అయోధ్య: వేలాది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి

  • స్వామినాథన్ నటరాజన్, ఖాదీజా ఆరిఫ్
  • బీబీసీ న్యూస్
షరీఫ్

ఫొటో సోర్స్, Mohd Shabbir

"ఓరోజు పోలీసులు ఒక శవాన్ని నదిలో విసిరేస్తుండటం చూశాను. అయ్యో అనిపించింది. భయపడ్డాను కూడా. ఇక నుంచి మరే మృత దేహానికి అలాంటి పరిస్థితి రాకూడదు, అనాథ శవాలకు నేనే సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహిస్తాని నాకు నేను చెప్పుకున్నాను" అని మొహమ్మద్ షరీఫ్ గుర్తు చేసుకున్నారు.

ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటికి 28 ఏళ్లుగా అయోధ్యలో వేలాది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

1992లో అయోధ్యలో జరిగిన మతపరమైన అల్లర్లలో షరీఫ్ 25 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఆయన మృతదేహం కూడా కుటుంబ సభ్యులకు దొరకలేదు.

80 ఏళ్లకు పైబడిన షరీఫ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో అందరూ చాచా (అంకుల్) అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఆయన తన మిషన్ గురించి తాజాగా బీబీసీతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Mohd Shabir

ఫొటో క్యాప్షన్,

షరీఫ్ ఇప్పటి వరకు 25000 వేల మందికి పైగా అంత్యక్రియలు చేశారని స్థానిక మీడియా చెబుతోంది

ఖననం, దహనాలు

ఎన్ని అంత్యక్రియలు చేశారో ఆయనకే తెలియదు. షరీఫ్‌కు అప్పగించిన మృతదేహాలకు సంబంధించి పూర్తి రికార్డులు తమ దగ్గర లేవని అయోధ్య జిల్లా కలెక్టర్ అనుజ్ కుమార్ ఝా బీబీజీతో అన్నారు. "ఆయనకు దాదాపు 2,500 మృతదేహాలను ఇచ్చి ఉంటాం" అని ఆయన చెప్పారు.

ఆయన 5,500 మందికి పైగా అంతిమ సంస్కారాలు నిర్వహించారని షరీఫ్ కుటుంబం చెబుతోంది. కానీ, ఆ సంఖ్య 25 వేలకు పైనే ఉంటుందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

వివిధ కారణాలతో చనిపోయిన అనేక మందికి ఆయన సొంతంగా అంత్యక్రియలు జరిపించారు.

ఇళ్లు వదిలి వచ్చిన గుర్తుతెలియన వ్యక్తులు, యాత్రికులు, వలసదారులు, వారి పిల్లలు, వృద్ధులు అనేక మంది చనిపోతుంటారు. రోడ్డు, రైలు ప్రమాదాల్లో, ఆస్పత్రిలో చనిపోయిన కొందరు పేదలకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు.

అలా నిరాదరణకు గురైన శవాలకు షరీఫ్‌ లాంటి స్వచ్ఛంద సేవకులు, సంస్థలతో కలిసి అధికారులు అంత్యక్రియలు జరిపిస్తారు.

ఫొటో సోర్స్, Shadab Ahamad

జాతీయ పౌర పురస్కారం కోసం ఎంపికైన వారి జాబితాలో షరీఫ్ పేరు కనిపించిన తరువాత ఆయన విశేషమైన సేవలు వెలుగులోకి వచ్చాయి. నిస్వార్థంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.

ఫొటో సోర్స్, Mohd Shabbir

ఫొటో క్యాప్షన్,

1992లో జరిగిన అల్లర్లలో షరీఫ్ కుమారుడు చనిపోయారు

సైకిల్ మెకానిక్

షరీఫ్ పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది. దాంతో ఆయన నానమ్మ దగ్గరే పెరిగారు. చదువుకోలేకపోయారు.

చిన్నతనం నుంచే ఇల్లు గడవడం కోసం ఆయన చాలా కష్టాలు పడ్డారు. సైకిల్ మెకానిక్‌ పని నేర్చుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తన కొడుకు చనిపోయిన తర్వాత సామాజిక కార్యకర్తగా మారారు.

"ఆ అల్లర్ల సమయంలో నా కొడుకు అదృశ్యమయ్యాడు. దాంతో నేను పిచ్చివాడిలా నెలరోజుల పాటు అంతటా వెతికాను. అయినా ఆచూకీ దొరకలేదు" అని షరీఫ్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Mohd Shabbir

అయోధ్య అల్లర్లు

1992లో జరిగిన హిందూ-ముస్లిం అల్లర్లలో షరీఫ్ 25 ఏళ్ల కుమారుడు మహ్మద్ రయీస్ చనిపోయారు. ఆ అల్లర్లు అప్పుడు అయోధ్య నగరంతో పాటు, దేశాన్ని కుదిపేశాయి.

"నా కొడుకు శరీరం కుళ్ళిపోయిందని పోలీసులు నాకు చెప్పారు. అతని మృతదేహాన్ని మేము చూడలేదు. మాకు అతని బట్టలు మాత్రమే ఇచ్చారు" అని షరీఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Mohd Shabbir

ఫొటో క్యాప్షన్,

పౌర పురస్కార అర్హుల జాబితాలో షరీఫ్ పేరు వచ్చిన తర్వాత ఆయనకు జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు

నా కొడుకును ఎవరు చంపారు?

ఇప్పటి వరకూ తన కొడుకు ఎక్కడ చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? అన్నది షరీఫ్‌కు తెలియదు.

"ఇతర శవాల మాదిరిగానే నా కొడుకు మృతదేహాన్ని కూడా నదిలో పడేసి ఉండవచ్చని నాకు అనిపిస్తోంది" అని 80 ఏళ్ల షరీఫ్ అంటున్నారు.

అప్పట్లో దేశంలోని చాలా జిల్లాల్లో మార్చురీ సౌకర్యం ఉండేది కాదు. దాంతో, అనాథ శవాలను నదుల్లో విసిరేయడం అనేది సర్వసాధారణంగా జరిగేది.

"నా కొడుకు కోసం ఓ నెలపాటు వెతికాను. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. సమీపంలో ఉన్న సుల్తాన్‌పూర్‌కు కూడా వెళ్లాను. అక్కడా కనిపించలేదు. నా కొడుకు మృతదేహాన్ని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోమ్తి నదిలో విసిరేశారని మా అనుమానం" అని షరీఫ్ చెప్పారు.

ఇరవై అయిదేళ్ల కొడుకు అలా కానరాకుండా పోవడం, కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోవడం షరీఫ్‌ను తీవ్రంగా బాధించింది.

ఫొటో సోర్స్, Mohd Shabbir

నా కొడుకు ఆఖరి చూపు కూడా మేము నోచుకోలేదు. కనీసం మాకు చూపించకుండానే నా కొడుకు శవాన్ని నదిలో పడేశారని మా అనుమానం. అది దారుణం. అప్పటి నుంచి మా జిల్లాలో అలా ఏ శవాన్నీ నదుల్లో విసిరేయనివ్వకూడదని నిర్ణయించుకున్నాను" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Mohd Shabbir

ఫొటో క్యాప్షన్,

తన ఆలోచనను మొదట్లో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు

అయితే, ఆయన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు వ్యతిరేకించారు. 'పిచ్చెక్కిందా?' అంటూ కుటుంబ సభ్యులు తిట్టారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

అప్పటి వరకు హిందూ మతానికి చెందిన దళిత కులస్థులు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించేవారు. ఆ పనిని షరీఫ్ చేయడంతో ఆయన్ను సంఘ బహిష్కరణ కూడా చేశారు.

"కొంతమంది నన్ను చూసి భయపడ్డారు. నన్ను తాకితే రోగాలు వస్తాయని అనుకున్నారు. నన్ను దూరం పెట్టారు. అయినా, నేను వెనక్కి తగ్గలేదు. బంధువుల వివాహాలకు వెళ్లలేదు. పండుగలకు, ప్రార్థనలను వెళ్లడం కూడా మానేశాను. నా కొడుకు ఆత్మకు శాంతి కలగాలన్నదే నా ఆశయం" అని షరీఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Mohd Shabbir

అనాథ శవం ఉందంటూ పోలీసులు ఫోన్ చేయగానే, షరీఫ్ అన్ని పనులనూ పక్కన పెట్టేసి వెంటనే వెళ్లిపోతారు.

సాధారణంగా చనిపోయిన వ్యక్తిని దహనం లేదా ఖననం చేయడానికి ముందు ఆయన స్నానం చేయిస్తారు. చనిపోయిన వ్యక్తి ముస్లిం అని అనిపిస్తే, ఆ శవాన్ని ఒక వస్త్రంలో చుట్టి, అంతిమ ప్రార్థనలు చదువుతారు.

చనిపోయిన వ్యక్తి హిందువు అయితే తన ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహిస్తారు.

సాధారణంగా చనిపోయిన తర్వాత మృతదేహం కోసం ఎవరైనా బంధువులు వస్తారేమోనని పోలీసులు వేచి చూస్తారు. కొన్నిసార్లు వారాలు కూడా చూస్తారు. ఇక ఎవరూ రారన్న అంచనాకు వచ్చాక, శవాన్ని షరీఫ్‌కు అప్పగిస్తారు. అందుకే ఆయన దగ్గరికి వచ్చే దాదాపు అన్ని శవాలూ కుల్లిపోయిన దశలో ఉంటాయి.

"అంత్యక్రియలకు అప్పుడప్పుడు పోలీసు అధికారులు నాతో స్మశానవాటికకు వస్తారు. కానీ, చాలా దూరంగా ఉండి చూస్తారు. దగ్గరికి రారు" అని షరీఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హిందువుల శవాలకు నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహిస్తారు

బాగా కుల్లిన శవాల నుంచి వచ్చే దుర్వాసన వల్ల కొన్నిసార్లు అనారోగ్యానికి గురవుతుంటానని ఆయన చెబుతున్నారు. బాగా కుల్లిపోయిన శవాలను చూసినప్పుడు కొన్నిసార్లు రాత్రి నిద్రపట్టదు, అలాంటప్పుడు నిద్ర మాత్రలు వేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ సేవలో తనకు సంతృప్తి ఉందని, ప్రతిదాన్నీ డబ్బుతో ముడిపెట్టి చూడకూడదని ఆయన అంటున్నారు.

దాదాపు పదేళ్ల పాటు ఎవరి సాయం లేకుండానే షరీఫ్ అనేక శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సహకారం అందలేదు.

ఆ తర్వాత నుంచి ఖర్చుల కోసం స్థానిక దుకాణాల యజమానులు కలిసి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ఇస్తున్నారు.

"హిందువులు, ముస్లింలు అందరూ నాకు సాయం చేస్తున్నారు. ఆహార పదార్థాలు, దుప్పట్లు ఇస్తారు. ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. అందుకోసం, ఎవరో గుర్తుతెలియన వ్యక్తి నన్ను పిలిచి 20 వేల రూపాయలు ఇచ్చారు" అని షరీఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, MOHD SHABBIR

వారసుడు లేడు

రోజురోజుకీ ఆయన శారీరంకగా బలహీనపడుతున్నారు. అయితే, ఆయన చేస్తున్న సేవను కొనసాగించేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ఆయనకు ఇంకా ఇద్దరు కొడుకులు, వారి పిల్లలు ఉన్నారు. కానీ, వారు ఈ పనిని కొనసాగించేందుకు ముందుకు రావడంలేదు.

"తాతయ్యకు చేయాలని ఉంది కాబట్టి చేయనిద్దాం. కానీ, మాకు ఇష్టం లేదు అని మా మనుమళ్లు అంటున్నారు. నేను చేసే పనిలో ఎవరూ పాల్గొనడంలేదు" అని షరీఫ్ అంటున్నారు.

ఆయన ఇప్పటికీ సైకిల్ రిపేరింగ్ దుకాణం నడుపుతున్నారు. రోజూ రెండు వందల రూపాయల దాకా సంపాదిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వనున్న పురస్కారంతో ఆయన్ను ఆర్థికంగా ఆదుకోలేదు. అయినా, తన సేవను గుర్తించినందుకు ఆయన సంతోషంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)