో ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మొదలైంది.
తొలి సీజన్లో అవధ్ వారియర్స్‌కు పీవీ సింధు, హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు సైనా నెహ్వాల్ కెప్టెన్లుగా ఉన్నారు. ఆ సీజన్ టైటిల్ హైదరాబాద్‌కే దక్కింది.
లీగ్ దశలో, ఫైనల్లో సైనా చేతుల్లో సింధు ఓడిపోయింది. కానీ, 2017లో జరిగిన పీబీఎల్ మూడో సీజన్లో సింధు చెన్నై స్మాషర్స్ తరఫున ఆడింది.
అప్పుడు లీగ్ దశలో, సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సైనాపై సింధు గెలిచింది. ఫైనల్లో తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపింది.
అంతకుముందు ఏడాది (2016లో) రియోలో ఒలింపిక్స్ జరిగాయి. పీవీ సింధు రజత పతకం గెలిచి సంచలనం సృష్టించింది.
వరల్డ్ ఛాంపియన్షిప్స్తో 2017, 18ల్లో రజత పతకాలు అందుకుంది. 2019లో ఏకంగా స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
భారత బ్యాడ్మింటన్‌కు పీబీఎల్ ఉపయోగపడుతోందా...
ఈ విజయాల వెనుక పీబీఎల్ పాత్ర కూడా ఉందని అంటోంది సింధు.
ఈ టోర్నీలో అంతర్జాతీయ క్రీడాకారులతో ఒకే జట్టులో కలిసి ఆడిన అనుభవం తమకు కలిసివస్తోందని ఆమె అంటోంది.
శిక్షణ, మంచి కోచింగ్, ఫిట్నెస్ కాపాడుకోవడం కూడా తన విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాయని సింధు వివరించింది.
జనవరి 20న పీబీఎల్ ఆరో సీజన్ మొదలైంది. ఈ సారి సింధు హైదరాబాద్ హంటర్స్ తరఫున ఆడుతోంది.
పీబీఎల్ లాంటి ఓ లీగ్ ఉండటం చాలా మంచి విషయమని సింధు అభిప్రాయపడింది. యువ క్రీడాకారులకు దీని వల్ల ఎంతో మేలు కలుగుతుందని ఆమె బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పింది.
''ఇలాంటి లీగ్‌లు ఉండటం మాకే కాదు, యువ క్రీడాకారులకూ ముఖ్యమే. ఈ టోర్నీ ద్వారా వాళ్లకు ప్రయోజనం దక్కుతుంది. అందరినీ అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారు.. సింధు, సైనాల్లా మారాలని అనుకునేవారు వచ్చి మ్యాచ్‌లు చూస్తారు. మేం అన్ని నగరాలకు వెళ్లి ఆడుతుంటే, జనాలు వచ్చి చూడటం వల్ల.. అసలు బ్యాడ్మింటన్ అంటే ఏంటి?, ఆటగాళ్లు ఎంతగా శ్రమిస్తారు? అన్నది వారికి తెలుస్తుంది. జూనియర్ ఆటగాళ్లకు, వారి తల్లిదండ్రులకు కూడా ఇది సాయపడుతుంది. పిల్లల్ని క్రీడలవైపు ప్రోత్సహించేలా చేస్తుంది'' అని సింధు చెప్పింది.
ఫొటో సోర్స్, PBL
సాయి ప్రణీత్
యువ ఆటగాడు సాయి ప్రణీత్ కూడా బీబీసీతో మాట్లాడాడు.
జూనియర్ ఆటగాడిగా ఉన్న తనకు పీబీఎల్‌లో సీనియర్లతో తలపడే అవకాశం వచ్చిందని, ఇది తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని సాయి ప్రణీత్ చెప్పాడు.
ఈసారి లీగ్‌లో ఏడు జట్లు పాల్గొంటున్నాయి. అవి అవధ్ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, హైదరాబాద్ హంటర్స్, ముంబయి రాకెట్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్, పుణె 7 ఏసెస్.
2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ పేరుతో పీబీఎల్ మొదలైంది. ఆ పేరుతో ఒక్క సీజన్ మాత్రమే జరిగింది.
దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత పీబీఎల్గా పేరు మార్చుకుని 2016లో మళ్లీ తెరపైకి వచ్చింది.
అప్పటి నుంచి ఏటా పీబీఎల్ జరుగుతోంది.
ఫొటో సోర్స్, PBL
పారుపల్లి కశ్యప్
చైనా, జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేసియా లాంటి దేశాల ఆటగాళ్లను స్వదేశంలోనే ఎదుర్కొనే అవకాశం రావడం వల్ల భారత క్రీడాకారులకు ప్రయోజనం జరుగుతుందని సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ బీబీసీతో చెప్పాడు.
ప్రస్తుతానికి చైనాకు చెందిన పేరు మోసిన ఆటగాళ్లు లీగ్‌లో ఎక్కువగా లేనప్పటికీ, రాబోయే రోజుల్లో వాళ్లు కూడా వచ్చే అవకాశం ఉందని కశ్యప్ అభిప్రాయపడ్డాడు.
''నేను మూడేళ్ల నుంచి ఈ లీగ్ ఆడుతున్నా. తొలి ఏడాదే అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీపడే అవకాశం వచ్చింది. చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ఎవరినైనా ఎదుర్కోగలనన్న విశ్వాసం వచ్చింది’’ అని చిరాగ్ శెట్టి అన్నాడు.
గత 10 ఏళ్లలో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చక్కని ప్రదర్శన చేశారు.
సింధు, సైనాలతో మొదలుకొని సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి లాంటి యువ ఆటగాళ్లు కూడా గొప్ప విజయాలు సాధించారు.
దేశంలో బ్యాడ్మింటన్ నిర్వహణ మెరుగ్గా ఉండటం, ఆటకు మంచి ప్రాధాన్యత దక్కడం ఇందుకు కారణాలని చిరాగ్ శెట్టి అభిప్రాయపడ్డారు.
పీబీఎల్‌ను గుర్తిస్తూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘం కూడా అంతర్జాతీయ ఆటగాళ్లకు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.
పీబీఎల్ ఆటగాళ్లకు కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.
క్రీడాకారుల వేలంలో హైదరాబాద్ హంటర్స్ రూ.77 లక్షలకు పీవీ సింధును గెలుచుకుంది. బెంగళూరు రాప్టర్స్ కూడా చైనీస్ తైపీ క్రీడాకారిణి తాక్ష్ జూ యింగ్ కోసం రూ.77లక్షలు, సాయి ప్రణీత్ కోసం రూ.32 లక్షలు వెచ్చించింది.
చెన్నై సూపర్ స్టార్ సుమీత్ రెడ్డిని రూ.11 లక్షలకు, పుణె 7 ఏసెస్ చిరాగ్ శెట్టిని రూ.15.5 లక్షలకు సొంతం చేసుకున్నాయి.
ఫొటో సోర్స్, PBL
ఈ సీజన్లో స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఆడటం లేదు.
పీబీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు చాలా లాభం కలుగుతోందని మాజీ ఆటగాడు దినేశ్ ఖన్నా అన్నారు.
''పీబీఎల్ ద్వారా విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడే, శిక్షణ పొందే అవకాశం ప్లేయర్స్‌కు దక్కుతుంది. భారత కోచ్‌లు చాలా మెరుగైనవారే. పీబీఎల్‌లో విదేశీ కోచ్‌లు కూడా ఉంటారు. వారి నుంచి కూడా కొత్త కొత్త మెలుకువలు తెలుసుకోవచ్చు'' అని ఆయన అన్నారు.
యువ ఆటగాడు లక్ష్య సేన్ కూడా పీబీఎల్ ద్వారా ప్రయోజనం పొందిన ఆటగాడేనని, భవిష్యత్తులో అతడు స్టార్ ప్లేయర్‌గా మారే అవకాశాలున్నాయని చెప్పారు.
గువహాటికి చెందిన 20 ఏళ్ల అస్మితా ఛలిహా, ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రి కూడా తమ ఆటతో ఆకట్టుకుంటున్నారని అన్నారు.
పీబీఎల్ వల్ల సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కూడా ప్రయోజనం పొందారని.. గత ఏడాది వీరి జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచిందని, అంతర్జాతీయ టాప్-10 జాబితాలో నిలిచిందని దినేశ్ ఖన్నా వివరించారు.
పీబీఎల్ వల్ల కొత్త కొత్త స్టేడియాలు రూపుదిద్దుకుంటున్నాయి. పాత స్టేడియంలకు మరమ్మతులు జరుగుతున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో గోపీచంద్ అకాడమీ ఉంది. దిల్లీకి ఏటా ఒక సూపర్ సిరీస్ నిర్వహించే అవకాశం దక్కుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సయ్యద్ మోదీ ఛాంపియన్షిప్ జరుగుతూ వస్తోంది.
బెంగళూరు, చెన్నై, గువాహాటిల్లోనూ మంచి స్టేడియాలు ఉన్నాయి.
పీబీఎల్ వల్ల ఆదాయం వస్తుండటంతో క్రీడాకారుల్లోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.
ఈసారి లీగ్‌లో స్పెయిన్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ ఛాంపియన్ కరోలినా మారిన్‌కు సింధుకు మధ్య పోటీ ఉంటుందని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు.కానీ. మారిన్ ఈ సీజన్లో ఆడట్లేదు.
టోక్యో ఒలింపిక్స్‌కు ఇంకా ఆరు నెలల సమయమే మిగిలుంది. దీంతో పీబీఎల్‌లో భారత ప్లేయర్స్ ఆడతారన్నదానిపై అందరి చూపూ ఉంది.
ఇవి కూడా చదవండి:
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడు
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)