ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

  • 17 ఫిబ్రవరి 2020

ఆమెకు 19 ఏళ్లు. ఆయనకు 45 ఏళ్లు. పైగా అనారోగ్యంతో ఆయన నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయినా... 'మన అప్పుల భారం తీరాలంటే ఆయన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ మూడుముళ్లు వేయించారు. ఆ తర్వాత ఏడేళ్లకే ఆయన చనిపోయారు.

అయితే, ఆ 'బలవంతపు పెళ్లి' ఆమెకు కష్టాలతో పాటు ఎన్నో అనుభవాలను, స్ఫూర్తిని కూడా మిగిల్చింది. ఆ స్ఫూర్తితోనే ఆమె వేల మంది జీవితాలను మార్చేస్తున్నారు.

Presentational grey line
Presentational grey line

'పెళ్లి' ఎలా జరిగింది?

ఉమ తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టిపెరిగారు.

తన పెళ్లి సంప్రదాయ దక్షిణ భారత ఆలయంలో ఎంతో వైభవంగా జరగాలని ఆమె ఎప్పుడూ కలలు కనేవారు. రకరకాల పూలతో చక్కగా అలంకరించిన వేదికపై తన వివాహం జరగుతుందని, అనంతరం బీచ్‌లో పెద్ద విందు కార్యక్రమం కూడా ఉంటుందని ఊహించుకున్నారు.

కానీ, అవేవీ జరగలేదు.

ముప్పై ఏళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమెను తల్లి తీసుకెళ్లి ప్రేమన్ థాయికడ్‌ అనే వ్యక్తికి పరిచయం చేశారు. అప్పడు ఉమాకు 19 ఏళ్లు. ప్రేమన్ ఆమెకంటే 26 ఏళ్లు పెద్ద.

అంతకుముందు వారు ఎన్నడూ కలుసుకోలేదు. కానీ, ఆయనే నీ భర్త అని తల్లి చెప్పింది. మేళతాళాలు.. బాజాభజంత్రీలు లేవు... అసలు వివాహ వేడుకే జరగలేదు.

"ఇకనుంచి నీవు ప్రేమన్‌ ఆస్తివమ్మా అని మా అమ్మ చెప్పింది. నీవు నా భార్యవు అని ఆయన అన్నారు. కానీ, ఆయన ఆస్తులపై మాత్రం నాకు హక్కులు లేవు" అని ఉమా గుర్తు చేసుకున్నారు.

ఉమా ప్రేమన్

ఆమెను ప్రేమన్ తన ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి ఆమెను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి ఆయన బయటకు వెళ్లిపోయారు. ఆమెకు నిద్రపట్టలేదు. రాత్రంతా లోలోపల ఆలోచించుకుంటూ ఉండిపోయారు.

మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రేమన్ తిరిగొచ్చి, బార్‌కు వెళ్దాం పద అన్నారు. ఆయన కొన్ని గంటలపాటు విరామం లేకుండా మద్యం తాగారు, ఆమె మాత్రం మౌనంగా కూర్చున్నారు. తన జీవితం ఎందుకిలా అయ్యిందంటూ ఆలోచిస్తూ ఉన్నారు.

బాగా తాగిన తర్వాత "నీవు నాకు రెండో భార్యవు" అని ఆయన చెప్పారు. నిజానికి రెండో భార్య కాదు, ఆయనకు తాను నాలుగో భార్యనన్న విషయం ఆమెకు తొందరలోనే తెలిసింది.

తాను తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతున్నానని, తన సంరక్షణను చూసుకోవడమే నా బాధ్యత అని ఆయన చెప్పారు.

అంతకుముందు

ఉమ తండ్రి టీకే బాలకృష్ణన్‌ సొంతూరిలోనే చిన్న చిన్న జబ్బులకు వైద్యం చేసేవారు. పెద్దయ్యాక తాను కూడా తన తండ్రిలా డాక్టర్ అవ్వాలని ఆమె అనుకున్నారు.

ఉమకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తల్లి మరో వ్యక్తిని ఇష్టపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఉమ అనేక కష్టాలు పడాల్సి వచ్చింది.

"మా నాన్న అంటే మా అమ్మకు ఇష్టం ఉండేది కాదు. ఆయన ఎప్పుడూ తనకంటే బయటివారితోనే ఎక్కువ సమయం గడుపుతారని అంటుండేది. ఓ రోజు దీపావళి పండుగకు టపాకాయలు కొనుక్కోమని నాకు డబ్బులిచ్చి దుకాణానికి పంపించింది. నేను తిరిగొచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు. వేరే వ్యక్తిని ఇష్టపడి ఆయనతోనే వెళ్లిపోయిందని నాకు తర్వాత అర్థమైంది."

"అప్పటికి నాకు మూడేళ్ల తమ్ముడు ఉన్నాడు. మా నాన్న పనికెళ్లేవారు. ఇంట్లో తమ్ముణ్ని నేనే చూసుకునేదాన్ని. అంత చిన్న వయసులో నాకు ఏం పని వస్తుంది? వంట చేయడం వచ్చేది కాదు. రోజూ పనికెళ్లే మా నాన్న మాకు వండిపెట్టాలంటే చాలా కష్టం. ఎలాగైనా వంట నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇరుగుపొరుగు మహిళలను అడిగి వంట నేర్చుకున్నాను" అని ఉమా గుర్తు చేసుకున్నారు.

ఉమా ప్రేమన్

"కొన్నాళ్లకే చాలా రకాల వంటలు నేర్చేసుకున్నాను. ఉదయం 5 గంటలకే లేచి టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం వండేదాన్ని. 9 గంటలకు బడికి వెళ్లేదాన్ని. సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చాక మా తమ్ముణ్ని చూసుకుంటూ రాత్రికి భోజనం వండేదాన్ని. ఆ వయసులో నా స్నేహితులందరూ సాయంత్రం బడి నుంచి రాగానే ఆడుకునేవారు. నేను మాత్రం ఇంటి పనుల్లో బిజీగా గడిపేదాన్ని" అని చిన్న వయసులో పడిన కష్టాల గురించి ఆమె వివరించారు.

ఉమాకు 17 ఏళ్లు వచ్చాయి. కోయంబత్తూరుకు 87 కిలోమీటర్ల దూరంలోని కురువయూర్‌లోని ఓ ప్రముఖ ఆలయాన్ని దర్శించుకునేందుకు పొరుగింటివారితో కలిసి ఉమ కూడా వెళ్లారు.

అక్కడ ఆమెతో మాట్లాడిన ఓ వ్యక్తి, అచ్చం నీలాగే ఒక మహిళ ఉందని చెప్పారు.

తిరిగి ఇంటికి వెళ్లిన ఉమకు, రెండు రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. అది తన తల్లి నుంచి వచ్చింది.

ఉమా ప్రేమన్

వెంటనే ఉమా గురువయూర్‌లోని తల్లి దగ్గరికి వెళ్లారు. ఆమెను తీసుకెళ్లిన రెండో భర్త భారీగా అప్పులు చేసి, ఆమెను వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు వచ్చి ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు.

"రోజూ వడ్డీ వ్యాపారులు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ మా అమ్మను వేధిస్తుండేవారు. నేను చాలా బాధపడేదాన్ని. అయితే, నన్ను ప్రేమన్‌కు ఇచ్చి పెళ్లి చేసేస్తే, ఆయన ఆ అప్పులను తీర్చేస్తారని మా అమ్మ ఉపాయం చేసింది. నేను అందుకు అంగీకరించలేదు. తర్వాత తిరిగి మా నాన్న దగ్గరికి వచ్చాను. కానీ, నేను మా అమ్మ దగ్గరికి వెళ్లి నమ్మకద్రోహం చేశానని ఆయన ఇంటికి రానివ్వలేదు. తప్పని పరిస్థితిలో మళ్లీ మా అమ్మ దగ్గరికి వెళ్లి, ఆమె చెప్పినట్లు ప్రేమన్‌‌ను ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది" అని ఉమా చెప్పారు.

ఉమా ప్రేమన్

పెళ్లి తర్వాత

"రోజూ నా భర్త నన్ను ఇంట్లో ఉంచి తాళం వేసేసి పనికెళ్లేవారు. ఎవరితోనూ కనీసం నిమిషం సేపు మాట్లాడనిచ్చేవారు కాదు. ఆరు నెలలు ఒంటరిగా నాలుగు గోడల మధ్యే ఉండాల్సి వచ్చింది. ఇక నా బతుకు ఇంతేనా అనిపించింది. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పూర్తిగా కోల్పోయాను."

"రానురాను మా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా ఏడేళ్లు గడిచాయి. 1997లో చనిపోయారు. ఆయన ఆస్తులేమీ నాకు దక్కలేదు. అయినా, ఆయన మరణంతో కొంత ఉపశమనం దొరికినట్లు అనిపించింది. నిజానికి ఆయన చనిపోవాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. కానీ, ఆయనను బతికించుకునే వీలులేదు. కాబట్టి, ఆయన మరణం నాకు జీవితంలో రెండో అవకాశం ఇచ్చిందని అనిపించింది" అని ఆమె చెప్పారు.

ఆ పరిస్థితుల నుంచి తేరుకునేందుకు ఆమెకు కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ఆస్పత్రుల్లో సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నవారికి సాయం చేయాలని ఆమె నిర్ణయించారు.

"నా భర్తకు వైద్యం కోసం మేము తరచూ ఆస్పత్రులకు వెళ్తున్నప్పుడు... చాలామంది సరైన వైద్యం పొందలేకపోతుండటాన్ని గమనించాను. అందుకు పేదరికంతో పాటు ఏ జబ్బుకు ఎలాంటి వైద్యం చేయించుకోవాలి? దానికి ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న కనీస అవగాహన లేకపోవడమూ కారణమని గ్రహించాను."

"అలాంటి వారికి ఎలాగైనా సాయపడాలని అనుకున్నాను. దరఖాస్తు ఫారాలు నింపడం, ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స చేయించుకోవాలి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాలి? లాంటి విషయాలు చెబుతుండేదాన్ని."

"నా భర్తను తీసుకుని తిరువనంతపురంలోని ఆస్పత్రికి వెళ్లినప్పుడు, ఆస్పత్రి సమీపంలో ఉన్న ఒక టెలిఫోన్ బూత్ నుంచి మా అత్తామామలతో మాట్లాడేదాన్ని. మా ఫోన్ నంబర్ ఆ టెలిఫోన్ బూత్ నిర్వాహకుడి దగ్గర ఉంది. కాబట్టి, సాయంకోసం చూస్తున్న చాలామందికి ఆయన నా నంబర్‌ ఇచ్చారు. దాంతో వందల మంది నాకు ఫోన్ చేస్తూ సలహాలు అడగటం ప్రారంభించారు" అని ఉమ వివరించారు.

ప్రజల నుంచి వచ్చిన ఆ స్పందనను చూసి ఆమె శాంతీ మెడికల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సరైన వైద్యం చేయించుకునేందుకు వేలాది మందికి ఆమె సాయం అందిస్తున్నారు. దాతల సాయంతో దేశవ్యాప్తంగా 20 డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఉమా ప్రేమన్

ఏ జబ్బుకు ఎక్కడ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? ఏ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుకు వైద్య సేవలు అందుతాయి? లాంటి అనేక రకాల వివరాలను సేకరించేందుకు ఆమె దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తిరిగారు.

"వివరాల కోసం ఆస్పత్రులకు ఉత్తరాలు రాసేదాన్ని. కానీ, అటువైపు నుంచి స్పందన వచ్చేది కాదు. దాంతో నేనే ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చింది. నేను ముఖాముఖిగా మాట్లాడి వివరాలు తెలుసుకునేందుకు ఆస్పత్రులకు వెళ్లినా కొందరు నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. మరో సమస్య భాష. నాకు తమిళం మాత్రమే వచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష రాక చాలా ఇబ్బంది పడేదానిని" అని ఆమె వివరించారు.

దశాబ్ద కాలంగా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి సాయం అందించేందుకు శాంతి సెంటర్ ప్రాధాన్యమిస్తోంది.

ఉమా ప్రేమన్

దేశంలో అవసరమైనన్ని డయాలసిస్ కేంద్రాలు లేవు. కిడ్నీ దాతల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. కాబట్టి, కిడ్రీ సమస్యలతో బాధపడుతున్న వారికోసం కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ఆమె నిధులను సేకరిస్తున్నారు. కిడ్నీ సంబంధిత జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

"మొట్టమొదటి డయాలసిస్ కేంద్రం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఏర్పాటు చేశాం. ఇప్పుడు మాకు భారతదేశం అంతటా 20 కేంద్రాలు ఉన్నాయి. దీనికోసం చాలా మంది విరాళాలు ఇచ్చారు" అని ఆమె చెప్పారు.

కిడ్నీల దానం కోసం ప్రజలను ఒప్పించడం అంత సులువు కాదని, చాలామంది కిడ్నీ దానమిస్తే తమ ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతుంటారని ఆమె అంటున్నారు.

కాబట్టి, ఇతరులకు చెప్పడం కంటే ముందు తానే చేసి చూపించాలని నిర్ణయించుకుని ఆమె తన కిడ్నీలలో ఒకదాన్ని దానం చేశారు. మూత్రపిండాలు విఫలమైన ఓ అనాథకు ఆమె తన కిడ్నీని ఇచ్చారు.

ఉమా తన కిడ్నీని దానం చేసి సిలీల్ ప్రాణాన్ని నిలబెట్టారు
చిత్రం శీర్షిక ఉమా తన కిడ్నీని దానం చేసి సిలీల్ ప్రాణాన్ని నిలబెట్టారు

తన ప్రాణాన్ని నిలబెట్టిన ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సలీల్ అంటున్నారు.

ఈ కథనంలోని ఫొటోలను వి. శివరాం తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదుకాలేదంటున్న చైనా మాటలు నమ్మొచ్చా?

కరోనావైరస్-అమెరికా: బాధితుల్లో నల్లజాతీయులు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి?

కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?

తూర్పు గోదావరిలో మొదలైన కరోనావైరస్ రక్షణ సూట్ల తయారీ

కరోనావైరస్-లాక్‌డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?

కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు

ఇండియా లాక్‌డౌన్: ‘‘కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని నేను అనుకోలేదు’’

కరోనావైరస్: ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న బ్రిటన్ వైద్య సిబ్బంది

కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది.. కంటైన్‌మెంట్ ఆపరేషన్‌ ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది