కునాల్ కమ్రాను నిషేధించిన ఎయిర్‌లైన్స్.. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి

  • జాహ్నవీ మూలే
  • బీబీసీ ప్రతినిధి
కునాల్ కమ్రా, అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

ఓ కమెడియన్, ఓ న్యూస్ యాంకర్, ఓ విమానయాన సంస్థ భారత్‌లో సోషల్ మీడియా వేదికలపై చర్చలకు కేంద్రంగా మారాయి.

రిపబ్లిక్ న్యూస్ చానల్ నడుపుతున్న జర్నలిస్టు అర్ణబ్ గోస్వామితో వాదనకు దిగినందుకు రెండు విమానయాన సంస్థలు కమెడియన్ కునాల్ కమ్రాపై నిషేధం కూడా విధించాయి.

అయితే, వివాదంపై వీళ్లిద్దరూ ఏం చెబుతున్నారు? ఎయిర్‌లైన్స్ సంస్థలు ఏం చర్యలు తీసుకున్నాయి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఓవైపు, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై తీవ్రంగా విరుచుకుపడే జర్నలిస్టుగా గుర్తింపు పొందిన గోస్వామి.. తరచుగా అనేక వర్తమాన అంశాలపై తనదైన తీర్పులనిస్తూ ఉంటారు. మరోవైపు, కమ్రాకు బీజేపీ తీరును విమర్శించే వ్యక్తిగా పేరుంది.

వీళ్లిద్దరూ ఇటీవలే ఇండిగో విమానంలో ముంబయి నుంచి లఖ్‌నవూకు ప్రయాణించారు. గోస్వామితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో చెబుతూ కమ్రా ఓ వీడియో పోస్ట్ చేశారు.

"మాట్లాడుకుందాం అని ఆయనను చాలా గౌరవంగా అడిగాను. కానీ, తాను ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఆయన నటించారు. జర్నలిజం గురించి అనేకసార్లు ఆయనను ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత గోస్వామిని ఆయన శైలిలోనే 'ద నేషన్ వాంట్స్ టూ నో' అంటూ విమర్శిస్తూ కమ్రా వీడియో పోస్ట్ చేశారు. అర్ణబ్ ఓ పిరికి జర్నలిస్టా" అని ఆ వీడియోలో ప్రశ్నించారు కమ్రా.

ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇది జరుగుతున్నంత సేపూ గోస్వామి నిశ్శబ్దంగా ఉండటం ఆ వీడియోలో కనిపించింది.

ఫొటో సోర్స్, IndiGo/Twitter

ఆ సాయంత్రం, ఇండిగో సంస్థ విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పురిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. కునాల్ కమ్రాపై ఆరు నెలల పాటు తమ సంస్థ నిషేధం విధిస్తోందని, విమానంలో ఆయన ప్రవర్తన ఆమోదనీయం కాదని పేర్కొంది.

దీనిపై మంత్రి వెంటనే సమాధానమిచ్చారు. ఇతర విమానయాన సంస్థలు కూడా దీన్ని అమలుచేయాలని సూచించారు. దీంతో ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా వెంటనే చర్యలు తీసుకుంది. ఇప్పుడు స్పైస్‌జెట్ కూడా కమ్రాపై ఆరు నెలల నిషేధం విధించింది.

ఫొటో సోర్స్, Getty Images

విమానయాన సంస్థలు ఇలా నిషేధం విధించొచ్చా?

ప్రయాణ సమయంలో ఆమోదనీయం కాని ప్రవర్తనను ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 డాక్యుమెంట్ వివరిస్తుంది.

రూల్ 23: ఏ వ్యక్తీ కూడా విమాన ప్రయాణ సమయంలో (ఎ) మరొకరిని శారీరకంగా గానీ మాటలతో గానీ హానిచేయడం, భయపెట్టడం చేయకూడదు. (బి) ఆస్తులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయకూడదు లేదా నష్టం కలిగించకూడదు. (సి) ఆల్కహాల్ ఉన్న పానీయాలు, డ్రగ్స్ తీసుకోకూడదు. ఇది విమానం లేదా వ్యక్తుల భద్రతకే ప్రమాదం కావచ్చు లేదా విమానయాన నిబంధనలకు, క్రమశిక్షణకు విఘాతం కలిగించవచ్చు.

ఇలాంటి సందర్భం ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనను అన్ని విమానయాన సంస్థలు నిషేధించాయి. దీంతో 2017లో ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించింది.

విమాన ప్రయాణం సమయంలో అవాంఛిత ప్రవర్తనను రివైజ్డ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ (సీఏఆర్)లో మూడు రకాలుగా వర్గీకరించారు. అవి.. .అవాంఛిత మాటలతో బాధించడం, శారీరకంగా హింసించడం, ప్రాణహాని కలిగేలా బెదిరించడం.

సైగలు చేయడం, మాటలతో వేధించడం వంటివి లెవల్ 1 నేరం కిందకు వస్తాయి. దీనికి కారణమైనవారిని మూడు నెలల పాటు నిషేధించవచ్చు. లెవల్ 2 నేరం చేసిన వారికి ఆరు నెలల నిషేధం, లెవల్ 3 నేరానికి పాల్పడ్డవారిపై కనీసం రెండేళ్ల నుంచి ఎంతకాలమైనా నిషేధం విధించేందుకు ఈ నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి.

నిషేధం విధించడంపై నిర్ణయాన్ని విమానయాన సంస్థ నియమించిన ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ తీసుకుంటుంది. దీనికి రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి నేతృత్వం వహిస్తారు. దీనిలో ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కూడా ఉంటారు. వీరు నెలలోపు విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించాలని నిబంధనలు చెబుతున్నాయి.

కానీ, ఓ సంస్థ ఓ ప్రయాణికుడిపై నిషేధం విధిస్తే, ఇతర సంస్థలు కూడా దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, kunalkamra88/twitter

విమానయాన సంస్థ పరిధులు దాటి ప్రవర్తించిందా?

కునాల్ కమ్రా విషయంలో విమానయాన సంస్థలు పరిధులు దాటి శిక్షలు వేస్తున్నాయని కొందరు నిపుణులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

బ్యాక్ గ్రౌండ్‌ ఎనౌన్స్‌మెంట్ జరుగుతుండగానే కమ్రా.. అర్ణబ్‌ను విమర్శించడం వీడియోలో కనిపిస్తున్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి.

"ఒకవేళ కమ్రా ఎనౌన్స్‌మెంట్ జరుగుతుండగానే మాట్లాడితే, ఇతర ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేశారా? సిబ్బంది ఫిర్యాదు చేశారా? ప్రయాణం ముగిసిన తర్వాత పైలట్ ఈ విషయాన్ని ప్రస్తావించారా? అర్ణబ్‌ను అడిగిన ప్రశ్నలు ఆయనను భయపెట్టేవిగా, అమర్యాదగా ఉండి ఉంటాయని వ్యక్తిగతంగా నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అది అమర్యాదకర ప్రవర్తనే అయినా కూడా అది లెవల్ 1 నేరం కిందకు వస్తుంది. దీనికి మూడు నెలల పాటు నిషేధం విధించాలి" అని ఏవియేషన్ సేఫ్టీ యాక్టివిస్ట్ యశ్వంత్ షెనాయ్ అన్నారు.

‘‘ప్రయాణికుల ప్రవర్తన భద్రతకు ముప్పు అని భావించే ఇదే డీజీసీఏ... ఇంజిన్ల మోడళ్లలో లోపాలున్నా విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలకు మాత్రం అనుమతిస్తోంది. కమ్రాపై చాలా వేగంగా చర్య తీసుకున్నారు. మంత్రి కూడా దీనిలో జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది విమానయాన సంస్థ ఓ ఘటనపై తీసుకున్న చర్యగా కాకుండా, ఒత్తిడితో తీసుకున్నట్లుగా కనిపిస్తోంది’’ అని ఏవియేషన్ అధికారులను విమర్శిస్తూ షెనాయ్ వ్యాఖ్యానించారు.

దీనికి అనుసరించిన విధానాన్ని, మంత్రి జోక్యం ఉందని భావిస్తుండటంతో ఆయన పాత్రను వెల్లడించాలంటూ సాకేత్ గోఖలే అనే మరో ఉద్యమకర్త సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తు కూడా దాఖలు చేశారు.

అయితే, ఈ అంశంలో సోషల్ మీడియాలో రెండు వైపులనూ విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)