నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్... మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష

  • 5 మార్చి 2020
నిర్భయ నిందితులు Image copyright DELHI POLICE

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు దిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 2న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో రాజ్యాంగపరంగా, న్యాయపరంగా వారికి ఉన్న అవకాశాలన్నీ ముగిసిపోయాయి.

అయితే, గతంలో శత్రుఘన్ చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ తర్వాత శిక్ష అమలుకు 14 రోజుల సమయం ఉండాలి.

ఇప్పటి వరకూ ఏం జరిగింది...

అంతకుముందు మార్చి 3న శిక్ష అమలుచేయాలని పటియాలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలిచ్చింది. కానీ, దోషి వేసుకున్న పిటిషన్ మూలంగా అది వాయిదా పడింది.

నిర్భయ దోషులను ఉరి తీయాలని పటియాలా కోర్టు ఇప్పటివరకూ మూడుసార్లు డెత్ వారెంట్ జారీ చేసింది.

ఈ నలుగురు దోషుల పేర్లు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా.

దీనికి ముందు కోర్టు జనవరి 22న వీరి ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. కానీ ఒక దోషి దయాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉండడంతో ఉరిశిక్ష తేదీని వాయిదా వేశారు.

తర్వాత కోర్టు ఫిబ్రవరి 1న వీరికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. కానీ ఆరోజు కూడా ఉరిశిక్ష విధించలేకపోయారు. దానిని తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేశారు.

ఆ సమయంలో, నిర్భయ తల్లి ఆశా దేవి కోర్టు నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈసారి నిందితులకు ఉరిశిక్షను విధిస్తారని, చట్టపరమైన లొసుగుల నుంచీ వారికి ఎలాంటి ప్రయోజనం లభించదని ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ, దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. తమ క్లయింట్ల దగ్గర ఇప్పటికీ చట్టపరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పారు.

Image copyright Getty Images

ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?

2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.

2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.

2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.

2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.

2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.

2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.

2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.

2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.

2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.

2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.

2020 జనవరి 8: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.

2020 జనవరి 14:సుప్రీంకోర్టు వినయ్ కుమార్ శర్మ, ముకేశ్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

2020 జనవరి 15:దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు జనవరి 22న ఉరిశిక్ష వేయలేమని చెప్పింది. దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉందని చెప్పింది. 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాష్ట్రపతి వైపు నుంచి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా నిందితులకు కనీసం 14 రోజుల గడువు ఇవ్వడం తప్పనిసరి అని చెప్పింది.

2020 జనవరి 17: ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి. కొత్త డెత్ వారెంట్ జారీ. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష విధించాలని ఆదేశం.

2020 జనవరి 28: ముకేశ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

2020 జనవరి 31: దోషుల ఉరిశిక్షను తదుపరి ఆదేశాల వరకూ నిలుపుదల చేస్తున్నట్లు పటియాలా కోర్టు ప్రకటించింది.

2020 ఫిబ్రవరి 2: పటియాలా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

2020 ఫిబ్రవరి 17: మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 2: దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

2020 మార్చి 5:మార్చి 20న ఉరి తీయాలని పాటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

కరోనావైరస్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాక్‌డౌన్ గురించి ఏం చెప్పింది?

లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్ ఎగుమతి చేయకపోతే, తగిన ప్రతిస్పందన ఉంటుందన్న ట్రంప్

కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; 'లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానికి చెప్పాను'

కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ అడ్డాగా కర్నూలు... 303 కేసుల్లో 74 ఈ జిల్లాలోనే

కరోనావైరస్... ఈ భూమి మీద ఒక ఆదిమ జాతిని సమూలంగా నాశనం చేస్తుందా?

కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?