తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం.. ఫలితాలు ఏం చెబుతున్నాయి?

  • 26 జనవరి 2020
టీఆర్ఎస్ విజయం Image copyright fb/trs party

తెలంగాణ మున్సిపల్/కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 1701 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 576 వార్డులు, బీజేపీ 293, ఎంఐఎం 87 వార్డులు గెలుచుకున్నాయి. సీపీఐ 20 వార్డుల్లోను, సీపీఎం 12 వార్డుల్లోను, టీడీపీ 8 వార్డుల్లోను గెలవగా.. స్వతంత్ర అభ్యర్థులు 246 వార్డుల్లో గెలిచారు. మరో 49 వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఇతర పార్టీల తరపున పోటీ చేసిన వారు గెలుపొందారు.

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు 09 కార్పొరేషన్లకు జనవరి 22 న ఎన్నికలు నిర్వహించారు.

ఈ నెల 24న జరిగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు జనవరి 27న రానున్నాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 74.40 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

120 మునిసిపాలిటీలలో 2727 వార్డులు ఉన్నాయి. అయితే అందులో 80 వార్డులు ఏకగ్రీవం కావటంతో 2647 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

9 కార్పొరేషన్లలో 325 వార్డులు ఉన్నాయి. అందులో ఒక వార్డులో ఏకగ్రీవం కావటంతో 324 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

మొత్తం 12900 అభ్యర్థులు బరిలో నిలిచారు. 7961 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు.

Image copyright fb/trs party

డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత, లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఈ మున్సిపల్ ఎన్నికలకు తోడ్పడింది అని నిపుణులు చెబుతున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 46.87 శాతం ఓట్లతో 88 సీట్లు గెలవగా కాంగ్రెస్ 28.43 శాతం ఓట్లతో 19 సీట్లు, బీజేపీ 6.98 ఓట్లతో 1 సీటు, ఎంఐఎం 2.71 ఓట్ల శాతంతో 7 సీట్లు గెలిచాయి.

లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో టీఆఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 గెలిచాయి.

అయితే మొదటి నుంచీ, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు.

గత ఏడాది నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా మొత్తం 32 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

Image copyright bjptelangana
చిత్రం శీర్షిక కె.లక్ష్మణ్

అయితే, బీజేపీ ఓటు శాతం గతంలో కంటే పెరిగింది అని నిపుణులు చెబుతున్నారు.

బీబీసీతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ "ఈ ఎన్నికలు టీఆర్ఎస్‌కు హెచ్చరిక. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్‌గా పోటీ చేసిన పార్టీ బీజేపీ ఒక్కటే. అమన్‌గల్, మక్తల్, తుక్కుగూడలో బిజెపి సొంతంగానే గెలిచింది. చాలా చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో గణనీయమైన సంఖ్యలో వార్డులు గెలుచుకున్నాం. రాష్ట్రంలో నాలుగైదు మినహాయిస్తే ఇప్పుడు మొత్తం 120 మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రాతినిధ్యం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంటే, బీజెపి గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది" అని చెప్పారు.

రంగారెడ్డి జిల్లాలోని అమన్‌గల్ మున్సిపాలిటీలో 15 వార్డుల్లో బీజేపీ 12 , టీఆర్ఎస్ 2 గెలుచుకున్నాయి.

తుక్కుగూడ లోని 15 వార్డుల్లో బీజేపీ 9 గెలుచుకోగా, టీఆర్ఎస్ 5 వార్డులు దక్కించుకుంది.

2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 1399 వార్డుల్లో 745 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 122 గెలుచుకుంది. 150 డివిజన్లలో 109 చోట్ల పోటీ చేసి 10 చోట్ల విజయం సాధించింది.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2727 వార్డుల్లో 2025 చోట్ల బరిలో నిలిచింది.

అయితే, టీఆర్ఎస్ విజయం ప్రజల విజయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

"తెలంగాణలోని సెక్యులర్ పాలన, అభివృద్ధిని మెచ్చి రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్‌ను గెలిపించారు" అని కేసీఆర్ అన్నారు.

"ఇది మామూలు విజయం కాదు. ఆలిండియా రికార్డ్‌. మున్సిపల్‌ ఎన్నికలను ఆపడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కోర్టులకు వెళ్లారు. ఎన్నో అవాంతరాల తర్వాత ఎన్నికలు జరిగినా, ప్రజలు ముక్తకంఠంతో తీర్పు చెప్పారు" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: దిల్లీ హింస: ‘1984 అల్లర్ల మాదిరి కాకూడదు.. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి’ - దిల్లీ హైకోర్టు

దిల్లీ హింస: అల్లర్ల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారా.. రాష్ట్ర పరిధిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవా

పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది

దిల్లీ హింస వెనక కుట్ర ఉందన్న సోనియా గాంధీ; 20కి చేరిన మృతులు

బంగారం ధరలు ఏ రోజుకి ఆరోజు కాదు.. ఏ పూటకి ఆ పూటే మారిపోతున్నాయా

దిల్లీ హింస: హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ చనిపోయాడని తెలీక, ఆయన కోసం ఎదురుచూస్తున్న భార్య

ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన