జాను సినిమా రివ్యూ: ఈ రీమేక్ చిత్రం తమిళ '96'లోని ఒరిజినల్ ఫీల్ క్యారీ చేయగలిగిందా?
- శతపత్రమంజరి
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, DilRaju/Facebook
తమిళంలో మోడ్రన్ క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకున్న '96' సినిమాని తెలుగులో 'జాను' అనే పేరుతో రీమేక్ చేశారు.
తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష తమ నటనా ప్రావీణ్యంతో ప్రాణం పోసిన జానకి, రామ్ పాత్రలను తెలుగులో సమంత, శర్వానంద్ పోషించారు. '96' చిత్ర దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెలుగు'జాను'కు కూడా దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌తో పాటు మేజర్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చెయ్యడం,ట్రైలర్,మ్యూజిక్,నటీనటుల ఫస్ట్ లుక్... అన్నీ ఒరిజినల్ ఫీల్‌ని క్యారీ చెయ్యడంతో ఈ సినిమాపై ఫీల్ గుడ్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి 'జాను' సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎంతవరకు ఆ ఫీల్ నిలబెట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
ఫొటో సోర్స్, DilRaju/Facebook
కథ:
రామచంద్ర.కె (శర్వానంద్) కెరియర్ పరంగా ఒక ట్రావెల్ ఫొటోగ్రాఫర్.ఒక టూర్లో భాగంగా అతను తాను పదో తరగతి వరకు చదువుకున్న వైజాగ్ వెళ్తాడు. తను హైస్కూల్ వరకు చదువుకున్న పాఠశాలకు వెళ్ళి పాత జ్ఞాపకాలన్నింటిని గుర్తుచేసుకుంటాడు.
ఒక్కసారిగా తన చిన్ననాటి స్నేహితులందరినీ కలుసుకోవాలనే ఆలోచన పుట్టి టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూపులో చేరి రీయూనియన్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఎంట్రీ అవుతుంది 'జాను'అలియాస్ ఎస్. జానకి (సమంత). ఇంతకీ జాను ఎవరు? రామచంద్ర-జానులకు మధ్య సంబంధం ఏమిటీ? ఆ జంట తమ మధ్య నడిచే మ్యాజికల్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేశారు? చివరకు వారి కథ ఏమయ్యింది?
ఫొటో సోర్స్, DilRaju/Facebook
కథనం-విశ్లేషణ:
సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం అని చెప్పడానికి ఇటీవల కాలంలో చెప్పుకోదగిన ఉదాహరణ '96'సినిమా. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుందీ సినిమా.
ప్రేమకథలను ప్రేమించే వాళ్లకు 'జాను'సినిమా ఒక మంచి జ్ఞాపకం. ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో ప్రేమలో పడతారు. ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ వలన విడిపోయిన ప్రేమికులు పదిహేనేళ్ల తరువాత కలిసినప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతలా తపించిపోయారో... ప్రతి ఫ్రేములో తీర్చిదిద్దాడు దర్శకుడు.
ప్రతి సన్నివేశాన్ని ఎత్తుగడను ఎంత హుందాగా ఎత్తుకున్నాడో ముగింపును అంతే అందంగా మలిచారయన. శర్వానంద్, సమంతల నటన... కెమెరా పనితనం, నేపథ్య సంగీతం అన్నీ కలిసి 'జాను' ని మంచి సినిమాగా నిలబెట్టాయని చెప్పవచ్చు. సినిమా మొదలైనప్పటి నుండి అంతర్లీనంగా సన్నటి విషాద రేఖను కనబరుస్తూ అప్రయత్నంగా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించిన దర్శకుడు... కథ క్లైమాక్స్ కి చేరేసరికి భావోద్వేగాలు పతాక స్థాయికి చేర్చి మోయలేనంత హృదయభారం కలిగించడంలో మంచి ప్రతిభ కనబరిచాడు.
అయితే, దర్శకుడు ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. కానీ, ఈ ప్రేమ కథను ఇలాగే చెప్పాలన్న దర్శకుడి కన్విక్షన్ అర్థమైనప్పటికీ కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరీ నెమ్మదించి బోర్ కొట్టిస్తుంది. వైజాగ్ లో పెరిగిన హీరోయిన్ ఫ్రెండ్ తెలంగాణ భాషలో మాట్లాడడం, 2004లో స్కూల్ అమ్మాయి ఎప్పుడో ఎనభయవ దశకంలోని పాటలు పాడడం లాంటివి ఇల్లాజికల్ గా అనిపిస్తాయి.
ఫొటో సోర్స్, youtube grab
ఫీల్ గుడ్ దర్శకుడు:
'జాను' సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటంటే.. దీన్ని ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేతుల్లో పెట్టడమే. అందుకే అతడు ఏ ఒక్కచోట తడబడకుండా ఫ్రేమ్ టూ ఫ్రేమ్ తీర్చిదిద్దాడు.పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా ఎట్ సేమ్ టైం ఎక్కడా హద్దులు దాటకుండా దర్శకుడు నియంత్రణ పాటించిన తీరు అద్భుతం. అతడిలో మంచి భావుకత కనపడుతుంది.
ఫొటో సోర్స్, DilRaju/Facebook
మెచ్యూర్డ్ పెయిర్:
ప్రేమ కథ అనగానే అదేదో చిన్నపిల్లలు వ్యవహారంలా కాకుండా..మంచి అనుభూతిని కలిగించే సినిమాలా మలచడంలో శర్వానంద్, సమంతలదే పెద్ద పీట. మాతృకలో విజయ్ సేతుపతి లాంటి మంచి నటుడు చేసిన పాత్రను మరొకరు చేసి ఒప్పించడం మామూలు విషయం కాదు. కానీ, శర్వానంద్ ఈ విషయంలో ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని చోట్ల విజయ్ సేతుపతిని అనుకరించినట్లుగా అనిపించినా... చాలా చోట్ల తన సహజ సిద్ధమైన హావభావాలతో సినిమాను నిలబెట్టాడని చెప్పవచ్చు. సమంత జాను పాత్రకు జీవం పోసింది.ముఖ్యంగా, క్లైమాక్స్ సన్నివేశాలలో ఆమె నటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. వర్ష బొల్లమ్మా శర్వానంద్ శిష్యురాలి పాత్రలో గుర్తుంటుంది. వెన్నెల కిశోర్, శరణ్య, తాగుబోతు రమేష్, రఘుబాబు... తమ తమ పరిధిలో బాగా నటించారు.
సాంకేతిక వర్గం సినిమాకు గొప్ప బలంగా చెప్పవచ్చు. సినిమాలో భారాన్నంతా పతాక స్థాయిలో పెంచి నిలబెట్టింది గోవింద్ వసంత సంగీతం. నేపథ్య సంగీతం మనసును కదిలిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. మహేంద్రన్ జయరాజు విజువల్స్ కూడా బాగున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఒక వైపు వైరస్, మరో వైపు భూకంపం... పెళ్లిళ్లకూ నో పర్మిషన్
- విరాట్ కోహ్లీ మరో అయిదారేళ్లు ఆడితే... ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి: కపిల్ దేవ్
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)