నరేశ్ vs రాజశేఖర్, జీవిత: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదం - ‘మా’లో ఏం జరుగుతోంది? సమస్య ఎక్కడ మొదలైంది?

  • 29 జనవరి 2020
నరేశ్, రాజశేఖర్

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌(మా)లో ఎప్పటికప్పుడు వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా 'మా' అధ్యక్షుడు నరేష్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, కార్యదర్శి జీవితల మధ్య వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. నరేష్‌పై ఫిర్యాదు చేస్తూ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొందరు 'మా' క్రమశిక్షణ కమిటీకి ఒక లేఖ రాశారని తెలుస్తోంది.

ఈ వివాదంపై 'మా' కార్యదర్శి జీవిత రాజశేఖర్ బీబీసీతో మాట్లాడుతూ.. "సంస్థలో సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. కానీ, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌కు ఉన్న ప్రధాన అభ్యంతరం ఏంటంటే.. సంస్థకు సంబంధించిన అనేక విషయాల్లో ఎవరినీ సంప్రదించకుండా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా ఒకటి రెండు సార్లు కాదు, చాలాసార్లు జరిగింది. ఇవే విషయాలను తెలియజేస్తూ ఒక లేఖ రాసి ఉపాధ్యక్షుడి పదవి నుంచి రాజశేఖర్‌గారు రాజీనామా చేశారు. ఇప్పటికి కూడా మేము కోరుకునేది.. 'మా'కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ని సంప్రదించి వారి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నదే" అని తెలిపారు. అసోసియేషన్ నిబంధనలను సరిగ్గా అనుసరించకపోవటం, నిర్ణయాలను సరైన రీతిలో అమలు చేయకపోవటం కూడా నరేష్‌గారి పై ఉన్న మరో ఫిర్యాదు అని జీవిత చెప్పారు.

2019‌ మార్చ్‌లో జరిగిన అసోసియేషన్ ఎన్నికల తరువాత అధ్యక్షుడిగా నరేష్‌, ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్‌, కార్యదర్శి‌గా జీవిత ఎన్నికయ్యారు. అయితే అదే ఏడాది అక్టోబర్‌లో అసోసియేషన్‌లో ఉన్న గొడవలు బయట పడ్డాయి. సోషల్ మీడియా వేదికగా నరేష్, జీవితతో పాటు కొంత మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా తమ తమ అభిప్రాయాలు, సమస్యలు తెలియజేస్తూ పోస్టులు పెట్టారు.

జీవిత రాజశేఖర్ విడుదల చేసిన ఒక వీడియో ప్రకారం.. ''కార్యవర్గ సభ్యురాలైన హేమతో పాటు మరికొందరు కలిసి 'మా'లో ఉన్న అభిప్రాయభేదాలను తొలగించేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించమని కోరారు. ఇదే విషయాన్ని నరేష్ దృష్టికి తీసుకువెళ్లి సమావేశానికి సమయం నిర్ణయించమని జీవిత అడిగారు. కానీ, నరేష్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ కలిసి మాట్లాడుకొని ఒక సమయం నిర్ణయించి, ఆ సమావేశానికి రమ్మన్ని నరేష్‌ను పిలిచారు. కానీ, నరేష్ దానికి హాజరు కాలేదు. అందరూ వచ్చారు కాబట్టి అదో ఫ్రెండ్లీ మీటింగ్‌లా ఉంటుందని, ఎగ్జిక్యూటివ్ సభ్యులు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా ఉంటుందని భావించి ఆ సమావేశాన్ని కొనసాగించాము. కానీ, ఆ సమావేశంలో రసాభాస జరిగింది. నరేష్‌గారికి అనుకూలంగా ఉండేవారు ఆ సమావేశం జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరుచూరి గోపాలకృష్ణగారు సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు" అని ఆ వీడియోలో జీవిత వివరించారు.

Image copyright MOvie artistes association

అయితే ఈ సమావేశంపై తన అభిప్రాయం తెలియజేస్తూ నరేష్ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. "నాకు ఒక అత్యవసర జనరల్ బాడీ మీటింగ్ అంటూ ఒక లేఖ అందింది. అయితే నిబంధనల ప్రకారం అలాంటి సమావేశం నిర్వహించి పిలిచే హక్కు నాకుంటుంది. అలాంటిది ఆ సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారన్న ఆలోచన నాకొచ్చింది. అందుకే ఆ జనరల్ బాడీ మీటింగ్ చెల్లదని నేను చెప్పాను. అయితే అది కార్యవర్గ సమావేశం కాదని, కేవలం ఫ్రెండ్లీ మీటింగ్ అని నాకు చెప్పారు. అలా అయితే దానికి ఒక అధ్యక్షుడిగా నేను ఉండాల్సిన అవసరం లేదనిపించి, నా షూటింగ్‌కి వెళ్లిపోయాను. ఆ తరువాత మళ్లీ అది జనరల్ బాడీ మీటింగ్ అని నాతో చెప్పారు. ఇదంతా కావాలని చేసినట్టు అనిపించింది" అని నరేష్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ వేడుకలో రాజశేఖర్ 'మా' పనితీరు పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత ఉపాధ్యక్షుడిగా ఆయన రాజీనామా చేశారు. ఆయన్ని సంప్రదించినప్పుడు ఆ పరిణామాలపై బీబీసీతో ఈ అంశం పై మాట్లాడేందుకు ఇష్టపడలేదు. డైరీ ఆవిష్కరణ వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ, మార్చ్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఒక సినిమా కూడా చేయకుండా 'మా' కోసం పని చేస్తునందుకు తన ఇంట్లో కూడా సమస్యలు వచ్చాయని చెప్పారు. "సినిమాలలో హీరోలాగా నిజజీవితంలో నిజాయతీగా పని చేస్తుంటే ఇక్కడ తొక్కేస్తున్నారు. అసోసియేషన్‌లో ఫ్రాంక్‌గా ఏ వ్యవహారం జరగడం లేదు. నేను నిజాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా సరైన మార్గంలో జరగాలి," అంటూ వేడుక మధ్యలోనే ఆయన వెళ్ళిపోయారు.

అయితే ఈ పద్ధతి సరి కాదని, రాజశేఖర్ ప్రవర్తనను ఖండిస్తున్నట్లు వేదిక మీద ఉన్న 'మా' స్థాపకుడు చిరంజీవి తెలిపారు. "మా అసోసియేషన్‌ను ముందుకు తీసుకొని వెళ్ళడానికి అందరూ తోడ్పడాలి. రాజశేఖర్ ప్రవర్తన ప్రీ ప్లాన్డ్‌గా వేడుకను రసాభాస చేయడానికే వచ్చినట్టు ఉంది" అన్నారు.

Image copyright Movie Artistes Association

అయితే 'మా' అసోసియేషన్‌లో గొడవలు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నపుడు నరేష్, శివాజీ రాజా మధ్య అనేక సందర్భాలలో వివాదాలు తలెత్తాయి.

ఆ తరువాత 2019 మార్చిలో 26 మంది ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అయితే అందులో కూడా రెండు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తున్నారని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యవర్గం ఇంకా ఏడాది పాటు కొనసాగుతుంది.

Image copyright MOvie Artistes Association

ప్రస్తుతం 'మా' అధ్యక్షుడు నరేష్‌పైన కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే అందులో నరేష్‌పై నిధులు దుర్వినియోగం చేశారని కూడా ఆరోపించినట్లు కొందరు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అయితే అది అవాస్తవం అని జీవిత వివరించారు. "నిధులు దుర్వినియోగం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిధులు ఖర్చు చేయడానికి కార్యదర్శి సంతకం కూడా కావాల్సి ఉంటుంది" అన్నారు.

క్రమశిక్షణ కమిటీలో చిరంజీవి, మురళీ మోహన్, మోహన్ బాబు, కృష్ణం రాజు, జయ సుధ ఉన్నారని జీవిత తెలిపారు. సభ్యుల ఫిర్యాదుపై ఆ కమిటీ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం

కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా

ఈ కొండల కింద టన్నుల కొద్దీ బంగారం...

'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?

టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020: భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా

మహిళా క్రికెట్ ప్రపంచ కప్: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్

రాజస్థాన్‌లో దళిత యువకులపై దాడి: 'మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు'

వి-అన్‌బీటబుల్: అమెరికన్ టీవీ టాలెంట్ షో ఫైనల్స్ గెలిచిన ముంబయి డాన్సర్లు