ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ

  • 27 జనవరి 2020
ఆశిమా ఛిబ్బర్

"మాతృత్వాన్ని ఎంచుకోవడంలోనే అసలైన స్వేచ్ఛ ఉంది. మనకు పిల్లల్ని కనే స్వేచ్ఛ ఉంటే ఆ స్వతంత్రం మాతృత్వం అనుభవానికి ఒక కొత్త కోణాన్ని ఇస్తుంది. ఇప్పటి మహిళలు రకరకాల పద్ధతుల్లో తల్లి కావాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఆమె అలా ఎంచుకుంటోంది కూడా. అది కూడా ఎలాంటి సంకోచం లేకుండానే" ఇది అమెరికా స్త్రీవాద రచయిత్రి బెట్టీ ప్రైడన్ చేసిన ప్రకటన.

ప్రైడన్ ఆన్‌లైన్ డేటింగ్ ప్రొఫైల్లో తనకు టీ తాగడంతోపాటూ కేక్ తినడం ఇష్టం అని రాసుంది. ఆమెకు సెప్టిక్ ట్యాంక్, చీకటి అంటే ఒక వింత భయం ఉంది. ఆమె ఒక బిడ్డ ఉన్న ఒంటరి మహిళ. ఆన్‌లైన్ ప్రపంచంలో, తనను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లతో మాత్రమే కలిసి ఉండడానికి ఆమె ఆసక్తి చూపించారు.

ముంబైలో ఉంటున్న 45 ఏళ్ల చిత్ర నిర్మాత ఆశిమా ఛిబ్బర్ కూడా, తను 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ టెక్నాలజీ సాయంతో బిడ్డను కన్నానని, దానికోసం తాను చాలా మంది సాయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కానీ, ఆమె ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వాలని అనుకోవడం సబబేనా?

"తల్లి కావాలనే నా కలను నిజం చేసుకోడానికి ఒక పురుషుడి కోసం వేచిచూడాలని నేను అనుకోలేదు. ఒక మహిళ అండాలు బిడ్డగా అభివృద్ధి చెందడం అనేది ఒక సహజసిద్ధమైన కార్యం" అంటారు ఆశిమా.

అంధేరీలోని ఒక బహుళ అంతస్తుల భవనంల ఉండే ఆమె ఫ్లాట్‌లో రెండు బెడ్స్ ఉన్నాయి. చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి. గదుల్లో అద్భుతలోకంలో ఉన్నట్టు లైటింగ్ ఉంది. పిల్లలను చూసుకోడానికి పనివాళ్లు ఉన్నారు. ఒక మహిళ ఉన్నారు. తనను ఇష్టపడే పురుషుడు దొరికేవరకూ బిడ్డతో గడిపే జీవితాన్ని, ప్రేమ జీవితాన్ని వేరువేరుగా ఉంచుతానని ఆమె చెబుతున్నారు.

తల్లి కావాలనే కోరిక

ఈ రోజుల్లో పిల్లల పెంపకానికి సాయం చేసేవారిని ఎంచుకోవడం అంటే, అది మన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కంటే చాలా కష్టం అంటారు ఆశిమా.

బిడ్డను చూసుకోడానికి ఆమె దగ్గర ఇంట్లో ఇద్దరు పనివాళ్లతోపాటు బయటి స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాలా పొడవాటి జాబితా ఉంది. "అమ్మమ్మ బాధ్యతలు చూసుకోడానికి తన తల్లి అప్పుడప్పడు హైదరాబాద్ నుంచి ముంబయి వస్తుంటారని" కూడా ఆశిమా చెబుతారు.

ఆశిమా 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా తల్లి కావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆమెకు దానికి రెండేళ్లు పట్టింది. 43 ఏళ్ల వయసులో ఆశిమా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆశిమా ఛిబ్బర్ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'మేరే డాడ్‌ కీ మారుతీ' సినిమాను డైరెక్ట్ చేశారు.

గత ఏడాది మే నెలలో 'మై హూనా'(నేనున్నాను) పేరుతో సిరీస్ ద్వారా ముంబయిలో ఉంటున్న ఒంటరి మహిళలను సన్మానించారు. ఈ సిరీస్‌లో ఒక ఎపిసోడ్‌లో ఆశిమా కూడా ఉన్నారు. ఆ ఎపిసోడ్‌ పేరు 'లడ్డూవోంకా డిబ్బా'(లడ్డూల డబ్బా). అందులో ఆశిమా ఒంటరి మహిళ పాత్రలో ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా బిడ్డను కనాలని తీసుకున్న నిర్ణయం గురించి తన అనుభవాలను పంచుకున్నారు.

"నేను బిడ్డను కనాలనుకున్నాను. కానీ, నా దగ్గర ఉన్న సమయం వేగంగా కరిగిపోతోంది" అని ఆశిమా చెప్పారు.

బిడ్డ తండ్రి పేరు గురించి ఒత్తిడి వద్దు

"ఎవరైనా ఒక అవివాహిత లేదా సింగిల్ మదర్, తన బిడ్డ సర్టిఫికెట్ కోసం అర్జీ ఇచ్చినపుడు. ఆమె ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం దానిని మంజూరు చేయాలి. బిడ్డ తండ్రి పేరు వెల్లడించాలని ఆమెపై ఒత్తిడి తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో చాలామంది మహిళలు ఒంటరిగానే తమ బిడ్డలను పోషించాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం వారి ఇష్టానికి వ్యతిరేకంగా, తన బిడ్డ తండ్రి పేరు చెప్పేలా ఆమెపై ఒత్తిడి చేయడంలో ఎలాంటి లక్ష్యం ఉన్నట్టు అనిపించడం లేదు" 2015 జులైలో కోర్టు ఒక తీర్పు వెలువరించింది.

అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో "ఈ పిల్లలను తన బిడ్డగా చెప్పుకోడానికి తండ్రి ఇష్టపడకపోవచ్చు, లేదా ఆ బిడ్డను పట్టించుకోకపోవచ్చు. ఈ పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తోంది" అని వ్యాఖ్యానించింది.

సాధారణంగా మహిళలు ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా ఒంటరి తల్లిగా కావాలని నిర్ణయం తీసుకుంటున్నారు. వీరు సమాజంలోని ఉన్నతాదాయ వర్గాల నుంచి వస్తున్నారు. కానీ, మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు చేయడంతో, వారి ఆర్థిక స్వతంత్రం కూడా పెరిగింది. అలాంటప్పుడు ఫామిలీ అనే వాదనలో కూడా ఎన్నో కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. సమాజంలో కూడా సింగిల్ మదర్‌ను అంగీకరించడం పెరిగింది. అయితే అది ఇప్పుడు పరిమిత స్థాయిలోనే ఉంది.

ఆశిమా ఛిబ్బర్‌నే ఉదాహరణగా తీసుకుంటే, ఆమె గర్భవతి అయినపుడు, ముంబయిలో ఆమె ఇంటి యజమాని, నీ సాహసోపేత నిర్ణయాన్ని చూసి గర్వంగా ఉందన్నారు. ఆశిమా తల్లి కావాలనుకున్న తన నిర్ణయం గురించి తల్లిదండ్రులకు చెప్పేసరికే, ఆమె గర్భం ధరించి ఐదు నెలలు దాటింది. ఆశిమా అమ్మనాన్నలు ఆమె నిర్ణయానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే, తల్లి అయ్యే అవకాశం శారీరకంగా ఆమె చేజారిపోతోంది. తల్లి కావడానికి తగినవాడిని వెతుక్కోడానికి ఇంకా ఎదురుచూడాలంటే ఆమెకు కష్టం అయిపోతోంది.

ఆ బిడ్డ ఎవరిలా ఉంటాడో తెలీదు

ఆశిమా ఛిబ్బర్ ఎక్కువ హైదరాబాద్‌లోనే పెరిగారు. బ్రిటన్‌లో ఉంటూ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. "నా మనసులో ఎప్పుడూ తల్లి కావాలనే కోరిక ఉండేది. అందుకే నేను సింగిల్ మదర్‌గా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను" అన్నారు.

ఆశిమా ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా తల్లి కావడానికి వీర్యదాతల ప్రొఫైల్ పరిశీలించారు. ఎక్కువ ఫిట్, ఆరోగ్యంగా ఉండేవారి కోసం చూశారు. లిస్టులో చివరి ఇద్దరు స్పెర్మ్ డోనర్ల పేర్లు ఆమె ఎంచుకున్నప్పుడు, డాక్టర్ ఇద్దరిలో ఎక్కువ పొడవు ఉన్నవారిని ఎంచుకోమని ఆశిమాకు చెప్పారు.

"మీ బిడ్డ రూపం ఎలా ఉండుంటో, మీకు తెలీదు అంటారు" ఆశిమా.

ఆశిమా తన బిడ్డకు శివ్ అనే పేరు పెట్టారు. తనకు ఇప్పుడు రెండేళ్లు. గోధుమవర్ణంలో, పెద్ద పెద్ద కళ్లతో ఉంటాడు. శివ్ పుట్టడానికి ముందే, తన బిడ్డ చూడ్డానికి ఎలా ఉంటాడో అని ఆశిమా చాలా అనుకునేవారు. స్పెర్మ్ డోనర్ల ప్రొఫైల్ చూపించినపుడు, ఆమెకు అందులో వీర్యదాతల ఫొటోలు చూపించలేదు. వారి గురించి ప్రాథమిక సమాచారం ఉన్న రెజ్యూమె మాత్రమే ఇచ్చారు.

Image copyright Getty Images

ఒంటరి తల్లిగా అనుభవం

"మనం ఒక జంట అయినప్పుడు, ఆ బిడ్డ ఎలా ఉండాటో మనకు కాస్త తెలుస్తుంది. అమ్మానాన్నల రూపం కలిసిరావచ్చు, లేదా తల్లిలాగో, తండ్రిలాగో ఉండచ్చు. కానీ నా కొడుకు నన్ను రోజూ ఆశ్చర్యపరుస్తాడు. పెద్దయ్యాక వాడు ఎలా కనిపిస్తాడో నేను అసలు ఊహించలేకపోతున్నాను" అంటారు ఆశిమా.

ఆమె గత ఏడాది నుంచీ చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉన్నారు. "ఏ మహిళకైనా ఒంటరి బిడ్డను పెంచి పోషించడం అనేది, మంచి ప్రత్యామ్నాయం కాదు. కానీ, మనిషి తన విధిని అంగీకరిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండాలి" అంటారు ఆశిమా.

ఉదాహరణకు బిడ్డను కనాలనే నిర్ణయాన్ని ఆశిమా ఒంటరిగానే తీసుకున్నారు. తర్వాత బిడ్డను టీకా వేయించడానికి తీసుకెళ్లినపుడు, శివ్‌కు ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు ఆమె చాలా భయపడిపోయేవారు. ఒక సింగిల్ మదర్ తన బిడ్డతో గడపడం అనే అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఉదాహరణకు ఆమె తన బిడ్డకు పాస్‌పోర్ట్ చేయించేందుకు పాస్‌పోర్ట్ ఆఫీసుకు వచ్చినపుడు, ఫాంలో బిడ్డను దత్తత తీసుకోవడం అనే ఆప్షన్‌ మీద టిక్ చేయమన్నారు. ఎందుకంటే ఆ ఫాంలో ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనే ఆప్షనే లేదు. కానీ, శివ్ పాస్‌పోర్ట్ ఫాంలో తల్లిగా తన పేరే రాయాలని, అతడికి జన్మనిచ్చింది నేనేనని ఆశిమా వారితో గట్టిగా వాదించారు.

ఆశిమా ఛిబ్బర్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. మల్టీటాస్కింగ్ అంటే ఒకేసారి ఎన్నో పనులు చేయడం నేర్చుకున్నారు. ఇందులో ఆమె తన సిబ్బంది సాయం కూడా తీసుకుంటారు. సమాజంలో ఒంటరి తల్లికి సహకారం అందడం చాలా ముఖ్యం అని ఆమె భావిస్తున్నారు.

సమాజం కట్టుబాట్ల నుంచి విముక్తి

భారత్‌లో సాధారణంగా పెళ్లి అనే ఆచారాన్ని ఏ మహిళకైనా కొత్త జీవితం ప్రారంభంగా భావిస్తారు. అలాంటప్పుడు ఒక మహిళ ఒంటరిగా ఉంటూ, పిల్లల్ని కనడం, వారిని పెంచడం అనేది అంత సులభం కాదు.

కానీ నగరాల్లో ఉంటున్న మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడంతో, వారికి ఇలాంటి కష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభించింది. ఆ నిర్ణయం ద్వారా ఈ మహిళలు పెళ్లి చేసుకోవడం, ఇల్లు చూసుకోవడం లాంటి కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛ పొందుతున్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అన్నిరకాల సమాజిక కట్టుబాట్ల నుంచి మహిళలు తమకు తాముగా విముక్తి పొందుతున్నారు.

ఆశిమా లాంటి ఒంటరి తల్లులు ఇలాంటి సాహసిక నిర్ణయాల ద్వారా లైంగిక సంబంధాలలో స్వతంత్రం నుంచి, ఇంకా ఎన్నో బంధాల్లో స్వేచ్ఛను సంపాదించే తమ హక్కును ఉపయోగించుకుంటున్నారు. వారు ఇప్పుడు పొందిన ఈ స్వతంత్రంతో సరోగసీ లేదా ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ఒంటరి తల్లి కావచ్చు. ఆమె ఇప్పుడు తల్లి కావాలంటే, పురుషాధిక్య సమాజం విధించిన ఆంక్షలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆంక్షల్లో ఆమె ఆ సమాజం మహిళల కోసం కేటాయించిన పాత్రను మాత్రమే పోషించాల్సి ఉంటుంది. దానిని వారు కోరుకోవడం లేదు.

అయినా, భారత సమాజంలో సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉంటుంది. కానీ, సరళీకరణ తర్వాత అక్కడ కూడా చాలా విప్లవాత్మక మార్పులు చూడడానికి వీలవుతోంది. ఇక్కడ, మొదటి విషయం మహిళల విద్య గురించి అవగాహన పెరిగింది. దాని పరిధి కూడా విస్తరించింది.

2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల మొత్తం జనాభాలో విద్యావంతులైన మహిళల జనాభా గత జనాభా లెక్కలతో పోలిస్తే 11.79 శాతం పెరిగి 65.46 వరకూ చేరుకుంది. రెండు దశాబ్దాల క్రితం 28.5 శాతం కుటుంబాలే నగరాల్లో ఉండేవి. అలాంటిది, ఇప్పుడు దేశంలోని 34 శాతం జనాభా నగరాల్లో ఉంది. 2011 జనాభాలెక్కల ప్రకారం 2001 నుంచి 2011 మధ్య మహిళల జనాభా 18 శాతం పెరిగింది.

పెరుగుతున్న ఒంటరి మహిళలు

ఈలోపు ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు, భర్తకు దూరమైనవారు, అసలు పెళ్లే చేసుకోనివారి సంఖ్య కూడా 27 శాతం పెరిగింది. ఒంటరి మహిళల ఈ జనాభాలో 35 నుంచి 44 ఏళ్ల వయసు మహిళల సంఖ్య పెరిగి 68 శాతానికి చేరుకుంది. ఘనంగా వివాహాలు చేసే ఒక దేశంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం అసాధారణం.

ఇక గతంలో ఒక కుటుంబంలో పురుషుడు, అతడి భార్య, వారి పిల్లలు ఉండేవారు. అలాంటి చోట ఇప్పుడు ఒంటరి మహిళల జనాభా పెరుగుతుండడం చాలా కీలకం. ఎందుకంటే, సంతోషకరమైన జీవితం కోసం పెళ్లి చేసుకోవడం అనే సామాజిక పరిస్థితికి ఈ గణాంకాలు సవాలు విసురుతున్నాయి.

2012లో జస్టిస్ కె.ఎస్.పుట్టుస్వామి మహిళలకు పిల్లల్ని కనాలని ఎంచుకునే హక్కును రాజ్యాంగం అందించిందని భావించారు. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు కింద వస్తుంది.

కానీ, 2019లో తీసుకొచ్చిన సరోగసీ నియంత్రణ బిల్లు చట్టపరంగా వివాహితులైన ద్విలింగ జంట మాత్రమే సరోగసీ ప్రత్యామ్నాయం ఎంచుకోడానికి అర్హులని చెప్పింది. ఒంటరిగా ఉన్న వ్యక్తులను, విడాకులు తీసుకున్నవారిని, సహజీవనం గడిపేవారిని, వితంతువులను, భార్యలేనివారిని ఈ ప్రతిపాదిత బిల్లు పరిధి నుంచి విడిగా ఉంచారు.

సరోగసీ ప్రత్యామ్నాయం ఎంచుకునే దంపతులు తాము ఐదేళ్లుగా లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు దాంపత్య జీవితంలో ఉన్నామని, పిల్లల్ని కనడంలో తాము అసమర్థులని రుజువు చేయాలని కూడా ఈబిల్లులో చెప్పారు. అప్పుడే, వారికి ప్రజాప్రయోజనం దృష్ట్యా సరోగసీ కోసం సిద్ధంగా ఉన్న వారి సాయం తీసుకునే హక్కు లభిస్తుంది.

ఒక తోడు అవసరం

తనకు ఒక తోడు అవసరం అని, అది వివాహంతో పూర్తి అవుతుందని ఆశిమా ఛిబ్బర్ భావిస్తారు. అయితే, ఆమె మనసులో తల్లి కావాలనే కోరిక ఎప్పుడూ ఉంటూ వచ్చింది. అందుకే, మొదట పెళ్లి చేసుకోవాలా, లేక మొదట బిడ్డను కనాలా అని ఆమె నిర్ణయించుకోవాల్సి వచ్చింది. చివరికి, ఆమెకు తన ఆర్థిక సవాళ్ల నుంచి విముక్తి లభించినప్పుడు, తన భావోద్వేగ అసమానతల నుంచి కూడా ఆమె స్వేచ్ఛను పొందారు.

తర్వాత, తను ఎప్పుడూ కోరుకున్నదాన్ని ఆమె నిజం చేసుకున్నారు. "గర్భవతి అయినప్పటి నుంచి నుంచి బిడ్డ పుట్టే కొన్ని రోజుల ముందు వరకూ ఎవరికీ తెలీకుండా వాంతులు చేసుకునేదాన్నని, అనారోగ్య సమస్యలను ఎదుర్కున్నానని" ఆశిమా చెప్పారు.

"అప్పుడు ఒంటరిగా అనిపించేది. కానీ నాకు నేనుగా మెల్లమెల్లగా ఆ సవాలును స్వీకరించడానికి సిద్ధపడ్డాను" అన్నారు.

ఇప్పుడు బిడ్డకు తల్లైన తర్వాత ఒక స్వతంత్ర, ఒంటరి మహిళగా ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట్లో ఆశిమా అర్థరాత్రి వరకూ బయటే గడిపేవారు. కానీ, ఇప్పుడు ఆమె ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి వస్తోంది.

ఆశిమా ఎంత ప్లానింగ్‌తో తల్లి కావాలనే కలను నిజం చేసుకున్నారంటే, దానివల్ల ఆమెలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఆమె బిడ్డ దగ్గర ఉన్న వాటిలో ఎక్కువ బొమ్మలు స్నేహితుల నుంచి బహుమతిగా వచ్చినవే. తన సాహసోపేత నిర్ణయాన్ని మెచ్చుకునేవారిని ఆశిమా ఎప్పుడూ కలుస్తూ ఉంటారు. కాలక్రమేణా సమాజంలోని కుటుంబం అనే ఒక సంకుచిత నిర్వచనం పరిధిని అది మారుస్తుందని, తనలాంటి ఒంటరి తల్లి లేదా తండ్రులను కూడా చివరకు కుటుంబంగా భావిస్తారని ఆశిమా ఆశిస్తున్నారు.

'ఈ కుటుంబంలో మనమిద్దరమే'

ముంబయిలోని ఆశిమా అపార్టుమెంట్ కిటికీ నుంచి మొత్తం నగరాన్ని చూడచ్చు. బయట పెద్దపెద్ద భవనాలను, చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తుంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ చోటు ఉందని అప్పుడు మనకు అనిపిస్తుంది.

ఆశిమా తన బిడ్డకు జుహూ బీచ్‌లో అస్తమిస్తున్న సూర్యుడిని చూపిస్తుంటారు. బిడ్డతో అలా బయటికి రావడం ఆశిమాకు చాలా ప్రత్యేకం. తన జీవితంలో విడదీయరాని ఒర భాగం అయిపోయేలా, ఆమె తన బిడ్డను, వెళ్లే ప్రతి చోటుకూ తీసుకెళ్తుంటారు.

ఆశిమా తన బిడ్డకు బిస్కెట్ చూపిస్తూ ఆడిస్తున్నప్పుడు, పక్కనే ఉన్న ఆమె తల్లి కూతురిని చూసి నవ్వుకుంటూ ఉంటారు.

తను ఇప్పుడెలా ఉందో అలాగే ఇష్టపడే అసలైన జీవిత భాగస్వామి దొరక్కపోతే, ఎప్పుడో ఒక రోజు తన కొడుకుతో "మన కుటుంబంలో ఉండేది మనమిద్దరమే" అని చెప్పాల్సి వస్తుందని ఆశిమాకు తెలుసు.

ఆశిమా ఎన్నో కుటుంబాలను చూసింది. నెల క్రితం ఆమె అలాంటి ఒక కుటుంబంతో సెలవులు గడపడానికి వెళ్లింది. ఆ కుటుంబంలో స్వలింగ సంపర్కుల జంట ఉంది. వారు తమ స్నేహితురాలిని సరోగేట్ మదర్‌గా ఒప్పించి బిడ్డను పొందారు. పురుషులైన ఇద్దరూ ఫ్రాన్స్‌లో ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారు. అదే అంతస్తులో కింది ఇంట్లో వారి బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ కూడా నివసిస్తున్నారు. అలా వారి బిడ్డకు ఇప్పుడు రెండు ఇళ్లు ఉన్నాయి.

ప్రపంచం మారుతోంది. బహుశా ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలు కొన్నే. అవే ప్రేమ, భద్రత, ఓపెన్‌గా ఉండడం.

"ప్రపంచంలో అన్నిరకాల కుటుంబాలు ఉన్నాయి. అందులో, మాది కూడా ఒక కుటుంబం. నా జీవితం గత 13 నెలలుగా సంతోషాలతో నిండిపోయి ఉంది" అంటున్నారు ఆశిమా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

కరోనావైరస్‌: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి

చేతులో డబ్బులు అయిపోతున్నాయి... ఏం చెయ్యాలో ఎలా గడపాలో తెలియడం లేదు – బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల గోడు

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?