‘నా భర్త కొడుతున్నాడు, కాపాడండి’ - దిశ యాప్‌లో కుటుంబ సమస్యల ఫిర్యాదులే అధికం అంటున్న పోలీసులు : ప్రెస్ రివ్యూ

  • 14 ఫిబ్రవరి 2020
దిశ యాప్ Image copyright ANDHRAPRADESHSTATEPOLICE/FACEBOOK
చిత్రం శీర్షిక దిశ యాప్‌లో కుటుంబ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు

ఆపద సమయాల్లో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌లో ఎక్కువగా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది.

విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి భర్తల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, సోదరుని వరుసయ్యే వ్యక్తి వేధిస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి, అలాగే ఓ వ్యక్తి తనను తరచు వేధిస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

వెంటనే స్పందించిన పోలీసులు కుటుంబ సమస్యల విషయంలో కౌన్సిలింగ్ ఇప్పిస్తుండగా.. వేధింపుల విషయంలో తక్షణం వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని బాధితులకు భరోసా కల్పిస్తున్నారని ఈ వార్తలో పేర్కొంది.

అదే సమయంలో యాప్ పని చేస్తోందా లేదా అంటూ రోజుకు సుమారు 2 వేల మంది అందులోని ఫీచర్లను వినియోగిస్తున్నారని కూడా తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉన్న ఈ యాప్ మరో నాలుగైదు రోజుల్లో ఐఓఎస్ ప్లాట్ ఫాంపై కూడా లభించనుందని ఈనాడు తన వార్తలో వెల్లడించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నేర రాజకీయాలు అదుపు దిశగా సుప్రీం కోర్టు మరోసారి కొరడా

నేరస్థులకు టిక్కెట్లెందుకు ?

వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వాళ్లకు టిక్కెట్లెందుకు ఇస్తున్నారంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఏ కారణంతో వారిని ఎంపిక చేశారన్నది వెంటనే తమ వెబ్‌సైట్లలో పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినట్టు ఈ వార్తలో వివరించింది.

వారు చేసిన నేరానికి సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందో కూడా అందులో తెలపాలని కోర్టు ఆదేశించిందని తెలిపింది.

ప్రతి అభ్యర్థి తమ నేర చరిత్ర గురించి ఊరు పేరు లేని పత్రికల్లో ప్రకటనలివ్వడం కాకుండా ప్రముఖ టీవీ ఛానెళ్లలో ప్రైంటైంలో అంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటలలోపు విధిగా మూడు సార్లు తమ నేర చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొన్నట్టు చెప్పుకొచ్చింది.

అలాగే భారీ సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో నామినేషన్ వేసిన వారం రోజుల్లో తమ నేర చరిత్రను వివరిస్తూ ప్రకటనలు ఇవ్వాలని కూడా కోర్టు చెప్పిందని వివరించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేంద్రం చేతుల్లోకి 40 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు !

పౌరులపై నిఘా !

ఇకపై సామాజిక మాధ్యమాల్లో రాజకీయంగా, సామాజికంగా స్వేచ్ఛగా తమ భావాలని వెల్లడించే అవకాశం ఉండకపోవచ్చంటూ నవతెలంగాణ ప్రధాన వార్తగా ప్రచురించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాలకు సంబంధించి త్వరలోనే ఓ కొత్త నియమావళి అమలులోకి రానుందని ఢిల్లీలోని ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించినట్టు తన కథనంలో పేర్కొంది.

అయితే ఈ నియమావళిలో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నట్టు కూడా చెప్పింది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే సుమారు 40 కోట్ల మంది పౌరుల గోప్యతకు భంగం కల్గుతుందని, పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించే విధంగా ఈ నిబంధనలున్నాయని తెలుస్తున్నట్టు ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

Image copyright FACEBOOK/KTR
చిత్రం శీర్షిక జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయ్: కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే- కేటీఆర్

దేశంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ యాక్షన్ సమ్మిట్‌లో చేసిన వ్యాఖ్యలను నమస్తే తెలంగాణ ప్రధానవార్తల్లో ఒకటిగా ప్రచురించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వివిధ ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయని కేటీఆర్ అన్నారని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలన్నీ సాంకేతికంగా ప్రాంతీయ పార్టీలేనని, దేశ వ్యాప్తంగా యంత్రాంగం, ఉనికి ఉన్న జాతీయ పార్టీలు ఏవీ లేవని ఆయన వ్యాఖ్యానించారని ఈ వార్తలో ప్రస్తావించింది. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పారిశ్రామిక రంగంతో పాటు వివిధ సమకాలీన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ వార్తలో పొందుపరచింది.

అలాగే పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నట్టు కూడా ఆయన చెప్పినట్టు నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు

ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్‌లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

హాంకాంగ్‌లో టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి

జపాన్‌ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి బయల్దేరిన అమెరికన్లు

"ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి