భారత్‌లో తగ్గిపోతున్న పక్షులు.. గద్దలు, రాబందులు, వలస పక్షుల్లో భారీ తగ్గుదల

రాబందులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రాబందులు

భారత్‌లో రెండున్నర దశాబ్దాలుగా చాలా పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఒక ముఖ్యమైన అధ్యయనం తెలిపింది.

పక్షులను చూస్తూ వాటి గురించి అధ్యయనం చేసే 15 వేల మందికి పైగా ఔత్సాహికులు అందించిన వివరాల ఆధారంగా 'ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్' పేరుతో ఈ అధ్యయనం వెలువడింది. 867 రకాల పక్షుల స్థితిగతుల గురించి వారు వివరాలు అందించారు.

గద్దలు, రాబందులు, పాడే పక్షులు, తీరాలకు వలసొచ్చే పక్షుల సంఖ్య అత్యధికంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది.

భారత జాతీయ పక్షి నెమలి మాత్రం తన బలగాన్ని పెంచుకుంది. నెమలుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

పక్షుల వేట, పక్షులకు ఆవాసాలు లేకుండా పోవడమే వాటి తగ్గుదలకు రెండు ప్రధాన కారణాలు.

కరెంటు తీగలకు తగిలి చాలా పక్షులు చనిపోతున్నాయని, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి వాటికి ఎదురవుతున్న ప్రధాన ముప్పు ఇదేనని నివేదిక చెప్పింది.

ఈ తరహా నివేదికల్లో ఇదే తొలి సమగ్ర నివేదిక.

గత పాతికేళ్లలో పక్షుల సంఖ్యలో తగ్గుదల, గత ఐదేళ్లలో పక్షుల సంఖ్యలో తగ్గుదల పేరుతో అధ్యయనవేత్తలు రెండు మదింపులు జరిపారు.

ఫొటో సోర్స్, Getty Images

"దీర్ఘకాలిక మదింపు విషయానికి వస్తే కేవలం 261 జాతుల గణాంకాలే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 52 శాతం జాతుల పక్షుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుత మదింపు విషయానికి వస్తే 146 జాతుల గణాంకాలే అందుబాటులో ఉన్నాయి. వీటిలో దాదాపు 80 శాతం జాతుల పక్షుల సంఖ్య తగ్గిపోతోంది" అని నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సహవ్యవస్థాపకుడు ఎండీ మధుసూదన్ చెప్పారు.

పక్షి ప్రేమికులు, ప్రొఫెషనల్ బర్డ్‌వాచర్ల నుంచి అందిన వివరాలను నిపుణులు 'ఈబర్డ్' అనే క్రౌడ్‌సోర్సింగ్ ఆధారిత అంతర్జాతీయ డేటాబేస్‌లో క్రోడీకరించారు. పక్షులకు సంబంధించి ఇది రియల్ టైమ్ డేటా అందిస్తుంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

అలహాబాద్‌లో పక్షుల సందడి

అధ్యయన నివేదిక ప్రకారం పక్షుల సంఖ్య అత్యధికంగా తగ్గుతున్న జాతులు:

భారతీయ రాబందు, వైట్-రంప్డ్ వల్చర్ (ఇది ఇంకో రకం రాబందు), రిచర్డ్స్ పిపిట్, లార్జ్-బిల్ల్డ్ లీఫ్ వార్బ్లర్ (ఇదో పాడే పక్షి), పసిఫిక్ గోల్డెన్ ప్లోవర్, కర్ల్యూ శాండ్‌పైపర్ (ఇదో ఉల్లంకి పక్షి).

పక్షుల సంఖ్య పెరుగుతున్న జాతులు:

భారతీయ నెమలి, రోజీ స్టార్లింగ్, ఫెరల్ పిజన్ (ఇదో పావురం), గ్లాస్సీ ఇబిస్, ప్లెయిన్ ప్రీనియా, అషీ ప్రీనియా.

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు

స్థానిక గువ్వల సంఖ్య ప్రధాన నగరాల్లో తగ్గుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు స్థిరంగానే ఉంది.

సుదూర ప్రాంత వలస పక్షులతోపాటు భారత ఉపఖండ వలస పక్షుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

ఫొటో సోర్స్, AFP

1990ల నుంచి వివిధ జాతుల రాబందులు, బట్టబాతు, పచ్చికబయళ్లలో ఉండే ఇతర పక్షుల సంఖ్య భారీగా పతనమైంది.

పక్షుల వ్యాపారంలో ఎక్కువగా కనిపించే గ్రీన్ మ్యూనియా తరహా జాతుల పక్షుల సంఖ్య ప్రమాదకరస్థాయిలో క్షీణించింది.

అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జెర్డాన్స్ కోర్సర్ అనే పక్షి 138 ఏళ్లలో తొలిసారిగా 1986లో కనిపించింది. 2008 నుంచి ఇది కనిపించడం లేదు.

అంతరించిపోయే ముప్పున్న 'ఫారెస్ట్ ఔలెట్ (ఇదో గుడ్లగూబ)' చాలా కాలం తర్వాత 1997లో మళ్లీ కనిపించింది. ఇప్పుడు ఇది దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది.

మొత్తం భారత పక్షుల స్థితి ఎలా ఉందనేది ఈ అధ్యయనం చెప్పడం లేదని, ఆయా జాతుల సమాచారాన్ని మాత్రమే చెబుతోందని నివేదిక స్పష్టం చేసింది.

చాలా భారతీయ పక్షుల గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో వాటి సంఖ్యలో మార్పుల గురించి స్పష్టంగా వెల్లడికాలేదని నివేదిక చెప్పింది. ఆయా పక్షుల సంరక్షణకు ఈ వివరాలు తెలియాల్సిన అవసరముందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)