పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. జాబితాలో ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్‌‌‌‌ల కంటే దిగువన

పిల్లల

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సులో ప్రపంచంలో ఏ దేశమూ పిల్లలకు ఆరోగ్యంగా ఎదిగే అవకాశం, వారి భవిష్యత్తుకు తగిన పర్యావరణం రెండింటినీ కల్పించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

పిల్లలు బాగా ఎదిగేందుకు ఎంత మేర అవకాశాలున్నాయనే అంశంలో 180 దేశాలకు ర్యాంకులు ఇస్తూ 'ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యూనిసెఫ్)- లాన్సెట్ కమిషన్' విడుదల చేసిన నివేదిక కీలకమైన విషయాలను వెల్లడించింది.

విద్య, పోషకాహారం, బాలల మరణాల రేటు లాంటి విషయాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని కమిషన్ ఈ ర్యాంకులను నిర్ణయించింది. 'చైల్డ్ ఫ్లరిషింగ్ ఇండెక్స్(బాలల ఎదుగుదల సూచీ) ర్యాంకింగ్స్' పేరుతో వీటిని ప్రకటించింది.

ఈ సూచీ ప్రకారం భారత్ 131వ స్థానంలో ఉంది. 112వ ర్యాంకుతో ఉత్తర కొరియా, 113వ ర్యాంకుతో భూటాన్, 120వ ర్యాంకుతో మయన్మార్ దేశాలు భారత్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి.

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం- భారత్, భూటాన్, మయన్మార్ దిగువ మధ్యస్థ ఆదాయ(లోయర్-మిడిల్ ఇన్‌కం) దేశాల జాబితాలో ఉన్నాయి. ఉత్తర కొరియా తక్కువ ఆదాయమున్న దేశాల జాబితాలో ఉంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పరంగా చూస్తే ఈ దేశాలేవీ భారత్ దరిదాపుల్లో లేవు.

పిల్లల ఎదుగుదల సూచీలో భారత్ కన్నా శ్రీలంక 63 స్థానాలు మెరుగ్గా ఉంది. శ్రీలంక 68వ ర్యాంకు పొందింది.

భారత్ మరో పొరుగు దేశం చైనా 43వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 140వ, బంగ్లాదేశ్ 143వ, నేపాల్ 144వ స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచంలోని పెద్ద దేశాల్లో ఒకటైన అమెరికా ఈ సూచీలో 39వ స్థానంలో ఉంది. మొదటి ర్యాంక్‌ నార్వేకు లభించింది.

బాలల ఎదుగుదల సూచీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన దేశాలు

1) నార్వే

2) దక్షిణ కొరియా

3) నెదర్లాండ్స్

4) ఫ్రాన్స్

5) ఐర్లాండ్

6) డెన్మార్క్

7) జపాన్

8) బెల్జియం

9) ఐస్‌లాండ్

10) బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

బాలల ఎదుగుదల సూచీలో చివరి 10 స్థానాల్లో ఉన్న దేశాలు

171) అఫ్గానిస్థాన్

172) సియెర్రాలియోన్

173) దక్షిణ సుడాన్

174) నైజీరియా

175) గునియా

176) మాలి

177) నిజర్

178) సొమాలియా

179) చాద్

180) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

కర్గన ఉద్గారాల ప్రాతిపదికగానూ ర్యాంకులు

కర్బన ఉద్గారాల స్థాయి ప్రాతిపదికగా కూడా 180 దేశాలకు ఈ నివేదిక 'సస్టైనబిలీటీ ర్యాంకులు' ఇచ్చింది.

మొదటి ర్యాంకు తూర్పు ఆఫ్రికాలోని బురుండికి దక్కగా, మధ్యప్రాచ్య దేశమైన ఖతార్‌ చిట్ట చివరన నిలిచింది. భారత్‌కు 77వ ర్యాంకు వచ్చింది.

ఈ రెండింటితో పిల్లల భవిష్యత్తుకు ముప్పు

వాణిజ్య ప్రకటనల్లో హానికరమైన ధోరణుల వల్ల పిల్లలు ఫాస్ట్-ఫుడ్ ఎక్కువగా తింటున్నారని, తక్కువ వయసులో మద్యానికి అలవాటు పడుతున్నారని, ఈ ధోరణులతోపాటు వాతావరణ మార్పులు వారి భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వాణిజ్య ప్రకటనల్లో హానికరమైన ధోరణుల వల్ల పిల్లలు ఫాస్ట్-ఫుడ్ ఎక్కువగా తింటున్నారని నివేదిక తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు పెను మార్పులు తీసుకురాకపోతే గత రెండు దశాబ్దాలుగా సాగించిన పురోగతి తిరోగమనం పడుతుందని బాలల ఆరోగ్య నిపుణులు దాదాపు 40 మంది ఈ నివేదికలో హెచ్చరించారు.

వాతావరణ మార్పులు, వాణిజ్య పోకడల ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి బాలిక, బాలుడి భవిష్యత్తుకు ముప్పు ఎదురవుతోందని కమిషన్ సహసారథి, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ హెచ్చరించారు. బాలలు, కౌమార దశలోని వారి ఆరోగ్య పరిరక్షణ విధానాలను దేశాలు సమూలంగా మార్చాల్సిన అవసరముందని ఆమె చెప్పారు.

తలసరి కర్గన ఉద్గారాల సూచీ: తొలి 10 స్థానాల్లో నిలిచిన దేశాలు

1) బురుండి

2) చాద్

3) సొమాలియా

4) కాంగో

5) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

6) మలావి

7) రువాండా

8) మాలి

9) నిజర్

10) మడగాస్కర్

ఫొటో క్యాప్షన్,

వాతావరణ మార్పుల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టకపోతే భావి తరాలపై ప్రతికూల ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తలసరి కర్గన ఉద్గారాల సూచీ: చివరి 10 స్థానాల్లో నిలిచిన దేశాలు

171) లక్సెంబర్గ్

172) కజక్‌స్థాన్

173) అమెరికా,

174) ఆస్ట్రేలియా

175) సౌదీ అరేబియా

176) బహ్రెయిన్

177) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

178) కువైట్

179) ట్రినిడాడ్ అంట్ టొబాగో

180) ఖతార్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

విధాన నిర్ణయాల్లో పిల్లల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలని నివేదిక సిఫార్సు చేసింది.

రెండింటిలోనూ రాణిస్తున్న శ్రీలంక

పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సులో ఫర్వాలేదనిపించే ఫలితాలు సాధిస్తూనే 2030లోగా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అందుకొనే దిశగా సాగుతున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

శ్రీలంక, అల్బేనియా, అర్మేనియా, గ్రెనడా, జోర్డాన్, మాల్డోవా, ట్యునీషియా, ఉరుగ్వే, వియత్నాం ఈ జాబితాలో ఉన్నాయి.

పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సులో తొలి పది దేశాల్లో ఒకటైన బ్రిటన్- వారి భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని పరిరక్షించడంలో మాత్రం బాగా వెనకబడి ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించి భావితరాలకు తగిన వాతావరణం ఉండేలా చూడటంలో బ్రిటన్‌ 133వ స్థానంలో నిలిచింది.

భావి తరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో సగటున నాలుగు డిగ్రీల పెరుగుదల ఉంటుందని, అదే జరిగితే భావి తరాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రమట్టాల్లో పెరుగుదల, వడగాడ్పులు, తీవ్రస్థాయిలో పోషకాహార లోపం, మలేరియా లాంటి వ్యాధుల వ్యాప్తి పెరగడం, ఇతర విపరిణామాలు సంభవిస్తాయంటూ వారు అప్రమత్తం చేస్తున్నారు.

వివిధ దేశాల్లో మానవీయ సంక్షోభాలు, ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ముడిపడిన సమస్యల వల్ల అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని, 200 కోట్ల మందికి పైగా ప్రజలు అక్కడే నివసిస్తున్నారని కమిషన్ సహసారథి, సెనెగల్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి అవా కాల్-సెక్ చెప్పారు.

నిరుపేద దేశాల్లోనే కర్గన ఉద్గారాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. కానీ వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలు ఈ దేశాలపైనే ఎక్కువగా ఉండే అవకాశముంది.

2015లో ప్రపంచ దేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీల) సాధనకు అంగీకరించాయి. అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులపై కార్యాచరణ, ఇతర లక్ష్యాలు వీటిలో ఉన్నాయి. ఐదేళ్లైనా పురోగతి అంతంతమాత్రంగానే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సోషల్ మీడియాలో పిల్లలను లక్ష్యంగా చేసుకొనే అడ్వర్టైజింగ్, అల్గారిథమ్‌లు భారీగా విస్తరించాయని ప్రొఫెసర్ ఆంథోనీ చెప్పారు.

ఏడాదిలో పిల్లల దృష్టికి 30 వేల అడ్వర్టైజ్‌మెంట్లు

అనుచిత, హానికర మార్కెటింగ్ పోకడల నుంచి పిల్లలకు ఎదురవుతున్న ముప్పు గురించి ఈ నివేదిక ప్రముఖంగా చెప్పింది.

ఏడాది కాలంలో 30 వేల టీవీ ప్రకటనలు పిల్లల దృష్టికి వస్తాయని, వీటిలో మద్యం, జంక్‌ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది.

పిల్లలు, కౌమార వయస్కుల్లో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిందని, ఊరించే మార్కెటింగ్ నుంచి వారికి ముందెన్నడూ లేనంత ప్రమాదం ఎదురవుతోందని ఈ నివేదిక రాసిన నిపుణుల్లో ఒకరైన ఆంథోనీ కాస్టెలో చెప్పారు. ఆయన యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో 'గ్లోబల్ హెల్త్ అండ్ సస్టైనబిలిటీ' ప్రొఫెసర్.

సోషల్ మీడియాలో పిల్లలను లక్ష్యంగా చేసుకొనే అడ్వర్టైజింగ్, అల్గారిథమ్‌లు భారీగా విస్తరించాయని ఆంథోనీ వివరించారు.

పిల్లల కోసం పిల్లల ఆధ్వర్యంలో ఒక కొత్త అంతర్జాతీయ ఉద్యమం రావాలని నివేదిక పిలుపునిచ్చింది.

నివేదికలోని సిఫార్సులు ఇవీ

  • పిల్లలకు భవిష్యత్తు ఉండేలా చేసేందుకు కర్బన ఉద్గారాలను తక్షణం తగ్గించేయాలి.
  • సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు దేశాలు చేసే ప్రయత్నాల్లో పిల్లలపై, కౌమార వయస్కులపై దృష్టి కేంద్రీకరించాలి.
  • బాలల ఆరోగ్యం, బాలల హక్కుల పరిరక్షణకు అన్ని రంగాల్లో కొత్త విధానాలు, పెట్టుబడులు రావాలి.
  • విధాన నిర్ణయాల్లో పిల్లల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • హానికర మార్కెటింగ్‌ను కట్టడి చేసేందుకు నిబంధనలు కఠినతరం చేయాలి.

పిల్లలు, కౌమార వయస్కుల ఆరోగ్య పరిరక్షణలో ఒక కొత్త శకాన్ని ఆవిష్కరించాలని ఈ నివేదిక చెబుతోందని ద లాన్సెట్ ఎడిటర్-ఇన్‌-చీఫ్ డాక్టర్ రిచర్డ్ హోర్టన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)