అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది? పోలీసులు, మీడియా ప్రతినిధులు ఏమంటున్నారు?

  • 25 జనవరి 2020
మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల Image copyright Ravi

రాజధాని అమరావతి ప్రాంతంలో ముగ్గురు మీడియా ప్రతినిధులపై నిర్భయ చట్టం, ఎస్సీ ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం కింద గుంటూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీశారని పోలీసులు అంటుంటే, తమపై కక్షతోనే వారు కేసులు నమోదు చేశారని జర్నలిస్టులు చెబుతున్నారు.

కేసులు నమోదైన మీడియా ప్రతినిధుల్లో ఈనాడు ఫొటోగ్రాఫర్ మరిడయ్య, ఈటీవీ రిపోర్టర్ కృష్ణ, టీవీ5 రిపోర్టర్ రమేశ్ చౌదరి ఉన్నారు.

రాజధాని ప్రాంత ఆందోళనల నేపథ్యంలో వేర్వేరు చోట్ల నుంచి పోలీసులను ఇక్కడకు తీసుకొచ్చారు. వారికి వివిధ ప్రదేశాల్లో బస కల్పించారు. వీటిలో మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి.

సంక్రాంతి సెలవుల తర్వాత బడి మళ్లీ మొదలైంది. పోలీసులు పూర్తిగా ఖాళీ చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని కొందరు స్థానికులు ప్రశ్నించారు. వార్తను కవర్ చేయడానికి వీడియో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు అక్కడకు వెళ్లారు. తరగతి గదుల్లో పోలీసులు బట్టలు ఆరేసుకున్న దృశ్యాలను వారు వీడియో, ఫొటో తీశారు. తీస్తున్నప్పుడు అక్కడున్న పోలీసులు అభ్యంతరం చెప్పారు.

తర్వాత అక్కడకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులను టీవీ5, ఏబీఎన్, వీ6, ఈటీవీ భారత్ లోగోలు ఉన్న మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించారు. స్పందించిన ఓ ఉన్నతాధికారి- బట్టలు ఆరేసి లేవనీ, ఒకవేళ ఉంటే వెళ్లి ఫొటోలు తీసుకోవాలని, కొన్ని చానళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నాయనీ, వారికి నోటీసులు ఇస్తామనీ అనడం వీడియోలో రికార్డ్ అయింది.

Image copyright Ravi

ఈ ఘటన తర్వాత మీడియా ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గదిలో ఒక ట్రైనీ మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా మీడియా ప్రతినిధులు వీడియో తీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఆమె ఫిర్యాదుతో భారత శిక్షా స్మృతి-ఐపీసీ సెక్షన్ 509 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 354 (మహిళ గౌరవానికి భంగం కలిగేలా నేరపూరిత చర్య) కింద, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఐపీసీ 354ను 2013 సవరణల ఆధారంగా నిర్భయ చట్టం అని పిలుస్తారు. ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి.

తోటి జర్నలిస్టులు ఏం చెబుతున్నారు?

సదరు మీడియా ప్రతినిధులు విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను మాత్రమే కవర్ చేశారని వారి తోటి జర్నలిస్టులు చెబుతున్నారు. పోలీసుల బట్టలు తరగతి గదుల్లో ఆరేసి ఉండటంతో వాటిని మాత్రమే వీడియో తీశారని పేర్కొంటున్నారు.

"వారు 'స్కూల్లో పిల్లల ఇబ్బందులు' అనే వార్త కవర్ చేయడానికే వెళ్లారు. ఎవరో గ్రామస్థులు చెబితే ఆ వార్త కవర్ చేద్దామని వెళ్లారు. తరగతి గదుల్లో బట్టలు ఆరేసి ఉన్న వీడియో మాత్రమే తీశారు. అంతకుమించి ఇంకేమీ లేదు. పక్కనే ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ వీళ్లను వీడియో తీశారు. నలుగురు జర్నలిస్టులు కలసి వెళ్లి, పెద్ద కెమెరాలతో వార్త కవర్ చేస్తున్నప్పుడు, చాటుగా వీడియోలు ఎందుకు, ఎలా తీస్తారు? అది అసలు అవాస్తవం. ఈ విలేఖరులు కొంత కాలంగా తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో ప్రజల ఆందోళనలకు మంచి కవరేజ్ ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నారు. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా ఇరికించారు" అంటూ కేసులు ఎదుర్కొంటున్న ఒక విలేఖరికి సన్నిహితుడైన మరో జర్నలిస్టు బీబీసీతో చెప్పారు.

గలాటా అవుతోందంటే వెళ్లాం: పోలీసు

పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు బీబీసీతో మాట్లాడుతూ- "ఆ రోజు మేం ఆ స్కూల్ దగ్గర్లో బందోబస్తు నిర్వహిస్తున్నాం. అక్కడేదో గలాటా అవుతోందంటే వెళ్లాం. మీడియా వాళ్లు స్కూల్లో కనిపించారు. స్కూల్లోకి ఎందుకొచ్చారని మీడియా వాళ్లను మా అధికారులు అడిగారు. స్థానికులు తీసుకొచ్చారని వారు చెప్పారు" అని తెలిపారు.

"మీడియా ప్రతినిధులు వీడియో తీసే సమయంలో అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకొంటున్నట్టు తెలిసింది. నిజానికి ఏ ప్రభుత్వమైనా, ఎవరి పాలనైనా పోలీసులు దూరం నుంచి వచ్చినప్పుడు ఇలా దగ్గర్లోని స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్ల లాంటి చోట వసతి కల్పిస్తారు. వీళ్లకు కూడా అంతే. వీళ్లు ఉదయం ఆరు గంటలకు వెళ్తే రాత్రి పది గంటలకు వస్తారు. విద్యార్థులకు ఏ ఇబ్బందీ ఉండదు. దాన్ని కూడా కొందరు రచ్చ చేస్తున్నారు" అని ఆ పోలీసు విమర్శించారు.

ఈ కేసు విషయంలో పోలీసులు గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని ఆందోళనల కవరేజీ విషయంలో కొన్ని మీడియా సంస్థలపై పోలీసులు ఆగ్రహం దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తాము బందోబస్తు విధులు నిర్వహిస్తుంటే, కావాలనే తమను విలన్లుగా చూపించేలా వార్తలు, ఫొటోలు ప్రచురిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

"పలు సందర్భాల్లో అక్కడ వాస్తవం ఒకటైతే, ఫొటో చిత్రీకరించే, వ్యాఖ్యానించే విషయం వేరుగా ఉంటోంది. అదంతా కొందరు కావాలనే చేస్తున్నారు" అని రాజధాని ప్రాంతంలో బందోబస్తు విధుల నిర్వహణకు బయటి జిల్లా నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి బీబీసీతో చెప్పారు.

"ఆడవాళ్లు బట్టలు ఆరేసుకున్న చోట వీడియో తీయడానికి వాళ్లకు హక్కెవరు ఇచ్చారు? అసలు బడిలోకి అనుమతి లేకుండా ఎవరు లోపలికి రానిచ్చారు" అని ఆయన ప్రశ్నించారు.

మరో పోలీసు అధికారి కథనం ప్రకారం- "జర్నలిస్టులు వీడియో తీయడానికి కెమెరా పెట్టే సరికి ఆ గదిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. ఆమె విధుల మధ్యలో అనుమతి తీసుకొని మేం బస చేస్తున్న చోటకు వచ్చారు. ఆమె బట్టలు మార్చుకోవాలనుకునే సమయంలో వీరి కెమెరాను గమనించి కేకలు వేసి, అక్కడ ఉన్న బెంచీల వెనుక దాక్కున్నారు. తర్వాత సదరు జర్నలిస్టు వెళ్లి ఆమెకు 'సారీ' చెప్పారు. ఈలోపు మిగతా పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఇదంతా మధ్యాహ్నం జరగ్గా, కేసు మాత్రం రాత్రికి నమోదు చేశారు."

వెంటనే అరెస్టు చేయొచ్చు.. కానీ విచారణ తర్వాతే చర్యలు: ఎస్‌పీ

గుంటూరు రూరల్ ఎస్‌పీ విజయరావు బీబీసీతో మాట్లాడుతూ- ఈ కేసుల్లో విచారణ ఇంకా ప్రారంభించలేదని, చట్ట ప్రకారం డీఎస్‌పీ స్థాయి వ్యక్తి విచారణ చేస్తారని చెప్పారు.

"మేం ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయడం లేదు. నిజంగా కావాలని చేయాలనుకుంటే మేం వారిని వెంటనే అరెస్టు చేసేవాళ్లమే. ఈ కేసుల్లో- ఆ అమ్మాయి వాంగ్మూలం ప్రకారం వెంటనే అరెస్టు చేసే వీలుంది. కానీ చట్ట ప్రకారం విచారణ చేశాకే తదుపరి చర్యలు తీసుకుంటాం. బాధ్యతాయుతంగా వెళ్తాం" అని ఆయన వివరించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కేసులు ఎదుర్కొంటున్న మీడియా ప్రతినిధుల స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. వారు అందుబాటులో లేరు.

కొందరు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఈ కేసుల విషయమై పోలీసు ఉన్నతాధికారులను కలిశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)