'వాలెంటైన్స్ డే' ప్రతిజ్ఞ: ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ

  • 15 ఫిబ్రవరి 2020
ప్రమాణం చేసిన అమ్మాయిలు Image copyright నితేష్ రౌట్

ప్రేమికుల రోజంటే ప్రేమలో ఉన్న యువతీ యువకులకి పండగ రోజు. ఆ రోజు ప్రేమికులు ఒకరితో ఒకరు గడుపుతూ, తమ ప్రేమ బలంగా ఉండాలని, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని వాగ్దానాలు చేసుకుంటూ ఉంటారు.

అయితే ఇందుకు భిన్నంగా మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చాందూర్‌లోని మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ యాజమాన్యం అమ్మాయిల చేత తాము ఎప్పుడూ ప్రేమలో పడమని, ప్రేమ వివాహం చేసుకోమని చెప్పిస్తూ 'వాలెంటైన్స్ డే' ప్రమాణం చేయించింది.

ప్రమాణం:

"నాకు నా తల్లితండ్రుల మీద పూర్తి నమ్మకం ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నేను ఎప్పటికీ ప్రేమలో పడనని, ప్రేమ వివాహం చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. నేను కట్నం అడిగే ఏ వ్యక్తినీ పెళ్లి చేసుకోను. సామాజిక ఒత్తిడికి గురై మా తల్లిదండ్రులు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే, భవిషత్తులో ఒక తల్లిగా నా కొడుక్కి నేను కట్నం తీసుకోను. అలాగే నా కూతురికి పెళ్లి చేస్తే నేను కట్నం ఇవ్వను. నా దేశం ఒక శక్తివంతమైన ఆరోగ్యకరమైన శక్తిగా అవతరించడం కోసం నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను".

కాలేజీలో టీచర్లు పిల్లలతో కట్నం తీసుకునే ఎవరినీ పెళ్లి చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించినప్పటికీ ఈ ప్రతిజ్ఞ వెనక అసలు ఉద్దేశ్యం వారు ఎప్పటికీ ప్రేమ వివాహం చేసుకోకుండా చూడటం అని అర్ధం అవుతోంది.

మేము ప్రేమకి వ్యతిరేకులం కాదు. కానీ వాళ్ళు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి

"మేము ప్రేమకి వ్యతిరేకులం కాదు. ప్రేమ చెడ్డ విషయం అని మేము చెప్పటం లేదు. యుక్త వయస్సులో అమ్మాయిలకి ప్రేమకి, ఆకర్షణకి మధ్య తేడా తెలియదు. ఎవరు మంచో చెడో తేల్చుకునే విచక్షణ వారికి ఉండదు. అందుకే ఈ ప్రతిజ్ఞ చేయించామని కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి చెప్పారు."

"ఈ ప్రమాణం పెద్దవాళ్ళకి కాదు. ఇది కేవలం కాలేజీకి వెళుతూ యుక్త వయస్సులో ఉన్న పిల్లలకి మాత్రమే. ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్, హైదరాబాద్ లో దిశ కేసు , ధామంగావ్ లో పసి పాప హత్య, ఇటీవల హింగింఘాట్ లో చోటు చేసుకున్న సజీవ దహనం ప్రస్తుత సామాజిక పరిస్థితి ఎలా ఉందొ చెబుతున్నాయి".

"ఆధునికత పేరుతొ ఎటువంటి సమాజాన్ని తయారు చేస్తున్నామో అర్ధం కావటం లేదు. దీనికి పరిష్కారం ఏమిటి?"

"ఈ మధ్య నేషనల్ సర్వీస్ స్కీం వాళ్ళు కాలేజీలో 'యువత ముందున్న సవాళ్లు' అనే అంశం పై ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఆ వర్క్ షాప్ లో అమ్మాయిలని చుట్టూ జరుగుతున్న హింసాత్మక ఘటనల గురించి అడిగినపుడు, చాలా మంది తమకి తెలియదని సమాధానం ఇచ్చారు. వాళ్లకి ఎందుకు తెలియటం లేదో మాకు అర్ధం కాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకి పెళ్లి చేయలేరని ఎందుకు అనుకుంటారు? తల్లి తండ్రుల అభిమతాలకి వ్యతిరేకంగా వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?" అని ప్రశ్నించారు.

Image copyright నితేష్ రౌట్

ప్రమాణాలు చేయించడం కన్నా అమ్మాయిలు శక్తివంతంగా అవ్వడం ముఖ్యం

ప్రమాణాలు చేయించడం కన్నా పరిస్థితులను ఎదుర్కొనే విధంగా అమ్మాయిలను తయారు చేయడం ముఖ్యమని, ముక్త చైతన్య అనే జర్నలిస్ట్ అన్నారు.

"ప్రమాణాలు చేయించడం ఏ విధంగాను మహిళల పై జరుగుతున్న హింసకి పరిష్కారం కాదు. ఇది కేవలం కంటి తుడుపు చర్య. ఇలాంటి ప్రమాణాలు నిజంగా మంచి వ్యక్తిని ప్రేమించే అమ్మాయిని అయోమయ పరిస్థితిలోకి నెట్టేస్తాయి. సమస్యకి మూల కారణాలను వెతకాలి".

"మన సమాజంలో మనం లైంగిక విషయాల గురించి అమ్మాయిలతో మాట్లాడం. అమ్మాయిలకి లైంగిక విషయాల పట్ల సరైన అవగాహన కలిగించాలి. లైంగిక అవసరాల పట్ల సరైన అవగాహన ఉంటే వారు తమకి ఎదురయ్యే సమస్యలని తామే పరిష్కరించుకోగలరు. ఎవరికి వారే వారికి తగిన భాగస్వామిని ఎన్నుకోగల్గుతారు".

Image copyright Nitesh raut

వరకట్న వ్యవస్థ ముందు తల దించుకోకండి

ఈ ప్రమాణం ప్రస్తుతం నెలకొన్న సామాజిక పరిస్థితులకి తల వంచి కట్నం ఇవ్వవలసి వస్తే ఇమ్మని సూచిస్తోంది. నిజానికి, ఎట్టి పరిస్థితుల్లోనూ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవద్దని అమ్మాయిలకి అవగాహన కల్పించాలి. సరైన పని చేసేందుకు అమ్మాయిలని ప్రోత్సహించాలి. సమాజం చూసే దృష్టి మార్చాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకి సామాజిక చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ అధ్యక్షురాలు రూపాలి చకాన్కార్ అన్నారు.

"కేవలం ప్రమాణాలు చేయడం వలన ఏమీ జరగదు. సమాజంలో అమ్మాయిల పట్ల ఉన్న దృష్టి కోణం మారాలి. స్త్రీని ఒక వస్తువుగా కాకుండా ఒక మనిషిగా చూస్తే హింసాత్మక ఘటనలు జరగవు. అమ్మాయిలతో ప్రమాణం చేయించడం కాకుండా, అబ్బాయిలకి కూడా మంచి, చెడు చెప్పగలగాలి. "

భావుసాహెబ్ ఛాస్కర్ అనే ఉపాధ్యాయుడు ఈ అంశం పై స్పందించారు.

"పురుషాధిక్య సమాజమే చాలా సమస్యలకి కారణం అని అన్నారు. అమ్మాయిలకి ఈ సమాజంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి. కానీ, అబ్బాయిల మనసులో ఏమీ జరుగుతుందో ఎవరూ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరు". ఈ పరిస్థితి మారాలి అని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు