పశ్చిమ బెంగాల్ మదరసాల్లో హిందూ విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?

  • ప్రభాకర్ మణి తివారీ
  • బీబీసీ కోసం
మదరసా

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

మదరసాలు అనగానే వెంటనే మైనారిటీ విద్యార్థులు సంప్రదాయ పద్ధతుల్లో శిక్షణ పొందే దృశ్యాలు మన కళ్లముందు మెదులుతాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మదరసాలు ఆ దృశ్యాన్ని మార్చేశాయి. రాష్ట్రంలో ఉన్న మదరసాల్లో ముస్లిమేతరులు చదువుకోవడమే కాదు, వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైన మదరసా బోర్డ్ పరీక్షల్లో ఈసారి ఓ కొత్త రికార్డ్ నెలకొంది. ఈ పరీక్షలో పాల్గొన్న 70 వేల మంది విద్యార్థుల్లో దాదాపు 18 శాతం మంది హిందువులే. మదరసా బోర్డు నిర్వహించే ఈ పరీక్ష పదో తరగతికి సమానం. ఇంతకు ముందు 2019లో ఈ పరీక్షకు ముస్లిమేతర విద్యార్థులు 12.77 శాతం ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ సాయంతో నడిచే 6 వేలకు పైగా మదరసాలు ఉన్నాయి.

"గత కొన్నేళ్లుగా పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్య రెండు- మూడు శాతం పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన ఈ మదరసాల్లో పదో తరగతి వరకూ ముస్లిమేతర విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో చేరుతున్నారు" అని పశ్చిమ బెంగాల్ మదరసా ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షుడు అబూ తాహెర్ కమ్రుద్దీన్ చెప్పారు.

"బంకూడా, పురూలియా, బీర్‌భూమ్ జిల్లాల్లోని నాలుగు అతిపెద్ద మదరసాల్లో ముస్లిమేతర విద్యార్థుల సంఖ్య, ముస్లిం విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంది" అన్నారు.

ఆయన వివరాలను బట్టి.. ముస్లిమేతర విద్యార్థులు ఎక్కువగా ఉన్నత విద్య అందించే మదరసాల్లో చేరారు. ఈ మదరసాల్లో సెకండరీ బోర్డ్ సిలబస్ ప్రకారం విద్యాబోధన జరగడమే దీనికి కారణం.

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

"దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఇదో ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ హిందూ విద్యార్థులు చదువుకోవడమే కాదు.. ముస్లిం విద్యార్థులతో పోలిస్తే మెరుగైన ఫలితాలు కూడా సాధిస్తున్నారు" అంటారు కమ్రుద్దీన్.

"మదరసాల్లో మాపట్ల మతపరమైన భేదభావాలు ఎప్పుడూ చూపించరు" అని వర్ధవాన్ జిల్లాలోని ఒక మదరసాలో చదివే విద్యార్థిని సేన్ చెప్పింది.

పశ్చిమ బెంగాల్‌లో సెకండరీ బోర్డ్ కింద చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువవడంతో విద్యార్థులు, వారి సంరక్షకులు (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో) ఈ మదరసాలవైపు చూస్తున్నారు. అంతకు ముందు కూడా ఈ మదరసాల మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి. బెంగాల్ మదరసాలకు ఉన్న ప్రత్యేకతల్లో ఇక్కడ అమ్మాయిలు చదువుకోవడం కూడా ఒకటి.

కొన్ని మదరసాల్లో హిందూ విద్యార్థులే ఎక్కువ.

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

గత ఏడాది మదరసా బోర్డు పరీక్షల్లో పాల్గొన్న మొత్తం విద్యార్థుల్లో అమ్మాయిల సంఖ్య దాదాపు 60 శాతం ఉంది.

గత ఏడాది మదరసా బోర్డు పరీక్షలో తూర్పు వర్ధ్‌వాన్ జిల్లా కేతూర్‌ గ్రామ్‌లో ఉన్నత విద్య అందించే అగర్‌డాంగా మదరసాలో చదివే సాథీ మోదక్, అపర్ణా సాహా, పాపియా సాహా అనే విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు.

ఈ మదరసాలో చదివే 751 మంది విద్యార్థుల్లో దాదాపు 45 శాతం మంది హిందువులే. ఈసారి బోర్డు పరీక్షలు రాయబోయే 68 మందిలో 23 మంది హిందూ విద్యార్థులే.

"1925లో దీనిని స్థాపించినప్పటి నుంచీ హిందూ విద్యార్థులు ఈ మదరసాలో భాగమయ్యారు. ఈ ప్రాంతంలో వేరే స్కూలేదీ లేకపోవడంతో హిందువులు ఈ మదరసాల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ మరో మూడు స్కూళ్లు తెరిచినా, మా బోధన పద్ధతులు చూశాక, ఇక్కడ హిందూ సమాజం నుంచి ఎక్కువ మంది పిల్లలు చదువుకోడానికి వస్తున్నారు" అని అగర్‌డాంగా ఇన్‌ఛార్జి ఉపాధ్యాయుడు మొహమ్మద్ అనీస్ ఉర్ రహమాన్ చెప్పారు.

ఇదే జిల్లాలోని ఓర్‌గ్రామ్ చతుష్పల్లి హై మదరసాలో చదివే 1320 మంది విద్యార్థుల్లో 65 శాతం హిందువులు. ఈ మదరసాల్లో విద్యార్థినుల జనాభా (720) విద్యార్థుల (600)తో పోలిస్తే 20 శాతానికి పైనే ఉంది.

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

మదరసాల్లో హిందూ విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?

అయినా, ఈ మదరసాల్లో హిందూ విద్యార్థినీ- విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? దానికి సమాధానం ఇక్కడి బోధనా ప్రమాణాలు, వాతావరణం అని చెప్పొచ్చు.

స్థానిక రైతు రమేష్ మాఝీ ఇద్దరు కూతుళ్లు చతుష్పల్లి మదరసాలో చదువుకుంటున్నారు.

"ఈ ప్రాంతంలో వేరే ప్రభుత్వ స్కూల్ లేదు. మదరసాలో బాగా చదువు చెబుతుండడం, సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో, నా ఇద్దరు కూతుళ్లను ఇక్కడే చేర్చాలని అనుకున్నా" అని ఆయనన్నారు.

అలాగే, కోల్‌కతా పక్కనే ఉన్న ఉత్తర 24 పరగణా జిల్లా రైతు సోమేన్ మండల్ పెద్ద కొడుకుది మరో ఉదాహరణ.

అతడు ఇంతకు ముందు స్థానిక ప్రభుత్వ స్కూలులో చదివేవాడు. కానీ సీట్లు తక్కువగా ఉండడంతో సోమేన్ రెండో కొడుక్కి ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ దొరకలేదు. దాంతో ఆయన తమకు దగ్గరలో ఉన్న మదరసాల్లో అతడిని చేర్పించారు. ఆయనకు ఆ మదరసా వాతావరణం ఎంత నచ్చిదంటే, తర్వాత పెద్ద కొడుకును కూడా ప్రభుత్వ స్కూలు నుంచి తప్పించి, చిన్న కొడుకు చదివే అదే మదరసాలో చేర్చించారు.

"అక్కడ సంబంధిత సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేరు. జాగ్రఫీ టీచర్ లెక్కలు చెబితే, సైన్స్ టీచర్ చరిత్ర చెప్పేవారు. స్కూల్లో నిర్వహణ కూడా సరిగాలేదు. ఇక్కడ మదరసాలో చదువులు మెరుగ్గా ఉన్నాయి. చుట్టుపక్కల నిర్వహణ కూడా బాగుంది. అందుకే నేను నా పెద్ద కొడుకును కూడా ఈ మదరసాలోనే చేర్పించాను" అన్నారు సోమేన్ మండల్.

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

గతంలో కంటే మెరుగైన మదరసాల బోధన

మదరసా ఎడ్యుకేషన్ బోర్డ్ అధ్యక్షుడు అబూ తాహెర్ కూడా మండల్ చెప్పిన దాన్ని ధ్రువీకరించారు.

"మదరసాలో బోధన గతంలో కంటే చాలా మెరుగైంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తున్నారు. అందుకే ముఖ్యంగా బీర్‌భూమ్, తూర్పు వర్ధ్‌వాన్, బాకుండా జిల్లాల్లో ముస్లిమేతర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మదరసాల వైపు ఆకర్షితులవుతున్నారు" అన్నారు.

రాష్ట్రంలోని మదరసాల్లో ముస్లిమేతర టీచర్లు 29 శాతానికి పైగా ఉన్నారని ఆయన చెప్పారు.

మదరసాల్లో పెరుగుతున్న హిందూ విద్యార్థుల సంఖ్య గురించి విద్యా శాఖ అధికారితో బీబీసీ మాట్లాడింది.

"ఈ మదరసాల్లో ముస్లిమేతర విద్యార్థుల సంఖ్య పెరగడానికి ముఖ్యమైన కారణాలు రెండు. మొదట పరిమితంగా ఉన్న స్కూళ్లలో సీట్లు లేకపోవడం. రెండోది మదరసాలకు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ గుర్తింపు లభించడం. చాలా స్కూళ్లు డొనేషన్లు కూడా అడుగుతున్నాయి. అందువల్ల పేద విద్యార్థులు మదరసాల వైపు చూస్తున్నారు" అని ఆయనన్నారు.

పాతకాలపు సంప్రదాయాలను అంతం చేశామనే వాదన

"మామూలు స్కూళ్లలో సీట్ల లోటు ఉంది. అది కాకుండా ఫీజు తక్కువగా ఉండడం వల్ల కూడా విద్యార్థులు మదరసాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిమేతర విద్యార్థులకు అరబిక్ భాష వల్ల ఎదురయ్యే సమస్యలను కూడా దూరం చేస్తోంది. వంద మార్కుల అరబిక్ పరీక్షలో వారు 65 మార్కులకు వేరే భాషలో సమాధానం రాయచ్చు" అని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక మదరసాలో ఇంగ్లిష్ బోధించే అమితాబ్ మండల్ చెప్పారు.

మదరసా బోర్డు అధ్యక్షుడు కమ్రుద్దీన్ కూడా దీన్ని సమర్థించారు.

"మేం మదరసాలను కూడా మామూలు స్కూళ్లు లాగే మార్చేశాం. ఇక్కడ విద్యార్థినీ విద్యార్థులు కలిసి చదువుకుంటారు. మేం పాతకాలపు సంప్రదాయాలకు ముగింపు పలికాం. ప్రభుత్వం మదరసా విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ కూడా ప్రారంభించింది. ఈ మదరసాల్లో చాలామంది విద్యార్థులు పై చదువులు చదివి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కూడా చేరుతున్నారు" అని కమ్రుద్దీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)