కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?

  • 15 ఫిబ్రవరి 2020
జ్యోతి తల్లి ప్రమీలా దేవి
చిత్రం శీర్షిక జ్యోతి తల్లి ప్రమీలా దేవి

''ఇక్కడ కరోనావైరస్ ఎక్కువగా ఉందంటున్నారు. మమ్మల్ని బయటకు పంపడంలేదు. విమానాలు కూడా తిరగడంలేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రోగ్రాంను రద్దు చేసుకున్నాం మమ్మీ. బహుశా వుహాన్ సిటీని బ్లాక్ చేస్తారేమో'' అంటూ జనవరి 25న జ్యోతి నాకు ఫోన్ చేస్తే, సరేనని ఫోన్ పెట్టేసినా. అప్పటికి కరోనావైరస్ గురించి మాకు పెద్దగా తెలీదు... అని ప్రమీలా దేవి అన్నారు.

ఉద్యోగం నిమిత్తం చైనా వెళ్లి, వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన తెలుగు యువతి అన్నెం జ్యోతి తల్లి ప్రమీలా దేవిని బీబీసీ కలిసింది.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలానికి చెందిన ప్రమీలా దేవి, ప్రస్తుతం నంద్యాలలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు జ్యోతితో పాటు, ఇంజినీరింగ్ చదువుతున్న ఒక కొడుకు ఉన్నాడు. వుహాన్లో చిక్కుకున్న కూతురి కోసం 2 వారాలుగా పోరాడుతున్న ప్రమీలతో గతకొన్ని రోజులుగా బీబీసీ ఫోన్లో మాట్లాడుతోంది. అయితే ఈరోజు ఆమె కాస్త స్థిమితంగా కనిపించారు.

''దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసొచ్చినంక ఈ మాత్రం ఉన్నాను. లేకపోతే కనీసం ఇట్ల కుచ్చోని మాట్లాడలేకపోయేదాన్ని'' అని అన్నారు.

జ్యోతి తండ్రి మహేశ్వర్ రెడ్డి, కేంద్ర హోంశాఖలో కానిస్టేబుల్‌గా రిటైర్ అయి, ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు.

2019 ఏప్రిల్‌లో బీటెక్ పూర్తయ్యాక కళాశాల ప్రాంగణ నియామకాల్లో జ్యోతికి ఉద్యోగం వచ్చింది. శిక్షణ కోసం ఆగస్టులో జ్యోతితో పాటు కంపెనీకి చెందిన 98 మంది భారతీయ ఉద్యోగులు వుహాన్ వెళ్లారని ప్రమీలా దేవి అన్నారు.

'కొన్నిరోజుల్లో పెళ్లి... కళ్యాణమండపం కూడా బుక్ చేశాం'

''అమ్మాయిలంతా కలిసేవున్నాం. ఆరోగ్యంగా ఉన్నాం. కరోనా భయంతో ఎవ్వరం బయటకు వెళ్లలేదు. భోజనం ఇక్కడికే వస్తుంది'' అని మా పాప చెబుతుంటే అంతా బాగావుందనుకున్నా. కానీ, కరోనా సోకి మనుషులు చచ్చిపోతున్నారని తెలిసినాక భయమైంది'' అని ప్రమీల అన్నారు.

మార్చి 14న బంధువుల అబ్బాయితో జ్యోతి పెళ్లి జరగాల్సి ఉంది. చైనాకు వెళ్లకముందే నిశ్చితార్థం కూడా జరిగింది. ఒకవైపు పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్యాణమండపాన్ని కూడా బుక్ చేసేశారు. ఇంతలో ఊహించని వైరస్ వుహాన్ నగరాన్ని చుట్టుముట్టింది.

Image copyright JYOTHY FAMILY
చిత్రం శీర్షిక తల్లి, తమ్ముడితో జ్యోతి

కరోనా మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో, వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన వైరస్ సోకని భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలను చైనాకు పంపింది. చైనాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఈ విషయం తెలుసుకున్న భారతీయులు నిర్దేశిత సమయానికి వుహాన్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ విషయాలన్నీ తల్లికి వివరిస్తూ జ్యోతి కూడా ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. కానీ, అధికారులు ఆమెను విమానం ఎక్కనివ్వలేదు.

''ఇండియా నుంచి వచ్చిన మొదటి విమానం సిద్ధంగా ఉంది. కొద్ది సేపట్లో విమానంలోకి వెళ్తాం మమ్మీ, మళ్లీ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కొంతసేపటికి మళ్లీ ఫోన్.. 'మమ్మీ... నన్ను విమానం ఎక్కనీయలేదు' అని. పాప భయంతో వణికిపోతాంది. ఏంచేయాల్నో అర్థంకాలేదు. 'ఈ విమానంలో వద్దు, మరుసటి రోజు రెండో విమానంలో వెళ్లమన్నారు' అని జ్యోతి చెప్తే, ఊపిరి పీల్చుకున్నాం. కానీ అందులో కూడా జ్యోతి రాలేదు'' అని ఆమె చెప్పారు.

చిత్రం శీర్షిక జ్యోతి తల్లి ప్రమీలా దేవి, జ్యోతికి కాబోయే భర్త

'కేవలం అనుమానం మాత్రమే...'

భారత ప్రభుత్వం పంపిన మొదటి విమానంలోనే జ్యోతి రావాల్సివుంది. కానీ ఆ సమయంలో తన శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉండటంతో విమానంలోకి అనుమతించలేదని చైనా అధికారులు జ్యోతికి వివరించారు.

''జ్యోతి చాలా సెన్సిటివ్. ఒకవైపు కరోనా వైరస్ భయం, ఇంకోవైపు ఫ్లైట్ మిస్సవ్వకూడదన్న టెన్షన్. అందరూ ఉరుకులు పరుగుల మీద ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అప్పటికే ఆమె బాగా అలసిపోయి నీరసంగా ఉంది. కొన్నిరోజుల నుంచి తిండి కూడా సరిగ్గా అందలేదు. ఎయిర్‌పోర్ట్‌లో జ్యోతిని మాత్రమే రెండుసార్లు చెక్ చేశారంట. అంతమందిలో రెండోసారి చెక్ చేస్తున్నపుడు బాగా భయపడింది. టెన్షన్‌తో శరీర ఉష్ణోగ్రత పెరిగింది. కేవలం ఒళ్లు వేడిగా ఉందని విమనం ఎక్కనీలేదు కానీ, కరోనా వైరస్ సోకిందని ఎవ్వరూ నిర్ధరించలేదు'' అని జ్యోతిని పెళ్లిచేసుకోబోయే అమర్ బీబీసీతో చెప్పారు.

''వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేకి గవర్నమెంటు రెండు విమానాలను పంపిందంటే, ఏదో ఒకదాంట్లో నాబిడ్డ దేశానికి వస్తుందనుకున్నా. కానీ, జ్యోతిని అక్కడే వదిలేసి వస్తారని అనుకోలేదు'' అని చెబుతున్న ప్రమీలా దేవి కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి.

కరోనా వైరస్ అనుమానం ఉంటే, ఎయిర్ పోర్ట్‌లోనే జ్యోతికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలి. కానీ, ఏవిషయమూ చెప్పకుండా అత్యంత ప్రమాదకరమైన వుహాన్ నగరంలో ఆమెను ఎలా ఉంచుతారని అమర్ ప్రశ్నిస్తున్నారు.

Image copyright Giri
చిత్రం శీర్షిక అమర్‌నాథ్ రెడ్డి, జ్యోతి

''వైరస్ లక్షణాలు కనిపించినా, వాళ్లకు అనుమానం వచ్చినా వెంటనే రక్త పరీక్షలు చేయాలి. కానీ చేయలేదు. కనీసం సురక్షిత ప్రాంతానికి పంపాలి, కానీ పంపలేదు. వైరస్ సోకకుండా కొన్ని మందులు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఇవేవీ చేయకుండా, జ్యోతితోపాటు శ్రీకాకుళం అబ్బాయి సత్యసాయిని, చైనా అధికారులు నడిరోడ్డుపై వదిలేసినారు. ఇద్దరూ ఎట్లాగో కష్టపడి, కంపెనీ ఇచ్చిన హోటల్‌కు తిరిగి వెళ్లారు. ఈ సంఘటన జరిగి రెండు వారాలు గడిచాయి. రోజుకు 3-4 సార్లు ఫోన్లో మాట్లాడుతున్నాం. ఇప్పటికీ జ్యోతి పూర్తి ఆరోగ్యంగా ఉంది. కానీ, వుహాన్ సిటీలో ఉండటం వల్ల ఒకవేళ తనకు వైరస్ సోకితే బాధ్యత ఎవరిది? స్వదేశానికి తేలేని ఇండియాదా లేక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లలేని చైనాదా?'' అని అమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జ్యోతికి అసలు పరీక్ష ఇక్కడే ప్రారంభమైంది. ఆడ, మగ ఉద్యోగుల కోసం రెండు వేరువేరు భవనాల్లో కంపెనీవారు విడిది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహిళల వసతి గృహంలో జ్యోతి ఒక్కరే ఉంటున్నారు. 24 గంటలూ, నాలుగు గోడల మధ్య జ్యోతి ఒంటరిగా ఉంటోందని, కరోనా భయంతో కనీసం కిటికీలు కూడా తెరవడంలేదని ప్రమీల అన్నారు.

అక్కడున్న క్యాంటీన్‌లో, వీరిలానే ఇరుక్కుపోయిన చైనీస్ వంట మనిషి ఒకరున్నారని, ఆమె భోజనం వండితే బీఫ్, పోర్క్ లాంటి మాంసాహారమే అందుబాటులో ఉంటోందని, కరోనా సోకుతుందన్న భయంతో జ్యోతి మాంసాహారం ముట్టకుండా, బ్రెడ్, బిస్కెట్లకే పరిమితమైందని ప్రమీల బీబీసీతో చెప్పారు.

ప్రమీలా దేవితో మాట్లాడుతుండగా, వుహాన్ నుంచి జ్యోతి ఫోన్ చేశారు. ఆరోజు జ్యోతి ఫోన్ చేయడం అది రెండోసారి అని అమర్ తెలిపారు. తల్లితో మాట్లాడాక, జ్యోతి బీబీసీతో కూడా మాట్లాడారు.

''రూం వదిలి నేను బయటకు పోవడంలేదు. మధ్యాహ్నం, సాయంత్రం అపార్ట్‌మెంట్ కిందకు ఫుడ్ తెస్తారు. అందులో రైస్‌తో పాటు కూరగాయలను మాంసంతో కలిపి చేసిన కూర ఉంటుంది. కూర అంటే... బీఫ్, చికెన్, పోర్క్ ఏదో ఒక మాంసాన్ని కూరగాయలతో కలిపి ఉడకబెట్టి, కొంత ఉప్పు, కారం వేసిస్తారు. కానీ, నేను ఆ ఫుడ్ తినడంలేదు. నేను తెచ్చుకున్న పికిల్స్ (ఊరగాయలు)తో అన్నం తింటున్నా. గత 10 రోజుల నుంచి అదే నా భోజనం. అది కూడా తినాలనిపించకపోతే నూడిల్స్ వేడినీళ్లలో కలుపుకుని తింటున్నా. ఇక్కడ ఫుడ్ చాలా కష్టంగా ఉంది. వీళ్లు మంసాహారం ఎక్కువగా తింటారు. అసలు వీళ్ల టేబుల్ ఐటమ్ మాంసమే. మాంసాహారంతో కరోనా వైరస్ వచ్చిందని తెలిసినా, వీళ్లు మానడంలేదు. ఇదే వారి రోజువారీ ఆహారం'' అని జ్యోతి బీబీసీతో అన్నారు.

Image copyright Giri
చిత్రం శీర్షిక తనతోపాటు చైనా వచ్చిన వారంతా తిరిగి భారత్‌కు వెళ్లిపోయారని జ్యోతి చెబుతున్నారు

రోజంతా నాలుగు గోడల మధ్యనే ఉంటున్నానని, పలకరించడానికి ఒక్క మనిషి కూడా ఉండడని ఆమె చెబుతున్నారు.

''భారత్ నుంచి వచ్చిన మా కంపెనీ ఉద్యోగులంతా తిరిగి స్వదేశం వెళ్లిపోయారు. నేను, సత్యసాయి మాత్రమే ఇక్కడ మిగిలాం. మా కంపెనీ అడ్మిన్ విభాగం మమ్మల్ని చూసుకుంటోంది'' అని జ్యోతి బీబీసీకి వివరించారు.

అయితే, జ్యోతితో మరిన్ని విషయాలు మాట్లాడటానికి ఆమె తల్లి అంగీకరించలేదు. కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న వుహాన్లో ఒంటరిగా రోజులు గడుపుతున్న జ్యోతి ఇప్పటికే భయాందోళనలో ఉన్నారని, తనను సున్నితంగా హ్యాండిల్ చేయాలని ప్రమీలా దేవి కోరారు. ఆమె మాటను గౌరవిస్తూ, జ్యోతితో సంభాషణను బీబీసీ ముగించింది.

''జ్యోతి నాన్న చనిపోయి ఐదేళ్లయింది. ఆ షాక్ నుంచి కోలుకుండేసరికి మూడేళ్లు పట్టింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం నా మైండ్ జీరో అయ్యింది. పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఎట్లనో కోలుకున్నాను. పాపకు పెళ్లి చేద్దామనుకుంటే, ఇప్పుడిట్ల జరిగింది. రోజూ పొద్దున లేస్తూనే, పాప ఏంచేస్తోంది, నిద్రలేచింటుందా అని ఆలోచన. రాత్రి పడుకునే ముందు, దేవుడా... నా బిడ్డ అక్కడ ఒంటరిగా ఉంది, కాపాడు అని మొక్కుతున్నాను. జ్యోతి కూడా, పగలంతా యాక్టివ్‌గా ఉంటుంది, రాత్రికి నిరాశగా మాట్లాడుతుంది'' అని ప్రమీల అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption"నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి

జ్యోతిని భారత్ తీసుకొచ్చే విషయమై, చైనాలోని భారత దౌత్య కార్యాలయం స్పందించింది. వైఎస్సార్సీపీ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, భారత విదేశాంగ మంత్రిని కలిసిన తర్వాత, ఈ స్పందన వెలువడింది.

''శరీర ఉష్ణోగ్రత కారణంగా భారత్ రాలేకపోయిన కుమారి అన్నెం జ్యోతి పేరు, చైనాలోని భారత విదేశాంగ కార్యాలయంలో నమోదైంది. ఆమెతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. జ్యోతి ఆరోగ్యం బావుండాలని ఆశిస్తూ, తనకు నీరు, ఆహారం అందేలా చూస్తున్నాం. వీలైనంత త్వరగా ఆమెను చైనా దాటించాలని ప్రయత్నిస్తున్నాం. వుహాన్ నగరం నుంచి బయటకు పంపే విషయంలో చైనా చాలా కఠినంగా ప్రవర్తిస్తోంది. వుహాన్‌తోపాటు హుబే ప్రావిన్స్ మొత్తాన్ని స్తంభింపజేశారు. ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు. అలాగే, ఈ ప్రాంతం నుంచి వచ్చేవారిని ఆహ్వానించడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. జ్యోతితోపాటు ఇక్కడున్న భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు భారత దౌత్య కార్యాలయం సిద్ధంగా ఉంది'' అని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది.

''నా చుట్టూ ఇంతమంది ఉన్నా నాకు ఒంటరితనమే ఉంటే, కడుపునిండా తిండి లేక, మాట్లాడటానికి ఒక మనిషి లేక, నా బిడ్డ ఇంకెంత బాధపడుతాందో ఆడ! ఒక్కసారి నా బిడ్డను నాకియ్యండి సార్, జీవితంలో ఇంకెప్పుడూ నాకు దూరంగా పంపీయను!'' అంటున్న ప్రమీలా దేవి చెంపపై ఎండిన కన్నీటి చారలు, మళ్లీ తడి అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా?

దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్

దిల్లీ హింస: ‘హిందువుల ఆలయాలను ముస్లింలు రక్షించారు’

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు

వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా.. శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’