వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'.. రద్దుపై ఏపీ సీఎం సంకేతాలు

  • 23 జనవరి 2020
జగన్ Image copyright IANDPR

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో హింట్ ఇచ్చారు. ఈ మండలి మనకు అవసరమా? అని ఆయన సభలో ప్రశ్నించారు.

రాజధాని బిల్లుల విషయంలో శాసన మండలిలో ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో మండలిని రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు అసెంబ్లీని పొడిగించారు. సోమవారం తిరిగి శాసన సభ సమావేశం కానుంది.

"మండలిలో నిన్న జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. చట్టాలు చేయడానికి ఈ సభ ఏర్పాటయింది. మండలి చట్టబద్దంగా వ్యవహరిస్తుందని నమ్మాం. మండలి నుంచి సలహాలు, సూచనలు వస్తాయనుకున్నాం. లేదా బిల్లును తిప్పి పంపిస్తారని అనుకున్నాం. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మన్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపారు'' అని వ్యాఖ్యానించారు జగన్.

మండలి సమావేశాల సందర్భంగా చంద్రబాబు గ్యాలరీలో ఉండటాన్ని తప్పు పట్టారు జగన్. ఛైర్మన్ ప్రసంగాన్ని మళ్లీ సభలో వినిపించి, దానిపై వ్యాఖ్యానించారు. విచక్షణాధికారంతో చట్టాన్ని అతిక్రమించారని విమర్శించారు.

''తప్పు అని తెలిసి కూడా.. తప్పు ఒప్పుకొని కూడా.. నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న మాటలను చూస్తే, హత్య చేయడం తప్పు అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?" అన్నారు జగన్.

‘ఆ తప్పుని ఇకపై చేయకుండా మనం ఆలోచించాలా వద్దా?’ అని అనడం ద్వారా మండలి రద్దు గురించి హింట్ ఇచ్చారాయన.

ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా: జగన్

''దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. శాసనసభలో ఎంతోమంది మేధావులు, డాక్టర్లు, లాయర్లు, రైతులు, జర్నలిస్టులు, విజ్ఞులు ఉన్నారు. ఇంత మంది మేధావులు ఇక్కడే ఉన్నప్పుడు మండలి అవసరమా అన్న విషయాల పైన కూడా ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా చేయాలి, ఎలా ఆపాలి, ఎలా జాప్యం చేయాలి అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తూ ఉన్న ఇలాంటి మండలి కొనసాగించాలా వద్దా అన్నది సీరియస్‌గా ఆలోచించాలి'' అన్నారు జగన్.

"మండలి ప్రజల కోసం నడుస్తోందా? ఓడిపోయిన నాయకుల కోసం నడుస్తోందా అని ఆలోచించాలి. ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడినుంచైనా చట్టాలు చేయవచ్చు. పాలన సాగవచ్చు. దివంగత జయలలిత గారు ఊటీ నుంచి పాలన సాగించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే అడ్డుకోవడం ఏంటి? ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ కోసం బిల్లు పెడితే వ్యతిరేకిస్తారా. కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తుంటే మండలి కొనసాగాలా వద్దా అని ఆలోచించాలి" అంటూ తన మనసులో మాట బయటపెట్టారు జగన్.

సోమవారం కూడా సభను కొనసాగించాలని జగన్ కోరగా, స్పీకర్ అంగీకరించి, సభను సోమవారానికి వాయిదా వేశారు.

మండలి రద్దు నిర్ణయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సమర్థించారు.

‘‘గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఏకంగా మంత్రి వర్గాన్ని రద్దు చేసి మండలి రద్దు చేశారు, మీరు విస్తృత అభిప్రాయం తీసుకుని వెళ్దాం అంటున్నారు. అలాగే చేద్దాము’’ అని అన్నారు స్పీకర్.

Image copyright APLEGISLATURE.ORG

మండలి రద్దుపై భిన్నాభిప్రాయాలు

అటు జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తూనే సభలో వైయస్సార్సీపీ సభ్యుల ప్రసంగాలు సాగాయి. ప్రభుత్వానికి సలహాలివ్వలేని సభ అనవసరమని మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. తాము మండలి సభ్యులుగా ఉన్నా, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు అన్నారు.

అయితే దీనిపై వివిధ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు జూలై 8న శాసన సభలో మండలి బిల్లు పెట్టి, మండలిని మళ్లీ తెచ్చారు. మండలిని రద్దు చేయడం అంటే రాజశేఖర్ రెడ్డికి వెన్నుపోటు పొడవడమే’’ అని అన్నారు కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి.

"శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం. తొత్తుల్ని తీసుకొచ్చి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారు. అందుకే మండలి రద్దు చేయాల్సి వస్తోంది. నిబంధనలు పాటించాలని చెప్పినా చైర్మన్ పాటించలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో శాసనమండలి అభిప్రాయం చెప్పడానికే రూల్ 71. ప్రభుత్వ ప్రతిపాదనను పక్కనపెట్టి మండలి చైర్మన్ రూల్ 71ని ఉపయోగించారు. సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం లెటర్ ఇచ్చామని చెబుతోంది. కానీ, సెలక్ట్ కమిటీకి పంపించాలంటే సభలో తీర్మానం చేయాలి" అన్నారు శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి 1958లో ప్రారంభం అయింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండేది. దీంతో బిల్లుల విషయంలో తరచూ ఇబ్బంది ఎదురయ్యేది. దీంతో 1985లో మండలిని రద్దు చేయించారు ఎన్టీఆర్. తిరిగి 2007లో కాంగ్రెస్ హయాంలో వైయస్ రాజశేఖర రెడ్డి శాసన మండలిని పునరుద్ధరించారు. ఇప్పుడు మళ్లీ మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిల్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో లేదు. పలు రాష్ట్రాల్లో కౌన్సిళ్లు కావాలనీ, వద్దనీ రకరకాల డిమాండ్లున్నాయి.

మండలి రద్దు చేయాలంటే.

ఒకవేళ మండలిని రద్దు చేయాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి. సభకు హాజరయిన వారిలో రెండింట మూడొంతుల మంది సభ్యులు దాన్ని ఆమోదించాలి. అప్పుడు పార్లమెంటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం మండలిని రద్దు చేస్తుంది.

ప్రస్తుతం శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా, అందులో తెలుగుదేశం నుంచి 26, వైయస్సార్ కాంగ్రెస్ నుంచి 9, ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నుంచి 5, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3, నామినేటెడ్ 8, ఖాళీలు 4 ఉన్నాయి.

మరోవైపు హైకోర్టులో రాజధాని రైతులు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్లను వచ్చేనెల 26కు వాయిదా వేసింది హైకోర్టు. బిల్లు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బిల్లు చట్టంగా మారడానికి సమయం పడుతుంది కాబట్టి కేసును వాయిదా వేసింది కోర్టు.

అదే సందర్భంలో చట్టంగా మారకుండా ప్రభుత్వ విభాగాలను తరలించకూడదని ఆదేశించింది. అలా కాదని తరలిస్తే, ఆ ఖర్చును వ్యక్తిగత ఖాతాల నుంచి జమ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, రైతుల తరపున అశోక్ భాన్‌లు ఈ కేసులో వాదనలు వినిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘మత స్వేచ్ఛ మాకు ముఖ్యం... మోదీతో భేటీలో ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తుతారు’

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

పోలవరం గ్రౌండ్‌ రిపోర్ట్: జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి

ప్రెస్ రివ్యూ: 'ఏపీలో దొరకని మందు.. తెలంగాణకు కాసుల విందు'