పూజా హెగ్డే: ‘నడుము చూపిస్తే తప్పులేదా? కాళ్లు చూపిస్తే తప్పా?.. ఇలాంటి వాళ్లను ఎడ్యుకేట్ చేయడం నా బాధ్యత’ - ప్రెస్ రివ్యూ

  • 26 జనవరి 2020
Image copyright facebook/AlaVaikunthapurramuloo

అల వైకుంఠపురంలో.. మూవీ హీరోయిన్ పూజా హెగ్డే నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాంటి పాత్రలే చేస్తానని ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు నచ్చిన వాటి గురించి ఆమె పత్రికతో చాలా విషయాలు పంచుకున్నారు.

తెరపై వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. జీవితంలో ఎలా ఉంటారు?

నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో... అలాంటి పాత్రలు కొన్ని చేస్తున్నాను. నాలో అరవిందలాంటి అమ్మాయి ఉంది. 'అల... వైకుంఠపురములో' కంపెనీ సీఈవోగా నటించా. ప్రపంచంలో సీఈవోలుగా చేస్తున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. 'మహర్షి'లో మొదట కాలేజీ అమ్మాయిగా, తర్వాత గేమింగ్‌డిజైనర్‌గా చేశా. అటువంటి అమ్మాయిలు ఉన్నారు కదా! అలాగే, 'గద్దలకొండ గణేష్'లో తండ్రి చెప్పుచేతల్లో ఉండే అమ్మాయిగా నటించాను. సాధారణంగా జనాలు ఏమనుకుంటారు? సమాజం ఏమనుకుంటుంది? అనే ఒత్తిడి అమ్మాయిలకు ఉంటుంది. అటువంటి పాత్రనూ చేశాను.

ఇంతకీ, నిజ జీవితంలో మీరు ఎలా ఉంటారో చెప్పలేదు!

ఈతరం అమ్మాయిలానే ఉంటా! వృత్తిపరంగా వందశాతం కష్టపడతా. సమయం కుదిరినప్పుడు స్నేహితులతో సరదాగా కబుర్లు చెబుతా. తల్లితండ్రులను గౌరవిస్తా. ప్రేమిస్తా!

సగటు అమ్మాయిలకు ఉండే ఒత్తిడి మీకు ఉంటుందా?

టెన్షన్స్‌ఎవరికి ఉండదు చెప్పండి? (నవ్వుతూ) 'నాకు ఎటువంటి ఒత్తిడీ లేదు' అని చెప్పే వ్యక్తిని మీరు చూపించండి? ప్రతి ఒక్కరికీ జీవితంలో ప్రెషర్స్‌ఉంటాయి. అఫ్‌కోర్స్‌... నేనూ ప్రెషర్స్‌ఎదుర్కొంటున్నా.

Image copyright facebook/AlaVaikunthapurramuloo

ప్రేక్షకుల సంగతికి వస్తే... 'అల...'లో హీరోయిన్‌ కాళ్లను హీరో చూసే సన్నివేశాలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళను అందాల బొమ్మగా చూస్తూ, కించపరిచేలా మాట్లాడే ప్రేక్షకులు ఉన్నారు. కామెంట్స్‌ చేస్తుంటారు. అవి విన్నప్పుడు మీ స్పందన?

కొందరి తీరు ఎలా ఉంటుందంటే... చీర కట్టుకునప్పుడు నడుము మొత్తం కనిపిస్తుంది. అందులో తప్పేం లేదు కానీ, క్రాప్‌ టాప్‌, జీన్స్‌ వేసుకుంటే తప్పు అని చెబుతారు. ఫర్‌ దెమ్‌... నడుము ఈజ్‌ నార్మల్‌. లెగ్స్‌ ఆర్‌ నాట్‌ నార్మల్‌. 'నడుము చూపించడం సాధారణ విషయమే కానీ, కాళ్లు చూపిస్తే తప్పు' అనేటటువంటి వాతావరణంలో పెరిగారు. వాళ్లను నేను బ్లేమ్‌ చేయను. వాళ్లను మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్లను ఎడ్యుకేట్‌ చేయడం నా బాధ్యత. నడుమును వర్ణిస్తూ ఎన్నో పాటలు ఉన్నాయి. 'అల... వైకుంఠపురములో' అమ్మాయి నడిచే విధానంపై 'సామజ వరగమన' పాట ఉంది. 'మీరు వేరే దృష్టితో చూడకండి. ఇలా చూడాలి' అని చెప్పాలి. ఒకవేళ నేను బీచ్‌ లొకేషన్‌లో పెరిగాను అనుకోండి... మహిళలు బికినీ వేసుకోవడమనేది చాలా సాధారణమైన విషయం. నాకు ఓ ఫ్రెండ్‌ ఉన్నాడు. బీచ్‌ లొకేషన్‌లో ఉంటాడు. మహిళలు బికినీ వేసుకోవడంలో పెద్ద విషయం ఏముంది? అనేది అతడికి అర్థం కాదు. ప్రతి ఆదివారం అక్కడ బీచ్‌కి వచ్చే ప్రతి అమ్మాయి బికినీ వేసుకుంటుంది. వాళ్లను నా ఫ్రెండ్‌ తదేకంగా చూడడు. ఎందుకంటే... అతడి దృష్టిలో బికినీ వేసుకోవడం నార్మల్‌. ఇక్కడ... అది నార్మల్‌ కాదు. మనం పెరిగిన విధానంలోనే అంతా ఉంటుందని పూజా హెగ్డే చెప్పినట్లు ఆంధ్రజ్యోతి తన ఇంటర్వ్యూలో రాసింది.

Image copyright aplegislature

‘వైసీపీ ఆకర్ష్’

మండలిలో బలం పెంచుకునేందుకు వీలుగా వైసీపీ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఆ ప్రయత్నాలు ఫలించి మండలిలో మెజారిటీ వస్తే రద్దు ఆలోచనను విరమించుకునే అవకాశం ఉంది అని తెలిపింది.

బలం పెరిగిన తర్వాత ప్రస్తుత చైర్మన్‌ను అవిశ్వాస తీర్మానంతో తొలగించి, వైసీపీ సభ్యుడిని చైర్మన్‌గా చేయాలన్న వ్యూహంతో ఉందని భావిస్తున్నాయి.

అనంతరం సెలక్ట్ కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఉపసంహరించుకుని వాటికి చిన్న చిన్న మార్పులతో ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం పొందాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోందని ఈనాడు రాసింది.

వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆదివారం రాత్రికి, లేదా సోమవారం ఉదయానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పత్రిక చెప్పింది.

శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ శనివారం ముఖ్యమంత్రి జగన్‌తో తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు.

మండలి రద్దుతోపాటు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల అంశంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం అందిందని ఈనాడులో వివరించారు.

టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలతో కొందరు మంత్రులు, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని, డబ్బు, పదవులు ఎర వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోందని కూడా ఈ కథనంలో రాశారు.

Image copyright facebook/TRS Party

‘ఎవరు ఎప్పుడు సీఎం అవుతారో సమయం వచ్చినపుడు తేలుతుంది’

తెలంగాణకు ఎవరు ఎప్పుడు సీఎం అవుతారో సమయం వచ్చినపుడు తేలుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్లు వెలుగు పత్రిక ఒక కథనం ప్రచురించింది.

''తెలంగాణ మంచిగనే ఉంది. పిల్లలైతే మంచిగనే పని చేస్తున్నరు. పోవాల్సివస్తే కేసీఆర్ దేశం కోసం బైలెల్లుతడు'' అంటూ త్వరలో తన పిల్లలకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని చెప్పకనే చెప్పారు అని కథనంలో రాశారు.

త్వరలో కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చేసిన కామెంట్లు ఆసక్తి రేపాయని పత్రిక చెప్పింది.

అనంతరం ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావిస్తే సీఎం నవ్వులు రువ్వించారు. కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారని విలేకరి అడిగిన ప్రశ్నకు.. ''ఎవరూ ఎప్పుడు సీఎం అవుతారనేది సమయం, సందర్భం వచ్చినప్పుడు తేలుతుంది.

నరేంద్ర మోడీ సీఎంగా ఉండి ప్రైం మినిష్టర్ కాలేదా. ఇక్కడ్నించి పోయాక, ఖాళీ అయ్యాక చూద్దాం. ఎవరు కావాలో, ఎవరు కావద్దో.. సమయం, సందర్భం వచ్చినప్పుడు తేలుతుంది. విష్ పుల్ థింకింగ్‌లో అనుకోవచ్చు. చాలా మంది కోరుకుంటారు..'' అని బదులిచ్చారు.

దీనిపై అసెంబ్లీలోనే ఇప్పటికే చెప్పానని కేసీఆర్ తెలిపారు. ''ఈ మధ్య హాస్పిటల్కు పోతే .. 30, 40 బ్లడ్ టెస్టులు చేసిండ్రు. ఫర్ఫెక్ట్ఆల్రైట్ గా ఉన్నావని డాక్టర్లు చెప్పిండ్రు.

దుక్కలాగున్న. నేను నచ్చుతలేనా ఏందీ..? నన్ను జబర్దస్తీగా పంపిస్తారా.. ఏందీ..'' అంటూ నవ్వారని వెలుగు పత్రిక కథనంలో రాసింది.

గ్రామ సచివాలయ సేవలు Image copyright facebook/Andhra Pradesh CM

గ్రామ సచివాలయాల్లో 536 రకాల సేవలు

నేటి నుంచి(జనవరి 26 నుంచి) ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో 536 రకాల సేవలు ప్రారంభిస్తున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

మారుమూల ప్రాంతం సైతం ఆదివారం నుంచి 536 రకాల సేవలు గ్రామ సచివాలయంలోనే అందజేసే ప్రక్రియ మొదలు కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.

ఇప్పుటిదాకా వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

పొలం పాస్‌బుక్‌లో భూముల వివరాలు నమోదు, ఈసీల జారీ, కుల ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులో మార్పుచేర్పులు, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌లాంటి సేవలన్నీ ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి వస్తాయని సాక్షి చెపింది.

15 నిమిషాల వ్యవధిలోనే 1 బి, అడంగల్, ఆధార్, రేషన్‌కార్డు ప్రింట్, టైటిల్‌డీడ్, రిజిస్ట్రేషన్‌డాక్యుమెంట్‌ సర్టిఫికెట్ కాపీ, విద్యుత్‌ కనెక్షన్‌ కేటగిరి మార్పు లాంటి సేవలు పొందవచ్చు. అప్పటికప్పుడు మొత్తం 47 రకాల సేవలను అందిస్తుండగా మరో 148 రకాల సేవలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తారని ఇందులో వివరించారు.

మిగిలిన వాటిలో కూడా మూడు రోజుల అనంతరం ఒక్కో సేవను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ సేవలన్నింటినీ అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేక పోర్టల్‌ రూపొందించినట్లు కథనంలో చెప్పారు.

ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో దీన్ని అనుసంధానించారు. దీనికి తోడు గ్రామ, వార్డు సచివాలయాల్లో నిత్యం 'స్పందన' కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)