పుల్వామా దాడి: అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చేసిన హామీలు నెరవేరాయా?

  • 14 ఫిబ్రవరి 2020
పుల్వామా Image copyright Getty Images

ఏడాది క్రితం పుల్వామా మిలిటెంట్ దాడిలో చనిపోయిన జవాన్ల శవాలు రాజస్థాన్ చేరుకోగానే, అందరి కళ్లూ చెమర్చాయి.

ఆ విషాద వాతావరణంలో ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు ఓదార్చడానికి ఎన్నో వాగ్దానాలు చేశాయి. వాటిలో కొన్ని హామీలు ఇప్పటికీ మాటలుగానే మిగిలాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను పట్టించుకోకుండా ఉన్నాయి.

పుల్వామాలో జరిగిన దాడిలో రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు జవాన్లు మృతిచెందారు. వారిలో జైపూర్ జిల్లా బాస్డీకి చెందిన రోహితాంష్ లాంబా, భరత్ పూర్ జిల్లాలో సుందర్‌వాలీకి చెందిన జీత్‌రాం గుర్జర్ కూడా ఉన్నారు.

ఈ ఇద్దరు జవాన్ల కుటుంబ సభ్యులు బీబీసీతో రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చిందని, కానీ అది ఇప్పటివరకూ నెరవేరలేదని చెబుతున్నారు.

చిత్రం శీర్షిక రోహితాష్ కుటుంబం

ఉద్యోగం కోసం ఎదురుచూపులు

జైపూర్ జిల్లాలో గుల్-ఓ-గుల్జార్ జాతీయ రహదారి నుంచి విడిపోయి ఒక రోడ్డు పొలాల్లో గోవింద్ పూర్ బాస్డీ వెళ్తుంది. అక్కడ చాలామంది వ్యవసాయం చేసుకుంటారు. చుట్టూ పచ్చటి పొలాలు కనిపిస్తాయి. వాటి మధ్య ఒక అమరవీరుల స్మారకం నిర్మించాలనే పని అరకొరగా మిగిలిపోయి ఉంది.

ఆ గ్రామం బయట రోహితాష్ లాంబా ఇల్లు ఉంది. లాంబా తమ్ముడు జితేంద్ర ప్రభుత్వ వైఖరితో చాలా నిరాశలో ఉన్నాడు. "అప్పుడు అందరూ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. మా వదిన పెద్దగా చదువుకోకపోవడంతో ఆ ఉద్యోగం నాకు ఇచ్చేందుకు ఇంట్లో అందరూ అంగీకరించారు. కానీ అది జరగలేదు. మేం అప్పటి నుంచీ మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాం. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది" అన్నాడు.

ఈ జవాన్ల కుటుంబాలు ప్రభుత్వం మీదే కాదు, సమాజం పట్ల కూడా కోపంగా ఉన్నాయి. దాని గురించి చెబుతూ రోహితాష్ లాంబా భార్య మంజు కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ఆయన నాకు నెలన్నర బిడ్డను వదిలిపోయాడు. అప్పటికి ఆయనకు 22 ఏళ్లే. మేం బతకాలంటే ఎలా బతకాలి. ఆయన పనిచేసిన దగ్గర నుంచి అధికారులు ఎవరూ వచ్చి మీరు ఎలా ఉన్నారు అని ఇప్పటివరకూ అడగలేదు. అజ్మేర్ నుంచి మాత్రం అధికారులు వచ్చేవారు. మా కష్టసుఖాలు తెలుసుకునేవారు" అని చెప్పారు.

Image copyright NarayanBareth/BBC
చిత్రం శీర్షిక రోహితాష్ భార్య మంజు

బాగోగులు పట్టించుకునేవారే లేరు

"పెళ్లైన ఏడాదిన్నరకే ఆయన చనిపోవడంతో, నాకు ధైర్యం చెప్పడానికి ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు, మీరు ఎలా ఉన్నారని ఎవరూ అడగడం లేదు. నా మరిదికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుంది. దానికోసం చాలాసార్లు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు. నేను 20 సార్లు జైపూర్ వెళ్లొచ్చాను. కానీ ఎలాంటి సమాచారం రాలేదు. ఏం చేయాలి?" అన్నారు.

రోహితాష్ తండ్రి బాబూలాల్ "మాకున్న భూమి తక్కువ. దీనికి నీళ్లు కూడా లేవు. మా కుటుంబానికి తనొక్కడే అండగా ఉండేవాడు. ఒక తండ్రి కొడుకు పాడె మోయడం కంటే ఘోరం ఏముంటుంది. అప్పుడు అందరూ మీకు మేమున్నాం అని చెప్పారు. కానీ, ఇప్పుడు మా దగ్గరకు వచ్చేవారే లేరు" అన్నారు.

చిత్రం శీర్షిక రోహితాష్ తల్లి

కన్నీళ్లే సమాధానం

రోహితాష్ లాంబా 2011లో సీఆర్పీఎఫ్‌కు సెలక్ట్ అయ్యాడు. 2013లో డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆ రోజు కొడుకును యూనిఫాంలో చూసి తల్లి ఘీసీ దేవి చాలా పొంగిపోయారు. ఇప్పడు చనిపోయిన బిడ్డను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఇంటి బాధ్యతలు రోహితాష్ తమ్ముడు జితేంద్రపై పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో అతడు చాలా విసిగిపోయాడు. నేతల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో, తన అన్న చనిపోయిన ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేయాలని ఆ కుటుంబం అనుకుంటోంది.

చిత్రం శీర్షిక రోహితాష్ తమ్ముడు జితేంద్ర

ఇంకా ఎన్నిరోజులో...

అప్పుడు లాంబా ఇంటికి వచ్చి ఓదార్చిన నేతల్లో రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ ఖచారియావాస్ కూడా ఉన్నారు.

ఆయన బీబీసీతో "రాజస్థాన్‌లో అమరుల కుటుంబాలకు మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ప్యాకేజ్ ఇచ్చాం. లాంబా కుటుంబంలోని ఒక సభ్యుడికి ఉద్యోగం ఇవ్వడానికి కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఇప్పటివరకూ చనిపోయిన జవాన్ భార్య, లేదా వారి పిల్లలకు మాత్రమే ఉద్యోగం ఇచ్చే నిబంధనలు ఉన్నాయి. అందుకే జితేంద్రకు ఉద్యోగం ఇవ్వడానికి రూల్స్ మార్చే ప్రక్రియ ప్రారంభించాం. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది" అన్నారు.

వారు ఉంటున్న ఇంటి బయట వేలాడదీసిన రోహితాష్ పోస్టర్ ఆ ఇంట్లో ఎవరో సైనికుడు మిలిటెంట్ దాడిలో చనిపోయానే విషయం అందరికీ తెలిసేలా చేస్తుంది.

భరత్‌పూర్ జిల్లా సుందరవాలీ గ్రామంలో జీత్‌రాం గత ఏడాది ఇదే సమయంలో పుల్వామా మిలిటెంట్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.

జీత్‌రాం కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదనే చెబుతున్నారు.

అతడి తండ్రి రాధేశ్యామ్ వ్యవసాయం చేస్తారు. జీత్‌రాం తమ్ముడు విక్రమ్ ఇప్పుడు ఇంట్లో అన్నీ చూసుకుంటున్నాడు. అతడు బీబీసీతో "ప్రభుత్వం చాలా వాగ్దానాలు పూర్తి చేసింది. కానీ నా ఉద్యోగం విషయం మాత్రం ఇంకా అలాగే ఉంది" అన్నాడు.

చిత్రం శీర్షిక జీత్‌రాం తల్లి గోపా

"ప్రభుత్వం అప్పుడు ప్రకటించిన ప్యాకేజ్ నుంచి ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంది. కానీ ఏవైనా విద్యా సంస్థలకు అమరుల పేర్లు పెడతామన్న వాగ్దానం ఇప్పటికీ పూర్తి చేయలేదు" అన్నాడు.

విక్రమ్, అతడి కుటుంబం ఇప్పుడు తమ సొంత ఖర్చులతో జీత్‌రాం కోసం ఒక స్మారకాన్ని నిర్మిస్తోంది.

పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు రాజస్థాన్‌లో స్వగ్రామానికి చేరుకున్నప్పుడు చాలామంది నేతలు వచ్చారు. భరత్‌పూర్‌లో జీత్‌రాం స్మారాకన్ని నిర్మించడానికి పది లక్షలు ఇస్తామని అప్పుడు బీజేపీ ఎంపీ బహదూర్ సింగ్ కోలీ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఆ మొత్తం వారికి అందలేదు. దానికోసం ఎవరిని అడగాలో విక్రమ్‌కు తెలీడం లేదు.

జీత్‌రాంకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుమన్ నాలుగేళ్లు, చిన్న పాపకు అతడు చనిపోయే సమయానికి 4 నెలలు.

చిత్రం శీర్షిక జీత్‌రాం భార్య సుందరి

జీత్‌రాం భార్య సుందరి బీబీసీతో "నా భర్త అమరుడైన సమయంలో అందరూ వచ్చారు. మాకు పొలం కోసం వ్యవసాయ కనెక్షన్ ఇస్తామని మాట కూడా ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదు" అన్నారు.

జీత్‌రాం గురించి అడిగినప్పుడు తల్లి గోపా కన్నీళ్లతో మౌనంగా ఉండిపోయారు.

సీఆర్పీఎఫ్ జవాన్ జీత్‌రాం గత ఏడాది ఫిబ్రవరి 14న మిలిటెంట్ దాడిలో చనిపోయినప్పుడు చుట్టుపక్కలవారు కుటుంబ సభ్యులకు చాలా ధైర్యం చెప్పారు. ఇప్పుడు కూడా వారిని ఓదారుస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో 16 కొత్త కేసులతో 180కి చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?

కరోనావైరస్: ఈ వీడియోలో కనిపిస్తున్నది తబ్లీగీ జమాత్‌కు చెందినవారేనా? - FactCheck

రోజుల బిడ్డ ఉన్నా.. కరోనావైరస్ సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం

ప్రెస్ రివ్యూ: లక్ష రూపాయలకే ఎమర్జెన్సీ వెంటిలేటర్ తయారు చేసిన హైదరాబాద్ ఐఐటీ అనుబంధ సంస్థ

కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?

ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల‌ కార్మికుల వేదన

కరోనావైరస్: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం తయారుచేసిన మెర్సిడెస్ ఫార్ములా వన్ టీం