కరోనా వైరస్: భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం ఎన్ని కోవిడ్ కేసులు బయటపడ్డాయి?

  • 14 ఫిబ్రవరి 2020
కరోనా వైరస్ Image copyright Getty Images

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఒక ట్వీట్‌ చేస్తూ "దేశ ప్రజలకు, ఆర్థికవ్యవస్థకు కరోనా వైరస్ ఒక పెద్ద ముప్పు అన్నారు.

ప్రభుత్వం ఈ ముప్పును తీవ్రంగా తీసుకోవడం లేదని, సమయానికి చర్యలు తీసుకోవడం అవసరమని సూచించారు.

ఆ తర్వాత రోజు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ ఒక ట్వీట్ చేస్తూ "ప్రభుత్వం కరోనావైరస్‌ను అడ్డుకోడానికి, దానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏర్పాట్లను మానిటర్ చేయడానికి ఒక మంత్రుల బృందాన్ని నియమించిందని" చెప్పారు.

దీనిపై మీడియాతో మాట్లాడిన మంత్రి కరోనావైరస్ వ్యాపించకుండా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకూ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో కూడా వివరించారు.

"భారత్‌ జనవరి 17 నుంచే కరోనా వైరస్‌ను పరిగణనలోకి తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కంటే ముందే ఇది ముందు ముందు అంతర్జాతీయ అత్యవసర స్థితిగా మారవచ్చని మేం ప్రకటించాం. ప్రభుత్వంలో ప్రతి స్థాయిలో ఉన్న మంత్రిత్వశాఖలు, సచివాలయాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కలిసి దీనిని మానిటర్ చేయడం కొనసాగించాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య మంత్రులతో టచ్‌లో ఉన్నాం" అని ఆయన చెప్పారు.

Image copyright TWITTER/DRHARSHVARDHAN

21 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్

"మొదట దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించాం. ప్రారంభంలోనే ఈ విమానాశ్రయాలకు నిపుణుల బృందాలను పంపించాం. తర్వాత దానిని 21 విమానాశ్రయాలకు పెంచాం. సీ-పోర్ట్ దగ్గర కూడా స్క్రీనింగ్ ప్రారంభించాం. చైనా, ఇంగ్లండ్, హాంకాంగ్, సింగపూర్, జపాన్, కొరియా నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం" అని హర్షవర్ధన్ చెప్పారు.

కేంద్రమంత్రి వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 2315 విమానాల్లో వచ్చిన ప్రయాణికులను పరీక్షించారు. 12 పెద్ద 65 చిన్న రేవుల నుంచి వచ్చే వారిని కూడా మానిటర్ చేస్తున్నారు.

ఇప్పటివరకూ చైనా నుంచి వచ్చిన నౌకలు, విమానాల్లో భారత్ చేరిన మొత్తం 5776 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు. ఎన్ఐబీ పుణెలో ల్యాబ్‌లో 1756 శాంపిల్స్ టెస్ట్ చేశారు. వాటిలో కేవలం 3 పాజిటివ్ వచ్చాయి.

నేపాల్‌లో కరోనా వైరస్ మొదటి కేసు వెలుగుచూడగానే, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలను కూడా అలర్ట్ చేశారు. గ్రామస్థాయిలో కూడా స్క్రీనింగ్ ప్రారంభించారు. దానితోపాటు చైనా సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు.

Image copyright TWITTER/DRHARSHVARDHAN

మొత్తం 3 కేసులూ కేరళలోనే

భారత్‌లో ఇప్పటివరకూ 3 ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిని ధ్రువీకరించారు. అన్ని కేసులూ కేరళలోనే బయటపడ్డాయి. బాధితులకు వేరుగా చికిత్సలు అందించారు. ఈ ముగ్గురికీ ఎలాగోలా వుహాన్ పర్యటనతో సంబంధం ఉంది. వారిని పరీక్షించి, పాజిటివ్ రావడంతో చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరీక్షలు నెగటివ్ వచ్చాయి. బాధితుల్లో ఒకరిని డిశ్చార్జ్ కూడా చేశారు. మిగతా ఇద్దరిని కూడా కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు.

ప్రస్తుతం ట్రావెల్ పాలసీలో మార్పులు చేసినట్లు కేంద్ర మంత్రి హర్ష్‌వర్ధన్ చెప్పారు. "ప్రజలు ప్రయాణాలు చేయకుండా అడ్డుకుంటున్నాం. ఇప్పటికే వీసా జారీ చేసినవారికి కూడా వాటిని రద్దు చేశాం. చైనా నుంచి భారత్‌లో పర్యటించే విదేశీ పౌరులకు కూడా వీసా రద్దు చేశాం" అన్నారు.

Image copyright Getty Images

కరోనావైరస్ హెల్ప్ లైన్ ఏర్పాటు

డైమండ్ క్వీన్ క్రూజ్‌లో ప్రయాణిస్తున్న 3700 ప్రయాణికులు, నౌకా సిబ్బందిలో కొందరు భారతీయులు ఉన్నారు. ఆ క్రూయిజ్‌లో 439 మందికి పరీక్షలు చేశారు. వారిలో ఇప్పటివరకూ 174 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారని హర్షవర్ధన్ అన్నారు.

క్రూయిజ్ షిప్‌లో ఉన్న 132 మంది నౌకా సిబ్బందిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని, వారిని అక్కడే ఆపేశామని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా దాదాపు 15991 మందిని పరిశీలనలో ఉంచామని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. వీరిలో సుమారు 497 మందికి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.

"వీరిలో 41 మందిని పూర్తిగా వేరుగా ఉంచారు. అయితే, కొందరిని అందరికీ దూరంగా ఉంచినంత మాత్రాన వారికి వైరస్ పాజిటివ్ అని అనుకోకూడదు" అన్నారు.

ప్రభుత్వం కరోనావైరస్ గురించి ఫిర్యాదులు, సలహాల కోసం ఒక కాల్ సెంటర్ ప్రారంభించింది. దాని నంబర్ 01123978046. ఇది 24 గంటలూ పనిచేస్తుంది.

ఈ హెల్ప్ లైన్‌కు ఇప్పటివరకూ దాదాపు 4 వేల ఫోన్ కాల్స్ వచ్చాయి. వారిలో కొదరు వైరస్ వివరాలు తెలుసుకోగా, మరికొందరు తమ అనారోగ్య సమస్యలు చెప్పారు.

Image copyright Reuters

థర్మల్ స్క్రీనింగ్ అంటే ఏంటి?

థర్మల్ స్క్రీనింగ్ ద్వారా కరోనావైరస్ లేదా అలాంటి ఏ వ్యాధితో ఉన్న బాధితుడినైనా గుర్తించవచ్చు.

నిజానికి థర్మల్ స్క్రీనింగ్‌తో ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి, ఏదైనా వైరస్ వ్యాపించిన వ్యక్తులకు స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ నుంచి వచ్చే తరంగాల వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభవాలు కూడా ఉండవు. అయితే దీనిని నిపుణుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు.

థర్మల్ స్క్రీనింగ్ ప్రక్రియలో ప్రజలు ఒక స్కానర్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆ స్కానర్ వ్యక్తి శరీరంలో ఉష్ణోగ్రత ఆధారంగా అనుమానిత రోగుల గురించి తెలుస్తుంది.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో పోలిస్తే వైరస్ బాధిత వ్యక్తుల శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉంటే అనుమానితులను వైద్య పరీక్షల కోసం పంపించవచ్చు.

దానితోపాటు ఈ థర్మల్ స్కానర్ ఒక ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలా పనిచేస్తుంది. ఆ స్కానర్ నుంచి వెళ్లే వ్యక్తి శరీరంలో ఉన్న వైరస్ ఇన్‌ఫ్రారెడ్ ఫొటోల్లో కనిపిస్తుంది.

వైరస్ ఎక్కువగా లేదా ప్రమాదకర స్థాయిలో ఉంటే వ్యక్తి శరీరం ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది.

Image copyright Magnum Photos

కరోనావైరస్ వ్యాధి పేరు కోవిడ్-19

చైనాలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం కరోనావైరస్‌తో వచ్చే వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా ఓ పేరు పెట్టింది. కోవిడ్-19 అని దీనికి పేరు పెట్టినట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అదనమ్ జీబ్రెయెసస్ ఈ విషయాన్ని జెనీవాలో వెల్లడించారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ప్రజల్ని పొట్టనబెట్టుకుని, వేల మందిని కబళించిన ఈ వైరస్‌పై సాధ్యమైనంత వేంగా ప్రపంచమంతా కలసి పోరాడాలని జీబ్రయెసస్ పిలుపునిచ్చారు.

శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ కరోనా వైరస్‌ల కుటుంబాన్ని 60 ఏళ్ల కిందటే గుర్తించారు. ఇప్పటి వరకూ ఆరు రకాల కరోనా వైరస్ లు గుర్తించారు. కానీ అవన్నీ పక్షుల మీదే ప్రభావం చూపిస్తూ వచ్చాయి. కానీ తాజా బయటపడ్డ కరోనా వైరస్ ఏదోది. ఇద మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందుకే దీనికి 2019 నావెల్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి, మెరుగైన చికిత్స అందించడానికి, అంతర్జాతీయంగా ఈ వ్యాధికి అవసరమైన వ్యాక్సీన్ తయారీ వంటి అన్ని అంశాల్లో ఉపయోగకరంగా ఉండేందుకు ఈ వైరస్ నుంచి వచ్చే వ్యాధికి ఒక పేరు అవసరమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పుకొచ్చింది. అందుకే కరోనా వైరస్ఋతో వచ్చే వ్యాధికి కోవిడ్-19 అని పేరు పెట్టింది.

నిజానికి కరోనావైరస్ అనేది ఓ వైరస్ కుటుంబం పేరు. ఆ కుటుంబం నుంచి పుట్టుకువచ్చిన కొత్త రకం వైరస్ తాజాగా చైనాలో వ్యాపించింది. టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అంతర్జాతీయ కమిటీ దీన్ని సార్స్-సీఓవీ-2గా గుర్తించింది. అయోమయం లేకుండా ఉండేందుకు, ఈ వ్యాధికి ఓ పేరు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతూ వచ్చారు. అంతేకాదు.. కరోనా అన్న పేరు చాలా మంది వ్యక్తులకు ఉంది. దీంతో పాటు కొన్ని నగరాలు, సంస్థలు, ఉత్పత్తులకు కూడా కరోనా అన్న పేరు ఉంది. దీంతో ఈ వైరస్‌కు కొత్త పేరు అవసరమన్న నిర్థరణకు వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

అయితే కొత్తగా పెట్టబోయే పేరు ఏ ఒక్క ప్రాంతానికి, జంతువుకి, వ్యక్తి, సమూహానికి వర్తించకుండా ఉండటం అవసరం. వ్యాధికి సంబంధించిందై, పలికేందుకు వీలుగా కూడా ఉండాలి అని జీబ్రెయెసస్ చెప్పుకొచ్చారు. 'కరోనా', 'వైరస్', 'డిసీజ్' ఆంగ్ల మూడు పదాల్లోని కొన్ని మొదటి అక్షరాలను తీసుకుంటూ, వ్యాధి వ్యాప్తి మొదలైన సంవత్సరం కూడా వచ్చేలా.. కోవిడ్-19 అని పేరు పెట్టారు. డబ్ల్యూహెచ్ఓ‌కు కరోనావైరస్ తొలి కేసు సమాచారం 2019, డిసెంబర్ 31న అందింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్‌‌‌ల కంటే దిగువన

కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు

ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా

స్కేటర్ సాయి సంహిత: "క్రీడల్లోకి రావడానికి అమ్మాయిలు భయపడకూడదు"

వైరల్ వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి

జర్మనీలో రెండుచోట్ల తుపాకీ కాల్పులు, తొమ్మిది మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది బస్సు ప్రయాణికులు మృతి

కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి